Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .....http://www.gotelugu.com/issue181/518/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

కంటికెవరూ కన్పించలేదు.
కాని పై అంతస్తు నడవా వెంట పట్టు పరదా వెనక కర కంకణ ధ్వని, పద మంజీరాల చప్పుడు విన వస్తోంది. తను ముందుకు నడుస్తుంటే ఆ వనితా మణి ఎవరో పరదా వెనక నీడలా పరుగెడుతూ ఆగుతూ పరదా వెనక నుండే తనను గమనిస్తోంది. ఇది చాలా ఆశ్చర్యకరమగు విషయం. లోకంగాని లోకంలో రాజ్యం గాని రాజ్యంలో పరిచితులే లేని బలి చక్రవర్తి కోటలో తనను అంత అక్కరగా పరిశీలించు బాలా మణి ఎవరు? ఏమి ఆమె అక్కర...? ఎవరామె? బహుశ ఈ విషయం తనను గొని పోతున్న సైనికాధికారి గాని భటులు గాని గమనించారో లేదో తెలీదు. అలాగని వాళ్ళని అడిగే ఉద్దేశం కూడ ధనుంజయునికి లేదు. చాలా సేపు ఆ అజ్ఞాత సుందరి కర కంకణ ధ్వనుల పద మంజీరాల సవ్వడి ధనుంజయుని వెంటాడుతూనే వుంది.
అనేక మలుపులు కోటలో దాటిన పిమ్మట `
రాజ సభా భవనం దగ్గర పడింది.
లోపల ఏదో నృత్య ప్రదర్శన సాగుతోంది. దూరంలో ఉండగానే స్త్రీ గొంతు ఒకటి ‘తకధిం తకతై’ యంటూ విన సొంపుగా వీనులకు సోకుతోంది. ఆ గొంతుననుసరించి వీణా, తంబురా, జతరంగిణి, వాయు లీనంతో కూడిన తంత్రీ వాద్య ఘోష, అలాగే లయ పలికిస్తూ డోలు మృదంగం కంజరా మొదలగు జంత్రీ వాద్య ఘోష కర్ణపేయంగా విన వస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురు నటువ రాండ్ర ఆట తాలూకు కర కంకణ, పద మంజీరాల సద్దు వినవబడుతోంది.
ధనుంజయుని ఎత్తయిన సభా మందిరం ద్వారం బయటే చాలా సేపు నిలిపి వుంచారు భటులు. నాట్య ప్రదర్శన ముగియగానే ధనుంజయుని వెంట బెట్టు కొచ్చిన సైనికాధికారి సభ లోనికి వెళ్ళాడు. తమ ప్రభువుతో వాడు ఏమి చెప్పినాడో గాని కొద్ది సేపు నిరీక్షణ తర్వాత అపరాధిని ప్రవేశ పెట్ట వలసిందిగా లోపలి నుండి పిలుపు వచ్చింది. భటులు ధనుంజయుని సభా మందిరం లోనికి నడిపించారు.
లోన అడుగు పెట్టగానే`
తన నిశిత ధృక్కులతో సభా మందిర అంతర్భాగాన్ని గమనించాడు ధనుంజయుడు. ఇది తమ రత్నగిరి సభా మందిరం కన్నా పరిమాణంలో చిన్నదే గాని చూడ్డానికి అత్యంత శోభాయమానంగా అలరారుతోంది. ఆగరు ధూపముతో పరిమళ భరితముగా వుంది. సుమ సౌరభాలు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. అంత వరకు నృత్య ప్రదర్శన సాగించిన నట్టువరాండ్రు, వాద్య కళాకారులు అంతా అప్పుడే పరదాల వెనక్కు పోతూ కన్పించారు.
సభా మందిరం నాలుగు వైపులా చుట్టూ పైన విశాలమైన నడవాల్లో పట్టు పరదాలు వేలాడుతున్నాయి. వాటి వెనక రాణి వాసపు స్త్రీలు ఆసీనులై పరదాల మాటు నుండి సభను వీక్షించడానికి అనువుగా వుంది. పరదాల వెనక స్త్రీ జనానా అలికిడి తెలుస్తోంది. వాళ్ళంతా చూస్తున్నారు. తననే నిశితంగా గమనిస్తున్నారని ధనుంజయునికి అర్థమవుతోంది.
