Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam
పాండురంగ మాహాత్మ్యము

'అత్యుత్తముడైన దైవము, అత్యుత్తమమమైన  తీర్థము,అత్యుత్తమ మైన క్షేత్రము ఒకేచోట వెలసిన స్థలము ఏది' అన్న అగస్త్యుని ప్రశ్నకు 'అందుకు సమాధానమును యివ్వగలవాడు  పరమశివుడే' అని చెప్పి ఆయనను, ఆయన  సతీమణిని, శిష్యులను, తన పరివారాన్నివెంట బెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు షణ్ముఖుడు. ఆసమయానికి పార్వతీసమేతుడై వనవిహారం చేసి 
ఒక వద్ద సేద తీరుతున్నాడు పరమశివుడు.

నాకవిభూపలోత్కర కనచ్ఛిఖరావృతమైన యొక్క ప
ద్మాకర తీర కేళికనకాద్రి సుఖస్థితినుండునంతఁ బుం
జీకృతతారహారముగ శేషవిభూషణునంఘ్రికిన్ నమో
వాక మొనర్చి యిట్లను శివాకలకంఠి సమంజసోక్తులన్            (ఉ)

ఇంద్రనీలమణులచే ప్రకాశిస్తున్న, పద్మములు నిండిన ఒక సరస్సు తీరంలో, బంగారు కొండపై, క్రీడాపర్వతముపై సుఖంగా విశ్రమిస్తున్న పరమశివుని పాదములకు నమస్సులు   చేసింది పార్వతీదేవి. తన మెడలోని ముత్యాలహారము నేలమీద ముత్యాల రాశి పోసినట్లు 
సోకేట్లు వినయముగా వంగి ఆ శేష భూషణుని పాదములకు నమస్కరించి, కోకిలకంఠము  వంటి కంఠముతో సమంజసమైన పలుకులతో యిలా అన్నది 'శివ'. ఆమె మెడలోని  పొడవైన ముత్యాలహారము నేలమీదకు కుప్పలా పడేంత వంగి నమస్కాం చేసింది! 'విజ్ఞానమయ! మహాప్రాజ్ఞ! యో సర్వజ్ఞ!

ప్రార్థింతు నిన్నొక్కయర్థమేను
నిర్వాణఫలదమై నీకున్కిపట్టైన 
క్షేత్రంబు దేవతా సింధుముఖ్య 
తీర్థంబుల జయించు తీర్థంబు, నత్యుత్క
టప్రభావంబుల దీప్రమైన 
దైవతంబును గూడి, దర్శన స్నాన పూ
జనముల గలుషభంజనమొనర్పఁ                   (సీ)
జాలు నిమ్మూఁడు నొకచోట మేళవించి 
యుండునో? కాక వేర్పడియుండు నొక్కొ ?
దీనిచందంబు సకలంబుఁ దేటపడఁగ
హృదయగమ్యంబు చేసి నన్నేలు' మనుడు   (తే)

'ఓ విజ్ఞానమయా! విశేష జ్ఞానవంతుడా, ఓ ప్రాజ్ఞుడా! గొప్పజ్ఞానము గలవాడా, సర్వజ్ఞా! సమస్తమూ తెలిసినవాడా, ఒక్క విషయమై నిన్ను ప్రార్థిస్తున్నాను. మోక్షప్రదమై, నీకు  నిలయమైన క్షేత్రము, గంగాది దేవనదులను జయించు తీర్థము, మిక్కిలి శ్రేష్ఠమైన ప్రభావముతో వెలుగొందే దైవములను కలిగి, క్షేత్రదర్శనము, తీర్థస్నానము,  దైవపూజనముల వలన సమస్త పాపములను నాశనముచేయగలిగేలా, ఈ మూడూ, క్షేత్రము, తీర్థము, దైవము, ఒకేచోట ఉన్నవా? లేక వేరువేరుగా ఉన్నవా? దీని విధానము సకలము స్పష్టమయ్యేట్లు, నా హృదయగతమయ్యేట్లు చెప్పి నన్ను కరుణింపుమయ్యా' అని ప్రార్థించింది పార్వతీదేవి.

లవలీపల్లవ పాండురంబులగు గల్లక్షోణులన్ జంద్రికా 
లవలీలన్ దరహాసమింపెసఁగఁ గేలన్ వైళ మగ్గోల బేఁ
లవరీతిన్ గొని తెచ్చి యంక కదళాలంకారమున్ జేసి, బా
లవిధూత్తంసుఁడు పల్కు మాధవకథా శ్లాఘా సుఖాసక్తుడై         (మ)

'వెన్నెలతీగ'వంటి తెల్లని చెక్కిళ్ళపై చిరునవ్వుల వెన్నెలలు శోభనిస్తుండగా, వెంటనే, తన చేతితో ఆ 'ముగ్ధను' (గోలన్) మృదువుగా దగ్గరకు తీసుకుని, అరటి మ్రానువంటి తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకున్నాడు ఆ బాలచంద్రశేఖరుడు. మాధవుని కథా కథన సుఖాన్ని అనుభవించే ఆసక్తితో యిలా పలికాడు.

'కించిద్వలగ్న! మిక్కిలి 
మంచిది నీ ప్రశ్నమిది సమర్మముగా వి
న్పించెద'నను నాలోనన 
కంచుకులరుదెంచి ఘటితకరకిసలయులై         (కం)

ఓ సన్నని నడుమున్నదానా! ఎంతో మంచి ప్రశ్నవేశావు. సమర్మముగా వినిపిస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను అంటుండగానే బెత్తాలు ధరించిన సేవకులు, అంతఃపుర  పరిచారకులు వచ్చి జోడించిన చివుళ్ళవంటి చేతులతో, నమస్కరించి, యిలా  అన్నారు.

'దేవ! యగాస్త్యాదిక ముని 
సేవితుఁడై వచ్చినాఁడు సేనాని భవ
త్సేవార్థియగుచు, నతఁడిట
రావచ్చునొ' యనుడు రాగరసభరితమతిన్    (కం)

దేవా! అగస్త్యముని మొదలైనవారితో కలసి మహాసేనాని, షణ్ముఖులవారు విచ్చేశారు. వారు ఇక్కడికి రావచ్చునా' అని  అడిగారు. పరమశివుడు అనురాగరసము నిండిన  హృదయముతో, దేవీసమేతుడై తన అంగీకారాన్ని తెలియజేశాడు షణ్ముఖుడు  మొదలైన వారి రాకకు. చిత్తము అంటూ ఆ కంచుకులగుంపు తమ చేతులలోని బెత్తాల కాంతులు పద్మములకు సోకుతున్న సూర్యకాంతులలా మెరిసిపోతుండగా, వెనుకకు 
తిరిగి షణ్ముఖుని వద్దకు వెళ్లి పరమశివుని అంగీకారాన్ని తెలిపారు. వారి హస్తములు  పద్మములలాగా, ఆ బెత్తాలు సూర్యకాంతులలాగా ఉన్నాయన్నమాట. షణ్ముఖుడు  ఆనందంగా జననీజనకుల దర్శనంకోసం లోనకు బయలుదేరాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
weekly horoscope 30thseptember to 3rd october