Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి సొగసులు చూద్దాం రండి ( పదకొండవభాగం ) - కర్రానాగలక్ష్మి

                              కాంగ్రా లోయ -- 6


చుట్టుపక్కల కొన్ని గ్రామాలు , పట్టణాలు కలిసి ధర్మశాల నగర నిర్మాణం జరిగింది . ఇందులో కొన్ని ప్రవాస టిబెటియన్లకు చెందినవి , కొన్ని ఘుర్ఖా లకు చెందినవి కొన్ని భారతీయులు చెందిన గ్రామాలు కావడంతో మనకి ధర్మశాలలో మూడు దేశాలకు చెందిన  సంస్కృతి కనిపిస్తుంది . ప్రవాస యిరుగుపొరుగు దేశ ప్రజలు నివసించే యే ప్రదేశం లోనైనా యెప్పుడో ఒకప్పుడు గొడవలు జరగడం చూస్తూవుంటాం , కాని యీ ప్రాంతం లో ఘుర్ఖాలు సుమారు రెండు మూడు శతాబ్దాలుగా వున్నాకూడా యెప్పుడూ స్థానికులతో గొడవలుపడ్డ ఆధారాలు లేవు . 50 సంవత్సరాలుగా వున్న ప్రవాస టిబెటియన్లు కూడా యెటువంటి గొడవలు పడ్డ దాఖలాలు లేవు . ధర్మశాల న్యాయానికి , ధర్మానికి , శాంతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు .

ధర్మశాల లో వినీలమైన మరో పట్టణం మెక్లోడ్ గంజ్ గురించి యిక్కడ చెప్పక తప్పదు .

మెక్లోడ్ గంజ్ లోనే కాంగ్రా జిల్లా ముఖ్యకార్యాలయం వుంది .

దౌలాధార్ పర్వతశ్రేణులలో సముద్రమట్టానికి సుమారు 2082 మీటర్ల యెత్తులో వున్న పట్టణం.

ఆంగ్లేయుల కాలం నుంచి వేసవి విడిదిగా పేరు పొందిన పట్టణం . దీనిని స్థానిక టిబెటియన్లు ' లాసా ' అని  ' ధాసా ' అని కూడా పిలుచుకుంటూ వుంటారు .

1850 లో జరిగిన రెండో ఆంగ్లో - సిక్కు  యుద్ద సమయంలో రెండు రెజిమెంట్లను కాంగ్రా కు తరలించేరు . తరువాత అక్కడ నుంచి దౌలాధార్ పర్వత వాలులలో సైనికుల కొరకు నివాసాలు యేర్పరచడంతో సైనికాధికారుల రాకపోకలు పెరగడం తో వారి సౌకర్యార్దం వసతి గృహాలు మొదలయినవి నిర్మింపబడడంతో వూరు పెరగసాగింది . 1855 లో ఆంగ్ల సైనికాధికారులు వేసవిలో వుండేందుకు నివాసాలు యేర్పరచుకున్నారు . 1863 లో అప్పటి వైస్రాయి ' లార్డ్ ఎల్జిన్ ' మెక్లోడ్ గంజ్ ని భారతదేశపు వేసవి ముఖ్యపట్టణం గా ప్రకటించి యంత్రాంగాన్ని యిక్కడకు తరలించేడు . అతనికి ఆ ప్రదేశం యెంతగా నచ్చిందంటే అతని మరణానంతరం అతని సమాధి కూడా యిక్కడే నిర్మించేంత , అతని భార్య ఆర్ధిక సహాయంతో సెయింట్ జాన్ చర్చి నిర్మించేరు . ఇది నియో -గోతిక్ శిల్పకళ తో కట్టిన రాతి కట్టడం , దీనిని వైస్రాయి ' లార్డ్ ఎల్జిన్ ' జ్ఞాపిక గా కూడా వ్యవహరిస్తారు . ఇప్పుడు యిది మెక్లోడ్ గంజ్ లో ఓ పర్యాటక స్థలం .

మెక్లోడ్ గంజ్ లో దేశ విదేశీయులను ఆకర్షించే ప్రదేశం బౌద్దులు  మతగురువైన దలైలామా నివాసం.

దలైలామా బుద్దుని అంశ అయిన అవలోకితేశ్వరుని పునర్జన్మలని బౌద్దులు నమ్మకం . ఒక దలైలామా అవతారం చాలించిన తరువాత మరో దలైలామా జన్మించి బౌద్దమతాన్ని రక్షిస్తాడని వారి నమ్మకం . 1933 లో 13 వ దలైలామా మరణం తరువాత 1935 జూలై 6 న టిబెట్ లోని ' థక్సర్ ' లో జన్మించి నాలుగేళ్ల ప్రాయంలోనే బౌద్దబిక్షువుగా మారి తర్వాత దలైలామా గా గుర్తింపబడి దలైలామా కు కావలసిన శిక్షణ పొందేరు . చైనా కమ్యూనిష్టులు టిబెట్ ని ఆక్రమించుకొనగా దలైలామా అతని అనునాయులు భారతదేశానికి శరణార్ధులుగా వచ్చి మెక్లోడ్ గంజ్ లో నివాసం యేర్పరచుకొని  ప్రవాస సెంట్రల్ టిబెటియన్ ఆడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యాలయాన్ని నిర్మించుకున్నారు .

గత యాభై సంవత్సరాలుగా టిబెట్ స్వాతంత్రం కోసం శాంతియుత పోరాటం జరుపుతున్న దలైలామా మందిరం దర్శించుకోడం ఓ మరచిపోలేని అనుభూతి . బయటకి ఓ మోస్తరుగా కనబడే తలుపులగుండా లోనికి వెడితే పెద్ద మందిరం . కొండని చదును చెయ్యకుండా , వృక్షాలను నరకకుండా కట్టుకున్న చాలా పెద్దపెద్ద భవనాల సముదాయాన్ని చూడగానే వారికి ప్రకృతి అంటే యెంత భక్తో అర్దం అవుతుంది . పెద్దపెద్ద ప్రార్ధనా మండపాలు వాటికి ఓ ప్రక్కగా దలైలామా మందిరం , అంటే రోజూ నిర్ణీత వేళలలో దలైలామా ప్రజలను కలిసే ప్రదేశం . ఓ ప్రక్కగా పాఠశాలలు , మరో ప్రక్క అధ్యనమండపాలు లోపల వేలమీద బౌద్దబిక్షువులు వున్నారు అంటే నమ్మశక్యంకాదు . నిశ్శబ్దంగా , ప్రశాంతంగా వారివారి విధులు నిర్వర్తిస్తున్న వారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . అంత పెద్ద ప్రాంగణం యెంతో శుభ్రంగా వుండడం చిన్న పిల్లల దగ్గరనుంచి క్రమశిక్షణతో మెలగడం చూస్తే ముచ్చటేస్తుంది . మేం వెళ్లిన రోజున దలైలామా విదేశీ పర్యటనలో వుండడం తో మాకు అతని దర్శనంకాలేదు . లోపల చాలా సేపు ఆ ప్రశాంతతను అనుభవిస్తూ కూర్చొని వెనుతిరిగేం .

గాలుదేవి మందిరం , ట్రాండ్ శిఖరం ---

మెక్లోడ్ గంజ్  బస్సుస్టాండు నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న చాలా చిన్న మందిరం . అక్కడదాకా కార్లు వెళ్లే రోడ్డు వుండడం తో నడిచే బాధ తప్పుతుంది . మందిరం స్థానికంగా పేరుపొందింది కాని మందిరం గురించి వివరాలు లభించలేదు . కాని అక్కడనుంచి దౌలాధార్ పర్వతాలు కనువిందు చేస్తాయి . అక్కడనుంచి ' ట్రాండ్ ' పర్వత శిఖరారోహణకు కాలి దారి మొదలవుతుంది . చాలా మంది అక్కడకి కాలినడకన బయలుదేరేరు . పర్వతశిఖరం పై కేంపింగ్ చేసే వుద్దేశ్యంతో చాలామంది వెళుతున్నారు . సంవత్సరంలో సుమారు యెనిమిది నెలలు కనుచూపు మేర వరకు తెల్లని మంచు వుండే ప్రదేశమని 'ట్రెక్కరులు ' చెప్పేరు . శిఖరం యెత్తు సుమారు 2875 మీటర్లు , అంతయెత్తు సుమారు నాలుగు కిలోమీటర్ల లో పూర్తవుతుంది అంటే యీ నాలుగు కిలో మీటర్ల నడక చాలా కష్టంగానూ యెగుడుదిగుడులుగానూ వుంటుంది . చాలా కష్టమనే చెప్పుకోవాలి , శిఖరాన్ని చేరుకున్నాకా చాలా బావుంటుంది , ఉత్సాహం వున్నవారు రెండు రోజులు యెక్కువ వుండేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు .

సిధ్దబాడి -----  

పురాణాల ప్రకారం ' కపిల ' మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం అంటారు . సిధ్ద అనే బాబా యీ ప్రదేశం లో తపస్సుచేసుకుంటూ గడిపినందువల్ల యీ ప్రదేశాన్ని ' సిద్దబాడి ' అనే పేరు వచ్చింది . బాబా వెలిగించిన యాగకుండం యెప్పుడూ వెలుగుతూనే వుంటుందట , యీ ప్రదేశం లోనివసించిన సిధ్ద బాబా కి యెన్నో మహత్తులు వుండేవని అందువల్లే యిక్కడి యాగకుండం యెప్పుడూ వెలుగుతూనే వుంటుందనేది స్థానికుల మాట .

ఆశ్రమం పక్కగా ప్రవహిస్తున్న ' మానుని ' ఏరు యెంతో పవిత్రమైనదిగా చెప్తారు . దీని వొడ్డున యెన్నో మందిరాలు వున్నాయి , వీటిలో 2 కిలో మీటర్ల దూరంలో వున్న ' అగంజర ' మహదేవమందిరం ముఖ్యమైనది .

సిధ్దబాడి కి కాస్త దూరంలో సందీపనీ హిమాలయాలలో 'చిన్మయానంద మిషన్ ' వ్యవస్థాపకులైన ' స్వామి చిన్మయానంద ' సమాధి వుంది

ఇక్కడ ' గ్యోతు ' మోనష్ట్రీ వుంది . ఇది కర్మపా  ' థాయెదోర్జీ ' తాత్కాలిక నివాసస్థలంకూడా . కర్మపా అంటే బౌద్ధమతం లోని వజ్రయాన తెగకు అధిపతి . ఈ మోనష్ట్రీ లో తంత్రవిద్యా బోధన జరుగుతూ వుంటుందట .

దాల్ లేక్ ---

మెక్లోడ్ గంజ్ కి సుమారు మూడు కిలోమీటర్ల దూరాన టిబెటియన్ పిల్లల పాఠశాల పక్కన వుంది యీ సరస్సు . దాల్ లేక కి శ్రీనగర్ దాల్ లేక కి యేమీ సంబంధం లేదు . ఈ సరస్సు చాలా చిన్నది , దీనికి దగ్గరగా ఓ పురాతనమైన మందిరం వుంది , అక్కడే నీటి బుగ్గలు ( స్ప్రింగ్స్ ) వున్నాయి .

ఈ సరస్సు ' గద్ది ' తెగవారుకి పవిత్రమైనది , ప్రతి సంవత్సరం ఆగష్టు - సెప్టెంబరు నెలలలో యీ సరస్సు వొడ్డున జాతర నిర్వహిస్తారు .

భాగ్సునాగ్ జలపాతం --

మెక్లోడ్ గంజ్ బస్సుస్టాండు కి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వుంది భాగ్సునాగ్ మందిరం . మందిరం వెనుకవైపున ప్రవహించే సెలయేటి నీరు తటాకంలో పడేటట్టుగా యేర్పాటు చేసేరు , ఆ తటాకం నీటిలో స్నానం చేసి మందిరంలోని శివుణ్ణి పూజించుకుంటారు . ఈ తటాకానికి ముందున కొత్తగా కట్టిన కొలను లో చాలామంది పర్యాటకులు ఈత కొడుతూ ఆనందిస్తున్నారు . ఈ ప్రాంతంలో ఘుర్ఖాలు యెక్కువగా వున్నారు . పర్యాటకులలో బౌద్దమతాన్ని అధ్యయనం కొరకు వచ్చిన వారితో పాటు అధిక సంఖ్యలో ఇజ్రాయీలు వుండడం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .

ఈ మందిరంలోని శివలింగం పంచముఖాలను కలిగి వుండి నేపాలులోని పశుపతినాథ్ విగ్రహాన్ని పోలివుంది . ఈ మందిరం చాలా పురాతనమైన నిర్మించబడిందని స్థానిక నేపాలీలు చెప్పేరు . మందిరం వరకు ఆటోలు , టాక్సీ లు నడుస్తూ వుంటాయి .

ఈ మందిర స్థలపురాణం యీ మందిరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వున్న జలపాతం స్థలపురాణం తో ముడుపడి వుంది . తెల్లని నురగలు కక్కుతూ వురుకుతున్న జలపాతం చేరాలంటే కాలినడకన వెళ్లాలి . 20 అడుగుల యెత్తునుంచి పడుతున్న  నీటిబిందువులు సూర్యుని కాంతిలో సప్తవర్ణాలు చిమ్ముతూ కనువిందు చేస్తుంటాయి . వర్షాకాలంలో దీనివేగం యింకా పెరుగి కనువిందు చేస్తూ వుంటుంది . జలపాతానికి యెదురుగా వున్న కెఫెలో వేడి వేడి టీ తాగుతూ జలపాతం చూడడం ఓ అనుభూతి .  యీ ప్రదేశం స్థానికులు యెక్కువగా యిష్టపడే పిక్ నిక్ స్పాట్ .

స్థలపురాణం గురించి చెప్పుకుందాం .

5 వేల సంవత్సరాలకు పూర్వం యీ ప్రాంతాన్ని భాగ్సు రాజు పరిపాలించేవాడు . భాగ్సు రాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకొనేవాడు . భాగ్సు రాజ్యంలో కరవు యేర్పడి నీళ్లు లేక ప్రజలు , పశువులు మృత్యువాత పడుతూ వుండడం సహించలేని రాజు నీళ్లకొరకు కొండలలో తిరుగుతూ అక్కడవున్న నాగరాజుకి చెందిన తటాకం లోని నీటిని తన కమండలంలో నింపుకొని తన రాజ్యానికి తిరిగి పయనమవుతాడు . నాగరాజు తటాకంలో నీరు లేకపోవడంతో తన తపఃశ్సక్తితో జరిగిన విషయం తెలుసుకొని అతని పైకి యుద్ధానికి వెళతాడు . ఇద్దరకీ జరిగిన ఘోరమైన యుద్ధంలో భాగ్సురాజు గాయపడి కమండలాన్ని కొండలపైనుండి జారవిడుస్తాడు . మరణమాసన్నమయిన రాజు నాగరాజుకి మొక్కి  క్షమాపణలు చెప్పి తన దేశప్రజలకు నీటి అవుసరం వుందికాబట్టి కొండలపైనుండి జారుతున్న నీటిని అపొద్దని వేడుకొని ప్రాణాలు విడుస్తాడు . నాగరాజు భాగ్సురాజు మాట మన్నించి వెనుతిరుగుతాడు . జరిగిన విషయం తెలుసుకున్న ప్రజలు ఆ జలపాతానికి మహారాజు , నాగరాజుల పేర్ల మీద భాగ్సునాగ్ జలపాతంగా పిలుచుకోసాగేరు .

కొన్ని సంవత్సరాల అనంతరం యీ ప్రాంతానికి రాజైన ధర్మచంద్ కు స్వప్నంలో ఈశ్వరుడు ప్రత్యక్షమై భాగ్సునాగ్ జలపాతం దగ్గర మందిర నిర్మాణం చెయ్యమని ఆజ్ఞాపించగా , రాజు పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించి పూజాది కార్యక్రమాలు నిర్వహించసాగెను .

ప్రస్తుతం వున్న మందిరం కొత్త నిర్మాణం , పూర్వమున్న మందిర స్థానే పాలరాతితో  కొత్త నిర్మాణం చేసేరు . చుట్టుపక్కల వున్న 14 ఘర్ఖా గ్రామాలకు ఆరాధ్య దైవం , యీ గ్రామ ప్రజలు గర్వంగా " మేము భాన్సువాలాలం " అని చెప్పుకుంటారు .

మళ్లావారం హిమాచల్ లోని నైనాదేవి గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam