Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే..... http://www.gotelugu.com/issue178/509/telugu-serials/atulitabandham/atulita-bhandham/

 

“ఏమిట్రా మధూ, ఎన్నాళ్ళని ఉద్యోగానికి లీవు పెడతావు?” టిఫిన్ ప్లేట్ చేతికి అందిస్తూ అడిగింది పూర్ణమ్మ.

బాబుతో పుట్టింటికి మధూ వచ్చి వారం దాటుతోంది...

“ఏమిటోనమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు... వీడిని  బేబీ కేర్ సెంటర్ లో వేస్తే, వేణు తీసుకు వెళ్ళకుండా ఉండడు. నాకతనితో కాపురం చేయాలని లేదు... అటు ఉద్యోగం వదులుకునే పరిస్థితీ కాదు... ఏం చేయనమ్మా  నేను?” నిస్సహాయంగా చూసింది మధుబాల.

“పోనీ, కొన్నాళ్ళ పాటు నేను నీతో వచ్చి ఉండనా మధూ?” అడిగింది పూర్ణమ్మ.

“వద్దమ్మా, నాన్నగారిని చూసుకోవాలి నువ్వు. నాన్నమ్మా, ఇంకా చంటి పాప... నీ అవసరం ఇక్కడే ఎక్కువ అమ్మా... నేనే ఏదో ఒక మార్గం ఆలోచించుకుంటాను...” అంది మధుబాల.

“వదినా, చూసావా, వీళ్ళిద్దరికీ ఎన్ని పోలికలో?” ఇద్దరు పిల్లల్నీ ఒడిలో కూర్చో బెట్టుకుని, బేబీ ఫుడ్ తినిపిస్తు న్న నిర్మల అంది.

అవును... ఆరు నెలలు నిండుతున్న పసివాళ్ళు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  కీర్తి, బాబి ఇద్దరూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని లాగుతూ బోసి నవ్వులు నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఫుడ్ తింటున్నారు. గిరి, మధు ఒకేలా ఉంటారు. చిన్నప్పుడు గిరికి ఫ్రాక్ వేసి, కృష్ణుడి జడ వేసి తీసిన ఫోటో, మధు చిన్నప్పటి ఫోటోలు ఒక్కరివే అనిపించేలా ఉంటాయి పోలికలు... అందుకే తండ్రి పోలిక వచ్చిన కీర్తి, తల్లి పోలిక వచ్చిన బాబి ఒకేలా ఉన్నారు, కవల పిల్లలు అంటే నమ్మేలా...

“అవును వదినా...” నవ్వింది మధుబాల.

“నువ్వేమీ అనుకోకపోతే...” సంశయంగా ఆగింది నిర్మల.

“ఫర్వాలేదు వదినా, ఏమీ అనుకోను చెప్పు...” ప్రశ్నార్థకంగా వదిన గారివైపు చూసింది మధుబాల.

“నువ్వు వేణు అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోవటం మంచిది... ఆహా, నువ్విక్కడ ఉండటం నాకు అభ్యంతరం కాదు... ఎన్నాళ్ళయినా ఉండొచ్చు... కానీ చూడు... మన ఇరుగూ పొరుగూ గుసగుసలాడుతున్నారు... అత్తయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు...” చెప్పలేక చెప్పింది నిర్మల.

మధుబాలకు ఉప్మా మింగుడు పడటం లేదు... చెంచాతో అటూ ఇటూ కెలుకుతూ కూర్చుంది...

“అయామ్ సారీ వదినా... మామయ్య గారి ఆరోగ్య పరిస్థితి నీకు తెలియంది కాదు కదా... నీ కాపురం గురించి చాలా బెంగ పడుతున్నారు. బీపీ కంట్రోల్ అవటం లేదు. మొన్న డాక్టర్ గారు కూడా వచ్చి చాలా కోప్పడ్డారు... మళ్ళీ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడాలి మనం... నువ్వెళ్ళి కాపురం చేసుకుంటే ఆయన కన్నా సంతోషపడేవారు ఎవ్వరూ ఉండరు... ఒక్క సారి సామరస్యంగా ఆలోచించు...

మా బాబాయ్ లాగా తాగుడూ, పేకాట వ్యసనాలు లేవు వేణు అన్నయ్యకు... మా మావయ్య లాగా అనుమానరోగం లేదు. నిన్ను ప్రేమగా చూసుకుంటారు. అత్తగారి సాధింపులు కూడా లేవు  నీకు. వినతతోనే సమస్య. ఆమెను రానీయకుండా ఉంటే చాలు... ఆ విషయం నేను సుగుణ పిన్నిగారితో మాట్లాడతాను...

జీవితం అంటే మన హక్కులూ, వ్యక్తిత్వాలే కాదు కదా వదినా... కొంచెం రాజీ, చాలా సర్దుబాటు కూడా... నువ్వు చదువుకున్నదానివి... క్షమాగుణం ఎంత ముఖ్యమో నేను చెప్పాల్సిన అవసరం లేదేమో...  అదీగాక...” ఆగింది నిర్మల...

“ఊ.. చెప్పు వదినా...”

“బాబికి తండ్రి ప్రేమను దూరం చేసే హక్కు నీకు లేదు వదినా...” కొరడా దెబ్బలా తగిలింది ఈ మాట మధుబాలకి.

“అవున్రా మధూ, నిర్మల చెప్పింది నిజమే... నాన్నలందరూ కూతుళ్ళకి మంచి వాళ్లేనే... వాళ్ళతో ఎన్ని బాధలు పడ్డారో అమ్మలకే తెలుసు...” చెప్పింది పూర్ణమ్మ కాఫీ గ్లాసు అందిస్తూ...

నిజమేనా? అమ్మకి నాన్న వలన కష్టాలు వచ్చాయా? ఇబ్బందులు పడిందా? ఏమో తనకు తెలియదు... ఇది ఇంటింటి రామాయణమా? సర్దుకుపోయి, బట్టలు సర్దుకుని వెళ్ళాల్సిందేనా?  తల విదిలించింది మధుబాల.

నిర్మల కాబట్టి తన శ్రేయస్సును, కుటుంబ పరిస్థితిని ఆలోచించి ఇంత సవివరంగా చెప్పింది... ఆమె స్థానంలో వేరే ఎవరున్నా తనకు నిత్యం సాధింపులు తప్పి ఉండేవి కావు... ఆలోచనలో పడింది మధుబాల.

ఆ రాత్రి బాబిని ఉయ్యాలలో వేసి, వాడు పడుకున్నాక, తాను నాయనమ్మ పక్కలో పడుకుంది మధుబాల.

“నానమ్మా, నాకేం చేయాలో తెలియటం లేదు...” అంది బేలగా...

“అమ్మీ, నీకు మీ అత్తగారితో ఏం లేదు కదా...” మనవరాలి వీపు రాస్తూ అడిగింది అంజమ్మ.

“లేదు నానమ్మా... అమ్మలాగే చూసుకుంటుంది... ఇప్పుడు వినత మీద తనకీ కోపమే... మామయ్య గారు పోయాక ఆవిడ ఆరోగ్యమూ అంత బాగుండటం లేదు... దానికి తోడు ఈ బాధ కూడా...”

“మధూ... మీ ఆయన నిలబెట్టి డబ్బులు అడిగాడనే కదమ్మా నీ బాధంతా? ఏ సమస్యనైనా అన్ని వైపుల నుంచీ ఆలోచించాలి కదా... అతనికి ఏం అవసరం వచ్చి అడిగాడో మనకేం తెలుసు? అదీగాక, గిరి తీసుకు వచ్చింది అప్పుగానే కదా...దానికి నువ్వు మనసు పాడుచేసుకోకూడదు...”

“కానీ నానీ, అవి నేను కష్టపడి సంపాదించిన డబ్బులు కదా... వాటి మీద అతనికి ఏం హక్కుంటుంది?”

“పెళ్లి అయి, మీరిద్దరూ ఏకమయ్యాక ఇంకా నీదీ, నాదీ ఏమిటే? ఇద్దరికీ హక్కుంటుంది... నీ డబ్బు, నా డబ్బు అనే తేడా ఉండదు... ఇప్పుడు నీ బాబు నీ స్వంతమని ఎలా అనుకుంటున్నావో, అతనూ అలాగే అనుకుంటాడు కదా...”

“ఎలా? కష్టపడి, నవమాసాలు మోసి, నొప్పులు పడి  కన్నది నేను... పాలిచ్చి పెంచుకుంటున్నది నేను... ఇప్పుడు వచ్చి హక్కు అనగానే వస్తుందా?” ఉక్రోషంగా అన్నది మధుబాల.

బోసినోటితో నవ్వింది అంజమ్మ...

“ఎందుకు రాదు? అతనే కదా నీకీ బాబును ఇచ్చింది? పంతాలకు పోయి బాబుకు తండ్రిని దూరం చేయకు మధూ... నువ్వు వెళ్ళటమే మంచిది అమ్మా...”

“కానీ, అతను చాలా కోపిష్టి వాడు నానమ్మా... చాలా పరుషంగా మాట్లాడతాడు... ఎంత బాధగా, అవమానంగా అనిపిస్తుందో తెలుసా?”

“పిచ్చి పిల్లా... నువ్వు ఉద్యోగం చేసే ఆఫీసులో యజమాని నిన్ను ఎప్పుడూ కోప్పడడా? నీ తప్పున్నా, లేకపోయినా కూడా... అదిలించటం అతని లక్షణం కదా... మరి నువ్వు ఆఫీసుకు వెళ్లనని, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయాలని అనుకున్నావా ఎప్పుడైనా?”

“అదీ, ఇదీ ఒక్కటేనా?”

“ఉహు, జీవితం ఉద్యోగం కన్నా చాలా ముఖ్యమైనది... జీతం ఇచ్చే యజమాని కోప్పడితే పట్టించుకోము... జీవిత భాగస్వామి కోపానికి మనసు బాధ పెట్టుకుంటాము... దీన్ని కూడా తేలికగా తీసుకుంటే, నువ్వు అతన్ని చాలా సులువుగా జయించగలవు మధూ... మనుషుల బలహీనతలను క్షమిస్తేనే వాళ్ళని ప్రేమించగలం...”

అంజమ్మ మాటలు చేదుగా ఉన్నా, వాటిల్లోని నిజం మధుబాలకు అవగతం అయింది.

“సరే, మీరంతా చెబుతున్నారు కాబట్టి రేపు నేనోసారి మా అత్తగారితో మాట్లాడతాను...” చెప్పింది మధుబాల కళ్ళుమూసుకుంటూ...

పెళ్ళి అయాక పుట్టిల్లు పరాయిదే అన్న విషయం మరోసారి అర్థమైంది మధుబాలకు.

*******************************************

“ఏమ్మా ఐశూ, మధూ ఎలా ఉంది?” కాల్చిన వంకాయ పచ్చడి గిన్నెలో తీసుకు వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అడిగింది అన్నపూర్ణ.

“మధు బావుంది పిన్నీ... రేపో ఎల్లుండో వచ్చేస్తుంది... వాళ్ళ అత్తగారింటికే వెళుతుంది బహుశ:”

“ఓ, మంచి వార్త చెప్పావు ఐశూ... చిన్న చిన్న విషయాలకు పంతాలకు పోవటం అంత మంచిది కాదు... ఆ ఆడపడుచును దూరంగా ఉంచితే సరి...”

“అవును పిన్నీ... మధు వాళ్ళ అత్తగారు దానికి హామీ ఇచ్చారట... ఇక వినతను రానీయను అని...”

“పోనీలే పాపం... అవునూ, పది దాటుతోంది, నువ్వింకా తయారు కాలేదేమ్మా? ఆఫీసుకు సమయం కావటంలా?”

“ఈరోజు సాయంత్రం నాలుగింటికి ఒక ఇంటర్వ్యూ ఉంది పిన్నీ... కంపెనీ మారాలని అనుకుంటున్నాను. కొత్తగా పెట్టిన ఒక కంపెనీలో ఇంటర్వ్యూ... జీతం బాగుంది... కొంత చేంజ్ కావాలనిపిస్తోంది... ఇదిగో సబ్జెక్ట్ చదువుకుంటున్నాను...” చేతిలో బుక్ చూపిస్తూ అన్నది.

“బాగా చెయ్యి అయితే... నేను వెళతానులే... నువ్వు చదువుకో... వేడి వేడిగా అన్నం తినేయ్ పచ్చడి వేసుకుని...నెయ్యి కలుపుకో... సరేనా?”

“సరే పిన్నీ, థాంక్ యు...” నవ్వింది ఐశ్వర్య.

సాయంత్రం నాలుగైదు విడతలుగా సాగిన ఇంటర్ వ్యూ లో, గ్రూప్ డిస్కషన్ లో ఐదుగురిని సెలెక్ట్ చేసారు. ఐశ్వర్య కూడా సెలెక్ట్ అయింది. ఒక నాలుగైదు రోజుల్లో జాయిన్ అవమని చెప్పారు.

ఆరాత్రి అమ్మానాన్నల్ని చూసి చాలా రోజులైందని ఊరికి బయలుదేరింది ఐశ్వర్య.

తన కోసమే బెంగ పెట్టుకున్న అమ్మా నాన్నల్ని ఓదార్చి, మూడో రోజు వెనక్కి వచ్చేసింది ఐశ్వర్య. ఆ మర్నాడే కొత్త ఆఫీసుకు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఉద్యోగంలో చేరింది.

కొత్తగా పెట్టిన ఫర్మ్ కాబట్టి అంతా కొత్త స్టాఫ్... ఇంకా వర్క్ పూర్తిగా మొదలవలేదు. అంచేత పెద్దగా పనులేవీ లేవు. ఆఫీసు వాతావరణం కూల్ గా, రిలాక్స్డ్ గా అనిపించింది.

రాత్రి ఇంటికి వచ్చిన తరువాత చాలా ప్రశాంతంగా తల స్నానం చేసి, పున్నమి వెన్నెలను చూస్తూ బాల్కనీలో కూర్చుంది. ఈరోజు ఎందుకో తెలియదు పదే పదే కార్తీక్ గుర్తు  వస్తున్నాడు. ఎడారి ఇసుకతిన్నెలను, సరస్సు అలలుగా భావించి పరుగు తీసే అమాయకపు పాంథుడిలా తోచాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో...

ప్రతీ వారం అమల ఇంటికి వెళ్ళటం బాగా అలవాటు అయింది తనకు... రూపతో ఆడుకోవటం, చదువు చెప్పటం, కార్తీక్ అమ్మానాన్నలతో కలిసి గడపటం... ఇవన్నీ మనసుకు ఎంతో సాంత్వన కలిగిస్తున్నాయి. అమల కూడా తోడబుట్టిన దానిలాగే తనను ఆదరిస్తోంది... ఒక్కోసారి అనిపిస్తుంది, తనకి ఎందుకీ బంధాలు అని... కానీ నిష్కల్మషమైన వారి ప్రేమను కాదని అనటానికి మనసూ ఒప్పటం లేదు...

అప్పట్లో ఇలా బాల్కనీలో, ఉయ్యాలలో కూర్చుని వెన్నెలను చూస్తూ పాటలు పాడేది తను... నైట్ క్వీన్ గుబాళింపులను మనసు నిండా నింపుకుంటూ, తన జుట్టుతో ఆడుకుంటూ, హాయిగా ఆనందించే వాడు కార్తీక్. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆకలేస్తోంది అనేవాడు... వంటింట్లోంచి వేడి పాలు, బిస్కట్లు తెచ్చిచ్చేది తను. కార్తీక్ కోసమని ఎప్పుడూ ఫ్రిజ్ లో పాలు రెడీ గా ఉంచేది. అలాగే వంటింటి స్టీలు డబ్బాల్లో స్నాక్స్, బిస్కట్స్ కూడా... ఇప్పుడు ఎలా ఉన్నాడో... ఆ డాలీతో సంతోషంగా ఉన్నాడా?

అసలు నిన్ను వదిలేసిన వాడి గురించిన ఆలోచనలు నీకెందుకు? – అంతరాత్మ నిలదీసింది. ‘కానీ వాడు నావాడు... మంచీ చెడూ తేడా తెలియని పసివాడు... తనకేం కావాలో తనకే తెలియని అమాయకుడు...’ అనుకుంది ఐశ్వర్య... గుండెలోతుల్లోంచి వెలువడిన నిట్టూర్పు కనురెప్పలను తోసుకుంటూ కన్నీటి ముత్యంగా మారి బుగ్గపై నిలిచింది...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam