Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahima gala marrichettu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - ..

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవతము, అత్యుత్తమమైన తీర్ధము, అత్యుత్తమ మైన క్షేత్రము ఒకేచోట ఉన్న పుణ్యస్థలం ఏది స్వామీ అని అగస్త్యుడు అడిగిన ప్రశ్నకు యిందుకు సమాధానం యివ్వగలవాడు పరమశివుడే అని చెప్పిన కుమారస్వామి, ఆ సమాధానంకోసం అగస్త్యుడినీ, ఆయన సతీమణి లోపాముద్రనూ, శిష్యులను, తన పరివారాన్నీ వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు. అక్కడి అప్సరల 
పూజలు అందుకున్నాడు. అక్కడ పరమశివునివలె వెలిగిపోతున్న ప్రమథగణములను చూశాడు. పార్వతీదేవితో ఉద్యానవిహారం చేస్తున్న పరమశివుని చూశాడు.

మందిరోద్యాన ఖేలనానంద విభవ 
మవధరించెడు తారావిటార్ధమౌళిఁ 
జివురుగుత్తుల విరులఁ బూజించుటకునొ 
యారుఋతువులు సన్నిధియయ్యె నచట                (తే)

ఉద్యానవన మందిరములో ఆనందంగా క్రీడించే వైభవాన్ని అనుభవించే, రుచిచూసే చంద్రమౌళిని, శివుడిని చివురుల గుత్తులతో, పూల గుత్తులతో పూజించడం కోసమేమో  అన్నట్లు ఆరు ఋతువులూ అక్కడ నెలకొన్నాయి అప్పుడు. ఆమె ప్రకృతి, ఆదిప్రకృతి. ఆయన ఆమె పురుషుడు, పరమపురుషుడు. కనుక ప్రకృతికి వశములైన ఋతువులు ఆరూ ఒకేసారి అక్కడ కొలువుదీరాయి, ప్రకృతీ పురుషులను సేవించడానికి, యిది ఒక  చమత్కారం అయితే, చంద్రుడిని 'తారావిటార్ధుడు' అంటే సగమే ఉన్న తారాజారుడు, తారను మరిగిన చంద్రునిలో సగమే, అంటే జాబిల్లిని మౌళిలో అంటే సిగలో కలిగివున్న  శివుడు అని చంద్రుడిని సూచించడం ఒక ప్రత్యేకత ఈ పద్యంలో.

మరువంపు వలపుఁ బల్మఱుఁ గ్రోలిక్రోలి కన్
మ్రాల్చి యురక మేనుమరచుఁ గొన్ని
యరవిచ్చు తెలమొల్లవిరుల మూతులు సాఁచి 
పొదిగూడి రెక్కలఁ బొదువుఁ గొన్ని 
గురువిందపూఁదేనెతెరలకై తమలోనఁ  
బొత్తువోవక సారెఁ బోరుఁ గొన్ని 
పక్వంబులగుదాఁకఁ బాటించి మల్లికా 
కాళికా నికాయంబుఁ గాచుఁ గొన్ని                               (సీ)

భోగివశమైన గేదంగిపూవునకును 
వగచు మదిఁ గొన్ని; బంధుజీవక లతాంత 
గుచ్ఛములలో నొకకొన్ని కొలువుసేయుఁ  
దేఁటు లఖిలర్తుమయవనీవాటిఁ గమిచి          (తే)

ఆ ఉద్యానవనములో ఆరు ఋతువులూ ఒకేసారి వచ్చిపడ్డాయి కనుక ఆరు ఋతువులలో  పూసే పూవులు ఒకేసారి పూచాయి, ఆ పూల తేనెలకోసం తుమ్మెదలు గుమికూడాయి. కోరికతో, ప్రేమతో మరువాల తేనెలను త్రాగీ త్రాగీ మత్తుగా కనులు సగాలుగా తెరిచి 
శరీరాలను మరిచిపోయాయి కొన్ని తుమ్మెదలు. మరువాలు వసంతఋతువులో పూస్తాయి, యిది వసంత ఋతువుకు సూచన. అరవిచ్చిన తెల్లని మొల్లలను మూతులు సాచి ముసిరి,రెక్కలతో పొదువుకొని చేరాయి కొన్ని తుమ్మెదలు. మొల్లలు శిశిర ఋతువులో పూసేవి, కనుక యిది శిశిర ఋతువుకు సూచన. తమలో తమకు పొత్తు కుదరక, గురువిందపూల తేనెల  తెరలకోసం మాటిమాటికీ పోట్లాడుకుంటున్నాయి కొన్ని తుమ్మెదలు. గురువిందపూలు హేమంత ఋతువులో పూచేవి, కనుక యిది హేమంతఋతువు సూచన. పక్వములు  అయ్యేదాకా ఉగ్గబట్టుకుని, పాటించి అంటే ఎదురుచూసి, మల్లియల వరుసలకోసం,మల్లెగుత్తులకోసం కాపు గాసేవి కొన్ని తుమ్మెదలు, అంటే యిది గ్రీష్మఋతువు సూచన. గేదంగి అంటే మొగలి పూవులు, పాములకు వశమైన మొగలిపూలను చూసి భయముతోనూ, తమకు కాకుండా వేరేవాడికి, పాముకు, దక్కినందుకు బాధతోనూ వగచే తుమ్మెదలు కొన్ని, యిది వర్షఋతువు సూచన. మంకెనపూలగుత్తులలో కొలువు తీరినవి కొన్ని తుమ్మెదలు, యిది శరదృతువు సూచన. యిలా ఆరు ఋతువులు, ఆరు ఋతువులలో పూసే పూలు, ఆపూలను మరిగిన తుమ్మెదలతో మనోహరముగా ఉన్న ఉద్యానవనములో పార్వతీదేవితో 
కలిసి విహరిస్తున్నాడు పరమశివుడు. ప్రబంధాలు అన్నింటిలోకీ విశేషమైన ఋతువర్ణన,  పూలవర్ణన ఒకే పద్యములో కలిగిన విశిష్ట పద్యము యిది.

పూవుఁదేనియఁ దడిసిన మావిచిగురు 
మీఁదనంటి చరించు తుమ్మెద దలిర్చు 
సమయమగుటయు నసి నెయ్యిసమరి మరుఁడు
త్రుప్పువోఁ దోము ఖడ్గంపుఁ దునుక యనఁగ                    (తే)

పూలతేనేతో తడిసిన మామిడి చిగురు మన్మథుని చురకత్తిలాగా ఉన్నది. యిక సమయం  వచ్చింది, నేను దాడి చేయడానికి అని పూలబాణాలతో పాటు మామిడిచిగురు చురకత్తిని  కూడా సిద్ధం చేసుకోడానికి పూనుకున్నాడు మన్మథుడు. దాన్ని తుప్పు వదిలించి, 
సానబెట్టడానికి మన్మథుడు మామిడిచిగురు అనే ఖడ్గానికి పూసిన నేయిలా ఉంది  ఆపూలతేనె. చిగురాకుమీద కురిసిన తేనెను త్రాగడానికి వీలూ కాక, వదిలిపెట్టడానికి మనసూ రాక ఆ ఆకుమీదనే తిరుగుతున్న తుమ్మెద సానబెట్టడానికి వాడే నల్లరాతి  ముక్కలా, నీలపు ముక్కలా ఉన్నది.  

గంధవిరహితమను బుద్దిఁ గనక తేఁటి
మూతివిచ్చిన మోదుగుమోగ్గఁ దగిలి
సౌరభాకాంక్షఁ బొంచి చెన్నారెఁ గీర 
తుండవశమైన నేరేడుపండుఁబోలె                             (తే)

కొద్దిగా మూతివిచ్చిన మోదుగుమొగ్గ చిలుకముక్కులా ఉన్నది. మోదుగుపూలకు సౌరభము ఉండదు అనే యింగితం లేక, దానికి ముసురుకున్న తుమ్మెద ఒకటి  నేరేడుపండులా ఉన్నది. యిది కాకిముక్కుకు దొండపండు అన్నట్టు చిలుక ముక్కుకు 
వశమైన (కీర తుండవశమైన) నేరేడుపండు అన్నట్టు ఉన్నది!

ఖరకర కరహతి సలసలఁ 
దెరలెడు మల్లీమరంద దీర్ఘికచుట్టున్ 
దిరుగునళి యనుభవమునకుఁ 
జొరదతిలోభాంధబుద్ది సొమ్మరయుక్రియన్                   (కం)

సూర్యుని తీవ్రమైన కిరణముల వేడిమికి సలసలా మరుగుతున్నది మల్లెపూలతేనెలు  నిండిన దిగుడుబావి ఒకటి. దానిచుట్టూ తిరుగుతున్నది తుమ్మెద ఒకటి. ఆ వేడికి  కాలిపోతాననే భయముతో, ఆ ప్రవాహములో మునిగిపోతాననే భయముతో రుచి చూడడానికి 
సాహసించి ఆ దిగుడుబావిలోకి దిగడంలేదు. అది ఎలాఉన్నదీ అంటే అతి పిసినారి  ఐనవాడు మాటిమాటికీ తన సొమ్మును చూసుకోవడమే కానీ వాడికి దాన్ని అనుభవించడానికి అదృష్టం లేదన్నట్లు ఉన్నది!

(కొనసాగింపు వచ్చేవారం)

**వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
idee anyonyate...!