Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bhandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue177/505/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

ధనుంజయుని కోసం ఎదురు చూస్తూ తన వంక గమనిస్తున్న అశ్వం గరుడ జూలు నిమిరి నుదురు ముద్దాడింది భద్రాదేవి` ‘‘బాధ పడకుమురా గరుడా. నీ యజమాని త్వరలోనే రాగలరు’’ అంటూ వెన్ను తట్టింది. తన మచ్చల గుర్రం ఢాకినికి, గరుడకు మరింత పచ్చిక వేసింది. అంగడి వృద్ధుడు అశ్వాల కోసం పచ్చిక వేయించి వుంచాడు. ఆ విధంగా తను తీసుకున్న రూకకు న్యాయం చేసాడు.
అప్పటికి సూర్యుడు పూర్తిగా అస్తమించాడు.

రాత్రికి ఎక్కడ గడపటం?

ఇది తమ ముందున్న ప్రధాన సమస్య. ఆ పైన ధనుంజయుని జాడ తెలీక ఆ బాధలో ఏమీ తిన లేదు. తనకు ఉలూచీశ్వరికి సంచిలో పండో కాయో ఏమన్నా మిగిలాయో లేదో తెలీదు. గుట్ట పైన గుడి మండపం తమ మజిలీకి చాలా అనువైన చోటు కాని అక్కడ వుండనీయరు. అటు చూస్తే ఉత్తరం నుండి ఉరుములు మెరుపులతో నల్ల మబ్బులు పోటీ పడి దూసుకొస్తున్నాయి. పోనీ అలా వూళ్ళోకి పోయి ఏదన్నా సత్రం వుందేమో లేదా ఎవరన్నా ఆతిథ్యం ఇస్తారేమో అడిగి చూద్దా మన్నా తామిద్దరూ యువతులు. రాత్రి వేళ ఎక్కడని తిరగ్గలరు? ఘృతాచి త్వరగా వస్తే బాగుండును. ఏదో ఒకటి త్వరగా ఆలోచించాలి.

భద్రా దేవి ఆలోచనలు ఓ కొలిక్కి రాక ముందే కళ్ళు తెరిచింది ఉలూచీశ్వరి. వెంటనే పక్కన కూచుంటూ` ‘‘ఏమైనది? మన సఖుని జాడలేవైనా తెలిసినవా?’’ అనడిగింది.
‘‘లేదక్కా. ఎంతో గాలించితి. ఏమియు తెలియ లేదు. విచిత్రం ఏమన ఆ వక్ర దంతుని జాడును తెలియ లేదు. అనగా వాడింకనూ భూ లోకమునకు మరలి రాలేదని యర్థము’’ అంది ఉలూచీశ్వరి.
‘‘అనగా... మన ప్రాణ సఖుని భూ లోకము నుండి వేరే లోకమునకు గోని పోయి వుండునా? అదియే సత్యమైనచో అది ఏ లోకము? ఊర్థ్వ లోకముకా...’’
‘‘లేదు లేదు. ఊర్థ్వ లోకము దేవ లోకము. వారు మానవులకు సాయ పడుదురు. నా సందేహము అది కాదు. అధో లోకము రాక్షస లోకము. ఖచ్చితముగా అటే ఏదో లోకమునకు గొని పోయి ఉండును’’
కాసేపు మౌనంగా ఉండి పోయింది భద్రా దేవి.
అంతలో నాగ దండును గాలిస్తూ వెళ్ళిన ఘృతాచి తిరిగి వచ్చింది.
‘‘ఏమైనది? జాడ లేవైన తెలిసినవా?’’ అడిగింది భద్రా దేవి.
‘‘లేదు తల్లీ. ఇట నుండి బయలు దేరి ఈ గుట్టను చుట్టి గాలించినాను. అవతల చిట్టడివి. ఎగువన దట్టమైన అడవి గుట్టు లోయలు అన్నీ వెదికినాను ఎక్కడా నాగుల సంచారం జాడ లేదు. కాని... ఇంతకు ముందే ఒక విచిత్రమును గాంచితి’’ అంది ఘృతాచి.
‘‘విచిత్రమా... ఏమైనది?’’
‘‘ఈ కొండ వాగు ఆవల ఎగువన దట్టమగు అటవీ ప్రాంతమున్నది. అచట ఒక అశ్వ శకటమును గాంచితి. నల్లని అశ్వాలు నల్లని రథము. అక్కడే మరో యాభై అశ్వాలనూ గాంచితి. కాని అచట ఎవరును లేరు. అవి నరుల అశ్వాలా లేక నాగ లోకం నుంచి వచ్చిన నాగ భటుల అశ్వాలా ఏమీ తెలియకున్నది. అచట ఎవరినీ గానక విసిగి మరల వచ్చితి’’ అంటూ అసు సంగతి చెప్పింది ఘృతాచి.
‘‘అక్కా సందేహము లేదు. వాళ్ళే... నల్లటి అశ్వము పూన్చిన నల్లటి రథము... అవి మా నాగ లోకమునకు చెందినవే.’’ అంది వెంటనే ఉలూచీశ్వరి.
‘‘కావచ్చును. కాని వాటిని అచటనే వదలి వారందరు ఎటు పోయినటు?’’ అంది సాలోచనగా భద్రా దేవి.
‘‘నాకును అదియే అంతు బట్టకున్నది. కాని...’’ అంటూ కొండ వాగు ఆవలకు చూస్తూ మాటలు మ్రింగేసింది ఉలూచీశ్వరి.
అప్పటికి బాగా చీకటి పడి పోయింది.
వాగు అవతల దూరంగా`
వరుసలు తీరిన అనేక దివిటీలు కొరివి దయ్యాల్లా కదులుతూ ఇటే వస్తూ కన్పిస్తున్నాయి. భద్రా దేవి కూడ అటు చూసి ఆశ్చర్య చకిత అయింది.
‘‘వాళ్ళేనా?’’ అంది అనుమానంగా.
‘‘అవును. వక్ర దంతుడు తిరిగి రాకుండా వాళ్ళు మకాము నుండి కదిలే అవకాశము లేదు.’’
‘‘ఏమో... వచ్చినాడేమో. ఎందుకైన మంచిది మరొక పరి వాడి జాడలు అవలోకింపుము’’ అంటూ హెచ్చరించింది భద్రా దేవి.
ఈ సారి జ్ఞాన దృష్టి నుండి`
త్వర గానే బయటి కొచ్చింది ఉలూచీశ్వరి.
‘‘వచ్చినాడక్కా. ఇంత క్రితము వచ్చినట్టుండె. వాడి పక్కనే మాయా శృంగుడును ఉండె’’ అంది గాభరాగా.
‘‘మాయా శృంగుడెవడు?’’ అర్థం గాక అడిగింది భద్రా దేవి.
‘‘వాడో పొట్టి వెధవ. నెత్తిన కొమ్ము ఉండును. మహా మాయావి. వాళ్ళ మాటల్ని బట్టి వక్ర దంతుడు మన ప్రభువును పాతాళమునకు పోవు బిల మార్గమున పారవైచి వచ్చినాడు’’ అంటూ దుఖ్ఖంతో గొంతు పెగలక ఏడ్చేసింది.
‘‘బాధ పడకు సోదరీ. ఎన్ని కష్టములైనను భరించి మన స్వామి మన కోసం క్షేమంగా మరలి వత్తురు. ప్రస్తుతము మనమీ కష్టము నుండి బయట పడవలె. ఆ దివిటీలు మీ నాగ దండే కదూ?’’
‘‘అవును. ధనుంజయుని మన నుంచి దూరము జేసి వచ్చిన వక్ర దంతుడు ఉత్సాహముగ వున్నాడు. ఈ రాత్రికే నను అపహరింప కుతూహల పడుచున్నాడు.’’
‘‘రానిమ్ము. ఆ నీచుల సంగతి నేను జూచెద. రాత్రికి వారితో పెను పోరాటము తప్పదు. కాని ఈ లోపల మనము తల దాచుకొనుటకు తావు లేకుండా జేసినాడే ఆ శివయ్య. అదే బాధగున్నది. మరి కొద్ది సేపట్లో ఈ ప్రాంతమును గాలి వాన ముంచెత్తనుంది’’ అంది ఆకాశం వంక జూస్తూ భద్రా దేవి.
సరిగ్గా అదే సమయంలో`
తొలి సారిగా ఒక విచిత్రము ఆవిష్కృతమైంది అక్కడ.
శివాలయం వున్న కొండ గుట్ట వైపు నుండి భీకరంగా విన వచ్చింది ఒక ఎద్దు రంకె. నిశీధలో ఆ ప్రాంతమంతటా మారు మ్రోగిందా రంకె.
ఉలికి పడి అటు చూసిన ఇరువురికీ`
చీకటి మాటున కూడ తెల్లగా మెరిసి పోతున్న పోతరించిన వృషభం ఒకటి తోక పైకి లేపి బుసలు కొడుతూ శర వేగంతో గుట్ట దిగి వస్తూ కన్పించింది. దాని అట్టహాసం చూస్తే గుండె చెదిరి పోయేలా వుంది. అది నేరుగా తమ వైపే దుమ్ము తెరలు రేపుతూ దూసుకొస్తోంది. దాని మెడ లోని గంటల శబ్ధం మారు మ్రోగుతోంది.
ఎవరిదా వృషభము? ఎవరి పైకి అంత ఉగ్ర రూపమున వస్తోంది. ఉలూచీశ్వరి కంగారుగా భద్రా దేవి వంక చూసింది. పక్కనున్న భూతం ఘృతాచి కూడ విభ్రాంతి చెందింది. ‘‘అమ్మా! చూడనది చాలా పొగరు బోతు గిత్త వలెనున్నది వెళ్ళి దారి మళ్ళించమందురా?’’ అనడిగింది.
‘‘వలదు వలదు. రానిమ్ము. దాని సంగతేమిటో చూతము గాక’’ అంది భద్రా దేవి.
వచ్చునది సాధారణ వృషభము కాదనిపిస్తోంది భద్రా దేవికి. శివుని వాహనం నందీశ్వరుడు. ఈ నంది కూడ గుట్ట పై నుండే దిగి వచ్చినది. సందేహం లేదు. అందుకే ఘృతాచిని వారించింది.
చూస్తూండగానే మరో సారి రంకె వేసింది వృషభం.
అది దుమ్ము తెరలు రేపుతూ సుడి గాలిలా వారి సమీపం నుండే నేరుగా కొండ వాగు వంచ వరకు దూసుకెళ్ళి ఆగింది. కాలు దువ్వుతూ మోర చాపి వాగు అవతల దివిటీ దిశగా చూస్తూ దిక్కు మారు మ్రోగేలా రంకె వేసింది. అక్కడి నుండి బయలు దేరి శాలి వృక్షం దక్షిణం వైపు వెళ్ళి రంకె వేసింది. అలా వృక్షాన్ని చుట్టి అన్ని దిక్కులకు రంకెలు వేసి పిమ్మట శాంతిస్తూ తోక దింపి సూటిగా వచ్చి భద్రా దేవి, ఉలూచీశ్వరి సమీపంలో చక్కగా కాళ్ళు ముడుచుకుని పడుకుంది గుడిలో నందిలా.
ఇంతలో గుట్ట వైపు నుండి ‘‘భౌ భౌ’ మంటూ శునక మొకటి అరుచుకొంటూ దిగి వస్తున్న జాడ తెలిసింది. ఆ శునకం కూడ మహా ఉగ్రంగా దూసుకొస్తోంది. నలుపులో నలుపుగా చీకట్లలో కలిసి పోయి సమీపం లోకి వచ్చే వరకూ దాని జాడ తెలీ లేదు. చేయెత్తు బలిష్టమైన శునకం. అది కూడ నేరుగా వాగు తీరానికి దూసుకెళ్ళి దివిటీలను చూస్తూ బిగ్గరగా కాసేపు మొరుగు తూనే వుంది. తర్వాత మొరుగుతూ శాలి వృక్షాన్ని చుట్టి వచ్చింది. వృషభం సమీపం లోకి వస్తూనే శాంతించి వెనక్కాళ్ళు ముడుచుకుని కూచుంది.
తల తిప్పి చూసిన భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు వాగు అవతల దివిటీలు క్రమంగా వెనక్కి తగ్గటం స్పష్టంగా కన్పిస్తోంది. భద్రా దేవికి ఇపుడిపుడే కొంచెం కొంచెం బోధ పడుతోంది.
ఆ శివయ్య వాహనమైన నందీశ్వరుడు, సదా ఆయన్ని అనుసరించి తిరిగే శునక రూపుడైన భైరవేశ్వరుడు తమకు రక్షణ కోసం కొండ దిగి వచ్చారు. ఇంత కన్నా ఏం కావాలి. వీరి ఆర్భాటం తమ కోసం కదలి వస్తున్న నాగ దండుకి దడ పుట్టించి ఉండాలి. వెనక్కి వెళ్ళి పోతున్నారు. ‘‘హే ప్రభూ శంకరా... ఈ విధంగా దయ చూపించావా కరుణామయా భక్త వత్సలా....’’ అని శంకరుని ప్రార్థిస్తూ ఉలూచీశ్వరితో సహా తమ ముందున్న నందికి, భైరవుడికి సాష్టాంగ నమస్కారం చేసింది భద్రా దేవి.
సరిగా అప్పుడే`
మరో విచిత్రం కూడ ఆవిష్క్రతమైంది.
అది మృదు మధురమైన ఒక వేణు నాదం.
సమ్మోహ పరిచే రసమయ మురళీ రవం ఒకటి చల్లటి గాలి అలల మీద తేలి యాడుతూ కర్ణ పేయంగా విన వస్తోంది.
ఈ నిర్జన ప్రదేశంలో ఇంత చీకటి వేళ మురళీ గానం చేస్తూ ఇటు వచ్చినది ఎవరు? పశుల కాపరులా... వారు మును మాపు వేళకే పశుల మళ్ళించు కొని పోదురే... భద్రా దేవి, ఉలూచీశ్వరిలు ముఖ ముఖాలు చూసుకున్నారు.
వీనుల విందు చేస్తూ మురళీ గానం సోక గానే ఇటు వృషభము, అటు శునకము కూడ లేచి తోకలు వూపుతూ ఆనందంగా అటే వీక్షింప సాగాయి. భూతం ఘృతాచి అయితే తన్మయంతో చిందులేయనారంభించింది. ఇంతలో`
ఒక అద్భుత దృశ్యం వారి కంట బడింది.
శివాయం వున్న కొండ గుట్ట, పక్కన కొండ వాగు మధ్య ప్రాంతంలో స్నాన ఘట్టం వద్ద అప్పుడే మలుపు తిరిగిన భక్త బృందం ఒకటి ఇటే వస్తోంది.
ఒంటి నిండా విభూది పూసుకున్న జడ ధారులైన వ్యక్తులు యిద్దరు అటు యిటు దివిటీలు పుచ్చుకుని ముందుగా నడిచి వస్తున్నారు. వారి వెనక మురళి వాయిస్తూ తన్మయంతో నాట్యం చేస్తూ శతాధిక వృద్ధుడు ఒకడు వస్తున్నాడు. వారి వెనక సుమారు పాతిక మంది అనుసరించి వస్తున్నారు. కాగడాల వెలుగులో వారంతా స్పష్టంగా కనబడుతున్నారు. ఒడలంతా విభూది పూసుకున్న జడధారులు వాళ్ళంతా. వారిలో కొందరు మురళీ గానానికి వంతగా డోలు మృదంగం తాళాలు వాయిస్తున్నారు. మిగిలిన వారు త్రిశూలాలు ఆయుధాలుగా ధరించి వున్నారు.
అయితే ఇచట విచిత్రం ఏమంటే` వేణు గాన లోలుడైన శతాధిక వృద్ధుడు ఆ భక్త బృందంలో భిన్నంగా కన్పిస్తున్నాడు. వారంతా శివ భక్తుని చూడ గానే చెప్పొచ్చు. కాని వారి మధ్యన మురళీ ధారుడు మాత్రం విభూది పూసుకోలేదు. లలాట ఫలకాన కస్తూరీ తిలకం ధరించాడు. శిఖి ఫించం లేదు గాని నీల మేఘ శ్యాముడు నీలి రంగు జరీ పట్టు పంచె కట్టాడు. వంటి మీద వేరే ఆచ్ఛాదనా లేదు. నెరిసిన గిరజాల జుత్తు భుజాల మీద పడుతోంది. శతాధిక వృద్ధుడైనా బహు సుందరాకారుడు. ఎంతో ఉత్సాహంగా నాట్యం చేస్తూ వేణు గానమాలపిస్తున్నాడు. అతడి చేతి వ్రేళ్ళ నుండి రసఝరీ ప్రవాహంలా పొంగి ప్రకృతిని పరవశింప చేస్తోంది మురళీ రవం.
అతడి మెడలో తులసీ దళాలు పారిజాత పుష్పాలతో కూర్చిన నిడుపాటి పూమాల వేలాడుతోంది. ఆయన కర్ణాభరణాల రత్నకాంతులు దివిటీల కాంతులకు తళుకులీనుతున్నాయి. ఆ భక్త బృందం నెమ్మదిగా కదులుతూ యిటే వస్తోంది. లేచి నిల బడి ఆశ్చర్య సంభ్రమాలతో వారినే గమనిస్తున్నారు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు.
శివ చరణు మధ్యన హరి భక్తుడా!
కడు విచిత్రము.
వారంతా ఎవరు? ఎచటకు వచ్చుచున్నారు.
వేణు గాన పరవశంలో పులకిస్తూనే ఆలోచిస్తున్నారు. అంతలో ఆ బృందం వారి ముందుకు రానే వచ్చింది. అప్పటికి ఆకాశం పూర్తిగా మేఘావృతమై పోయింది. ఉరుములు మెరుపులతో వాతావరణం పెళ్ళి సందడిలా వుంది. చలి గాలి జివ్వున వీస్తోంది. ఏ క్షణమైనా కుండ పోతగా వర్షం పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆశ్చర్య పరచిన విషయం ఏమంటే, వృషభము, శునకము రెండూ కూడ ముందు కాళ్ళ మీద వంగి ఆ శతాధిక మురళీధరుని పాదాలను భక్తితో తాకటం. ఇక భూతం ఘృతాచి ఆయన ముందు సాష్టాంగ పడి నమస్కరిస్తూ కన్నీరు విడుస్తోంది.
తమకు ఏమీ అర్థం గాక పోయినా భక్తి భావంతో మోకాళ్ళ మీద కూచుని ప్రణామం చేసారు భద్రాదేవి, ఉూచీశ్వరిలు.
మురళి వాయించటం ఆపి చిరు నవ్వుతో అందర్ని చూస్తూ చెయెత్తి ‘‘శుభమస్తు’’ అంటూ ఆశీర్వదించాడాయన.
‘‘స్వామీ! అంధకారములో కొట్టుమిట్టాడుచున్న మాకు సమయానికి దైవంలా వచ్చినారు. మాకేమియు అర్థము గాకున్నది స్వామీ. ఈ వృషభ రాజము, ఈ శునకము, ఇప్పుడు మీరంతా... ఇది మా అదృష్టమే అనుకోవలె. కాని మీకు నమస్కరించుట తప్ప ఏ అతిథి సత్కారము ఆచరింప లేని అభాగ్యులం. మమ్మల్ని క్షమించి తమరు ఎవరో తెలియ జేసి మాకు దారి చూపండి’’ అంటూ వేడుకుంది భద్రా దేవి.
ఆ మురళీ ధరుడు మందహాసం చేసాడు.
అదే సమయంలో................................

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్