Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు


నగరేశ్వర స్వామి గుడి. రంగురంగుల దీపాలతో వెలిగిపోతోంది. చక్కని అలంకారంతో కన్యకాపరమేశ్వరి  విగ్రహం. గుడిలో భక్తుల కోలాహలం. సరిగ్గా గుడి వాకిలి ముందు...ప్రసాదం ఇచ్చే కాడ అందరూ వరసగా కదులుతున్నారు. నేను అటు ఇటూ చూస్తూ అడుగులేస్తున్నా. ఇంతలో వెనకనుంచి ఎవరో అంగీ లాగినట్టయింది. ముందుకెళ్లడానికి కాస్త గింజుకున్నా...చెయ్యి బరువుగా ఉంది. అంతటోల్లు ఎవరప్పా... అనుకుంటూ తలతిప్పి చూశా... అంతే. ఒక్కసారి తత్తరబిత్తరయిపోయా! కండ్లల్లో నీళ్లు సురూ...నేను అనుకున్నదే అయింది. వద్దురా...ఇప్పుడే వచ్చాం....కాసేవు ఆగుదామంటే ఎవరూ విన్తేదు. ఇప్పుడు ఇలా... అవునూ ఏదీ ఇంతసేపూ నా ఎనకాలే ఉన్న ఫ్రెండ్సు ఇప్పుడు కనిపించలేదే...దేవుడా... అయిపోయింది నాపని అనుకుంటుండగానే "లే...బైటికి రారా..' పొడుగాటి కర్రపట్టుకున్న బక్కాయప్ప ప్రసాదం క్యూ నుంచి పక్కకు లాక్కొచ్చాడు. "అన్నా...అన్నా...ఇడిసేయన్నా...' నేనంటున్నట్టల్లా వాడు ఇంకా రెచ్చి పోతున్నాడు. "ఏమప్పా...ఇంట్లో తినేకి పెట్టేది లేదా? సాయంత్రం అయితేసాలు గుడికాడ వాలిపోతుండారే...యాడ ఆ మిగిలినోళ్లు? ఓ మీదంతా గ్యాంగా...సెప్తా ఉండు మీపని...ఈ పొద్దు బలే దొరికిండావులే! అని కసిగా నవ్వుతుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. "నువ్వే కాపాడు సామీ' అనుకుంటూ రణమండ్ల ఆంజనేయుణ్ని లక్షసార్లు మొక్కుకున్నా. విచిత్రం కమానులో మా ఇంటి పక్కనే ఉన్న అక్క కనిపించింది. నన్ను చూడగానే "అరె...నువ్వేందిరా ఇక్కడా...ఏం చేస్తున్నావ్...' అనగానే నాకు ఎక్కడ్లేని ధైర్యం వచ్చేసింది. "అక్కా చూడక్కా...ఈ యప్ప నన్ను బెదిరిస్తుండాడు' నామాట వినగానే "ఏమప్పా బంగారం లాంటి పిలగాడు. అట్లా అంగీ పట్టుకుని గుంజుతుండావే...ఇడుసు ఇడుసు' అంటూ అందుకుంది. ఆ బక్కోడు తక్కువైనోడేం కాదు. "మూడ్రోజుల్నుంచి కాచుక్కూర్చొనిండాను. నీకు తెలీద్లేమ్మా...ఈల్లంతా గ్యాంగు. ప్రసాదం ఇచ్చేకి తడువులేదు...తయ్యారు. ఒక్కోడు రెండు రెండు చేతుల్తో నాల్గేసి సార్లు క్యూలో నిలుసునేది...తీసుకునేది. సానా ఉండాదిలే ఈల్ల కత. ఇయ్యాల ఇడిసేది లేదు. నాల్గు ఈపుకి ఇడిస్తే...' వాడి మాట పూర్తి కాలేదు...అక్క కయ్యిమంది, "సాల్లేప్పా...పాపం పిలగాళ్లపైనే పెతాపం. అయినా అమ్మ ప్రసాదం తింటే తప్పేముంది...నీ  యింటి తిండా?...రేయ్ పద పదా...' అంటూ నన్ను లాక్కెళ్లింది. బతికాన్రా దేవుడా అనుకుంటూ ఆమె వెనకాల పరుగో పరుగు!

మిగిలిన పండగలెట్లా ఉన్నా...దసరా అంటేనే ఎక్కడ్లేని కుషీ. కనీసం పదిరోజులకు తక్కువ కాకుండా రజాలు. జమ్మీ ఆకుల్తో జేబులు గలగలలాడే పైసలు. పండుగ ఉన్న తొమ్మిది రోజులు..దినామూ ఇంట్లో స్వీట్లు. 

ఓళిక, చక్కెరా ఓళిగ, మైసూరుపాకు, గిలగంచీలు...అంతా గొంతుదాకా లాగించేదే. ఎవరింట్లో అయినా సేమ్యా పాయిసం చేసినారంటే...వారికి పెద్ద పెద్ద పిండి వంటలు చేయడం రాదనే అర్థం. ప్రతి రోజూ పొద్దున్న లేచింది. 

మొదలు వీధిలో ఆడుకోడానికెళ్లాలి. గోలీలు, బొగిరీలు, సబ్జా..ఇంక చాల్రా సామీ అనుకునేదాకా ఆడుకునేదే. మద్యాన్నం అయిందో లేదో...ఇంట్లో గంట చప్పుడు వినిపిస్తే... అమ్మ పూజ ముగిసింది...తట్టల ముందు కూర్చోడమేనని తెలిసిపోయేది. ఎంత ఆటమధ్యలో ఉన్నా..."లే ఇంక సాలు...నేనెల్లాలా...' అంటూ ఇంటికొచ్చేసేవాణ్ని. అడుగు లోనికి పెట్టానో లేదో..."రేయ్..కాళ్లు కడుక్కొని రారా...వీధి దుమ్మంతా నీతోనే...' అమ్మ అరుపులు. అసలే కడుపులో నకనక...ఆ పని కానిచ్చి లోపలికి వచ్చి తట్ట ముందు కూర్చొన్నానా..."మొదట అమ్మవారికి దండం పెట్టుకో...చదువు ఎట్ట వస్తుందిరా?' అంటు కసురుకునేది.  దేవికి దండం పెడుతుంటే...అగరవత్తుల కన్నా.. నైవేద్యానికి పెట్టిన పిండి వంటల వాసనే ముక్కుకు ఘాటుగా తగిలేదు. ఏలాగోలా పూజతంతు పూర్తయ్యాక...తట్టముందు ఓ పట్టు పట్టేవాణ్ని. చేతిపై నీళ్లు పడింది ఆలస్యం..."లే.. వస్తావా...' బైట నుంచి ఫ్రెండ్స్ పిలుపు. అమ్మ ఎంత అరచి గీపెట్టినా మళ్లీ వీధిలో పడిపోవడమే. జీవితంలో ఇవే ఇక ఆఖరు  సెలవులు... ఆడుకోకపోతే నాశనమైనట్టే! అన్నంత ఆబగా వ్యవహరించేవాళ్లం. తిన్నది పూర్తిగా అరిగాక..ఇ  చేరుకునేవాళ్లం. సాధారణంగా ఇంట్లో నాన్న కంట్లో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు తప్పేది కాదు. నాన్న "ఏరా...ఇంట్లోనే లేవు' అంటుంటే మెల్లగా నక్కుతూ లోపలికి వెళ్లి సంచి పట్టుక్కూరొ్చనే వాణ్్ని తెలుగు వాచకం తెరచి గట్టిగా చదువుతుం టామా....రేయ్ ఇంగ్లిష్ తీసుకో' లోపల్నుంచే నాన్న హుకూం. "ఆ పుస్తకం పూజకు పెట్టాడట' అమ్మ బదులివ్వగానే...సరే అదే చదివి చావు...నాన్న తిట్టినా ఏమాత్రం తాకేవి కావు.  హమ్మయ్యా అనుకుని తెలుగు వాచకం అటూ ఇటూ తిరగేస్తూ...ఉప్పు కప్పురంబు నొక్క పోలిక...వేమన పద్యాన్ని చెవులు తుప్పు వదిలేనా గాఠిగా అరిచేవాణ్ని. సెలవులున్నా ఇంట్లో పుస్తకాలు తెరవమని ఏ  క్షణాన్నైనా అడిగే ప్రమాదముందని ముందే తెలుసు కాబట్టి తెలివిగా ఇంగ్లిషు, లెక్కలు పుస్తకం పూజకు పెట్టేసేవాణ్ని. సరస్వతి పూజ రోజు ..అమ్మ మడుగు కట్టుక్కూర్చొని "పుస్తకాలు పెట్టరా...' అనడం ఆలస్యం...పరుగెత్తుకెళ్లి ఇంగ్లిష్, లెక్కలు టెక్స్ట్ పుస్తకాలు పెట్టేసేవాణ్ని.

నేనే కాదు కమానులో ఏ పిలగాడైనా దసరాలో చేసే పని ఇదే! ఇష్టం లేని కష్టమైన పుస్తకాలు ఇలా పూజలో పెట్టే చాన్సు ఉండేది కేవలం దసరాలోనే ...అందుకే ఈ పండగ అంటే మాకు ఎంత ఇష్టమో!!    మధ్యాహ్నం పీకల్దాకా మెక్కినా...సాయంత్రం అయితే చాలు పిల్లలందరం పోగై చుట్టుపక్కల గుళ్ల చుట్టూ తిరగాల్సిందే. ఏ గుడిలో ప్రసాదం ఎప్పుడిస్తారో లెక్కలన్నీ పక్కాగా ఉండేవి. శనగ, పెసర, అలసందుల గుగ్గళ్ళు, పప్పులు చక్కెర పొడులు, రకరకాల ప్రసాదాలు నోరూరించేవి. అయితే అత్యాశకు పోయి ఒకటికి రెండు సార్లు ప్రసాదాల కోసం గబడినప్పుడే...దొరికిపోయేవాళ్లం. ఈ సందడితోపాటు బొమ్మల కొలువు గొప్ప సరదాగా ఉండేది. కమాను, చింతకుంటవీధి, చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇళ్లల్లో బొమ్మలు కూర్చొబెట్టేవాళ్లు. తుంగాబసప్ప, ఆడిటర్ రామారావు..వీరింటినే డైమండ్ వాళ్లిల్లు అంటారు. వైద్యం , నకాతే,  గాయత్రి డాక్టరు, మిరియాల సెట్టి వాళ్లిల్లల్లో పెద్దెత్తున బొమ్మల కొలువులుండేవి. ఈ కొలువును చూడ్డానికి కమాను అమ్మలక్కలు వెళుతుంటే వారితోపాటు పోలోమని మేమూ తయారయ్యేవాళ్లం. ఆ బొమ్మల్ని చూడ్డంలో బోల్డెంత ఆనందం. కొందరిళ్లల్లో బొమ్మల కొలువు అందరూ చర్చించుకు నేంత గొప్పగా ఉండేవి. ఇసుక తిన్నెలు వేసి...చక్కని పార్కులు రూపొందించేవారు. ఆ పార్కుల్లో రకరకాల ఆట వస్తువులతో ఆడుకునే బొమ్మలు,  వివిధ జంతువుల బొమ్మలుం డేవి. కీ ఇస్తే డ్రమ్ములు కొట్టే బొమ్మలు, పట్టాలపై పరిగెత్తే రైళ్లు, రంగురంగుల లైట్లతో గిరగిరా తిరిగే కార్లు...రకరకాల సెట్టింగులు వేసి మరో లోకాన్ని తలపించేవారు. ఇవి చాలు కదా

మాలాటి పిలగాళ్లను కట్టిపడేయడానికి. ఈ పదిరోజులూ ఎవరింటికి పేరంటానికెళ్లినా...గుగ్గిళ్లు తప్పనిసరి. శనగ లేదా పెసర పప్పుతో పచ్చి కొబ్బెర, కొత్తిమ్మిర,పచ్చిమిరపకాయలు కలిపి చేసే ప్రసాదం కోసం పడి  చచ్చేవాళ్లం. తెల్లారింది మొదలు రాత్రయ్యేదాకా వళ్లుపులిసి పోయేలా తిరిగి తిరిగి ఇల్లు చేరుకునే సరికి మా పని అయిపోయేది. పరుపు కనిపిస్తే చాలు చడీచప్పడు చేయకుండా పడి నిద్రలో జారిపోయేవాళ్లం.  పదో రోజు ఇంక మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అదృష్టం ఎలా ఉందో? ఈ సారి ఎంత డబ్బు వస్తుందో అని ఒకటే ఆరాటం. సాయంత్రం కమాను చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి జమ్మీ ఆకులు ఇచ్చి పెద్దోళ్ల కాళ్లకు మొక్కితే...వారు నవ్వుతూ ఆశీర్వదించి...తిరికి ఆకులతోపాటు అయిదో పదో పైసలిచ్చేవారు. ఆ పైసల కోసమే...దసరా ఎప్పుడెప్పడా అని తహతహలాడిపోయేవాళ్లం. విజయదశమి సాయంత్రం నాల్గు గంటల నుంచే కొత్త నిక్కరు, అంగీ కోసం నానా హడావుడి. అమ్మ "కాస్త మొహం కడుక్కొని రా...బట్టలు వేసుకుందు గానీ'అనగానే బచ్చలింట్లో దూరడం...గచ్చులోంచి చెంబులో నీళ్లు ఎత్తి మొహంపై గుమ్మరించుకోవడమే! బైటికి వచ్చాక అమ్మ తువాలుతో తుడిచి, నిక్కరు అంగీకి కాసింత దేవుడి కుంకుమ అంటించి ... ఊ... వేసుకోరా అనేది. నిక్కరు నేనే వేసుకున్నాక..కాజాలు బిగుతుగా ఉంటాయి కాబట్టి, అంగీ  గుండీలు మాత్రం అమ్మ వేసేది. క్రాఫు దువ్వేటపుడు...ఇదేందిరా నీళ్లు తలకు పట్టిం చేశావ్.. .అమ్మ అంటుంటే...మరి క్రాఫు పిండిలా రావాలి కదా అమాయకంగా అంటున్న నా నెత్తిపై నవ్వుతూ మొట్టికాయ వేసేది.

కొత్త డ్రస్సు వేసుకున్నాక మా నడకే మారిపోయేది. అప్పటికే వీధిలో ఫ్రెండ్స్ కూడా కొత్త బట్టల్లో మెరిసిపోతూ కనిపించేవారు.  అందరం వీధిలో అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటూ స్టైల్ గా ఏదో ఫ్యాషన్ క్యాట్ వాక్ లా నడిచేవాళ్లం. కట్టలపై కూర్చొని కబుర్లలో మునిగిన అమ్మలక్కలు మమ్మల్ని చూడగానే "ఏరా కొత్త డ్రస్సా...' అడుగుతుంటే ఎక్కడ్లేని గర్వంతో తలూపేవాళ్లం. సాయంత్రం అవుతుండగానే నాన్న సిల్కు జుబ్బా కొత్త పంచె కట్టుకుని ఇంటి ముందు కట్టపై అప్పటికే వేసిన జంబుకానాపై ఠీవిగా కూర్చొనేవాడు. పక్కనే కాసిన్ని జమ్మీ ఆకులు...వాటి పక్కనే తళతళ మెరిసే పైసలు. పెద్దవాళ్లు వస్తే జమ్మీ ఆకులు...పిల్లలు వస్తే ఆకులతోపాటు పైసో...రెండు పైసో ఇచ్చేవాడు.దాదాపు ప్రతి ఇంటి ముందు ఇలాంటి వాతావరణమే కళ్లక కట్టేది. అందరూ అందరిళ్లకు వెళ్లడం. జమ్మీ ఆకులు ఇచ్చి పుచ్చుకుంటూ..."బన్నీ తీసుకుని బంగారంలా మాట్లాడండి...'మెరిసే కళ్లతో...నవ్వే పెదాలతో పలుకుతుంటే...ఆ అపురూప దృశ్యం గుండెల్ని హాయిగా తాకేది. కమాను కమానే కొత్త బట్టలతో మెరిసిపోతున్నట్టు కనిపించేది. అమ్మలక్కలయితే కొత్త చీరల రెపరెపలతో హడావుడిగా తిరిగేవాళ్లు. ఆ రోజు మటుకు ఎక్కడెక్కడ నుంచో బంధువులు తప్పనిసరిగా వచ్చి బన్నీ ఆకులు ఇచ్చి అభినందనలు తెలుపుకొనేవాళ్లు. జమ్మీ ఆకుల్ని బంగారం అని ఇప్పటికీ పిలుచుకుంటాం.  పండగ రోజు దూర ఊళ్లల్లో ఉంటున్న బంధువులకు, స్నేహితులకు దసరా శుభాకాంక్షల ఉత్తరాలు రాస్తూ...ఇన్లాండు కవరో...మామూలు కవరులోనో జమ్మీ ఆకులు కాసిన్ని పెట్టి పంపడం బాగా గరుతు. అమ్మలక్కల కబుర్లు...పెద్దోళ్ల ముచ్చట్లు...పిల్లలు కేరింతలు...పండగ అంతా కమానులోనే మకాం వేసినట్టుండేది.

 నేను,రఘు,వేణు, ఇంకొందరం నిక్కరు జేబులో జమ్మీ ఆకులు నింపుకొని కనిపించిన ప్రతి అమ్మకు అయ్యకూ వంగి వంగి దండాలు పెట్టేవాళ్లం. "ఆ...శుభం లేవండ్రా...' అంటూ వారు ఆకుల్ని ఓ చేత్తో పట్టుకుని, మరోచేయి జేబులో పోనిస్తే ఇంక మా పంట పండినట్లే! వారు కూడా చాలా గడసరిగా ఎంతిచ్చారో చూడనిచ్చేవారు కాదు. ఆకులు పైసలు కలగలిపి మా అరచేతుల్లో పెట్టి గట్టిగా మూసేవాళ్లు. మేం తెరవడానికి ప్రయత్నిస్తే...అహా..ఇక్కడ చూడరాదురా...వెళ్లండి అని బలవంతంగా పంపించేవాళ్లు. ఇల్లు దాటగానే ...ఠక్కున ఆగి చూసుకుంటే....పచ్చని ఆకుల మధ్య తెల్లగా మెరుస్తూ పైసలు కవ్వించేవి. ఆ పైసల్ని మురిపెంగా మురిపెంగా  తీసి పక్కజేబులో తోసేసి...మళ్లీ కాసుల వేట మొదలెట్టేవాళ్లం. ప్రతి గంట గంటకూ ఇంటికి పరిగెత్తుకొచ్చి...జేబులో పైసలు తీసి లెక్కెట్టి గూట్లో దాచుకునేవాళ్లం. కమానులో అచ్చణ్ణ కక్క, కాశీపతి తాత,  లక్ష్మీపతి పెదనాన్న, చింతకుంట వీధిలో శీనణ్ణ మామ...తెలుగు పండిట్ దక్షిణామూర్తి సారు...అందరి వద్దకు వెళ్లి బుద్ధిగా జమ్మీ ఆకులిస్తూ...కాళ్లకు దండం పెట్టేవాళ్లం. దక్షిణామూర్తి సారుతో మా అనుబంధం  వేరే రీతిగా ఉండేది. వెంకటనరసప్ప గుడెదురుగా ఉన్న బ్రాహ్మణ మండలిలో మాకు ఆయన అమరకోశం చెప్పేవాడు. మాకు అస్సలు ఇష్టం లేని క్లాసు అది. కేవలం నాన్న భయానికి వెళ్లే వాణ్ని. ప్రతి రోజూ సారు "రేయ్...మొదలెట్టండ్రా...యస్యజ్ఞాన దయా సింధో...' అంటుంటే మాలో ఒకడు కొంటెగా "గోడ దూకితే అదే సందు' అంటూ పూరించేవాడు. అందరూ నవ్వుకునే వాళ్లం.

ఏంట్రా అది అని సారు గదమాయింపు..మళ్ల  పాఠం సురూ! పండగ రోజు ఆయనకు కూడా దండం పెట్టుకోవాల్సి వచ్చేది. అదీ పైసలేమైనా రాలుతాయేమోనని. దక్షిణామూర్తి సారు చాలా కతర్నాక్. మమ్మల్ని చూడగానే నవ్వుతూ..."రండ్రండి...శమీ  శమయతే పాపం...' అంటూ గట్టిగా మంత్రం చదివే వాడు. మాకది బేకులేదు. పైసలు ఇస్తాడో లేదో అని సగం మనసు పీకుతుంటే కాళ్లకు దండం పెట్టి లేచేవాళ్లం. ఆయన చేతిలో జమ్మీ ఆకులుంచుతూ..లేరా...శుభం బాగా చదువుకో...మంచి మార్కులు తెచ్చుకో...అంటుంటే ఉండబట్టలేక ఏమిచ్చాడో...ఎంతిచ్చాడో ఈ సారు అనుకుంటూ చూసుకుంటుంటే...పైసలు ఉండవు...చూడకు ఊరకే..'ఈ మాటలు కూడా మంత్రంలా అంటుంటే వళ్లు మండిపోయేది. మా అవస్థలు చూస్తూ ఆయన కొంటెగా నవ్వేవాడు. కాస్త ఇవతలకు వచ్చాక తిట్టుకునేవాళ్లం. కమానులో ఈ తంతు ముగిసిందా...ఇక అసలు కథ మొదలు. అది చిట్టమ్మత్త ఇంటికెళ్లడం. దాదాపు కిలోమీటరు దూరంలో ఉండే చిట్టమ్మత్త ఇంటికి నేను రఘు కాళ్లీడ్చుకుంటూ వెళ్లేవాళ్లం. ఎందుకంటే ...అత్తమ్మ ఇద్దరికీ తప్పనిసరిగా చెరో అర్ధరూపాయి ఇచ్చేది. మమ్మల్ని చూడగానే నిండుగా నవ్వుతూ "ఊ..వచ్చినారా అల్లుళ్లు...బాగా మొక్కం డి మరి...అంటూ అడిగి కాళ్లకు దండం పెట్టించుకునేది. ఆ తర్వాత పట్టండి అంటూ ప్రేమగా అర్ధరూపాయ బిళ్ల చేతిలోపెడుతుంటే మాకు ప్రపంచం జయించినంత ఆనందం. అప్పటిదాకా జమ అయ్యిందంతా యాభై పైసలదాకా ఉంటే..దీంతో రూపాయి అయ్యేది. జేబులో పైసలు బరువుగా తగులుతుంటే సంబరంగా ఇల్లు చేరుకునేవాళ్లం.

దసరా అయ్యేలోగా ఎలాగైనా సరే ఎక్కువ పైసలు కూడబెట్టాలన్నదే మా ఆశ. అందుకే ఎదురుపడిందెవరు...అని కూడా ఆలోచించేవాళ్లం కాదు. మనిషి ఆకారం కనిపిస్తే చాలు వెంటనే జమ్మీ ఆకులివ్వడం..టపీమని కాళ్లపై పడిపోవడం. మరి రూపాయదాకా పోగ వ్వాలంటే ఈ మాత్రం తిప్పలు తప్పేవి కావు. అయితే ఈ ఆవేశమే ఓ సారి రఘు కొంప ముంచింది. జమ్మీ ఆకులు పట్టుకున్న వాడికి ఎదురుగా ఇంట్లో ముసర్లు తిక్కే నరసమ్మ కనిపించింది. ఇంకేం ఆలోచించకుండా వాడు జమ్మీ ఆకులిచ్చి టక్కున కాలిపై పడిపోయాపడు....పాపం నరసమ్మకు ఎక్కడ్లేని కంగారు పుట్టుకొచ్చేసింది. "అయ్యో సామీ...సామీ...' అంటున్న లాభం లేకపోయింది. ఆ తర్వాత రఘు పరిస్థతి ఏంటన్నది అప్రస్తుతం. పైసలు కూడబెట్టాలన్న మా కోరిక తీవ్రత ఎంతో చెప్పడానికి ఈ ఘటన ఓ కొలమానం.కాస్త చీకటి పడ్డాక..ఇంట్లో గోడకానుక్కూర్చొని ఆ పైసల్ని కొన్నిలక్షసార్లు లెక్కబెట్టే వాళ్లం. "ఒరేయ్...చాల్లేరా నాయనా లెక్కబెట్టింది...

' అమ్మ ఓ వైపు అరుస్తున్నా ఆ తంతు ముగిసేది కాదు. ఎప్పుడో తెలీకుండానే నిద్రలో జారుకునేవాణ్ని. మరుసటి రోజు రామన్నయ్య నన్నురఘును ఉదయమే రైల్వే స్టేషను వద్ద  ఉన్న కల్కూరా హోటలుకు పిలుచు కెళ్లేవాడు. పోగేసిన డబ్బులతో ఇంతింత పెద్ద పూరీలు మనసారా తిని వచ్చేవాళ్లం. అక్కడితో దసరా పండుగకు తెరపడినట్టు లెక్క. పండుగ మొక్కుబడిలా కాకుండా ...మనసారా చేసుకోవడం...బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో కలిసిమెలిసి సరదాగా గడపడం ...తలచుకుంటుంటే ఆ వసంత క్షణాలన్నీఎలా కరిగిపోయాయో కదా అనిపిస్తుంటుంది. పూజలు పిండి వంటలు,కొత్త బట్టలు...పండుగ అంటే ఇవేగా అంటే కాదు కాదు...నలుగురు గుమిగూడాలన్న కాసింత తీరిక...వంట్లో ఓపిక...బతుకును వన్నెలచిత్రంలా మలచుకో వాలన్నకోరిక...అని మనసు అంటుంటుంది. నిజమేగా పండుగకు అద్దాల్సిన అసలైన కొత్త రంగులు ఇవే కదా! మరి ఇప్పడు ఏదో తెలీని శూన్యం సుడిగాలిలా చుడుతున్న విచిత్ర భావన! కాలం అలానే ఉంది మరి. అదే పగలు...అదే రాత్రి...దసరా కూడా ఏటా టం చనుగా వస్తోంది..కానీ గుడిలో పొడుగాటి కర్రతో గదమాయించే బక్కమనిషి లేడు...కొంటె నవ్వుతో వెక్కిరించి ఉడికించే దక్షిణామూర్తి సారు లేడు...నిలువెత్తు అమాయకత్వంతో నరసమ్మ కాలికిపడిపోయిన రఘు లేడ. ఆప్యాయంగా అల్లుళ్లూ అంటూ పిలుస్తూ అర్ధరూపాయ చేతిలో పెట్టే చిట్టమ్మత్తా లేదూ...కేవలం దసరా మాత్రమే ఉంది.అంతేనా అంటే అంతే కాదు తలచుకున్నకొద్దీ గుండెను పిండేసే ఆత్మీయ వేదనా ఉంది!!

--------

బన్ని..జమ్మీ..-శమీపత్రం. ఓళిగ-బొబ్బట్టు

మరిన్ని కథలు
vishala hrudayam