Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

విక్ర‌మ్‌తో ఇంట‌ర్వ్యూ

interview with vikram
ఛాలెంజింగ్‌గా లేక‌పోతే... సినిమాలు మానేస్తా!  -
 
క‌మ‌ల్ హాస‌న్ త‌ర‌వాత ఆ స్థాయిలో ప్ర‌యోగాలు చేసేవాళ్లు క‌నిపించ‌రేమో అనుకొన్నారంతా. కానీ.. త‌మిళ ప‌రిశ్ర‌మ మంచి న‌టుల‌నే అందిస్తోంది. సూర్య‌, విక్ర‌మ్‌లాంటి వాళ్లు వెరైటీ పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా నిలుస్తున్నారు. వాళ్ల సినిమాలెలా ఉన్నా స‌రే... న‌టులుగా మాత్రం ప్ర‌తీ సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. సూర్య అయినా అప్పుడ‌ప్పుడూ కాస్త క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచిస్తాడేమో, విక్ర‌మ్ అలా కాదు. కొత్త పాత్ర‌లు, కొత్త క‌థ‌లు ప‌ట్టుకొని ప్ర‌యాణం చేస్తూనే ఉంటాడు. ప్ర‌తీ సినిమాకీ త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకొంటూనే ఉంటాడు. అప‌రిచితుడు త‌ర‌వాత ఆ స్థాయిలో హిట్టు ద‌క్క‌క‌పోయినా... న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వ‌లేదు విక్ర‌మ్‌. త‌న‌లో ఉన్న ఇంకొక్క‌డ్ని ప్ర‌తీ సినిమాకీ ప‌రిచ‌యం చేస్తూనే వ‌చ్చాడు. ఇప్పుడు ఇంకొక్క‌డు అనే పేరుతో ఓ సినిమా విడుద‌లైంది. ఇందులోనూ రెండు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపిస్తున్నాడు విక్ర‌మ్‌. ఈ సంద‌ర్భంగా విల‌క్ష‌ణ న‌టుడు విక్ర‌మ్ తో చేసిన చిట్ చాట్ ఇదీ...

* హాయ్ విక్ర‌మ్‌
- హాయ్‌...

* మిమ్మ‌ల్ని చియాన్ అని పిల‌వాలా, విక్ర‌మ్ అని పిల‌వాలా?
- ఎలా పిలిచినా ఆనంద‌మే. అభిమానులు చియాన్ చియాన్ అని పిలుస్తుంటారు. సేతులో నా పాత్ర పేరు అది. నా జాత‌కం తిర‌గ‌బ‌డానికి కార‌ణం ఆ సినిమా. దాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందుకే అభిమానులు ఆ సినిమాని అలా గుర్తు చేస్తుంటారు.

* ఇంత‌కీ ఈ సినిమాలో ఇంకొక్క‌డు ఎవ‌రు?
- సినిమా చూసిన‌వాళ్ల‌కు ఆ విష‌యం ఈపాటికే తెలిసిపోయుంటుంది. చూడ‌నివాళ్లు చూసే వ‌ర‌కూ ఆ స‌స్పెన్స్ ఉంటే బాగుంటుంది క‌దా?  తెర‌పై చూసి తెలుసుకొంటేనే బాగుంటుంది. 

* ప్ర‌తీ సినిమాలోనూ ఇలా గెట‌ప్పులు మార్చ‌డం అవ‌స‌ర‌మా?
- (న‌వ్వుతూ) క‌థ‌కు అవ‌స‌రం. ఈ సినిమాలో గెట‌ప్ వేస్తే బాగుంటుంది అనుకొంటే త‌ప్ప‌కుండా చేసేస్తా. నాకు కిక్ ఇచ్చే అంశాల్లో అదొకటి. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌కులు కూడా నాకు అలాంటి క‌థ‌లే చెబుతున్నారు. నిజానికి ఇంకొక్క‌డు సినిమాలో ల‌వ్ అనే పాత్ర కోసం మ‌రో న‌టుడ్ని అనుకొన్నాం. క‌థ చెబుతున్న‌ప్పుడు నేనే చేయాల‌ని అనుకోలేదు. చాలామందిని అడిగి అడిగి... ఓరోజు.. ఈ గెట‌ప్ నేనే వేస్తే బాగుంటుంది క‌దా, అనిపించింది. ద‌ర్శ‌కుడూ ఓకే అన్నాడు. అందుకే అలా సెట్ట‌య్యింది..

* రెండు పాత్ర‌లు ఒకేసారి చేస్తున్న‌ప్పుడు ఓ పాత్ర‌ని ఎక్కువ‌గా ప్రేమించి ఓ పాత్ర‌ని త‌క్కువ‌గా ప్రేమించ‌డం జ‌రుగుతుందా...?
- రెండింటినీ చేస్తున్న‌ది నేనే కాబ‌ట్టి ఆ ప్రేమ స‌మానంగా ఉంటుంది. కాక‌పోతే కొన్ని కొన్ని పాత్ర‌లు త్వ‌ర‌గా క‌నెక్ట్ అయిపోతాయి. దాని కోసం ఎంత క‌ష్ట‌మైనా పడాలి అనిపిస్తుంటుంది. న‌టుడిగానూ ఛాలెంజింగ్ గా ఉంటుంది క‌దా?  నిజానికి ఏ సినిమా ఒప్పుకొన్నా అందులో ఛాలెంజింగ్ విష‌యం ఏదోటి ఉండాలి. లేక‌పోతే ఆ సినిమా చేయ‌డం మానేయ‌డ‌మే బెట‌ర్‌.  

* విక్ర‌మ్ గెట‌ప్పుల కోస‌మే సినిమాలు చేస్తాడ‌న్న అప‌వాదు ఉంది...
- అదేం లేదండీ. కాక‌పోతే గెట‌ప్పులు అని దాన్ని ఇంకో కోణంలో చూడొద్దు. అలా వేషం మార్చుకోవ‌డానికి ఎంతెంత క‌ష్టం ప‌డాల్సివ‌స్తుందో ఊహించండి. ఓ సినిమాలో హీరో, విల‌న్ ఒక్క‌రే అయితే ఎంత థ్రిల్లింగ్ పాయింట్ అవుతుందో క‌దా?  హీరోనీ, విల‌న్‌నీ ఇద్ద‌రినీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. రెండు పాత్ర‌ల్నీ శ‌క్తిమంతంగా తీర్చిదిద్ద‌డానికి వీలుంటుంది. ఆ దృషి కోణంలో చూస్తే మంచి ఫ‌లితాలొస్తాయి. 

* ప్ర‌తీ సినిమా కోసం, పాత్ర కోసం ఇంతింత క‌ష్ట‌ప‌డుతుంటారు. ఫ‌లితం తేడా వ‌చ్చిన‌ప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?
-  బాధ‌గానే ఉంటుంది. కానీ అవ‌న్నీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ లైఫ్ క‌దా?  అయితే వీళ్లంతా ఇంత క‌ష్ట‌ప‌డ్డారు క‌దా అని సినిమాని హిట్ చేయాల‌న్న రూల్ లేదు. న‌చ్చితే చూస్తారు, లేదంటే లేదు.

* ఐ సినిమా ఫెయిల్ అయిన‌ప్పుడు కూడా ఇలానే అనుకొన్నారా?
- ఐ సినిమా ఫెయిల్ అని నేను అనుకోను. కానీ అనుకొన్నంత హిట్ కాలేదు. డ‌బ్బులు బాగానే వ‌చ్చాయి. ఆ టైమ్‌కి రికార్డు వ‌సూళ్లు సాధించింది. మా క‌ష్టాన్నీ జ‌నం గుర్తించారు. ఆ గెట‌ప్పులు గురించి మాట్లాడుకొన్నారు. 

* బ‌య‌ట పార్టీల్లో, ఇత‌ర సినిమా వేడుకల్లో క‌నిపించ‌రు. కార‌ణం ఏమిటి?
- నాకు పార్టీలంటే పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. సెట్‌, ఇల్లూ, జిమ్ త‌ప్ప‌.. మిగిలిన ప్రాంతాలేం పెద్ద‌గా ప‌రిచయం లేదు.

* ఓ సినిమా కోసం బ‌రువు పెరుగుతారు, వెంట‌నే త‌గ్గిపోతుంటారు.. అది మీ శ‌రీరంపై ప్ర‌భావం చూపించ‌దా?
- సినిమా నా ఫ్యాష‌న్‌. దాని కోసం ఎంత క‌ష్టం చేయ‌డానికైనా రెడీ. బేసిగ్గా... అలా క‌ష్ట‌ప‌డ‌డం నాకిష్టం.  రావ‌ణలో విల‌న్‌గా క‌నిపించాను. చాలా మొర‌టిగా ఉండే మ‌నిషి పాత్ర అది. ఆ మొర‌టుద‌నం క‌నిపించాలంటే మొహం న‌ల్ల‌గా మారిపోవాలి. అందుకే... దాని కోసం గంట‌ల త‌ర‌బ‌డి ఎండ‌ల్లో నిల‌బ‌డేవాడ్ని. ఫైట్ చేస్తున్న‌ప్పుడు అక్క‌డ‌క్క‌డ చిన్న చిన్న దెబ్బ‌లైనా త‌గ‌లాలి క‌దా. అందుకే నిజంగానే ప‌డిపోతుంటాను. స‌హ‌జ‌త్వం కోసం పులి బోనులో్కి వెళ్ల‌మ‌న్నా వెళ్తా. యాక్ష‌న్ చెప్పేశాక‌.. నాకేం గుర్తుండ‌దు. ఆ పాత్ర ఎలా బిహేవ్ చేయాలో అలానే చేస్తా. సినిమా అంటే అంత పిచ్చి.

* రిస్కులు చేస్తున్న‌ప్పుడు ఇంట్లోవాళ్లు అడ్డు చెప్ప‌రా?
- వాళ్లు చెప్పీ చెప్పీ అల‌సిపోయారు. ఇక వీడు విన‌డు అనుకొన్నారేమో.. ఇప్పుడు నో చెప్ప‌డం కూడా మానేశారు.

* అంతిమంగా మీ ల‌క్ష్యం ఏమిటి?
- ల‌క్ష్యాలేం లేవు. న‌టుడికి ఎప్ప‌టికైనా కొత్త కొత్త కోరిక‌లు పుడుతుంటాయి. వాటిని నిజం చేసుకొంటూ వెళ్లిపోవ‌డ‌మే. బ‌ల‌మైన విల‌న్ పాత్ర‌లో క‌నిపించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నా. అది తీరని కోరికగా మిగిలిపోతుందేమో అని భ‌య‌ప‌డ్డా. కానీ ఇంకొక్క‌డులో ల‌వ్ పాత్ర ద్వారా ఆ కోరిక తీరింది. రేపో మాపో.. ఇంకో కొత్త క‌ల వస్తుంది. ఇంకో కోరిక క‌లుగుతుంది. దాన్ని తీర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తా.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ 

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka