Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
madhurangaa ..aarogyangaa

ఈ సంచికలో >> శీర్షికలు >>

డల్హౌసీ అందాలు ఇవిగో.. - కర్రానాగలక్ష్మి


హిమాచల్ ప్రదేశ్ లో పేరు పొందిన మరో వేసవి విడిది ' డల్ హౌసీ ' . హిమాలయాలకు దగ్గరగా వున్న పర్వత ప్రాంతాలు కాబట్టి వేసవిలో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు చల్లగానే వుంటాయి . అందులో అహ్లాదకరంగా వుండే ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షించడంలో వింతేమీ లేదు .
సముద్రమట్టానికి సుమారు 2 వేల మీటర్ల యెత్తున , దౌలాధర్ పర్వత శ్రేణుల నడుమ దేవదారు అడవులు , సెలయేళ్లు , సరస్సుల తో వున్న "చంబా " లోయలో వున్న పట్టణం డల్హౌసీ . 1854 లో బ్రిటిష్ సైనికాధికారులు భారతదేశపు వేడినుంచి తప్పించుకొనేందుకు దౌలాధర్ పర్వతాలకు దగ్గరగా నిర్మించుకున్న వేసవి విడిది . కధాలాఘ్ , పొట్రెయిన్ , టెరాహ్ , బక్రోట , భంగపాటు అనే అయిదు కొండలపై నిర్మింప బడ్డ పట్టణం . అందుకే యీ పట్టణం సుమారుగా 6 వేల అడుగుల నుంచి 9 వేల అడుగుల యెత్తువరకు వుంటుంది .

చంబా పర్వత జిల్లా ముఖ్యపట్టణమైన డల్హౌసీ కళలకు , సాంప్రదాయానికి , మందిరాలకు 6 వ శతాబ్దానికి పూర్వం నుండి ప్రసిద్ది పొందింది . ' గద్ది ' , ' గుజ్జర్ ' అనే కొండజాతుల పరిపాలనలో 84 మందిరాలు నిర్మింపబడి యిప్పటి కీ వారి వంశస్థులచే సంరక్షింప బడుతున్నాయి .
1854 లో ' సర్ డోనాల్డ్ మెకలోడ్ ' బ్రిటిష్ సైనికాధికారుల వేసవి నివాస స్థలంగా రూపొందించి అప్పటి వైస్రాయి పేరు మీద ' డల్ హౌసీ ' అని నామకరణం చెయ్యడం జరిగింది . బ్రిటిషర్ల కాలం లో నిర్మించబడ్డ చర్చ్ లు , బంగళాలు స్కాటిష్ , విక్టోరియన్ స్టైల్ లో కట్టబడ్డాయి .

దేశీ పర్యాటకులు ముద్దుగా భారతదేశపు స్విట్జర్ ల్యాండ్ అని పిలుచుకుంటూ వుంటారు . దేశీ పర్యాటకులలో హానీమూన్ స్పాట్ యిది .

ఇక్కడ సుమారుగా 600 హోటల్స్ వున్నాయంటే దేశవిదేశీ పర్యాటకులలో యీ ప్రదేశం పట్ల వున్న మక్కువ అవగతం అవుతుంది . మే నుండి అక్టోబరు వరకు పర్యాటకుల రద్దీ చాలా యెక్కువగా వుండడంతో సుమారు 12 వేల పనివారలకి తాత్కాలిక వుద్యోగాలను కలుగ జేస్తోంది . నవ్వంబరు నుంచి ఏప్రిల్ వరకు ఆఫ్ సీజన్లు గా పరిగణిస్తారు , అంటే పర్యాటకుల రద్దీ యెక్కువగా వుంటుంది . ఒకటి రెండు రోజులు దగ్గరనుంచి కొన్ని నెలల వరకు , గది వాష్ రూం నుంచి బంగళాల వరకు అద్దెకు దొరకు తాయి .

వేసవి విడిది అనగానే కొండవాలులలో టీ తోటల పెంపకమో కాఫీ తోటల పెంపకమో చూస్తూ వుంటాం , కాని యీ ప్రాంతపు కొండ వాలులలో బంగాళా దుంపల పెంపకం చూడడం ఒక వింత అనుభూతి నిస్తుంది .

చిన్న పెద్ద మందిరాలతో పాటు జలపాతాలు , సరస్సులు , ప్రకృతి సౌందర్యాలు వున్న ప్రదేశం . డల్ హౌసీ లో చూడదగ్గ ప్రదేశాలు చాలా వున్నా ముఖ్యమైన వాటి గురించి మీకు పరిచయం చేస్తాను .

సుభాష్ బావిలి ---

స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్ర బోస్ పేరు పెట్టబడింది .    1937 ప్రాంతాలలో సుభాష్ చంద్ర బోస్ యీ ప్రాంతాలలో తరచూ గడిపేవారట . తెల్లని మంచుతో కప్పబడిన పర్వతశిఖరాలు , యెత్తైన పైను వృక్షాల మధ్య పచ్చని పచ్చిక కప్పిన మైదానంలో నడక అహ్లాదాన్నిస్తుంది . ఇక్కడి ప్రకృతిలో మెడిటేషన్ చేస్తూ  యిక్కడ వున్న నీటి జలలో స్నానం చేస్తూ సుమారుగా యేడు యెనిమిది నెలలు గడిపి తిరిగి ఆరోగ్యం పొందిన ప్రదేశం కాబట్టి అతని పేరు మీదుగా ' సుభాష్ బావిలి ' గా ప్రసిద్దిపొందింది . బోసు గారు మెడిటేషన్చేసుకున్న ప్రదేశం లో అరుగు లాంటిది కట్టేరు . అలా కాస్త దూరం అడవిలో తిరగడం , ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని యిక్కడకు వచ్చిన పర్యాటకులు సేద తీరుతూ వుంటారు . భూమిలోంచి సహజసిద్దంగా వస్తున్న నీటి జల యిక్కడి ప్రత్యేక ఆకర్షణ . ఇందులో స్నానం చేస్తే యిందులో వున్న సహజ ఔషధ గుణాల వల్ల అన్ని రకాలయిన అనారోగ్యాలు మటుమాయ మవుతాయని నమ్మకం , అందువల్లే అంత చలిలో కూడా పర్యాటకులు యిక్కడ స్నానం చేస్తూ  కనిపిస్తారు . మేం కాస్త నీళ్లు నోట్లో పోసుకొని , కాళ్లు చేతులు మాత్రం కడుక్కున్నాం . అక్కడనుంచి వచ్చేక కూడా ఆ పరిసరాలు , ఆ ప్రశాంతత చాలా రోజులు వెంటాడుతూనే వున్నాయి .

డల్ హౌసీ వచ్చే పర్యాటకులు తప్పకుండా వెళ్ల వెలసిన ప్రదేశం యిది .

పంచ్ పుల --

పంచ పుల అంటే అయిదు వారధులు అని అర్ధం , పోడుగైన పైన్ వృక్షాలతో నిండి వున్న మంచుతో కప్పబడ్డ యెత్తైన శిఖరాలనుంచి గలగల శబ్ధాలతో జారే జలపాతాలు . మొత్తం యేడు జలపాతాలు పడుతూ వుండడం తో దీనిని ' సాత్ ధారా ' అని పిలుస్తూ వుంటారు . ఏడాది పొడువునా ' సాత్ ధార ' లు ప్రవహిస్తూ వున్నా మే నుంచి అక్టోబరు వరకు యీ జలపాతాలకి నీరు యెక్కువగా చేరటంతో పెద్ద శబ్ధం తో అత్యంత వేగంగాప్రవహిస్తూ  పర్యాటకులకు కను విందు చేస్తూ వుంటాయి . సర్దార్ అజిత్ సింగు జ్ఞాపకార్థం కట్టిన కట్టడాన్ని యిక్కడ చూడొచ్చు . ఈ ప్రదేశం ప్రకృతి ఆరాధకులకు అత్యంత యిష్టమైన ప్రదేశం . ఫొటో గ్రాఫర్లు , చిత్రకారులు తమతమ పనులు చేసుకుంటూ కనిపిస్తూ వుంటారు . చాలా మంది పర్యాటకులు యిక్కడినుండి కాలినడకన అడవుల మధ్య నుంచి డల్హౌసీవరకు వెళుతూ కనిపించేరు . ప్రశాంతమైన ప్రకృతిని యిష్ట పడే వారికి డల్ హౌసీ పర్యాటన తృప్తి నిస్తుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు . వేసవిలో మంచుకరిగి వర్షాకాలంలో యిక్కడ వర్షపాతం యెక్కువగా వుండడంతో కొండలపై నుండి వచ్చే నీరు యిక్కడవున్న తటాకంలో కి  చేరుతూ వుంటుంది . అలా వచ్చిన నీటితో యీచుట్టు పక్కల చాలా గ్రామాలకు తాగునీరు , కొన్ని వేల యెకరాల పంట భూములకు నీటిని సరఫరా చేస్తున్నారు .    ఇక్కడ వున్న డాభా లలో వేడి వేడి భోజనాలను అందిస్తున్నాయి . ఇక్కడ పర్యాటకులకు మరొక ఆకర్షణ హిమాచల్ టూరిజం వారు నిర్వహిస్తున్న బోటింగ్ , ఫిషింగ్ లు  . ఈ ప్రాంతాలలో తిరిగి నగర జీవితం వల్ల మనలో యేర్పడ్డ వొత్తిళ్లను తగ్గించుకొని రిలాక్స్ అవొచ్చు .
మళ్లా వారం మరికొన్ని పర్యాటక విశేషాలతో మీ ముందుకు వస్తానని మనవి చేస్తూ శలవు

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam