Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ....  http://www.gotelugu.com/issue178/510/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

ఆకాశ మార్గాన పెద్ద మెరుపు.

ఆ వెనకే దిక్కులు పిక్కటిల్ల జేస్తూ ఉరుముల శబ్ధం. దాంతో బాటే చిట పట చినుకులు రాలటం ఆరంభమైంది. పరమ భాగవతోత్తముడైన ఆ పురుషోత్తముడు ఆకాశం వంక చూస్తూ` ‘‘ఆగవయ్యా వరుణ దేవా. ఏమా తొందర? ఇచట వ్యవహారమింకను చక్క బడ లేదు. మేము వెడలు వరకు ఒక్క వాన చినుకు రాలినా వూరుకోను సుమా’’ అంటూ మురళిని ఆకాశం వంక చూపుతూ హెచ్చరించాడు.
ఆశ్చర్యం... అద్భుతం.

ఆయన హెచ్చరించిన మరు క్షణం రాలుతున్న చినుకులు కూడ ఆగి పోయాయి. కుంభ వృష్టిగా పడుతుందనుకున్న వాన ఆగి పోయింది. కాని గగన తలాన నల్ల మబ్బులు కారాడుతూనే వున్నాయి.

ఇప్పుడు అతివలిరువురి వంక చూసి

మంద హాసం చేసాడా మురళీ ధరుడు.

‘‘ఏమన్నావు తల్లీ... నేను ఎవరని గదూ అడిగినావు. అదేమిటో గాని లోకమున అందరూ నాకు తెలియు... కాని నేను కొందరికే తెలియు... విచిత్రము గదూ!

పసి ప్రాయమున నోరు తెరిచిన గాని నా బొజ్జలో ఏమున్నదో తెలియ లేదట. రోలును లాగి చెట్లను కూల్చినపుడు గాని నా బలమెంతో ఎరుంగరైతిరి. నను పశుల కాపరి యని కొందరు, అల్లరి వాడను తుంటరి వాడనని ఇచ్చకాలాడు వారు కొందరు, వెన్న దొంగనని నింద వేయు వారు కొందరు, కపటి యని, మోస గాడనని ఈసడించు వారు కొందరు` ఏమైతే నేమి గాని తల్లీ నను మాత్రం మాధవ స్వామి అంటారు. ఆ రాధా రమణుడు వేణు మాధవుని భక్తుడను’’ అన్నాడు.

మాధవ స్వామి మాటలు భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు అంతు చిక్క లేదు గాని అక్కడే వున్న భూతం ఘృతాచికి అర్థమై పోయింది. నోరు కొట్టుకుంది, నెత్తి కొట్టుకుంది.

‘‘అయ్యో పిచ్చి తల్లులూ ! ఈయన మాటలు నమ్మకండమ్మా. వేషము జూచి మోస పోవలదు. ఈ దివ్య పురుషుడు ఎవరనుకొనుచున్నారు? సాక్షాత్తూ ఆ పురుషోత్తముడేనమ్మా. లీలా మానుష రూపుడు, జగన్నాటక సూత్రధారి, ఆ వైకుంఠ వాసుడు, ఆ వేణు గోపాలుడే మిమ్ము కరుణించి వచ్చినాడు... మోస పోవలదు సుమా.’’ అంటూ ఇంత లావున నోరు తెరచి అతివలిరువురినీ హెచ్చరించానుకుంది. కాని ఆ మోహనాకారుని చూస్తున్న దివ్యానందంలో కన్నీరు ఉప్పొంగి గొంతు పెగలక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాని అవస్థ గ్రహించి మంద హాసం చేసాడు మాధవ స్వామి.

‘‘ఘృతాచీ! త్వర లోనే నీ పాపము పరిపక్వత చెందనున్నది. నీ రుధిర దాహము తీరనుంది. పిమ్మట ఈ భూత జన్మ నుండి నీకు విముక్తి లభించి మరు జన్మమున కాశ్మీర రాజ తనయగా జన్మించగ యోగము. అంత దనుక నీవు చూచినది చూచినటు, విన్నది వినినటు మరచి పోవలె సుమా’’ అంటూ నర్మ గర్భంగా హెచ్చరించాడు.

‘‘ధన్యు రాలను తండ్రీ’’ అంటూ భక్తితో నమస్కరించింది ఘృతాచి.

భద్రా దేవి, ఉలూచీశ్వరిలు` చేష్టలు దక్కి చూస్తున్నారు.వారి కేమీ అర్థం గావటం లేదు.

‘‘అమ్మా భద్రా దేవి’’ పిలిచాడు మాధవ స్వామి. ఉలికి పడి చూసింది భద్రా దేవి.

తన పేరు ఈ స్వామికి ఎలా తెలుసు?

ఆశ్చర్యం నుండి ఆమె తేరు కొనక ముందే మాధవ స్వామి దర హాసంతో పలికాడు` ‘‘నిను అపర్ణుడని పిలువనా... ఇప్పుడు పురుష వేషమున లేవు గాబట్టి భద్రా దేవి యనే పిలుతును’’ అన్నాడు.

భద్రా దేవి సిగ్గు పడింది.

ఉలూచీశ్వరి ఆసక్తిగా వింటోంది.

‘‘మరీ ఆశ్చర్య పోవలదు సుమా. నీ గురించియే కాదు నీ చెల్లి యగు ఈ ఉలూచీశ్వరి గురించీ తెలియు. నాగ లోక యువ రాణి, నాగ రాజు దంపతుల గారాల పట్టి, నాగ కుమారి. మీ వలపుల చెలి కాడు రత్నగిరి రాకుమారుడు ధనుంజయుడు. సరి గానే చెప్పితిని గదా? ఇది జ్యోతిషము కాదమ్మా, వాస్తవము. ధనుంజయుడు ఎవరో కాదు, నా నేస్తము, ప్రియ సఖుడు, ఆప్తుడు నాకు ఎంతో కావలసిన వాడు. నాకు తెలుసు అతడి గురించి తనకు తోచిందే గాని ఒకరు చెబితే వినుకోడు. మహా మొండి వాడు. లేకున్న మీరంతగా చెప్పినా వినకుండా శివయ్య దర్శనానికి వచ్చునా? వచ్చి అదృశ్యమై మిమ్మల్నిలా కడ గండ్లపాలు జేసే వాడా. వినడే....’’ అంటూ భారంగా నిట్టూర్చాడు.
‘‘కాని స్వామీ....’’ అంటూ ఉలూచీశ్వరి ఏదో అడగ బోతుంటే చేయెత్తి వారించాడు మాధవ స్వామి.

‘‘నాకు తెలుసు నాగ రాజ పుత్రీ. నీకంతయు తెలియు. ధనుంజయుని అదృశ్యమున గొని పోయి పాతాళమున పడ వేసిన వాడు మీ నాగ లోక ప్రముఖుడు వక్ర దంతుడు. అవునా?’’ అడిగాడు.

తల వూపింది ఉలూచీశ్వరి.

‘‘మీకు తెలీని విషయం ఏమన, ధనుంజయుని గూర్చి మీకన్నను నాకే బాగుగా తెలియు. అంత దేనికి? గతంలో రాయ గిరి వేణు గోపాల స్వామి ఆలయాన కలిసినాము. చిలక్కి చెప్పినటుల జెపితి. నాయనా ఇది పద్ధతి కాదయ్యా. మీ ఇలవేలుపూ నీ తండ్రి గారి ఆరాధ్య దైవము ముందుగా నీవు సహ్యాద్రికి గదా పోవలె. ఆ భీమ శంకరుని ఆశీస్సులు పొంది బయలు దేరుము. శుభములొనగూరును అంటి. వింటేనా! ఆ శివయ్యకి అంత శక్తి వుంటే నా తండ్రి పుట్ట వ్రణము బారిన పడు వారేనా! ససేమిరా పోను పొమ్మన్నాడు. ఏమైనది. అలిగిన ఆ భీమ శంకరుడు గాలి వాన సృష్టించినాడు. పెను గాలి వానలో దారి తప్పి అడవులబడి దిక్కు తెలియక అష్ట కష్టములు అనుభవించినాడు. దారిలో చిరంజీవి యగు అశ్వద్ధామను కలిసి కొన్ని విషయము తెలుసుకున్నాడు. పిమ్మట ఢాకినీ వనం చేరాడు. అక్కడే గదూ ఈ నాగ పుత్రిని కాపాడి మనసు హరించినాడు. అంతేనా! మనసు మార్చుకుని బుద్ధిగా సహ్యాద్రి చేరి భీమ శంకరుని సేవించినాడు. ఆ శివయ్య కరుణతో ఈ భద్రా దేవి దర్శనమైనది. అపర్ణుడే భద్రా దేవియను సత్యమును తెలిసినది. అచ్చోటనే ద్రోహల నుండి పెను ప్రమాదమును తప్పినది. చూచితిరా! దైవ కృపా కటాక్షం ఉన్నచో కీడులో కూడ మేలు ఎటుల ఒన గూడునో’’ అంటూ కాసేపు చెప్పటం ఆపాడు మాధవ స్వామి.

భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు ఆయన మాటలు వింటూంటే గతం గుర్తుకొచ్చి దుఖ్ఖం పొంగుకొస్తోంది. తిరిగి తన సందేశం వినిపించాడు మాధవ స్వామి.

‘‘చూడండి లలనా మణులారా. ఆలయాన మీరు మీ ప్రియుని గానక విలపించినారు గదా. సమాధానము కావలెనని వేడు కొంటిరి గదా. ఇదో సమాధానము. మీరు అనాధలు గాదు, తల దాచుకొన గూడు లేని అభాగ్యులూ గాదు. సంపూర్ణ  దైవానుగ్రహం కలిగిన అదృష్టవంతులు. మీ రక్షణ కొరకు ఆ కైలాస నాధుడు నందీశ్వరుని, భైరవుని పంపించినాడు. ఇదో... తన శివ గణాలనూ, మధ్యవర్తిగా నన్నూ పంపించినాడు. ఇంకేమి కావలె? రండమ్మా! ఆ స్వామి సన్నిధికి పోవుదము. మీకే కొరతా రాబోదు.’’ అంటూ వచ్చిన పని వివరించాడు.

అంతా విని బాధగా చూస్తూ` కన్నీరు తుడుచుకుంది భద్రా దేవి.

‘‘క్షమించండి స్వామీ. మేము రాలేము’’ అంది.

‘‘ఏవమ్మా! ఈ రేయి గాలి వానలో ఈ శాలి వృక్షము చెంతనే చలికి గడ గడ వణకుచూ కష్ట పడుదురా. ఏమైనది?’’ మంద హాసంతో అడిగాడు స్వామి.

‘‘ఎలా రాగలము స్వామి. అచట పాతాళ లోకమున మా మనోవల్లభుడు ఎన్ని బాధలు కష్టములు పడుచున్నారో గదా. తనచట ఇడుముల గ్రుమ్మరుచుండ మేమెటుల ఇచట సుఖమున ఉండ గలము స్వామీ. ఆయనను కాపాడుట వదలి మా కొరకు అక్కర చూపుట ఇది యేమి ధర్మము? ఆ గరళ కంఠునికి తెలియని ధర్మముండునా? మా ఎడబాటే ఆ స్వామికి ఆనందమా?’’ అంది కన్నీళ్ళతో భద్రా దేవి.

‘‘అవును స్వామీ. మా సఖుడు మరలి వచ్చువరకు మేమిచటనే ఉందుము.’’ అంటూ భద్రా దేవిని సమర్థించింది ఉలూచీశ్వరి.

‘‘వూహు! ఇది సరి యగు నిర్ణయము గాదు. మీరు పొరబడుచున్నారు. చూడు తల్లీ భద్రా దేవి, మహా మహులే శివ తత్త్వాన్ని అర్థము జేసు కొన జాలరు. బాలికలు మీవల్ల అగునా? కర్మ ఫలం అనుభవింపక తప్పదు. కర్ము చేయకనూ తప్పదు. సుత్తి దెబ్బలు తిన కుండ బంగారము అందమగు ఆభరణము అగునా? జీవితము గూడ అంతియే. కారణ జన్ములు ఎంత కష్ట పడిన అంతకంత కీర్తి ప్రతిష్టలను సుఖమును బడయ గలరు. చెప్పితిని గదా! కీడు లోనూ మేలు ఒన గూర్చునదే దైవ కృప. ఇచటను ధనుంజయునకు ఒక ప్రయోజనము గలదు. అతను మరలి రాగానే అది మీకు అర్థము కాగలదు.

ఒక ప్రక్క నాగ దండు ఉలూచీశ్వరి కోసము ప్రయత్నించు చుండ నీ విటుల భీష్మించి ఇచటయే ఉండుట క్షేమము గాదు. నా మాట వినండి. పదండి’’ అంటూ అనునయంగా నచ్చ చెప్పాడు.

తన కోసం గాకున్నా ఉలూచీశ్వరి క్షేమం కోరి అయినా ఈ దైవ ఆహ్వానాన్ని అంగీకరింపక తప్ప లేదు భద్రా దేవికి. ముందుగా వృషభము కొండ గుట్ట దిశగా అడుగు లేసింది. ఆ వెనకే తమ అశ్వాలను నడిపించుకుంటూ భద్రా దేవి, ఉలూచీశ్వరిలు బయలు దేరారు. వారికి ముందు దివిటీలతో శివ గణాలు నడిచాయి. వెనక రక్షణగా శునక రూపంలోని భైరవుడు అనుసరించాడు. చివరిగా భూతం ఘృతాచి గాలిలో తేలుతూ బయలు దేరింది.

అతివలిద్దరి ముందు నడుస్తున్న మాధవ స్వామి తిరిగి మురళి అందుకుని కళ్యాణి రాగం అందుకున్నాడు. చెంగు చెంగున దూకుతూ కాలి బాట మీద ముందుగా గుట్ట పైకి సాగి పోతోంది వృషభ రాజము. దాన్ని అనుసరించి మౌనంగా గుట్ట ఎక్కుతున్నారంతా. శివ గణాలు కూడ మురళీ రవం వింటూ మౌనంగా నడుస్తున్నారు. వాద్య ఘోష చేయటం లేదు. మురళీ రవానికి ప్రకృతి పులకిస్తోంది.

‘‘స్వామీ! తెలీక అడుగుచుంటి క్షమింపుడు. కళ్యాణి రాగం మీకు అంత యిష్టమా?’’ దారిలో అడిగింది ఉలూచీశ్వరి.

‘‘నాకు అత్యంత ప్రీతి కరమగునవి మోహన, కళ్యాణి రాగము. ఆ కైలాస నాధునికి ప్రీతి కరమగునవి శంకరాభరణము, భైరవీ రాగము.’’ అన్నాడు మాధవ స్వామి.

‘‘అంత అద్భుతముగా వేణు గానమాలపిస్తున్నారు. మీ గురు దేవులు ఎవరు స్వామి?’’ ఈసారి భద్రా దేవి అడిగింది.

‘‘గురు దేవుడు... హహహ’’ అంటూ ఫడాలున నవ్వాడు మాధవ స్వామి.

‘‘తల్లీ... నా చదువుకు గురు దేవుడున్నాడు గాని వేణువుకి ఏ గురువులునూ లేడమ్మా. సాధారణ పశుల కాపరిని,  గోపాలుడ్ని. ఏమియు తోచక మురళి వాయిస్తుంటే తానుగా అభ్యాసమై పోయినది’’ అంటూ మరో ప్రశ్నకు అవకాశమివ్వకుండా వెంటనే మోహన రాగం అందుకున్నాడు.

సమ్మోహ పరిచే మోహన రాగ మాధుర్యానికి ప్రకృతే పులకించ సాగింది. చీకట్ల మాటున తెలీటం లేదు గాని చుట్టూ పొదల వెంట లతలు తీగలు సాగి పుష్పించి సౌరభాన్ని వెద జల్లుతున్నాయి. నడుస్తున్న మాధవ స్వామి పాద పద్మాల కింద పచ్చిక పరవశించి ఒత్తుగా పెరిగి పోతోంది. పొదల వెంట కుందేళ్ళు, ఉడుతలు మొదలైన చిరు ప్రాణులు, కొన్ని పక్షి జాతులు నిర్భయంగా తమ తావులు వదిలి బయటికొచ్చి పరవశంతో చిందులేస్తున్నాయి. రస మయ వేణు గానంలో మోహన రాగ పరవశంలో కొండ గుట్ట పైకి ఎలా చేరుకున్నారో వారికి తెలియ లేదు. అంతా ప్రాకార గోపురం దాటి ముందుగా పదహారు స్తంభాల రాతి మండపాన్ని చేరుకున్నారు.

అశ్వాలను అచటనే వదిలి భద్రా దేవి, ఉలూచీశ్వరిలిరువురు ముందుగా మూసి వున్న ఆలయ ద్వారం ముందు కెళ్ళి సాష్టాంగ పడి ఆ దేవ దేవుడు సదా శివుని మనసారా ప్రార్థించారు. తిరిగి లేచే సరికి ఇప్పుడక్కడ వృషభము లేదు, శునకము లేదు, శివ చరణులు లేరు. మండపము అరుగు మీద కూచుని వేణువాలపిస్తున్నాడు మాధవ స్వామి.

మండపాన్ని చుట్టి అయిదు వరుసలతో కూడిన మెట్లున్నాయి. ఆ మండప నిర్మాణమే చుట్టూ బయటి పక్క ఎనిమిది స్థంభాలు, లోన దగ్గర దగ్గరగా ఎనిమిది స్థంభాలు కలిగి పైన దృఢమైన రాతి కప్పుతో కూడిన అద్భుత నిర్మాణము.

ఆ మండపం నైరుతిలో చివరి రెండు స్థంభాలకు అశ్వాలు బంధించ బడి పచ్చిక వేయ బడుంది. వాటి కోసం పక్కనే పెద్ద చెక్క తొట్టి నిండుగా నీరు ఉంచబడింది. ఈ చివర రెండు స్థంభాలకు రెండు దివిటీలు కట్టబడి మండప ప్రాంతం కాంతులీనుతోంది. భూతం ఘృతాచి తమ తోలు సంచిలోంచి తడిసిన దుస్తులు తీసి బయట వరుస స్థంభాలకు చుట్టూ ఆర కడుతోంది. ఎప్పుడో ఉదయం పుణ్య స్నానం చేసి పిండిన దుస్తులవి. ధనుంజయుని అదృశ్యంతో వాటి గురించి పట్టించుకో లేదు.

ఇక మధ్యలో ఎనిమిది స్థంభాల నడుమ ప్రదేశంలో చక్కగా నిద్ర పోవటానికి అనువుగా నేల మీద పట్టు బాలీనుతో కూడిన పరుపు వేయబడి వుంది. ఇవతలగా చిన్న బల్ల మీద మంచి నీటితో కూడిన బిందె, రెండు లోటాలు ఉంచబడ్డాయి. నేల మీద రెండు పీటలు ఉంచి వాటి మీద ఆహార పదార్థాతో కూడిన పళ్ళెరము చక్కగా మూత      ఉంచ బడున్నాయి. ఇంతలోనే ఇన్ని ఏర్పాట్లు ఎలా జరిగాయో అర్థం గాక యువతులిద్దరూ అయోమయంగా చూస్తూ మెట్లెక్కి పైకి వచ్చారు.

‘‘రండమ్మా! మీకొరకే చూస్తున్నాను’’ అంటూ మురళి వాయించటం ఆపి లేచాడు మాధవ స్వామి.

‘‘మీ సఖుడు ధనుంజయుడు మరలి వచ్చు దనుక మీకిచట ఏ కొరత యును రాదు తల్లీ. కాని ఇప్పుడు నేను నుడువు మాటలు జాగ్రత్తగా విని గురుతుంచుకోవలె. రాత్రి వేళ మండపమును చుట్టి శివ చరణులు అదృశ్య రూపమున మీకు కావలి యుందురు. చీమను కూడ మండపము లోనికి చోర నీయరు. కావున శతృ భయము లేక మీరు ఇచట నిశ్చింతగా ఉండ వచ్చును. ఇక పగటి వేళ` సూర్యోదయము పిమ్మట మీరు ఎట తిరిగినను సూర్యాస్తమయమునకు ముందే మండపమునకు వచ్చి చేర వలె. సూర్యాస్తమయము తర్వాత తిరిగి సూర్యుడుదయించు లోన రాత్రి వేళ పొరబాటున కూడ మీరు ఈ మండపము వదలి బయటకు పోవలదు. ఏలయన శివ రచరణులు కావలి యున్నను మిమ్ము ఆపరు. నాగ లోకము నుండి వచ్చిన నాగ రాజు భటు మిమ్ము అపహరించు అవకాశము కలదు. బహు జాగురూకులై హెచ్చరిక నుండ వలె. అర్థమైనది గదా’’ అంటూ వివరించి చెప్పాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్