Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
goddess naina devi

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇదో బొమ్మల గ్రామం - మానస

 ఇదో బొమ్మల గ్రామం ...

 


అది జపాన్ లోని నగోరో గ్రామం. అందులో త్సుకిమి అనే మహిళ. త్సుకిమి బాల్యంలో తన తల్లిదండ్రులతో పాటు నగొరో గ్రామంలోనే నివసించేది. కొంతకాలానికి త్సుకిమి కుటుంబం పట్నానికి వలస వెళ్ళిపోయింది. కుటుంబంతో పాటు త్సుకిమి కూడా. కొన్నేళ్ళు గడిచిపోయయి. ఇన్నేళ్ళయిన తరువాత తన గ్రామం ఎలా ఉందో చూడాలనిపించింది త్సుకిమి కి. అంతే అనుకున్నదే తడవు వెంటనే తన తండ్రితో  ఊరికి బయలుదేరింది. ఎంతో ఆశతో తన బాల్య స్నేహితులను, తన ఉరివారందరిని చూద్దామని వెళ్ళిన త్సుకిమి కి బోసిపోయిన ఊరు స్వాగతం చెప్పింది.


కేవలం ఓ పాతిక, ముప్పై మంది తప్ప పెద్దగా మనుష్య సంచారం లేకుండా, ఖాళీగా ఉన్న గ్రామాన్ని చూసి బిత్తరపోయింది. ఊర్లో బతకడానికి సరయిన ఉపాధి లేకపోవడంతో గ్రామంలోని ఒక్కొక్కరు గ్రామం నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామమంతా ఖాళి అయిపోయింది. ఒకప్పుడు కళకళలాడుతూ ఉన్న ఆ ఊరు ఆలా వెలవేలలాడుతూ కనబడేసరికి బాధపడింది. మళ్ళి ఎలాగైనా ఊరంతా ఎక్కడ చూసినా కళకళలాడుతూ మనుషులను చూడాలనుకుంది. కాని ఎలా..... ఏం చేయాలి..... ఆలోచనలో పడింది. అంతమంది మనుషులనయితే తేలేదు.

అందుకే అచ్చంగా మనుషుల్లా కనబడే, మనుషులంత ఎత్తుండే బొమ్మలను తయారుచేయడం మొదలుపెట్టింది.  ఇంతకుముందు ఆ ఊరిలో ఎంతమంది మనుషులుండే వారో  దానికి సరిసమానమైన సంఖ్యలో ఉండేలా, పాతబట్టలు, గడ్డి ఉపయోగించి దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి 35౦ బొమ్మలను తయారుచేసింది. వాటికి చక్కటి బట్టలు, ఆభరణాలు కూడా వేసింది.


ఇప్పుడా గ్రామంలో మనుషులు లేరన్న చింత లేదు. ఎక్కడ చూసినా అచ్చంగా మనుషుల్లా కనబడే నిలువెత్తు బొమ్మలే...! రోడ్డుమీద చూస్తే చకచకా సైకిళ్ళు తొక్కుతూ వెళుతుంటాయి. పొలాల్లో ఆడామగా బొమ్మలు పొలం పనులు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటాయి. స్కూల్లో చూస్తే చక్కగా పాఠాలు చెప్తున్న టీచర్లు, అంటే శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.

ఇక ఇళ్ళలో సందడిగా పనులు చేసుకుంటున్న మనుషులు. ఇంటి ఆవరణలో వీధి అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంతున్న ఇరుగుపొరుగు. బస్టాండ్ లో ప్రయాణ హడావిడిలో ఉన్న జనం.... ఇలా ఎక్కడ చూసినా కళకళ లాడుతూ ఉన్న బొమ్మలు ఆ ఊర్లో మనుషులు లేని లోటును తీర్చేసాయి. ఇది చదివిన తరువాత మీకో సందేహం వచ్చుంటుంది.

అదేనండీ..... బొమ్మలయితే తయారుచేయొచ్చు. కాని అవి ఊర్లో ఎక్కడపడితే అక్కడికి ఎలా వస్తాయి. ఎలా పనులు చేస్తాయి. వాహనాలు ఎలా నడుపుతాయి! అని.... సందేహం వచ్చింది కదా!

ఇదంతా త్సుకిమి ప్రతిభే. మనుషులు ఎలా అయితే పనిచేస్తారో అచ్చంగా అలాగే రోడ్డు మీద సైకిళ్ళు తోక్కుతున్నట్టు, పొలాల్లో పనులు చేస్తున్నట్టు, ఇంటిపనులు చేస్తున్నట్టు, కబుర్లు చెప్పుకుంటున్నట్టు, ప్రయాణాలు చేస్తున్నట్టు తయారుచేసిన బొమ్మలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. దాంతో అక్కడెవరో మనుషులే ఆ పనులన్నీ చేస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. భ్రమ కాదు అక్కడ మనుషులున్నట్టే భావిస్తుంది త్సుకిమి. వాటి మధ్యలో కూర్చొని 65 ఏళ్ల త్సుకిమి అయినో వాటితో తనివితీరా మాట్లాడుతుంది. తన మనసులోని మాటలను వాటితో పంచుకుంటుంది.

వాటితో కలిసి తింటుంది. తాగుతుంది. ఒకటేమిటి.... అన్ని పనులలోను వాటినే తోడుగా చేసుకుంటుంది. ఆమె దృష్టిలో అవి బొమ్మలు కాదు. మనుషులే. ఒకప్పుడు మనుషులతో కళకళ లాడిన గ్రామం మళ్లి కళ్ళముందు నిలిచిందని తృప్తి పడుతుంది.

అది సరే ఆ బొమ్మలు ఎంతకాలం అలా ఉంటాయి? ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ పాడయిపోవూ? ఎందుకు పాడయిపోవు.... అల పడయినప్పుడల్లా వాటికి కొత్త హంగులద్ది సజీవంగా చేస్తుంది.


పూర్తిగా పడయిపోతే వాటి స్థానంలో కొత్త బొమ్మలను తయారుచేస్తుంది. ఎక్కడ చూసినా బొమ్మలే కనవడడంతో ఈ ఊరికి డాల్స్ విలేజ్ అన్న పేరు స్తిరపడిపోయింది. కొసమెరుపేంటంటే ....

ఈ ఊరి చరిత్ర తెలుసుకున్న ఇతర ప్రాంతాలవారు దీన్ని చూడడానికి రావడం, అది కాస్త ఎక్కువవడంతో ఈ గ్రామం ఇప్పుడో టూరిస్ట్ స్పాట్ అయిపోయిందట.

 

 

- మానస

మరిన్ని శీర్షికలు
sarasadarahasam