Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nenu naa dongedupulu

ఈ సంచికలో >> కథలు >> అహింసా రైతు

ahimsaa       raitu

పూర్వం  రామకృష్ణాపురం అనే  ఒక చిన్న గ్రామంలో ఆనందుడు అనే  రైతు బిడ్డ  ఉండేవాడు.  వాడు కాస్త అమాయకంగా ఉండేవాడు. ఆనందుడికి  చిన్నతనంలోనే  తల్లి  తండ్రీ  చనిపోవటంతో  పెద్దగా చదువు వంట బట్ట లేదు. ఆనందుడు ఒంటరిగా తమ పొలం సమీపం లో వేసుకున్న చిన్న గుడిసె లో  ఉండేవాడు.  తన తల్లి తండ్రుల నుంచి  సంక్రమించిన  కొద్ది పాటి  పొలం దున్నుకుని  జొన్న, వరి  వంటి పంటలు పండించి  తన  జీవనం సాగించేవాడు. ఆనందుడికి  చిన్న తనం నుండే  దైవ  భక్తి కాస్త  అధికంగా  ఉండేది.  ఆ గ్రామంలో  ఉన్న  రామాలయం లో  జరిగే  పురాణ,  హరి కధా కాలక్షేపాలకు  ఆనందుడు తరుచుగా హాజరు  అయ్యేవాడు.  

ఒకసారి  ఒక మునీశ్వరుడు  ఆ  గ్రామానికి  వచ్చి  కొద్ది కాలం  ఆ రామాలయంలో  ఆధ్యాత్మిక  ప్రవచనాలు కొన సాగించాడు. రామాయణ, భారత, భాగవతా ల గురించి, పాప పుణ్యాల గురించి ఆయన చెప్పిన ప్రవచనాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఒక రోజు ఆయన  బుద్ధుడి బోధనలు, ముఖ్యంగా   అహింస  గురించి  సోదాహరణగా  గ్రామస్తులందరికీ  బోధించి  తాను  మరో  చోటికి  బయలు దేరే ముందు ఆ  గ్రామస్తులందరి చేతా   తాము అహింసా యుతమయిన  జీవనము  గడుపుతామని, సాటి మనుషులకు, జంతువులకు, పక్షులకు,  క్రిమి కీటకాదులకు హాని చేయ బోమని ప్రతిజ్ఞ  చేయించాడు.  ఆనందుడు  కూడా అందరితో  పాటే ప్రతిజ్ఞ  చేసాడు. అహింస గురించి మునీశ్వరుడు చెప్పిన మాటలు ఆనందుడి మనసులో బాగా నాటుకు పోయాయి.  అహింసాయుత మార్గంలో జీవించాలని ఆనందుడు గట్టిగా తీర్మానించుకున్నాడు.

ఆ ఏడు  చక్కటి  వర్షాలు పడటంతో  గ్రామస్తులంతా  సంతోషంగా నాట్లు వేసే  కార్యక్రమం  ప్రారంభించారు. ఆనందుడు  కూడా  తన కున్న  కొద్ది పాటి  పొలంలో  జొన్న పంట వేసాడు.  ఆనందుడు వేసిన  జొన్న  పంట  ఏపుగా పెరిగింది. జొన్న పంట  చక్కటి  దిగుబడి  ఇస్తుంది కనుక  ఆ  పంట  అమ్మగా వచ్చే  డబ్బుతో  కొన్ని ఆవులనో , మేకలనో, కోళ్ళనో   కొనుగోలు  చేసి వాటి పెంపకం ద్వారా మరింత ఆదాయం  గడించవచ్చు ఆ తరువాత తాను  కూడా తగిన  కన్యని వివాహం చేసికొని జీవితంలో  స్థిర పడవచ్చు అని  ఆనందుడు ఆలోచించ సాగాడు.

ఒక  రోజు ఆనందుడు  పొలానికి వెళ్లి  చూడగా  తన  చేలో  త్వరలో చేతికి అందనున్న పంటకు  క్రిమి  కీటకాలు  ఆశించి  పంటను నాశనం చెయ్యటం గమనించాడు.  తన  పొలంలో  లాగే ఆ  గ్రామంలో  మిగతా  రైతులు  వేసిన పంటలకు కూడా  క్రిమి కీటకాలు ఆశించటాన్ని  గమనించాడు  ఆనందుడు.  గ్రామం లోని   రైతులందరూ  వెను వెంటనే  సస్య రక్షణ చర్యలు  చేపట్టి క్రిమి  కీటకాల బారి నుండి పంటలను  కాపాడుకొనే ప్రయత్నాలు  మొదలు పెట్టారు.  ఆనందుడికి మునీశ్వరుడు చెప్పిన జీవహింస, అహింస మాటలే  గుర్తు రాసాగాయి.  తాను  సస్య రక్షణ చర్యలు చేపడితే  తన  పంటని తిని  బతుకుతున్న క్రిమి కీటకాలు చనిపోతాయి. అది జీవ హింస అవుతుంది. మునీశ్వరుడు జీవ  హింస  చేయ రాదని బోధించాడు.  పైగా తాను జీవ హింస  చేయనని ప్రతిజ్ఞ కూడా చేసాడు.  అందు వలన ఆనందుడు  దైవం మీద  భారం వేసి తన పంటని కాపాడుకోవటానికి  ఎటువంటి  సస్య రక్షణ  చర్యలు చేపట్టకుండా ఊరుకున్నాడు. దానితో  పక్క పొలాల రైతులు చేపట్టిన  సస్య రక్షణ చర్యల ప్రభావం వలన ఆ పొలాల నుండి  కూడా మొత్తం   క్రిమి కీటకాలు అన్నీ  ఆనందుడి  పొలంపై  దాడి చేసి  ఆనందుడి పంటని సర్వ నాశనం చేసేశాయి.

 గ్రామంలోని  ఇతర  రైతులు అనందుడికి  పంట రక్షణ చర్యలు చేపట్టమని ఎన్ని మార్లు  చెప్పినా ఆనందుడు పెడ చెవిని  పెట్టాడు.  పైగా   "సస్య  రక్షణ చర్యల వలన  పాపం  ఆ  క్రిమి  కీటకాలు చనిపోతాయి.  అది హింస-- పాప కార్యం.  నేను  చేయ లేను"  అని చెప్పటం తో   తతిమా రైతులు  ఆనందుడి మీద  జాలి పడ్డారు.  వారు ఎంతగా వివరించి చెప్పినా వినక ఆనందుడు మొండిగా "జీవ హింస--అహింస"  అంటూ తన పంటనంతా  క్రిమి కీటకాల పాలు  చేస్తున్నాడని వారు బాధ పడ్డారు. కానీ ఆనందుడు వారి మాట వినలేదు. ఆనందుడి  పంట  పూర్తిగా నాశనం ఐపోయింది.  అలాగే  ఆ తరువాత వేసిన  వరి  పైరు కూడా  చీడ పీడలు ఆశించి,  అహింస  పేరిట  సస్య రక్షణ చర్యలు  చేపట్టనందున పూర్తి పంట  క్రిమి కీటకార్పణం అయి పోయింది. ఇలా  వరుసగా పంటలు  దెబ్బ తినటంతో  ఆనందుడు పూర్తిగా చితికి పోయాడు.  పంట వేయటానికి  అవసరమయిన విత్తనాలు సైతం కొన లేక చివరకు  తన పొలాన్ని  దున్నకుండా వదిలేసి తాను  ఇతర రైతుల  దగ్గర  కూలీ పనికి వెళ్ళటం మొదలు పెట్టాడు.  ఆవిధంగా  ఆనందుడి బ్రతుకు రైతు  స్థాయి నుంచి  రైతు కూలీ స్థాయి కి  దిగ జారింది.

కొంత కాలానికి  ఆ  మునీశ్వరుడు రామకృష్ణా పురానికి మళ్ళీ వచ్చాడు.  ఊరి  పెద్దల  ద్వారా ఆనందుడి  దుస్థితి గురించి  విన్న  మునికి అమితమయిన జాలి కలిగింది.  తన  బోధనలను సరిగ్గా అర్ధం  చేసుకోకుండా ఆనందుడు  రైతు కూలి స్థాయికి   దిగ జారి పోయాడని తెలిసి  ముని  ఆనందుడిని పిలిపించాడు.  ఊరులో  అందరు రైతులు  చీడ పీడల నుంచి తమ పంటలను  కాపాడుకుంటుంటే  నువ్వు మాత్రం ఎందుకు  ఆ పని  చేయ లేదని ముని ఆనందుడిని  ప్రశ్నించాడు. స్వామీ తమరు  క్రిందటి సారి మా ఊరు వచ్చినప్పుడు  మా  అందరి చేత  జీవ హింస చేయబోమని  ప్రతిజ్ఞ  చేయించారు. నేను కూడా ఆ రోజు  ప్రతిజ్ఞ చేసాను.  ఆ ప్రతిజ్ఞ కి  భంగం కలిగేలాగా  చేయ కూడదని నేను నా పంటలను  కాపాడుకోవటానికి  ఎటువంటి  సస్య  రక్షణ చర్యలు  చేపట్ట లేదు అని చెప్పాడు  ఆనందుడు.

"నీ లాగే జీవహింస చేయ బోమని ప్రతిజ్ఞ చేసిన మీ ఊరి లోని  మిగిలిన  రైతులు సస్య రక్షణ చర్యలతో  తమ  పంటలను కాపాడుకున్నారు కదా ? నువ్వు ఎందుకు ఆ పని  చేయ లేదు ? " అన్న ముని  ప్రశ్నకు  "నేను ఆ పని చేస్తే నేను  చేసిన  ప్రతిజ్ఞ ని భంగం  చేసినట్లు అవుతుంది కదా ?"  అని ఎదురు  ప్రశ్నించాడు  ఆనందుడు.  ఆనందుడి అమాయకత్వానికి జాలి పడి ముని ఇలా వివరించాడు. "అహింస అని  నేను బోధించిన దాని అర్ధము  మనకు అపకారం చేయని జీవులను  హింసించ రాదని.  కానీ మన  పంటలను నాశనం చేసే  క్రిమి  కీటకాలు మన పంటలను పాడు చేసి మనకు  తీరని  నష్టం కలిగిస్తాయి.  నీ విషయమే తీసుకుంటే  ఆ క్రిమి కీటకాలు నీ పైర్లను  నాశనం చెయ్యటం వలన  నీకు  ఎంతటి నష్టం జరిగిందో గుర్తించావా ?  రైతు గా  జీవించే నువ్వు  ఇప్పుడు  రైతు  కూలీ  గా  మారి పోయావు.  దీనికి  కారణం  నా బోధనలను నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటమే.  మీ గ్రామం లో  మిగతా రైతులు కూడా నీలాగే  అహింసా యుతంగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేసినా వారెవరూ నీలా పంటలను క్రిమి కీటకాలకు వదిలి పెట్టి, పంటలను పోగొట్టుకొని రైతు కూలీలుగా మారలేదు. మరొక ఉదాహరణ --మన శరీరం లోకి   రోగ  క్రిములు ప్రవేశించి మనకు  వ్యాధులను కలిగిస్తాయి.

పాపం  రోగ  క్రిములు మన దేహాన్ని ఆశ్రయించుకొని  బ్రతుకున్నాయి పోనీలే  అని మనము ఊరకుంటే  ఆ రోగ క్రిములు మన రక్త మాంసాలని పీల్చి పిప్పి చేస్తాయి. చివరకు మన  శరీరం శిధిలం అయి మృత్యు వాత పడతాము.  అలా  జరగకుండా  మనం మందులు వాడి రోగాలను  నయం  చేసుకుంటాము. అంటే  మన శరీరం లోకి  ప్రవేశించిన రోగ క్రిములను నిర్మూలిస్తామన్నమాట.  ఇప్పుడు నీకు  నా బోధనా సారం అర్ధం అయినది  అనుకుంటాను" అని ముగించాడు మునీశ్వరుడు.   మునీశ్వరుడి వివరణతో ఆనందుడికి తాను చేసిన  తప్పిదం  తెలిసి వచ్చింది.  ఆ తరువాత నుంచి   ఆనందుడు మళ్ళీ కష్ట పడి అచిరకాలం లోనే తన పొలం లో చక్కటి  పంటలు పండించు కోవటమే కాకుండా త్వరలో నే  తగిన కన్యని వివాహం చేసుకొని ఒక  ఇంటి వాడిగా, మంచి రైతు గా    స్థిర పడ్డాడు.

మరిన్ని కథలు
boy friend