Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue180/517/telugu-serials/atulitabandham/atulitabandham/

 

వినతా, ఆమె మిత్ర బృందం అందరూ, గైడ్ లీడ్ చేస్తూండగా, ఒకరి చేయి మరొకరు  చేయి పట్టుకుని మెట్ల మీదుగా క్రిందికి దిగారు. ఎన్నో తెలుగు సినిమాల్లో అత్యంత వైభవంగా చూపబడ్డ ఆ బొర్రా గుహల అందాల్ని తిలకించి ఆనందంతో పులకించిపోయారు...
బయటికి వచ్చి, లంచ్ చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని, మూడు గంటలకల్లా మళ్ళీ బయలుదేరారు. అనంతగిరి కాఫీ రిసార్ట్స్ మీదుగా ఆ కాఫీ గింజల పరిమళాలను పీల్చుకుంటూ, చిక్కటి అడవి లోంచి వెళుతూ ఉంటే కొంత దూరం పోయాక పనస పళ్ళ వాసన గుప్పుమంది. వినతకు తానెప్పుడో చదివిన ‘వంశీ’ కథల్లోని అరుకు పరిమళం గుర్తు వచ్చింది...  స్నేహితులతో వంశీ నవలల గురించీ, కథల గురించీ, సినిమాల గురించీ చర్చిస్తూ ఉండగానే, సుంకరి మెట్ట వచ్చేసింది. ఒక వైపు పెద్ద పెద్ద కొండల వరుస, మరో వైపు క్రిందికి పెద్ద లోయ... ఆ లోయలో పచ్చిక మైదానం... భగవంతుడి సృష్టి చిత్రానికి ఇంతకన్నా వేరే భాష్యం ఉండదు అనిపించింది.
వీళ్ళు వెళ్ళే సరికి మెయిన్ రోడ్ మీద సంత జరుగుతోంది. గిరిజనులు స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ... రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు పెట్టి అమ్ముతున్నారు. చింతపండూ, కుంకుడు కాయలూ, అడ్డాకులూ, అడవి జామ పళ్ళూ లాంటివి. మరో వైపు పట్నం నుంచి తెచ్చినవి కావచ్చు, క్రీములూ, పౌడర్లూ, దువ్వెన్లూ, చీరలూ, బట్టలూ మరో దుకాణంలో అమ్ముతున్నారు. వాటిని ఈ గిరిజనులు కొనుక్కుంటున్నారు.
గిరిజన స్త్రీల ఆహార్యం అంతా ఒక్క లాగే... చీరను వంటికి చుట్టుకుని, పైకి తీసుకువచి, దాన్ని భుజమ్మీద జాకెట్టు పైభాగం లో ముడి వేసారు. పన్నెండు పదమూడేళ్ళ పిల్లనుండీ అలాగే ఉంది వేషధారణ... జుట్టు అడ్డకొప్పుగా ముడిచి, ప్రతీ కొప్పులోనూ అడవి పూవులు తురిమారు. అడవితల్లి స్వచ్ఛమైన, సుందరమైన  అమాయకపు బిడ్డలు వాళ్ళంతా...
అక్కడ కాసేపు కార్లు ఆపి వాళ్ళతో ఫోటోలు తీసుకున్నారు మిత్ర బృందమంతా... అక్కడ రోడ్డు ప్రక్కన చితుకుల మంట మీద కాచిన టీ కొనుక్కుని తాగి మళ్ళీ బయలుదేరారు. స్నేహితులతో రావటం వలన కానీ అదే మరెవ్వరితోనైనా అయితే రోడ్డు ప్రక్కన అమ్మే అలాంటి టీ ని చచ్చినా తాగి ఉండేది కాదు వినత.
దారిలో ఎంతో మంది గిరిజన యువతులు అడవి నుంచి బరువైన కట్టెల మోపులు, నెత్తి మీద పెట్టుకొని చులాగ్గా  మోసుకుపోతూ కనిపించారు.  వీళ్ళంతా అరుకు చేరే సరికి సాయంత్రం ఐదున్నర అయింది. గెస్ట్ హౌస్ లో చేరి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అప్పటికే చిరుచలిగా ఉండటంతో వేడి వేడి నీళ్ళు స్నానాలు చేసి, డిన్నర్ రూమ్ కే తెప్పించుకున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకుని, చుట్టూ ఉన్న అడవిలోని అందాల్ని మసక వెన్నెల్లో చూసి ఆనందిస్తూ, నిద్రలకు ఉపక్రమించారు.
***
“వచ్చే సోమవారం నుండీ నేను బాంబే ట్రైనింగ్ కి వెళుతున్నాను మూడు రోజులు... మీకిచ్చిన పనులన్నీ చక్కగా స్టడీ చేసి, రిపోర్ట్స్ రాసి ఉంచండి... సరేనా?” టీమ్ లో అందరికీ సూచనలు ఇచ్చాడు కార్తీక్.
అందరూ సరేనన్నట్టు తలలూపి, అతనిచ్చిన సూచనలు స్క్రిబ్లింగ్ పాడ్స్ లో నోట్ చేసుకున్నారు. అవసరమైతే తనను కాంటాక్ట్ చేయమని చెబుతూ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు కార్తీక్.
ఆ మరునాడు ఐశ్వర్య, అమల ఇంటికి వెళ్లేసరికి అక్కడ కనిపించాడు కార్తీక్. ఆఫీసులో ఎప్పుడూ బిజీగా ఉంటాడు... మీటింగ్ లో కూడా మాట్లాడే అవకాశం అంతగా రాదు... కానీ ఇక్కడ కనిపించే సరికి ఎందుకో తెలియదు, అక్కడినుండి వెళ్ళిపోవాలని అనిపించింది ఐశ్వర్యకు. గుండెల్లో కొద్దిగా గుబులు... అంతలోనే, తానేం తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోవాలి? అనుకుంది.
తాను రూప కోసం, ఆంటీ అంకుల్స్ కోసం ఇక్కడికి వస్తోంది... బెదిరిపోనక్కర లేదు... అనుకుంటూ లోపలి వచ్చింది.
“హాయ్ ఐశూ, వచ్చావా? నాక్కొంచెం హెల్ప్ చేస్తావా?” హడావుడిగా ఎదురు వచ్చింది అమల.
“ఏమిటక్కా? తప్పకుండా చేస్తాను, చెప్పండి...” అంది ఐశ్వర్య.
“నేను చాలా అవసరంగా బయటకు వెళ్ళాలి. వంట మొదలు పెట్టబోతూండగా ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాలి... నీకేం అభ్యంతరం లేకపోతే కొంచెం వంట చేసి పెట్టవూ?  నేను ఒక్క రెండు గంటల్లో వచ్చేస్తాను... ఇదిగో ఇప్పుడు పదకొండు అయింది కదా, ఒంటిగంటకల్లా ఇక్కడుంటాను... ప్లీజ్...”
“అది కాదు అక్కా... వంటంటే... అదీ... నా చేతి వంట...పెద్ద వాళ్ళు...” ఇబ్బందిగా కదిలింది ఐశ్వర్య.
“అత్తయ్యగారికి, మామయ్యగారికి  అలాంటి పట్టింపులు ఏమీ లేవు ఐశూ... నువ్వు మా ఇంట్లో మనిషివే ఎప్పుడూ... సరేనా? నీకు హెల్ప్ చేయటానికి బంగారి ఉంది... ఏం లేదు, ఒక మంత్రి గారిని కలవాలి... మా క్లబ్ సెక్రటరీ ఫోన్ చేసింది... పన్నెండింటికి అప్పాయింట్మెంట్ ఇచ్చారట... నేను వెళుతున్నా...” జుట్టు పైన పైన దువ్వేసుకుని, డ్రెస్ మార్చుకుని, కారులో వెళ్ళిపోయింది అమల.
భయం భయంగానే వంట గదిలోకి అడుగు పెట్టింది ఐశ్వర్య. పనమ్మాయి బంగారి ఉల్లిపాయలు, కూరగాయలు కోస్తోంది... ఐశ్వర్యను చూడగానే పలకరింపుగా నవ్వింది.
తనూ నవ్వి, “ఏం కూరలు చేయమన్నారు అమలమ్మ?” అని అడిగింది ఐశ్వర్య.
“ఇదిగోండి, అరటికాయ వేపుడు చేయమని చెప్పారండి... ముక్కలు తరుగుతాను... ఇంకానేమో సాంబారు, ఏదైనా పచ్చడి... ఇంకో కూర ఏదైనా... ఆలుగడ్డలు,  కాప్సికం ఉన్నాయండి... మీరు ఏం చెబితే అది తరిగి పెడతా... ముందు నాకు కొంచెం చాయ్ పోయండి... అమ్మ మిమ్మల్ని అడగమని అన్నారు...” అందామె వినయంగా...
వెంటనే త్వరత్వరగా పాలు వేడి చేసి టీ తయారు చేసింది. బంగారి కోసం విడిగా కొంత తీసి, చక్కెర వేసిచ్చి మిగిలిన దాంట్లో రెండు ఇలాచీలు  దంచి వేసింది. మరిగిన తర్వాత  పంచదార వేయకుండా టీ వడగట్టి రెండు కప్పుల్లో పోసి, హాల్లో కూర్చున్న  కాత్యాయని, పరమేశ్వర రావులకు అందించింది.
“అమ్మాయ్, నేను కూడా రానా వంటింట్లోకి? నిలబడి ఉండలేను... కుర్చీలో కూర్చుని చేస్తాను...” అంది కాత్యాయని.
“అబ్బే, వద్దు ఆంటీ... పెద్ద పనేమీ లేదు. బంగారీ నేను చేస్తాం లెండి...”  అని మిగిలి ఉన్న టీలో పంచదార వేసి, కప్పుల్లో పోసి తెచ్చి అరుణ్ కి, కార్తీక్ కి ఇచ్చింది.
“ఓ, ఇలాచీ ఫ్లావర్... థాంక్ యు ఐశూ...” అని కార్తీక్ అంటుంటే చాలా ఇబ్బందిగా తోచింది ఐశ్వర్యకు. తమ మధ్య ఏమీ జరగనట్టే కాజువల్ గా మాట్లాడేస్తూ ఉంటాడు కార్తీక్.
తాను కూడా ఒక కప్పు టీ తాగి, రూపకు చదువుకుంటూ ఉండమని చెప్పి, మళ్ళీ పనిలో ప్రవేశించింది.
అరటికాయల్ని పైన తొడిమలు కట్ చేసి, రెండు భాగాలుగా చేసి కుకర్ లో వేసింది ఐశ్వర్య. రెండు విజిల్స్ రాగానే తీసి తొక్కలు తీసి చక్రాల్లా కోసి, పోపులో వేసి ఎర్రగా వేయించింది.  కందిపప్పును కమ్మని వాసన వచ్చేలా కొద్ది పాటి నూనెలో  వేయించి, ఎండుమిరపకాయలతో  కంది పచ్చడి రుబ్బింది. మజ్జిగతో చిక్కగా పులుసు పెట్టింది. కాప్సికం, ఆలూ ముక్కలు కోయించి, గ్రేవీ కర్రీ చేసింది. టమాటాలు వేసి, ఘుమఘుమలాడే  చారు పెట్టింది. చివరగా అన్నం రైస్ కుకర్ లో పెట్టి స్విచాన్ చేసి హాల్లోకి వచ్చింది.
“అబ్బా, ఎంత జల్దీ చేసేసారమ్మా...” బుగ్గలు నొక్కుకుంది బంగారి, తానుతికిన బట్టల్ని బాల్కనీలో ఆరేసి వస్తూ. చిన్నగా నవ్వింది ఐశ్వర్య.
వండిన ఐటమ్స్ అన్నీ గిన్నెల్లో సర్ది వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఐశ్వర్య.
“ఆంటీ, రైస్ కూడా మరో పావు గంటలో రెడీ అయిపోతుంది...” చెప్పింది కాత్యాయనితో.
“థాంక్స్ అమ్మా... మీ అంకుల్ కి త్వరగా పెట్టేయాలి... షుగర్ పేషెంట్ కదా, ఆకలికుండలేరు...” అందావిడ.
అన్నం రెడీ కాగానే ముందుగా పరమేశ్వర రావు గారికి వడ్డించేసారు.  తర్వాత కంచంలో అన్నం పెట్టుకుని అన్ని కూరలూ వడ్డించి రూప దగ్గరకు తీసుకు వెళ్ళి, స్పూన్ తో తినిపించింది ఐశ్వర్య.
ఈలోగా అమల వచ్చేసింది. వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుని వచ్చి, భోజనం చేస్తున్న మామగారినీ, లోపల రూమ్ లో తింటున్న రూపనూ చూసి సంబరపడిపోయి, ఐశ్వర్యను గట్టిగా కౌగలించుకుంది ఆనందంతో.
తరువాత అందరూ కలిసి లంచ్ చేసారు. ప్రతీ ఆధరువునూ చాలా మెచ్చుకుంది తింటూ అమల.
“అరటికాయ వేపుడు చాలా బాగుంది ఐశూ... నువ్విలా చేస్తావా?”
“అవునక్కా, మజ్జిగ పులుసు లోకి ఇలా బాగుంటుంది... మా అమ్మ రెసిపీ ఇది...” చెప్పింది ఐశ్వర్య.
“ఇలా బావుంది అమలా... ఈ సారి నువ్విది ట్రై చేయి... ఐశూ, అన్నీ బావున్నాయమ్మా... చారు కూడా... అమలా, నాకో బౌల్ లో పోసివ్వు,  తాగుతాను... ఐశూ, నీ వంట సింప్లీ సూపర్బ్...” అన్నాడు అరుణ్.
చాలా రోజుల తర్వాత ఐశ్వర్య చేతి వంట తింటున్న మెరుపు కనిపించింది కార్తీక్ కళ్ళలో. కాత్యాయని కూడా ఐశ్వర్యను చాలా మెచ్చుకుంది కంది పచ్చడి బాగుందంటూ...
సాయంత్రం వరకూ రూపతో కేరమ్స్ ఆడి, అమల ఇచ్చిన టీ తాగి తన ఫ్లాట్ కి బయలుదేరింది ఐశ్వర్య. కార్తీక్ అప్పటికే బయటకు వెళ్ళిపోయాడు...
***
మర్నాడు ఉదయమే కాఫీ, టిఫిన్లు అయ్యాక స్నానాలు చేసి ట్రిమ్ గా తయారై సైట్ సీయింగ్ కి వెళ్ళారు వినతా వాళ్ళు.
పద్మాపురం నర్సరీ, బొటానికల్ గార్డెన్ మొత్తం తిరిగి చూసారు. ఎన్నో పేర్లు తెలియని వృక్షాలు, మొక్కల జాతులు ఉన్నాయి అక్కడ. బృందంలో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో  ఆనందంగా ఆయా చెట్ల పేర్లు డైరీ లో రాసుకుని, ఫోటోలు తీసుకున్నారు.
మధ్యాహ్నం హోటల్ లో లంచ్ చేసి, ట్రైబల్ మ్యూజియం కి వెళ్ళారు. అక్కడ సజీవంగా కనిపిస్తున్న మూర్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఆ మ్యూజియం దగ్గరే ‘థింసా’ నృత్యాన్ని ఏర్పాటు చేసారు టూరిజం డెవలప్ మెంట్ వారు. రంగురంగు చీరలు వారి పద్ధతిలో కట్టుకున్న గిరిజన యువతులంతా, ఒకే వరుసలో నిలబడి,  ఒకరి చేతులు మరొకరు పట్టుకొని, లయబద్ధంగా ఆడే నృత్యమే థింసా అంటే.  డప్పుల శబ్దం, కొమ్ము బూరా శబ్దం మ్రోగుతూ ఉండగా వాటికి అనుగుణంగా అడుగులు వేస్తూ, వంగి, లేస్తూ ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బావుంది.
వినతా, ఆమె ఫ్రెండ్స్ కోమల, రాజీ వీళ్ళంతా ఆ నృత్యాన్ని వీడియో తీసుకున్నారు. తరువాత సరదాగా వాళ్ళతో అడుగులు కలిపి లయబద్ధంగా అడుగులు వేసి మురిసిపోయారు.
ఆ మర్నాడు చుట్టు ప్రక్కల ఉన్న రెండు మూడు జలపాతాల దగ్గరకు వెళ్లి చూసి వచ్చారు. ప్రకృతిలో మమేకం అయిపోయిన వారంతా, మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న  ఆ సెలయేళ్ల అందాలను కంటి కెమెరాలో బంధించి, హృదయాల్లో నిక్షిప్తం చేసుకుని గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చారు. ఆ మధ్యాహ్నం అంతా మబ్బులు పట్టి చిరుజల్లులు కురవసాగాయి.
ఆ చిరు జల్లుల్లో తడుస్తూ, గంతులు వేసింది వినత.
“అప్పుడప్పుడు మన వాళ్ళని వదిలి ఇలా దూరంగా వచ్చేయాలి...” అంది.
“అవును నిజమే... మన ఈ ట్రిప్ మాత్రం ఎప్పటికీ మరువలేనిది...” అంది కోమల.
“నేను మాత్రం నా పుట్టినరోజుకు మా ఆయన్ని తీసుకుని వస్తాను... ఈ ప్రదేశం ఎంత నచ్చిందో నాకు...” అంది రాజీ...
ఆ రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటే గుర్తు వచ్చింది మర్నాడు ఆడపడుచు అవంతి, పిల్లలతో  అమెరికా నుంచి వస్తుందన్న విషయం. ‘వస్తే వచ్చింది లే... తాను ఎలాగూ రేపు ఫ్లైట్ ఎక్కేస్తోంది కదా...’ అనుకుంది చప్పరించేసి...
డిన్నర్ అయ్యాక, ఫ్రెండ్స్ తో కార్డ్స్ ఆడుతూ ఉంటే ఫోన్ మ్రోగింది. చిరాగ్గా తీసి చూసింది. పవన్... పవన్ నంబర్ నుంచి వస్తోంది తనకి ఫోన్ కాల్... ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేస్తే క్లాస్ తీసుకుంటాడు...
చటుక్కున సైలెంట్ మోడ్ లోకి మార్చేసి, మొబైల్ ని దిండు క్రిందకి తోసేసింది. తర్వాత ఆటలో మునిగిపోయింది.
***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali