Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిత్రం భళారే విచిత్రం - మావూరు.విజయలక్ష్మి

 

సైగల గ్రామం బెంగ్ కల



అదో అందమైన దేశంలో అంతకంటే అందమైన ద్వీపం. అందులో ఇంకా అందమయిన గ్రామం.

అక్కడ ఎవరూ  నోటితో మాట్లాడరు. చేతులతో మాట్లాడతారు. చేతులు తిప్పుతూ మాట్లాడతారు.

అదేంటలా?  ఎవరైనా ఎక్కడైనా నోటితో మాట్లాడతారుగానీ .... చేతులతో ఎలా మాట్లాడతారు?

మాట్లాడతారు....... ఎక్కడైనా సంగతి ఎలా ఉన్నా,  అక్కడ మాత్రం ఖచ్చితంగా చేతులతోనే మాట్లాడతారు. ఆ భాష తీరే అంత. ఆ భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయొచ్చు. ఆ దేశం... లేదంటే ఆ ప్రాంతం భాష రాదన్న బాధ లేదు. ఇంతకీ ఏంటా భాష...? “కాట కోలాక్”

పర్యాటకులకు స్వర్గధామంగా, భూలోక స్వర్గంగా భాసిల్లే అందమయిన దేశంగా పేరుపొందిన  ఇండోనేసియాలో అంతకంటే అగ్దమయిన ద్వీపం బాలి. ఆ సుందరద్వీపం బాలిలో బెంగ్ కల గ్రామవాసులు మాట్లాడే భాష కాట కోలాక్. సైగల భాష. అదేంటి వాళ్ళకి మాటలు రావా? మూగవాళ్ళ ? అన్న అనుమానం వస్తుంది కదూ..... నిజమే.... ఆ గ్రామం లో కొంతమంది మూగవాళ్ళే. కాని అందరూ కాదు. కొంతమందే;  కాని అందరూ మాట్లాడుకునేది మాత్రం సైగల భాష తోనే. ఇదేంటీ మెలిక... కొందరే మూగవాళ్ళయినప్పుడు  మిగతావాళ్లు మామూలుగా మాట్లాడుకోవచ్చుకదా ? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలంటే ఇండోనేసియా ఉత్తరబాలి దీవులలో ఉన్న బెంగ్ కల గ్రామం గురించి తెలుసుకోవలందే.

బెంగ్ కల గ్రామస్తుల జీవనశైలి

స్థానికులు ఈ గ్రామాన్ని బధిర గ్రామమని, దేసకొలర్ అనీ, దేసిబెంగ్ కల అనీ పిలుస్తారు. పేరుకు తగినట్టుగానే గ్రామస్తులందరూ ఒక విలక్షణమైన జీవనశైలిని అనుసరిస్తారు. గ్రామస్తులందరూ బధిరుల మాదిరిగానే జీవిస్తారు. మాట్లాడతారు. ప్రవర్తిస్తారు. వారి జీవనశైలినే అనుసరిస్తారు. అంటే మాటలు వచ్చినవారు, రానివారు కూడా చేతులు తిప్పుతూ, సంజ్నలు చేస్తూ మాట్లాడతారు. అక్కడున్న చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ మాట్లాడే భాష ఈ సైగల భాషే. అక్కడున్న బధిరులు ఇతరుల కారణంగా ఇబ్బంది పడకుండా అందరూ ఈ సైగలభాషనే ఉపయోగిస్తారు.

ప్రత్యేక భాషగా ....

బెంగ్ కల గ్రామవాసులు తమ పిల్లలకు చిన్నతనం నుండి ఇళ్లలోనే ఈ భాషను నేర్పిస్తుంటారు. ఇక్కడ మనం సెకెండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని మాతృభాషతో పాటు ఇతర భాషలను ఎలా నేర్చుకుంటేమో అక్కడ కూడా ఈ సైగలభాషను సెకండ్ లాంగ్వేజ్ గా నేర్పిస్తారంటే దీని ప్రాధాన్యత ఏంటన్నది అర్ధమవుతోంది.

శాపమే కారణమా?

దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ సంజ్ఞల భాష “కాట కోలాక్”కి. ఏడు శతాబ్దాల నుంచి అక్కడి ప్రజలు ఈ సంజ్ఞల భాషతోనే మాట్లాడుకుంటున్నారు. ఏడు శతాబ్దాల నుంచి ఇక్కడ ప్రజలలోఎక్కువమంది మూగ, చెవిటి వారే కావడం విశేషం. గత ఏడు తరాలనుంచి దాదాపు మూడువేలమంది బధిరులుగా జన్మించారు. ఈ ప్రాంతంలో తరతరాలుగా ప్రతి ఇంట్లోను కనీసం ఇద్దరు, ముగ్గురికయినా మూగ, చెవుడు రావడం ఖచ్చితంగా జరుగుతోంది. ఎందుకిలా.... అంటే ఇదంతా శతాబ్దాలకు ముందు ఇద్దరు మంత్రగాళ్ళ మధ్య జరిగిన కొట్లాట కారణంగానే జరుగుతోందని అంటారు అక్కడి ప్రజలు, పూర్వం అక్కడ మంత్రశక్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులకు మద్య ఘర్షణ రేగిందట. దాంతో ఇద్దరూ పోట్లాడుకొని చివరికి ఒకరికొకరు శాపమిచ్చుకున్నారట. అప్పటినుంచి ఆ ఊరిలో ప్రతి ఇంట్లోను ఇలా బధిరులు జన్మించడం జరుగుతోందని చెప్తారు స్థానికులు.

శాపమే కాదు వరం కూడా ....

ఇది కేవలం వారి పోట్లాట కారణంగా ఏర్పడినా ఇది తమ దేవుడు తమకిచ్చిన వరమని తమ దేవుడయిన బాధిరదేవుడు తమను కాపాడుతూ ఉంటాడని వారి నమ్మకం. అందుకే ఇక్కడ పుట్టే ప్రతివారికి పసితనం నుంచే ఈ సంజ్ఞల భాషను నేర్పిస్తుంటారు. నిజానికి ముడువేలమంది జనాభా కలిగిన ఈ గ్రామంలో మాట్లాడగలిగినవారు ఉన్నా కూడా, ఇక్కడ బధిరులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని చిన్నప్పట్నుంచి కాట కోలాక్ సైగలభాషను నేర్పిస్తుంటారు.మాట్లాడగలిగినవారు కూడా సైగలతోనే మాట్లాడుకుంటారు.

నిజంగా శాపమేనా? లేక వరమా?

రెండూ కాదు ఇదంతా ఆ ప్రాంతంలోని భౌగోళిక కారణాలు, జీన్స్ సంబంధిత కారణాలతోనే జరుగుతోంది అంటున్నారు సైంటిస్టులు. ఆ ప్రాంతంలోని డిఎఫ్ఎన్ బి౩ అన్న జీన్స్ కారణంగానే ఇలా జరుగుతోందని చెప్తున్నారు. అయితే ఇదే కచ్చితమయిన కారణమని కూడా రుజువు చేయలేకపోతున్నారట. 

బెంగ్ కల గ్రామవాసులు తమకే స్వంతమైన ఈ కాట కోలాక్ సంజ్ఞల భాషతో కూడిన ఒక ప్రత్యేకమైన నృత్యరీతులను కూడా ఏర్పరచుకున్నారు. అదే జంజర్ కోలాన్ డేన్స్ పేరుతొ పిలుస్తారు. ఈ వింత గ్రామాన్ని, ఇక్కడి నృత్యాన్ని చూడడానికి పలుదేశాలనుంఛి వేలాదిమంది పర్యాటకులు వస్తారట.

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugalu