Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు

గదిలో ఫ్యాన్ చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. గాయత్రి డాక్టరు ఛైర్ పై కూర్చొని మందు చీటీపై బరబర రాసేస్తున్నాడు. అమ్మ నేను కాస్త దూరంలో నిలుచున్నాం. "ఈ మందులు వాడండి' చీటీ ఇచ్చేసి బెల్ నొక్కాడు. అమ్మ చీటీ అందుకుని ముందుకు కదులుతుంటే...కొంగుపట్టి కిందికి గుంజుతూ "ష్..ష్...' అంటూ సైగ చేశాను. అమ్మ"ఏందిరా...ఏం కావాలి' అన్నట్టు నా వైపు చూసింది. నాసైగలు...నా తిప్పలు అర్తం చేసుకుని "సార్...మరి తినడానికి...' మాట పూర్తి కాకుండానే "గంజే ఇవ్వమ్మా...' ముక్తసరిగా అనేసి ఆ మహానుభావుడు టేబుల్ పై ఉన్న పేపర్లలో తలదూర్చేశాడు. "అయిందా...పద' అంటూ బైటికి తీసుకొచ్చింది. ఇంక నా బాధ అంతా ఇంతా కాదు. జ్వరం పుణ్యమా అని స్కూలు ఎగ్గొట్టొచ్చు అనుకున్నానే గానీ...పత్యం పేరుతో ఇలా కడుపు మాడ్చేస్తారని అనుకోలేదు. ఆస్పతి్ర ముందు గదిలో మందుల రూము. అక్కడ ఇంతింత పెద్ద సీసాల్లో రంగురంగుల మందునీళ్లు. గదిగోడకు చిన్న కిటికీ...సినిమా టాకీసులో టికెట్ ఇచ్చే సందులా ఉంటుంది. అందులోంచి చీటీ, సీసా ఇవ్వగానే ...అవతల నిలుచున్న కాంపౌండరు దాన్ని క్షణం చూసి చిన్న చీటీలో నాల్గు తెల్లబిళ్లలు కట్టిచ్చాడు. సీసాలో మిక్చర్ నీళ్లు పోసి ముందుకు నెట్టాడు. ఆస్పత్రిలోంచి ఆడుగు బైట పడిందో లేదో...కయ్యిమంటూ అరవడం మొదలెట్టాను."నాకు గంజి వద్దు ఏం వద్దు పో...' కోపంగా అంటుంటే "మని జ్వరం కదరా...కొంచెం తగ్గనీ' అమ్మ సముదాయింపు. ఇంటికెళ్లే దాకా దారి పొడగునా నేను కోప్పడుతుంటే...అమ్మ బుజ్జగిస్తునే ఉంది. ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లయినా ఇలాంటి దృశ్యాలు మా ఇంట్లో కనిపించేవి.

కమానులో పిల్లగాళ్లకు ఎవరికి సుస్తీ చేసినా వెంటనే తెలిసిపోయేది. ఎలా అంటే స్వెటర్ వేసేసేవారు. అమ్మ కూడా అంతే. కాస్త వళ్లు వేడి చేస్తే చాలు...వెంటనే స్వెటరు వేసి కూర్చోబెట్టేది. స్కూలు టైములో కట్టపై స్వెటరు వేసుకుని కూర్చున్నామంటే...ఓహో బండి రిపేరుకొచ్చందని అందరూ అనుకునే వాళ్లు. బైటికి వెళ్లే ప్రతి ఒక్కరు..."ఏరా జొరమా...' అని అడుగుతుంటే ఔనంటూ బుద్ధిగా తలూపేవాణ్ని. లోలోపల ఎంత ఆనందమో...స్కూలుక వెళ్లక్కర్లేదని. నేను హాయిగా కట్టపై కూర్చొని ఉంటే...ఫ్రెండ్స్  కుళ్లుకుంటూ బడికి పోయేవాళ్లు.  అక్కడికీ ఉండబట్లలేక ..."రేయ్...స్కూలు' అంటూ ఇంట్లో అందరికీ వినిపించేలా అరిచేవారు. అయినా నాకేం భయం.జ్వరమొచ్చిందిగా. పాపం ఈ రాజకీయాలేవి తెలీని అమ్మ లోపల్నుంచే "వాడు రాడులేరా...జ్వరం' అని బదులిచ్చేది. ఇంక చేసేదిలేక వాళ్లు పళ్లునూరుకుంటూ..."లేయ్...ఉత్తి జొరం కదా..నాకు తెలుసులేరా..సారుకు చెప్తే ఉంటుంది నీ పెళ్లి..' అని గుసగుసగా తిట్టి...పైకి మాత్రం "సరే అక్కా...నేను పోతుండా' అనేసి వెళ్లేవారు. పాపం వారి తిప్పలు చూసి నాకు నవ్వు ఆగేది కాదు. "ఊరూర్కే ఎందుకొస్తది జొరం...అప్పుడు నీకు రాలేదా...నువు కూడా స్కూలు ఇడిస్తవి కదా...' అని మనసులోనే తిట్టుకునేవాణ్ని. సాయంత్రం కాగానే అమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లేది.

డాక్టరు టేబుల్ పై పడుకోబెట్టి స్టెతస్కోపుతో పరీక్షిస్తుంటే ...హమ్మయ్యా  మరేం పర్లేదు. వారం రోజులు స్కూలు బంద్...అని తెగ సంబరపడిపోయేవాణ్ని. అమ్మ వేడివేడి రవ గంజి చేసి ఇస్తుంటే...పరుపుపై కూర్చొని ..గోడకానుకుని గ్లాసులో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తాగుతున్నామంటే ఇంక జ్వరం పూర్తిగా వచ్చినట్టే లెక్క! నాన్న స్కూలు నుంచి వస్తూ బ్రెడ్ తెచ్చేవాడు. అదీ రుచిగా ఉండేది. జ్వరం కాబట్టి స్కూలు అని గానీ...చదువుకో అనిగానీ...ఆర్డరేసే వాళ్లెవరూ ఉండరు కాబట్టి...కావలసినంత రెస్టు. ఉదయ నాన్న బడికి పోగానే అమ్మ మంచం వేసి పడుకోరా అనేది. ఈ వైభోగం బాగానే ఉండేది కానీ...పొద్దుగడిచేది కాదు. ఫ్రెండ్స్ స్కూలు నుంచి రాగానే...వీధిలో హడావుడి మొదలయ్యేది. తిండి లేక కాస్త నీరసించి ఉన్నా...వేషాలకేం తక్కువ ఉండేది కాదు. శక్తి కూడదీసుకుని బైటకు అడుగు వేశామో లేదో ..."రేయ్ బైట ఎందుకురా...జ్వరం ఎక్కువవుతుంది' అంటూ అమ్మ కేకలు. కట్టపైనే కూర్చుంటా...బదులిస్తూ కట్టపై కూర్చొనే మంతనాలు మొదలట్టేవాణ్ని. తోటివాళ్లు ఆడుకుంటుంటే వారిని చూసుకుంటూ పొద్దు గడపాల్సి వచ్చేది. అక్కడికీ అమ్మ పనిలో ఉన్నది గమనించి మల్లగా ఆడుకోడానికెళదామంటే...దుర్మర్గులు కొందరు "రేయ్...వద్దురా...నీకు జొరం కదా' అంటూ అమ్మకు పిలిచేలా అరిచేవారు. ఇంక చేసేదిలే పళ్లుకొరుక్కొంటూ మళ్లీ కట్టకు చేరాల్సి వచ్చేది.

జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేదంటారు. నిజమే! అయితే అదీ కొన్నాళ్లే! పత్యం పేరుతో నోరు కట్టేసుకుని బతకాలంటే ఎవరికి మాత్రం సుఖముంటుంది? మిగిలిన డాక్టర్ల విషయం ఏంటో గానీ ఈ గాయత్రి డాక్టరు మాత్రం ఈ పత్యం విషయంలో చాలా కట్ నీట్! కమాను చుటు్టపక్కల నాల్గు గేరీ వాళ్లకు గాయత్రి డాక్టరంటే బలే గురి. ఆయన చేయి పట్టుకుంటే చాలు రోగం ఠక్కున నయమవుతుందనేవారు. ఆస్పత్రి పేరు గాయత్రి క్లీనిక్ కాబట్టి  ఆయప్పని గాయత్రి డాక్టరు అని పిలిచేవారు. ఒక పేరేంటి...ఆయనకు వరసగా మూడు పేర్లు. గాయత్రి డాక్టరు...అశ్వత్థ డాక్టరు...గిడ్డ డాక్టరు. కేవలం జలుబు జ్వరాలే కాదు మొండి వ్యాధుల్ని కూడా నయం చేసేవాడు. కమానులో అందరూ ఆయన వద్దకే వెళ్లేవాళ్లం. చుట్టుపక్కల వాళ్లే కాకుండా...దూర ప్రాంతాల నుంచి ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఆస్పత్రి ఎప్పుడూ బురఖా వేసుకున్న వారితో కిటకిటలాడుతుండేది. ఎవరికి ఏ సుస్తీ వచ్చినా...రెండో మాట లేకుండ ఆయన వద్దక వెళ్లిపోయేవాళ్లు. అయితే డాక్టరు రాకముందే చీటీ రాయించుకోవాలి. వరసగా వేసిన బెంచీలపై కూర్చొని ఎదురు చూస్తుండేవాళ్లం. పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని ట్రీట్ మెంటులో ఏమాత్రం తేడా ఉండేది కాదు. నాడి చూశాడంటే...జబ్బు కనిపెట్టేసినట్టే లెక్క! అన్నీ సరే గానీ పత్యం వద్దే మహా సంకటంగా ఉండేది. ఏదో రెండ్రోజులు మందులిచ్చి పదా అనే రకం కాదాయే. జ్వరం తగ్గేదాకా కాదు...ఆయనిక చాలు అనేదాకా రోజూ వెళ్లాల్సిందే. ఒక రోజు తప్పించినా..."నిన్నెందుకు రాలేదమ్మా...' అని అడిగేవాడు. అందుకే ఆయన వద్దనేవారకు తప్పించేవాళ్ల కాదు.

వారం తర్వాత అమ్మ గంజి ముందుపెడితే చాలు...కడుపు వికారమనిపించేది. ఆ వాసన ముక్కుకు తగిలిని వెంటనే ఎక్కడ్లేని నీరసం కమ్ముకొచ్చేది. "నాకు గంజి వద్దూ...' అంటూ హఠం చేస్తుంటే..."వద్దంటే...జ్వరం తగ్గాలా వద్దా.. తాగాల్సిందంతే' అంటూ అమ్మ గదరించేది. మొహం అదోలా చేసుకుని విధిలేక తాగాల్సి వచ్చేది. మామూలు రోజుల్లో అయితే కావల్సినప్పుడల్లా సుబ్బయ్య సెట్టి హోటల్  వెళ్లి ఇడ్లి లేదా దోసె తెచ్చుకునేవాళ్లం. కమాను వెనక సుబ్బయ్య హోటలుండేది.ఇల్లు హోటలు రెండూ ఒకటే. న్యూస్ పేపరును చిన్నగా చించి ఇడ్లీ కట్టిచ్చేవారు. ఆ పేపరుకు తగలుకున్న చట్నీ రుచి బ్రహ్మాండం. అప్పడప్పుడు పావలా డబ్బు జతయితే రాఘ వేంద్ర విలాస్ హోటల్ వెళ్లవాణ్ని. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఆ హోటల్ కు వెళితే...వేడివేడ సాంబరు ఇడ్లీ లాగించే వీలుండేది. ఈ జ్వరం పుణ్యమా అని అంతా బంద్! ఏదో స్కూలు ఎగ్గొట్టొచ్చు అనుకుంటే ఇదేదో ప్రాణం మీదకు వచ్చేలా ఉందని తెగ హైరానా పడేవాణ్ని. ఏద వద్దంటారో దానిపైనే ఆశన...ఆరాటం. రాత్రి  నిద్రలో ఇవే కలలు. జేబులో పావలా ఉన్నట్టు...దర్జగా రాఘవేంద్ర విలాస్ కెళ్లి ప్లేటు ఇడ్లీ ఆర్డరిచ్చినట్లు...పొగలు కక్కే సాంబరు ఇడ్లీ పూటుగా లాగిస్తున్నట్టు కలలు వచ్చేవి. కనీసం రెండు పైసలున్నా ఇంటి దగ్గర్లోని సెట్టి వద్దకెళ్లి వకాయ బజ్జీ కొనుక్కొని గుట్టుచప్పుడు తినేసి మూతి తుడుచుకుని ఇల్లు చేరే రకం. అలాంటిది ఎక్కడికి వెళ్లకుండా ..కదలకుండా  ఇంట్లోనే కడుపు మాడ్చుకుంటూ ఉండిపోవాలంటే ఎంత నరకం! అది అనుభవించే వారికే తెలుసు. ఈ వైభోగం చాలదన్నట్టు జ్వరం ఉన్నప్పుడే పండుగలు వచ్చి తగలడేవి. "పాపం...జ్వరంరా నీకు. లేకుండా చిత్రాన్నం...బజ్జీలు తినేవాడివి' అమ్మ అంటుంటే అరికాలి మంట నెత్తికెక్కేది. హూ...అంతా నాఖర్మ అనుకుంటూ ముసుగుతన్ని పడుకునేవాణ్ని. అక్కడికీ నాన్న ...వాడికేమైనా ఇవ్వరాదా...అన్న మాటలు లీలగా చెవిన పడేవి. నాకు మొదట నుంచి తిండి ధ్యాస ఎక్కువ.

ఇంకో మాటలో చెప్పాలంటే తిండిబోతు. ఒక్కోసారి అడ్డూఅదుపూ లేకుండా తిన్న సందర్బాలూ  ఉన్నాయి. అమ్మ తరచూ రకరకాల చిరుతిళ్లు చేసి పెట్టేది. గుంత పొంగణాలు చేస్తే మాత్రం లెక్కపెట్టకుండా ..."ఒరేయ్ ఇంక చాల్లేరా' అనేంతవరకు లాగించేవాణ్ని. పొంగణాలు గుండ్రంగా ...చిన్నగా ఒక్కసారి గబుక్కున నోట్లో వేసుకునేలా ఉంటాయి. దెసెలాంటి పెనం. అయితే దానిపై గుంతలు ఉంటాయి. ఆ గుంతల్లో పిండి పోస్తారు. అది పొంగుతుంది. గుంతలో పొంగుతుంది కాబట్టి గుంతపొంగణం. ఓ సారి అమ్మ గుంతపొంగణాలు చేసింది. నేను విజృంభించి పాతిక దాకా లాగించేశాను. ఈ విషయం అప్పుడే ఊరికి వచ్చిన భీమప్ప తాతకు తెలిసింది. ఆయన ఆయుర్వేద వైద్యులు. మరునాడు పొద్దున్నఇంటికి వచ్చినప్పడు ఆయన అమ్మతో...వాడు ఎలా ఉన్నాడు? ఇబ్బంది పడ్లేదు కదా? అని ఆరా తీశాడట! అలాగే ఓసారి పండుగనాడు అమ్మ సేమ్యా పాయిసం చేసింది. నాన్న మాట వరసకి అమ్మతో మొదట వాడకి వేయి...మిగిలిందే అందరికి అన్నాడట! దొరికిందే చాన్స్ అని నేను పూటుగా లాగించేసరికి సగం ఖాళీ! అంత తీవ్రస్థాయిలో తిండియావ ఉండేది. మరి ఇలాంటి వాణ్ని వారం రెజులు నోరు కట్టేసుకుని కూర్చోడమంటే ఎంత దారుణం! కానీ ఏం చేద్దాం...అంతా ఆ గిడ్డ డాక్టరు చేతిలో ఉంది. ఆ మహానుభావుడు దయచూపేదెప్పు? నేను మనసారా తినేదెప్పడు? ఈ జన్మకింతేనా? అని నాపై నాకే జాలేసేది.

ప్రతిసారీ ఆస్పత్రికి కొండంత ఆశతో వెళ్లేవాణ్ని. అమ్మ కూడా "రేయ్...ఇక ఆఖరు. సారుని గట్టిగా అడిగేద్దాం. ఆయన సరే అంటే చాలు....ఇంక నువు మామూలుగా తినేయడమే...సరేనా!' అంటుంటే ఎక్కడ్లేని ఆనందం. ఆస్పత్రిలో కాలు పెట్టాక...అదో విచిత్ర ప్రపంచంలా ఉండేది. డాక్టరు రూము ముందు పెద్ద టేబులు...కుర్చీ వేసుకుని కాంపౌండరు కూర్చొని ఉండేవాడు. అసలు ఆయన టెక్కు మామూలు కాదులే! డాక్టరు తన జేబులో ఉన్నమనిషిలా స్టైలు కొట్టేవాడు. అన్నిటికీ తనే పెద్దలా మాట్లాడేవాడు. డాక్టరు లోపల ఉన్నాడా అని అడిగితే...కళ్లతోనే సమాధానం చెప్పేవాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే...క్యూ చూపించి కూర్చోపొమ్మని సైగలు. అమ్మానేను ఆ బెంచీపై కూర్చొంటామా...పక్కనే ఉన్న తురకామె "క్యా హోగయా...ఏమైంది బేటాకు' అంటూ కాస్త ఎత్తిన బురఖా నుంచే ఆరా...జ్వరం అమ్మ బదులు. ఈ తతంగం మధ్యలో కూర్చొన్నంత సేపు నేను మాత్రం ఆ కాంపౌండరునే గమనిస్తూ ఉండేవాణ్ని. వచ్చిపోయే ప్రతి ఒక్కరూ ఆయన వద్ద ఆగాల్సిందే.డాక్టరు సాబ్ కోసం... అని బైట నుంచి వచ్చిన వాళ్లు అడిగితే...లోపల పేషెంట్...

అక్కడ కూర్చొండి అంటూ ఆర్డరేసేవాడు. ఉన్న పేషెంట్లు చాలరన్నట్లు మెడికల్ రెప్రెజెంట్లు వచ్చేవాళ్లు. మరోపక్క వాళ్లు వెయింటింగు. అయిదుగురు పేషెంట్లు తర్వాత ఒకరు చొప్పున లోపలికి వదిలేవాడు. వాళ్లు నేరుగా డాక్టరు రూములోకి వెళ్లేందుకు లేదు...ఆయన రూము ముందర ఇంకో కర్టెన్ రూము ఉండేది. అక్కడ కూర్చొని ఉంటే...ఈ కాంపౌండరు సారు...లోపలికి దూసుకెళ్లి కబురందించేవాడు. డాక్టరే లేచి వచ్చి వారితో రెండు నిముషాలు మాట్లాడి పంపించేవాడు. ఈ మొత్తం వ్యవహారంలో నాకు కాపౌండరే హీరోలా కనిపించేవాడు. ఉంటే వీడిలా ఉండాలిరా నాయనా! ఈ అభిప్రాయమే ఓ సారి అందరినీ బిత్తరపోయేలా చేసింది. ఓసారి ఇంటికి బంధువులొచ్చారు. పిల్లలు కనిపిస్తే సాదారణంగా అడిగే ప్రశ్న ఏముంటుంది?...ఏరా పెద్దయ్యాక ఏమవుతావ్ అని...అదే అడిగారు. సాధారణంగా డాక్టరో..యాక్టరో...ఇంజనీరో...కనీసంలో కనీసం టీచరో ఏదో ఒకటి చెబుతారు కదా! కానీ నేను మాత్రం చాలా ఠీవీగా నిలుచొని "కాంపౌండర్' అన్నాను. వాళ్లకు అర్తం కాలేదు. అదేం పనిరా అంటే...ఓస్...ఆ మాత్రం తెలీదా...గిడ్డ డాక్టరు ఆస్పత్రిలో కాంపౌండర్ ఉన్నాడు కదా...అలా అవుతా' అన్నా ధీమాగా. అవునా...కాపౌండరే ఎందుకు అని రెట్టించి అడిగితే..."మరి ఆస్పత్రిలో అందరినీ కంట్రోల్ చేసేది ఆయప్పే కదా...అందుకే' అంటుంటే పాపం నా తెలివితేటలకి వారికి మూర్ఛవచ్చినంత పనైంది. నవ్వాలో ఏడ్వాలో తెలీక..."అబ్బో మీవాడు గట్టోడే' అంటుంటే...పాపం నాన్న మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో!

ఇంక జ్వరం పూర్తిగా తగ్గిందన్న నమ్మకం కుదిరాక కూడా ...డాక్టరు ఇది చివరి రోజూ ఇక బంద్ చేయండి అని చెప్పేవాడు కాదు. చీటీపై బరబర రాస్తుంటే...అమ్మే ఉండబట్టలేక "సార్...జొరం తగ్గనట్టుందీ...' అనగానే "ఔనమ్మా...ఇంక మందులు చాలులే' అనేవాడు. అమ్మ తలూపి చీటీ తీసుకుని బైటకు అడుగు వేస్తుంటే...నా ప్రాణం విలవిల్లాడిపోయేది. "మందులు వద్దంటున్నాడు  కదా... అడగవే...' నాపోరు పడలేక అమ్మ "సార్..భోజనం...' మాట పూర్తి కాకుండానే మామూలుగా పెట్టేయమ్మా...అనేవాడు. ఆ మాటలు చెవిలో అమృతం పోసినట్టుండేవి. నాయనా నీవూ వద్దు...నీ మందులూ వద్దు..నీ పత్యమూ వద్దు...అంటూ మనసులోనే గిడ్డ డాక్టరుకు పొర్లుదండాలు పెడుతూ బతుకుజీవుడా అని ఆస్పత్రి నుంచి ఐటపడేవాణ్ని. ఇంటికెళ్లడం తడువు...నాకు ఆకలే...ఏమిస్తావ్...అటూ అమ్మను రాచిరంపాన పెట్టడమే! అప్పుడే సురూ చేసినావా...పదా మళ్లీ డాక్టరు కాడ పోదామా' అమ్మ అనగానే ఠపీమని నోరుమూసుకుని మూలన పడుండేవాణ్ని.

మందులు..పత్యం మాట ఎలా ఉన్నా, అశ్వత్థ డాక్టరు అంటే కమాను చుట్టుపక్కలవటారం వాళ్లకి కేవలం నమ్మకమే కాదు,కొండంత అభిమానం. కొందరు  "ఆ...ఆ పొట్టి డాక్టరు వైద్యం...మీ నమ్మకం సరిపోయింది! ఆయనేమన్నా ఎమ్బీబీయస్సా?' అని వ్యంగ్యంగా విమర్శించినా సరే...గాయత్రి డాక్టరు కాబట్టే ఈ వ్యాధి నయం చేయగలిగాడు అంటూ చెప్పగల సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన పేషెంట్లను గమనించే తీరు....వారికి ధైర్యం చెప్పే విధానం ఇప్పటి చాలా మంది వైద్యులు నేర్చుకోవాల్సిన అంశాలు. అప్పట్లో కమానులో ఉండిన ప్రతి కుటుంబం నేటికీ " ఆ డాక్టరు ఉంటే ఎంత బావుండేదో' అనుకుంటునే ఉంటుంది. గాయత్రి డాక్టరు లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ చక్కగా కొనదేలిన ముక్కు...కాసింత బట్టతల..ఎప్పడూ నీట్ గా ప్యాంటు షర్టు వేసుకుని పొట్టిగా చలాకీగా కదిలే ఆయన రూపం కళ్లకు కడుతునే ఉంటుంది. ఆయన్ను ఎప్పుడు తలచుకున్నా కమాను వాళ్ల మనసులు కృతజ్ఞతతో బరువెక్కుతునే ఉంటాయి.

-------------------

గిడ్డ-పొట్టి, గదరించు-తిట్టు, కట్ నీట్-కచ్చితంగా

మరిన్ని కథలు
putrotsaahamu