అదే సమయంలో`
దక్షిణ భాగంగా నడవాలో పరదా వెనుక చెంగు చెంగున లేడి పిల్లలా దూకుతూ పరుగున వస్తున్న తరుణీ మణి కర కంకణ, పద మంజీరాల సవ్వడి ధనుంజయుని వీనులకు సోకి మరో మారు ఉలికి పడేలా చేసాయి. కోటలో ప్రవేశించినప్పటి నుంచి ఆ సద్దు తనను వెన్నంటు తూనే వుంది. ఇప్పుడు కూడ ఆమె పరుగు పరుగున పరదా మాటున వచ్చి సరిగ్గా సింహాసనం వెనక భాగం నడవాలో పరదా వెనక నిలవటం చూసాడు. కాని పరదా మాటున రూపం తెలీటం లేదు.
ఎదురుగా ఎత్తయిన వేదిక మీద అత్యంత సుందరమైన రత్నఖచిత పసిడి సింహాసనం వుంది. దాని ముందు గదాయుధాన్ని భుజాన వేసుకొని తనను నిశితంగా చూస్తున్న బలి చక్రవర్తిని గమనించాడు.
ఆ సింహాసనానికి ఎడమ పక్క కాస్త దిగువలో మరో పసిడి ఆసనం మీద ఒంటి కన్ను, నెరసిన జుత్తు దండ కమండలాతో ఒక వృద్ధ తాపసి ఆసీనుడై వున్నాడు. బహుశ ఆయనే రాక్షస కుల గురువు శుక్రా చార్యుల వారని వూహించాడు ధనుంజయుడు. ఇక సభలో రెండు వరుసల్లో ఉచితాసనాలను అనేక మంది అలంకంరించి వున్నారు. ఒక వరుస లోని వారు చక్రవర్తి మంత్ర ప్రముఖులని, రెండవ వరుసలో పాతాళ నగర ప్రముఖులై వుండాలని అనుకున్నాడు. వారు ఎవరెవరో ధనుంజయునికి అస్సలు తెలీని విషయం.
ఆజానుబాహుడు మహా బల శాలియగు బలి చక్రవర్తి జరీ అంచు పసుపు రంగు పట్టు పంచె కట్టాడు. వజ్ర వైఢూర్యాది రత్నము పొదిగిన పసిడి బిళ్ళ పట్టీని నడుముకు బిగించాడు. ఆయన పసిడి పాద రక్షలు కూడ మణి మయ కాంతులీనుతున్నాయి. ఛాతీకి అడ్డంగా యజ్నోపవీతం వుంది, మెడలో మణిమయ రత్నహారాలు, భుజ కీర్తులు మొదలగు అనేక ఆభరణాలు కర్ణ కుండలాలు ధరించాడు.
ఆయనవి ఆకర్ణాయత నేత్రాలు, నిశితమైన చూపు, గుబురు మీసాలు, శిరస్సున అత్యంత శోభయామానమగు రత్న కిరీటం శోభిల్లుతోంది. అది ఎంత బరువు వుంటుందో గాని ఆయన గదాయుధం కూడ స్వర్ణ మయము రత్నఖచితము. బలి చక్రవర్తితో బాటు సభలోని వారంతా సంకెళ్ళతో తమ మధ్య నిలబడిన ధనుంజయుని ఆశ్చర్య సంభ్రమాలతో చూస్తున్నారు.
సాధారణంగా ప్రభువు దర్శనానికి రాగానే జయ వాచకం పలికి ప్రణామం చేయటం ఆచారము, గౌరవ ప్రదము  కాని ధనుంజయుడు తల వంచలేదు. బలి చక్రవర్తికి ప్రణామాలూ చేయ లేదు. ఇనుప సంకెళ్ళు సద్దు చేస్తుండగా సింహాసనం ఎదురుగా ఆవేశంగా నిలబడున్నాడు.
అంతా ఉత్కంఠ భరితులై వీక్షిస్తున్నారు.
ఒకరూ నోరు మెదపటం లేదు.
బలి చక్రవర్తి మీసం దువ్వుతూ గదాయుధాన్ని భుజాన వేసుకొని సింహ కిశోరంలా సింహాసనం ముందు అటు యిటు పచార్లు చేస్తూ ఓర కంట ధనుంజయుని గమనిస్తున్నాడు. క్షణాలు గంభీరంగా దొర్లి పోతున్నాయి. అప్పుడు`
సింహాసం పక్కన దిగువన`
పసిడి ఆసనం అలంకరించిన వృద్ధ తాపసి కల్పించుకొంటూ` ‘‘అపరాధీ’’ అని పిలిచాడు.
‘‘నీ నామ ధేయము ధనుంజయుడని తెలిసినది. భూలోకము నుండి వచ్చిన మానవుడవు. చొరబాటు దారునివి. ప్రభువు సమక్షమున శిరము వంచి ప్రణామము చేయు సంస్కారము నీకు లేదా?’’ అంటూ గంభీరంగా ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న విని ధనుంజయుడు పరిహాసంగా నవ్వాడు.
‘‘స్వామీ! అమిత తపస్సంపన్నులు, రాక్షస కుల గురువు అగు శుక్రా చార్యుల వారు తమరేనని భావింతు... సరియేనా?’’ అనడిగాడు.
అవునన్నట్టు తల పంకించాడు ఆచార్యుడు.
‘‘స్వామీ! పురాణ ప్రసిద్ధులు, మీ పేరున పరగు శుక్ర గ్రహ అధిపతులు అగు మీకు ముందుగా నా ప్రణామము.’’ అంటూ నమస్కరించాడు ధనుంజయుడు. అతడి గంభీర స్వరంతో సభా మందిరం మారు మ్రోగింది.
‘‘నేరము విచారింపకనే మీరు నా మీద చొరబాటు దారునిగా నింద వేసినారు. నేను నరుడనే, భూ లోక వాసినే. మీరు నా సంస్కారము గురించి ప్రశ్నించితిరి. దారి తప్పిన బాట సారి అయిననూ అపరిచితుడైననూ అతిధి దేవోభవ అని ఉపచర్యలు గావించి అతిథ్యమిచ్చి దారి చూపించి పంపించు మహోన్నత సంస్కారము సదాచారము మాది. కాని ఇచట నాకు ఏమి జరిగినది. అవమానము, ఘోర పరాభవము.
నేను ముందే వచించితి. నాకు శత్రువైన నాగ లోక వాసి ఒకడు మోసమున నను గొని వచ్చి మీ మరు భూమిలో పడవేసినాడు. అది నా తప్పిదమా? దాహార్తికి మంచి నీరు అడిగినందుకు మీ అశ్వ పురుషలిరువురు కొరడాలు ఝుళిపించినారు. ఆత్మ రక్షణకు వాళ్ళని ఎదిరించక తప్ప లేదు. వాళ్ళు మరి కొందరిని తెచ్చి పరిస్థితిని పోరాటము వరకు తెచ్చినారు. మీ భటుల మట్టి బుర్రకు నా మాటలు అర్థము గాక పోవచ్చును. మీకును అర్థము గాదా? జరిగిన దోషముకు మీ భటుల నిందింప వలెనా లేక నిరపరాధినగు నన్ను గొలుసులతో బంధించి ఇటకు నడిపించిన మీ సైనికాధికారిని నిందింప వలెనా?
చట్టము... రాజ శాసనము... పొరబాటున మీ పాతాళ లోకమున అడుగిడిన వారి ఆత్మ గౌరవమును కించ పరుచు మీ రాజ శాసనమును మీ రాజును నేనేల గౌరవించవలె?’’ అంటూ నిర్భయంగా, సూటిగా ప్రశ్నించాడు.
అంత వరకు మౌనంగా వున్న బలి చక్రవర్తి` ‘‘హుఁ...!’’ అంటూ హుంకరించి విసురుగా వెళ్ళి సింహాసనం అధిష్టించాడు. గదాయుధాన్ని పక్కన వుంచి ధనుంజయుని గ్రుచ్చి చూసాడు.
‘‘అహంభావి... ఏమి వదరుచున్నావు. దేశకాల పరిస్థితుల ననుసరించి ఏ లోక మందైనను ఏ దేశ మందైనను ఆయా చట్టము, శాసనము రూపొందించబడును. ఎవరు అచట ప్రవేశించినను ఆ చట్టమును శాసనమును గౌరవింప వలె. ఇది నీకు తెలియదా?’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘ప్రభువులు క్షమించాలి. పురాణ ప్రసిద్ధులు, రాక్షస చక్రవర్తులు, సాక్షాత్తూ ఆ జగన్నాటక సూత్రధారి శ్రీహరి పాదమునే తలపై దాల్చిన పుణ్య పురుషులు మీరు. మీ దర్శనమే శుభము. నాకు తెలుసు. మీరు వ్రాక్రుచ్చున్నది సమంజసమే కాని... నేరము ఋజువు గాకుండానే నింద వేయవచ్చునని ముల్లోకము ఏ రాజ్యమున ఈ చట్టము లేదా ఈ విధమైన రాజ శాసనము అమలునందు ఉన్నదేమో శలవీయగలరా’’ అంటూ నిర్భయంగా ఎదురు ప్రశ్నించాడు ధనుంజయుడు.
సభలో చిన్న కలకలం.
ధనుంజయుని ప్రశ్న ఎవరికీ మింగుడు పడ లేదు.
తన ప్రశ్నకు సమాధానము రాదని అతడికి తెలుసు.
ధనుంజయుడు శుక్రా చార్యుని వంక చూసాడు.
‘‘ఆచార్యా..! మానవుల జాతక చక్రమున, కళత్ర స్థానమును, కళలు, రాజ యోగము నిర్ధేశించు తమకు నా జాతక చక్రము తెలియకుండునా? తమరు శలవీయండి నేను అపరాధినా? నిండు సభలో యిలా గొలుసులతో బంధితుడనై నేరస్తునిగ నిలబడు నీచ స్థితి ఏల కలిగినది?
నేను చొరబాటు దారుడినా? సు క్షత్రియ వంశజుండ, రాకుమారుండ, యువరాజునగు నేను చోరుడినా లేక చొరబాటు దారుడినా... ఈ చీకటి రాజ్యమున ఏమున్నదని చొరబడుదును? మా కోశాగారమున లేని పసిడి రాశులా వజ్ర వైఢూర్యములా? ఏమి కొని పోవ చొర బడితినని మీ అభిప్రాయము? ప్రణామము స్వీకరించుటే గాని ప్రణమిల్లు అవాటు లేని వీర వంశజుడను. నను అవమానించిన వారిని గౌరవింపజాల’’ అన్నాడు ఖచ్చితముగా.
‘‘భళా..! నీలో ఆవేశము వీరత్వము మూర్తీభవించిన అగ్ని శిఖలను తలపిస్తున్నావు. భూలోకమున ఏ రాజ్యమునకు చెందిన వాడవు? ఏ రాజ కుమారుడవు?’’ అంటూ ప్రశ్నించాడు బలి చక్రవర్తి.
‘‘క్షమించాలి ప్రభూ! ఇచట మీ సభలో ఇందలి ముందు బంధితుడనై నిందితునిగా నిల బడిన నేను కీర్తి వహించిన మా పూర్వజుల గురించి చెప్పి వారి ఘన కీర్తికి కళంకమాపాదింపజాల. నేను అపరాధినని మీ సభ నిర్ణయించిన మీ చట్ట ప్రకారము శిక్షింప వచ్చును’’ అన్నాడు ధనుంజయుడు.
‘‘ఆఁ! వదరు బోతు... నీ వివరములు తెలుపుట యందును ఇంతటి ఆభిజాత్యమా? ఆచార్య దేవా...! ఇతడికి ఏ శిక్ష విధింప వలె?’’ అంటూ శుక్రాచార్యుని సంప్రదించాడు బలి చక్రవర్తి.
‘‘ఆగండి ప్రభూ! శాంతించండి’’ అంటూ ధనుంజయుని వంక చూసాడు శుక్రాచార్యుడు.
‘‘నాయనా ధనుంజయా. నీ వ్యధ అర్థమగుచున్నది. ప్రభువు పట్ల నీ అవిధేయత కినుక రగిలించుచున్నది. నీకు మా చట్టము అర్థము గాకున్నవి. తెలిసి తాకినను తెలియక తాకినను నిప్పు కాల్చక మానదు గదా. అదే తెరంగున నీవు తెలిసి వచ్చినను తెలియక వచ్చినను అనధికారికముగా వచ్చిన ఎవరినైనను మా శాసనము దోషిగానే పరిగణిస్తుంటాయి. మొదట నీవు చట్ట విధేయుడవైనచో పిమ్మట నీకు శిక్ష తగ్గించి నీకు సాయపడు అవకాశము కలదు.’’ అని సూచించాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..rahasyam