Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

నాగార్జునతో ఇంటర్వ్యూ

interview with nagarjuna
మార‌క‌పోతే... జ‌నం మ‌ర్చిపోతారు!  - నాగార్జున‌
 
ట్రెండ్‌ని ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉంటారు.
కానీ ట్రెండ్ సృష్టించేవాళ్లు మాత్రం అరుదుగా క‌నిపిస్తారు.
నాగార్జున అటాంటి అరుదైన క‌థానాయ‌కుడే. శివ లేక‌పోతే తెలుగు సినిమా ఇంకా మూస ధోర‌ణిలోనే కొట్టుకుపోతుండేది.
నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌వాత అన్న‌మ‌య్య‌లాంటి సినిమాలో న‌టించ‌డానికి ఏ క‌థానాయకుడికైనా ధైర్యం ఉండాలి. ఆ సాహ‌సం చేశారు కాబ‌ట్టే.. నాగ్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యాడు.  ఎప్పుడూ ఒకే ధోర‌ణిలో కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు ఛేంజ్ అవుతూ.. వెండి తెర‌కు స‌రికొత్త ప‌రిమ‌ణాలు అద్దుతున్నాడు నాగ్. ఇప్పుడు నిర్మ‌లా కాన్వెంట్‌తో మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా.. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాగ్‌. ఈ సంద‌ర్భంగా గో తెలుగుతో మాట్లాడుతూ నాగ్ చెప్పిన విష‌యాలు ఇవీ....

* నిర్మ‌లా కాన్వెంట్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే...
- ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ.

* ఏమిటా కొత్త‌ద‌నం?
- అన్ని విష‌యాల్లో. ఈ సినిమాకి దాదాపు అంద‌రూ కొత్త‌వాళ్లే ప‌నిచేశారు. వాళ్ల ప‌నిత‌నం ఫ్రెష్‌గా ఉంటుంది.  ఎప్పుడైతే కొత్త‌వాళ్ల చేతిలోకి సినిమా వెళ్లిందో.. అప్పుడు సినిమాకి ఆటోమెటిగ్గా కొత్త‌ద‌నం వ‌చ్చేస్తుంది.

* మీరూ న‌టించారు క‌దా?  పాత్ర న‌చ్చి ఒప్పుకొన్నారా, లేదంటే నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ నిర్మాత అని అంగీక‌రించారా?
- నా తొలి ఓటు ఎప్పుడూ పాత్ర‌కే. నన్ను దృష్టిలో ఉంచుకొనే ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ని త‌యారు చేసుకొన్నాడు. మీరు లేక‌పోతే ఈ సినిమా చేయ‌మండీ... అన్నాడు. నాకూ బాగా న‌చ్చింది. యువ‌త‌రంతో చేస్తుంటే ఆ ఉత్సాహ‌మే వేరు. అందుకోస‌మైనా ఈసినిమాలో భాగం కావాల‌నుకొన్నా. 

* రోష‌న్ న‌ట‌న చూస్తే ఏం అనిపించింది?
- త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌నిపించింది. త‌ప్ప‌కుండా మంచి హీరో అవుతాడు. ఆడియో ఫంక్ష‌న్లో ఎంత బాగా మాట్లాడాడో?  ఆ మెచ్యూరిటీ స్క్రీన్‌పై కూడా క‌నిపిస్తుంది.

* ఈ సినిమాతో సింగ‌ర్ కూడా అయిపోయారు..
- మీ గొంతు బాగుంటుందండీ అని చెప్పిన మొద‌టి వ్య‌క్తి రోష‌న్ సాలూరి. నా కెరీర్ ప్రారంభంలో నా వాయిస్ సినిమాల‌కు ప‌నికి రాద‌న్నారు. పీల‌గా ఉంటుంద‌ని మాట్లాడారు. కానీ.. మెల్ల‌మెల్ల‌గా అదే స‌ర్దుకొంది. అలాంటి గొంతు పాట‌ల‌కు బాగుంటుంద‌ని చెప్ప‌డంతో నేను ఆశ్చ‌ర్య‌పోయాను. నిజంగా బాగుంటుందా?  అని గుచ్చి గుచ్చి అడిగాను. చివ‌రికి పాడేశా.

* భ‌విష్య‌త్తులోనూ పాట‌లు పాడ‌తారా?
- నాకు త‌గినంత స‌మ‌యం ఇచ్చి... ట్యూన్ ఈజీగా ఉంటే పాడేస్తా.

* ఇటీవ‌ల హుందాగా క‌నిపించే పాత్ర‌లే ఎంచుకొంటున్నారు. వ‌య‌సుని దృష్టిలో ఉంచుకోవ‌డం వ‌ల్లే ఈ మార్పా?
- మ‌నం, ఊపిరిలాంటి సినిమాలు చేసిన నేనే... సోగ్గాడే చిన్ని నాయిన‌లోనూ క‌నిపించాగా. బంగార్రాజు.. ఎంత రొమాంటిక్‌గా ఉంటాడో.. మ‌ర్చిపోయారా?  మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర ఎప్పుడొచ్చినా చేస్తా. మీర‌న్న‌ట్టు వ‌య‌సు కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే.  నాకు నేనే స్ఫూర్తి పొందే పాత్ర‌లు కొన్నుంటాయి. అలాంటివి వ‌చ్చిన‌ప్పుడు ఏమీ ఆలోచించ‌కూడ‌దు.

* ఇంట్లోనే ఇద్ద‌రు హీరోలున్నారు క‌దా? 
- అవును. అయితే వాళ్ల‌దారి వాళ్ల‌దే.. నా దారి నాదే. మాలో మాకు పోటీ లేదు. ఉంది అనుకొన్నా.. అది స‌ర‌దాకే. మార్పు అనేది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. కొన్ని సినిమాలు చేస్తాం. ఆడ‌వు. కొన్ని ఆడ‌తాయి. ఆడ‌ని సినిమాలు ఎందుకు ఆడ‌లేదో గుర్తించాలి. మ‌న ప్ర‌య‌త్నంలో లోపం ఎక్క‌డుందో వెదికితే అక్క‌డ్నుంచి మార్పు మొద‌ల‌వుతుంది. ఈమ‌ద్య నేను కొన్ని సినిమాలు చేశా. ఫ్లాప్ అయ్యాయి. ఇక అలాంటి క‌థ‌లు చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యా.  త‌రానికి త‌గ్గ‌ట్టు మారాల్సిందే.. మార‌క‌పోతే.. జ‌నం మ‌ర్చిపోతారు. 

* వందో సినిమాకి ద‌గ్గ‌ర ప‌డుతున్నారు. అందుకోసం ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తులు చేస్తున్నారా?
- నిజం చెప్పాలంటే నాకు అంకెలు పెద్ద‌గా గుర్తుండ‌వండీ. ఇప్పుడు చేస్తున్న‌ది ఎన్నో సినిమా అనేది కూడా గుర్తు పెట్టుకోను. అందుకే వంద గురించి ప్ర‌త్యేకంగా ఆలోచించ‌డం లేదు.

* మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?
- నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల సినిమాల‌పై ఫోక‌స్ పెట్టా. వీళ్ల సినిమాలు నాకిప్పుడు ఛాలెంజింగ్‌గా మారాయి. మ‌రోవైపు ఓం న‌మో వేంక‌టేశాయ కూడా ఉంది క‌దా?  వీటి మధ్య టైం స‌రిపోద‌ని నేనే త‌ప్పుకొంటున్నా.

* అఖిల్ తొలి  సినిమా మిమ్మ‌ల్ని నిరుత్సాహానికి గురి చేసిందా?
- న‌న్నే కాదు... అంద‌రినీ నిరుత్సాహ ప‌రిచింది. మా వంతు కేర్ తీసుకొనే ఆ సినిమా చేశాం. కానీ ఫ‌లితం రాలేదు. అందుకే త‌న రెండో సినిమా విష‌యంలో అఖిల్ ఏమాత్రం తొంద‌ర ప‌డ‌డంలేదు. కెరీర్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తిన‌డం కూడా మంచిదే. అలాంటి త‌ప్పుల్ని మ‌ళ్లీ పున‌రావృతం చేయ‌డు.

* న‌మో వేంక‌టేశాయ సంక్రాంతికి వ‌చ్చేస్తుందా?
- తీసుకురావాల‌నే ఉంది. కానీ ఇప్పుడే చెప్ప‌లేను. ఎందుకంటే గ్రాఫిక్స్ ప‌ని ఆ సినిమాకి చాలా ఉంది. అదెప్పుడు అవుతోందో చెప్ప‌డం క‌ష్టం. సంక్రాంతికి వ‌స్తామ‌ని చెప్పి రాక‌పోతే ఫ్యాన్స్ నిరాశ ప‌డ‌తారు. అందుకే డేట్ ముందే చెప్ప‌డం నాకు ఇష్టం లేదు.

* ఆ సినిమా ఎలా ఉండబోతోంది?
- రాఘ‌వేంద్ర‌రావు గారు చాలా స్పెష‌ల్ కేర్ తీసుకొని తీస్తున్నారు. ఆయ‌న ఉత్సాహం చూస్తుంటే నాకే ఆశ్చ‌ర్యం వేస్తోంది.

* అందులోనూ రొమాన్స్ మేళ‌వించారా?
- (న‌వ్వుతూ) అది లేక‌పోతే ఎలా?  ఆయ‌న మార్క్ అదే క‌దా?  కానీ సున్నితంగానే ఉంటుంది లెండి. హాథీరామ్ బాబా జీవితంలోని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఆయ‌న గురించి తెలుసుకోవ‌డానికి పెద్ద‌గా సోర్స్ ఏమీలేదు. కానీ జ‌న‌రంజ‌కంగానే మ‌లుస్తున్నారు రాఘ‌వేంద్ర‌రావు. 

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka