Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue180/515/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

అంతటితో ఆగ లేదు ధనుంజయుడు. తను కొరడా తోలు ఒడిసి పట్టిన రెండో అశ్వ పురుషుడి నుంచి కొరడాను లాక్కుని దాంతో వాడిని చితగ్గొట్టాడు. వాడు కొరడా దెబ్బలు తిని వెర్రి కేకలు వేస్తూ నగరం దిశగా పారి పోయాడు. అప్పటికింకా మొదటి అశ్వ పురుషుడు మోకాలి బాధతో లేచి నిలువ లేక అవస్థ పడుతున్నాడు. వాడి మెడ లోని వెండి నీటి బుర్రను లాక్కున్నాడు. మూత తీసి కొద్దిగా తాగి చూసాడు. కొబ్బరి నీళ్ళలా తియ్యగా వుంది నీరు. సందేహించకుండా దాహం తీరేలా సగం నీరు తాగేసాడు. దాన్ని అక్కడే పారేసి వాడి బరిసెను ఆయుధంగా అందుకుని తిరిగి నడక ఆరంభించాడు.

దాహం తీరగానే శరీరానికి కొత్తగా శక్తి ఏర్పడినట్టుంది. ఓ చేత బరిసె, ఓ చేత కొరడా ఆయుధాలుగా వున్నాయి. ఇక నిర్భయంగా నగరం వైపు చర చరా అడుగులు సారించాడు.

అయితే ఎక్కువ దూరం పోక ముందే`

గుంపుగా అనేక మంది అశ్వ పురుష భటులు తన వైపు శర వేగంతో దూసుకు రావటం కన్పించింది. తన చేతిలో దెబ్బలు తిని పారి పోయిన వాడు వాళ్ళందరినీ వెంట బెట్టుకొస్తూ ఏదో అరిచి చెప్తున్నాడు. అరుపులు కేకలతో మహా అట్టహాసంగా వచ్చి పడుతున్నారు వాళ్ళంతా.

వాళ్ళని చూడ గానే ధనుంజయుని కోపం మిన్ను ముట్టింది. ఆవేశంతో కండరాలు బిగుసుకున్నాయి. ఆగ్రహంతో వూగి పోయాడు. తనకు సాయం చేయక పోగా వాళ్ళు తననొక అపరాధిని చేసి దండెత్తి రావటం పుండు మీద కారం చల్లినట్టుంది. యాభైకి పైగా వున్నారు వాళ్ళు. వాళ్ళను తీక్షణంగా చూస్తూ కొరడాను నడుంకి చుట్టుకున్నాడు. ‘‘రండిరా మూర్ఖ శిఖామణులారా. మీ అంతు చూచెద గాక’’ అనరుస్తూ బరిసెను గిరగిరా తిప్పుతూ నిర్భయంగా వాళ్ళకి ఎదురు పరుగెత్తాడు.

వచ్చీ రావటమే ఆ విచిత్రమైన అశ్వపురుషులు ధనుంజయుని పడ గొట్టాలని బరిసెలు విసరనారంభించారు. వాటిని గాల్లోనే తిప్పి కొడుతూ వీరావేశంతో అశ్వాల మధ్యకు దూసుకు పోయాడు. వాళ్ళ ఆయుధాలకు చిక్కకుండా గిరికీలు కొడుతూ దొరికిన అశ్వ పురుషుని దొరికినట్టు బరిసె తిప్పి కాళ్ళ మీద మోదసాగాడు. కాళ్ళు విరిగినంత బాధతో వెర్రి కేకలు వేస్తూ విరుచుకు పడుతున్నారు వాళ్ళు. కొందరిని బరిసెతో గాయపరుస్తున్నాడు. భయంకర పోరాటం. అరుపు కేకలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్త సాగింది. ఇసుకతో కూడిన ధూళి గాల్లోకి సుడి గాలిలా లేస్తోంది. చూస్తూండగానే పది మంది అశ్వ పురుషుల్ని కూల్చాడు ధనుంజయుడు. అంత ఆర్భాటంగా వచ్చి చుట్టు ముట్టినా ధనుంజయుని వేగాన్ని ఆపటం వాళ్ళ వల్ల కాలేదు.

ఆ పోరు అలాగే కొన సాగితే ఏమి జరిగేదో గాని ఇంతలో ఒక అశ్వం మీద ఆజాను బాహుడైన వ్యక్తి ఒకడు శర వేగంతో దూసుకొచ్చాడు. అతడి వెనకే పాతిక అశ్వాల మీద కృపాణాలు ధరించిన రాక్షస వీరులున్నారు. వారిలో చాలా మందికి నెత్తిన ఒకటి లేదా రెండు కొమ్మున్నాయి. మెడలో పూసల దండలు, వికార రూపాలు, నల్లటి దుస్తులు ధరించి వున్నారు. వారికి నాయకుడిలా వున్న వ్యక్తి వస్తూనే తన అశ్వాన్ని నిలువరిస్తూ` ‘‘ఆపండి. పోరు ఆపండి’’ అని తమ భాషలో అరిచాడు.

అతడి హెచ్చరిక వింటూనే అశ్వ పురుషులైన వీరులు వెనక్కి తగ్గారు. వాళ్ళందరి మధ్య ఒంటరిగా నిలబడి దెబ్బ తిన్న బెబ్బులిలా చూస్తున్నాడు ధనుంజయుడు. అతడి శరీరం మీద గాయాలు తొలుస్తున్నాయి. ఈ అశ్వ పురుషులెవరో తెలీదు. వచ్చిన వాళ్ళెవరో తెలీదు. కాని వాళ్ళంతా రాక్షస జాతికి చెందిన వాళ్ళని మాత్రం గ్రహించాడు.

ఇప్పుడూ అదే సమస్య`

భాషా సమస్య.

బరిసె నేలకు ఆన్చి అవసరమైతే మరో సారి పోరుకు సిద్ధంగా వున్నాడు ధనుంజయుడు. అశ్వం మీద వచ్చిన అధికారి ఏదో అడుగుతున్నాడు. ధనుంజయునికి అర్థం గావటం లేదు. ధనుంజయుని భాష వాళ్ళకి అర్థం గావటం లేదు. ముఖ ముఖాలు చూసుకుంటున్నారు. ముందీ భాషా సమస్య పరిష్కారం గాకుంటే వీళ్ళు తనను దోషి గానే చూస్తారు. ఏం చేయాలి?

ఒకింత తీవ్రంగా ఆలోచించిన ధనుంజయుడు ప్రాచీన ప్రాకృత భాషలో` ‘‘మీరంతా ఎవరు? ఇది ఏ ప్రాంతము? ఏ లోకము?’’ అనడిగాడు.

విచిత్రంగా ఆ భాష వాళ్ళకి అర్థమైంది.

అశ్వం మీది అధికారి సంభ్రమాశ్చర్యాలతో చూసాడు.

‘‘ఇది ఏ ప్రాంతమో తెలీకనే మా లోకములోనికి చొర బడితివా?’’ అని ప్రాకృత భాషలో ప్రశ్నించాడు. ఈ విధంగా భాషా సమస్య తొలగినందుకు ధనుంజయుడు ఆనందించాడు.

‘‘క్షమించాలి. నేను చొరబాటు దారుడ్ని కాను. నాకు శత్రువైన నాగ లోక వాసి ఒకడు మోస పూరితమున నను గొనివచ్చి ఒక బిల మార్గన పడ వేసినాడు. ఆ మార్గము నన్నిటకు చేర్చినది. నేను కావాలని మీ భూమి మీద కాలు మోప లేదు. క్షుద్బాధ దాహార్తి నను నిలువ నీయుట లేదు. నను అతిధిగా భావించి ఆదరించటానికి మారుగా చొరబాటు దారునిగా నింద వేయుట తగదు’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘కాని నీవు మా గస్తీ దళ సభ్యులిరువురిని గాయ పరిచినావు. ఇచట ఇంత మందిని కొట్టినావు. సాయం అడిగే పద్ధతి ఇదియేనా?’’ గంభీరంగా ప్రశ్నించాడతడు.

‘‘లేదు. మీ వాళ్ళు మీకు తప్పుడు సమాచారమిచ్చినారు. దాహార్తికి నీరు అడిగితే కొరడాతో హింసించారు. ఆత్మ రక్షణ కోసం పోరాడుట నేరము కాదని మీకు తెలియదా?’’ అనడిగాడు ధనుంజయుడు.

‘‘నీ నామ ధేయమేమి?’’ ఒకింత ఆలోచించి అడిగాడతడు.

‘‘నను ధనుంజయుడందురు’’ బదులిచ్చాడు. కాని అంతకు మించి వివరాలేమీ చెప్పలేదు.

‘‘ఏ లోకము నీది?’’ మరో ప్రశ్న.

‘‘భూలోకము.’’

‘‘ఓ... నరుడవా?’’

‘‘అవును. మానవుడను. మానధనుడను. స్నేహానికి ప్రాణమిచ్చుట, శత్రువయితే అంతు చూచుట మా వీర లక్షణము.’’

‘‘భళా! మానవుల్లో ఇంత సాహసాన్ని సమీపకాలమున జూచి ఎరుగను. ఓ అపరిచితుడా! ఇది పాతాళ లోకము. మా యొక్క ప్రభువు మహా దాత, ధర్మ గుణ సంపన్నుడు, ఆడిన మాట తప్పని వారగు బలి చక్రవర్తు వారు. నీవు దుస్సాహసమున మా భటులను ఎదిరించి ప్రయోజనము లేదు. అనధికారికముగా ఎవరు మా లోకమున ప్రవేశించినను చొరబాటు దారుని గాను మాకు శత్రువు గానే పరిగణించి నిర్బంధించ వలసి వున్నది. అది రాజ శాసనము. కావున ఆయుధము వదిలి నీవు లొంగి పోవుట మంచిది. నీవు చెప్ప దలచుకున్నది రాజ సభలో చెప్పుకున్న తగిన సాయము లభించ గలదు.’’ అంటూ సూచించాడా సైనికాధికారి. కొన్ని లిప్తలకాలం ఆలోచించాడు ధనుంజయుడు.

అతడు చెప్పినదీ సమంజసం గానే వుంది.

లొంగి పోతే తనను బలి చక్రవర్తి ముందు ప్రవేశ పెడతారు. చెప్ప దలచినది ఆయన తోనే చెప్పుకొని తగిన సాయం పొంద వచ్చును. ఈ విధంగా ఆలోచించిన ధనుంజయుడు బరిసె పారేసాడు.

అది ఎంత పొరబాటో`

ఆ మరు క్షణమే తెలిసి వచ్చింది.

బిల బిలా అశ్వాలు దిగిన రాక్షస భటులు ధనుంజయుని చుట్టు ముట్టి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బిగించేసారు. చేతుల నుంచి పొడవుగా మిగిలిన రెండు గొలుసు చివర్లను నలుగురు భటులు పట్టుకున్నారు. కన్ను మూసి తెరిచే లోన బంధితుడై పోయాడు ధనుంజయుడు. కొందరు రాక్షస భటులు ధనుంజయుని శరీరాన్ని వాసన చూస్తూ` ‘‘ఆహాఁ... వాసన... నర వాసన... కమ్మటి నర వాసన. ఇతడు నరుడే’’ అంటూ గుస గుసలు పోసాగారు. ఆగ్రహావేశంతో వాళ్ళందర్ని విదిల్చి కొట్టాడు ధనుంజయుడు.

‘‘ఏమిటీ మోసము? ఏమిటీ దారుణము? నేనుగా మీ వెంట వచ్చు వాడినే... నాకీ సంకెళ్ళు అవసరమా? మీ లోకము నుండి పారి పోగలనా?’’ అశ్వం మీది అధికారిని గద్దించాడు.

‘‘పారి పోలేవు ధనుంజయా. కాని మేము అపరాధులను, నేరస్తులను రాజ సభకు గొని పోవు విధము ఇదే. ఇది రాజ శాసనము. ఆచారము’’ అన్నాడతడు.

‘‘ఆచారము కాదు, అవమానము. ఘోర పరాభవము. సహింప రాని అనైతిక చర్య. నేను అపరాధిని కానని అరిచి చెప్పిననూ మీ మట్టి బుర్రకు అవగతము కాదా? ఈ అవమానమును సహింపజాల’’ అంటూ తనను నడవ మని గొలుసు లాగుతున్న రాక్షసుల్ని ఉరిమి చూసాడు. ఆ గొలుసుల్ని ఒడిసి పట్టి తన వైపు బలంగా గుంజాడు. అంతే`

వాటిని పట్టుకున్న నలుగురూ పిల్లి మొగ్గలు వేస్తూ వచ్చి ధనుంజయుని కాళ్ళ దగ్గర పడ్డారు. పడ్డ వాళ్ళని పాదాలతో దారుణంగా మర్థిస్తూ గొలుసుల్ని కొంత మేర చేతులకు చుట్టుకున్నాడు. మిగిలిన కొసతో వీర భద్రుడిలా చెల రేగి దొరికిన వాడ్ని దొరికినట్టు గొలుసులతో మొదనారంభించాడు. గొలుసు శబ్ధాలు రాక్షసుల కేకలతో మరొక మారు మారు మ్రోగిందా ప్రాంతం. తలకాయలు పగిలిన వాళ్ళు కొందరు, కాలు చేతులు విరిగిన వాళ్ళు కొందరు కొద్ది సేపు యుద్ధ రంగంగా మారి పోయిందా ప్రాంతం. అదే వూపులో వాళ్ళ నాయకుడి అశ్వాన్ని గొలుసుతో బలంగా మోదగానే అది పెద్దగా సకిలించి నాయకుని కింద పడేసి ఎటో పారి పోయింది. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన నాయకుడు క్రింద పడి లేస్తూనే దుమ్ము దులుపుకొంటూ`

‘‘ఆగుము ధనుంజయా ఆగుము. ఆవేశం తగ్గించుము.’’ అనరిచాడు.

‘‘ఇంత అవమానము జరిగిన పిమ్మట ఇంకనూ అవేశము తగ్గించుటా! పద. ఈ వ్యవహారమును రాజ సభలోనే తేల్చుకొందును. అదియు ఈ బంధనాలను తొలగిస్తేనే’’ అనరిచాడు ధనుంజయుడు.

‘‘లేదు లేదు. రాజ శాసనాన్ని మేము ధిక్కరించ లేము. కావాలంటే నిన్నెవరూ గొలుసులు పట్టి నడిపించరు. గొలుసులతో అలాగే మా వెంట వస్తే చాలు.’’ అంటూ సంధికి సిద్ధమయ్యాడు నాయకుడు.

‘‘సరి. అటులనే వత్తును. నీవు నా ముందు నడువ వలె. మీలో ఎవరును అశ్వము నధిరోహించి నా వెంట రాకూడదు. కాలి నడకన నా వెనక రావలె’’ అంటూ షరతు విధించాడు ధనుంజయుడు.

గొలుసు దెబ్బలు తినే కన్నా`

అతడి షరతునంగీకరించుటే మంచిదనిపించింది నాయకుడికి. అతడి ఆజ్ఞతో అంతా అశ్వాలు దిగి పోగా కొందరు వాటిని తమ వెంట తీసుకు పోయారు. ముందు నాయకుడు నడుస్తుంటే అతడి వెనకే సంకెళ్ళతో భారంగా నడుస్తూ ధనుంజయుడు అనుసరించాడు. వాళ్ళకి ఎడంగా వెనక రాక్షస భటులు ఆయుధాలు వూపుకుంటూ ధనుంజయుని వెంట నడక సాగించారు.

ఆ విధంగా రాక్షస భటుల వెంట బయలు దేరిన ధనుంజయుడు చాలా దూరం నడుస్తూనే వున్నాడు. గాయాల బాధ, ఆకలి బాధ, దాహార్తికి తిరిగి నాలుక పిడచ కట్టుకు పోతోంది. ఇసుక భూమిలో నడక వేగంగా సాగటం లేదు. ఆ పైన సంకెళ్ళ బరువు. దారిలో నాయకుడ్ని అడగగా అతడు జాలి పడి మంచి నీరు తాగటానికిచ్చాడు. క్రమంగా నగరం దగ్గర పడుతోంది.

అక్కడ దీపాలంటూ విడిగా ఏమీ లేవు.

మణి మయ రత్నకాంతులతో నగర సౌధాలన్నీ ధగధగాయమానంగా మెరిసి పోతున్నాయి. అప్పటికే చొరబాటు దారునిగా ధనుంజయుని గురించి నగరంలో తెలిసి పోయినట్టుంది. వీధు ల్లోను, సౌధాల మీద నగర ప్రజలు చేరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రమంగా ధనుంజయుడు నగర ప్రధాన వీధిలో ప్రవేశించాడు. అతన్ని వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు. ధనుంజయుడు కూడ అచటి పౌరుల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు.

వారిలో కొందరు స్త్రీ, పురుషులు చక్కగా మనుషుల్లాగే వున్నారు. కొందరు మాత్రం వికార రూపాలు, అస్త వ్యస్తంగా దుస్తులు, తల మీద ఒకటి లేదా రెండు కొమ్ములు కలిగి కోర పళ్ళతో మెడలో చిత్ర విచిత్రమైన హారాలతో వికృతంగా వున్నారు. స్త్ రీపురుషు బేధం లేకుండా కొమ్ములు మొలిచి వున్నాయి. వీధుల్లో ఆడుకొంటున్న బాలబాలికల్లోనూ కొందరు అందం గానూ కొందరు తలమీద కొమ్ముతో వికృతం గానూ కన్పిస్తున్నారు. వాళ్ళందరూ రాక్షస జాతేనా లేక ఇతర జాతులు కూడ వీళ్ళతో కల గలిసి వున్నారాని ధనుంజయునికి బోధ పడ లేదు.

సౌధాల ఉప్పరిగె మీద గవాక్షాల చెంత, అరుగు మీద గుంపులు గుంపులుగా చేరి ధనుంజయుని విభ్రాంతి చెంది చూస్తున్నారంతా. అసలు వీళ్ళంతా ఈ చీకటి రాజ్యంలో ఏం తిని బ్రతుకుతారో, పంటలు పండిస్తున్నారో లేదో. ఇక్కడి జీవన విధానం ఏమిటో ధనుంజయునికి అంతు చిక్కటం లేదు. వీధుల్లో అక్కడక్కడా అశ్వారూఢులైన సైనికులు, అశ్వ పురుషులు, కొన్ని శునకాలు దర్శనమిస్తున్నాయి. అంతకు మించి మరో ప్రాణి జాడ లేదు. చూద్దామన్నా పశువుల జాడ లేదు. కాని సుసంపన్న లోకం. ఎటు చూసినా వెల కట్ట లేని రత్న మాణిక్యాలు, వజ్రాలు కాంతులు విర జిమ్ముతూ కన్పిస్తున్నాయి.

అవన్నీ చూసుకొంటూ కొన్ని వీధులు దాటాక నగర నడి బొడ్డున వున్న కోట సింహ ద్వారం దాటి లోన ప్రవేశించాడు. ధనుంజయుని ఆ అధికారి, భటలు కోట లోకి నడిపించారు. అనేక కక్ష్యలు నడవాలు దాటి ముందుకు తీసుకు పోతున్నారు. ఎటు చూసినా కోటలో పసిడి తాపడాలు, వజ్ర వైఢూర్యాలతో కూడిన అద్భుత దృశ్యాలే కన్పిస్తున్నాయి. వాటి కాంతులే దారి చూపిస్తున్నాయి. గొలుసుల చప్పుడు చేస్తుండగా భారంగా అడుగులు సారిస్తున్న ధనుంజయుడు ఉన్నట్టుండి ఉలికి పడ్డాడు.

ఎవరో తనను గమనిస్తున్నారు.

చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఆత్ర పడి చూస్తున్నారు.

ఆ విషయం తనకు స్పష్టంగా తెలుస్తోంది.

ఎవరది?

చుట్టూ చూసాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabhandham