Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - .

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము

'అత్యుత్తముడైన దైవము, అత్యుత్తమమమైన  తీర్థము,  అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట వెలసిన స్థలము ఏది'  అన్న అగస్త్యుని ప్రశ్నకు 'అందుకు సమాధానమును  యివ్వగలవాడు  పరమశివుడే' అని చెప్పి ఆయనను,   ఆయన  సతీమణిని, శిష్యులను, తన పరివారాన్ని  వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు షణ్ముఖుడు.  ఆసమయానికి పార్వతీసమేతుడై వనవిహారం చేసి  ఒక వద్ద సేద తీరుతున్నాడు పరమశివుడు. తల్లిదండ్రుల  దర్శనంకోసం అనుమతిని పొంది లోనకు ప్రవేశించాడు షణ్ముఖుడు.

వీడియం బెడలించి విధురత్న కనకాలు
కాంచితాంబువు పుక్కిలించి యుమిసి
యుదిరి బంగారువ్రాఁత హొంబట్టు వలెవాటు
సడలించి వెసఁ గటిస్థలిని జుట్టి
యనుయాయి పృథుక హస్తాంతర న్యస్తోప
దోచితార్థము తానె యుద్వహించి
యంగుళీ సంజ్ఞ సంయములఁ బ్రత్యేకంబు
మునుమున్న లోనికిఁ జననొనర్చి                        (సీ)

ద్వారపార్శ్వస్థ వేదికావళుల జరఠ
రక్షివర్గంబు టంక్రియారభటి వఠర
వలయ మకుటాదికంబుగ నిలిచి మ్రొక్క
నగవుఁజూపులఁ జూచుచు నగరు సొచ్చి              (తే)

పెద్దలదగ్గరకు వెళ్ళేప్పుడు షణ్ముఖుడు కూడా అనుసరిస్తున్న కొన్ని నియమాలను చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు. అంతవరకూ నోటిలోనున్న తాంబూలాన్ని ఉమ్మేశాడు. చంద్రకాంతమణులు తాపడం చేసిన చెంబులోని నీటిని పుక్కిలించి  ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకున్నాడు. భుజాలమీద ఉన్న బంగారు జలతారు  వస్త్రాన్ని తీసి నడుముకు కట్టుకున్నాడు. అంతవరకూ తన అనుయాయి, అనుచరుడు మోస్తున్న కానుకల మూటను అతడి చేతిలోనుండి తీసుకుని, తానే పట్టుకున్నాడు. వేళ్ళతో, చేతితో సైగచేసి, తనను అనుసరిస్తున్న మునులను ముందుగా లోపలకు  పదండి అని పంపాడు. తను ద్వారాన్ని దాటి లోపలకు ప్రవేశించగానే అక్కడ  కూర్చున్న ముసలి పరిచారకులు, పాతకాపులు హడావిడిగా లేచి తలలకు చేతులు తాకించి మొక్కినపుడు వారి చేతులకున్న కడియాలు వారి తలలపై ఉన్న కిరీటాలకు తగిలి ఠంగుమని మ్రోతలు చేస్తుండగా, చిరునవ్వుతో వారిని చూపులతోనే  పలుకరిస్తూ నగరిలోకి, ఆ ఉద్యాన వనవాటికలోనికి ప్రవేశించాడు కుమారస్వామి.పెద్దల సన్నిధికి వెళ్ళేప్పుడు విలాస, వ్యసన, వైభవ, వినోద వైఖరులతో కాకుండా  వినయంగా వెళ్ళాలి. విలాస, వ్యసన సూచకమైన తాంబూలాన్ని అందుకే ఉమ్మేశాడు. వైభవ, దర్ప చిహ్నమైన బంగారు జలతారు పైవస్త్రాన్ని తీసి నడుముకు చుట్టుకున్నాడు. లోన ఉన్న పెద్దలకు తను కింకరుడు కనుక, లోనకు వెళ్ళేప్పుడు ఆ పెద్దవారికి తాను  యివ్వవలసిన కానుకల బరువును తానే వహించడం చేశాడు. పెద్దల దగ్గరకు, పెరుమాళ్ళ  దగ్గరకు ఉత్తచేతులతో వెళ్ళకూడదు కదా, అందునా ఆ లోపల ఉన్న 'పెద్దాయన' పెద్ద, పెరుమాళ్ళు కూడా!

అంతవరకూ తనవెంట ఉన్న గౌరవనీయులు, సాధువులు, మునులు ముందుగా లోనకు  వెళ్లి దర్శించుకునే అవకాశం దొరికితే ఉబ్బి మురిసిపోతారు పాపం, సజ్జనులు, అమాయకులు.  తాను ఎలాగూ ఆంతరంగికుడే, కనుక వెనుకా ముందూ అన్న తేడా తనకు ఏమీ లేదు. కుమారస్వామికి రాజకీయనాయకుల్లా లోనకు వెళ్లి తాను మంతనాలు చేసి, బయటకు  వచ్చి రొమ్ము విరుచుకుని అంతా అడిగేశాను, అంతా చెప్పేశాడు, యిక వెళ్దాం పదండి  అనే రకం కాదు. తనకన్నా పైవారితో తన తోటివారి, తన క్రిందివారి పరిచయము పెరగడం స్వార్ధపరులైన నాయకులకు యిష్టం ఉండదు, తమ ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అన్న  భయంతో. కుమారస్వామికి అలా కాదు. తనను అనుసరిస్తున్నవారి కోరికలు, సంతోషము, గౌరవము ముఖ్యం ఆయనకు. సజ్జనులు ఎవరికైనా అలానే ఉంటుంది, ఉండాలి, అలా  ప్రవర్తించేవారే సజ్జనులు, అనుసరణీయులు!   

వచ్చి పయోజపత్రముల వ్రాలెడు తుమ్మెదదొమ్మిమూఁకలన్
దచ్చనసేయుచున్ బితృపదంబులఁ గూఁకటులంట దర్శినం
బిచ్చుట మున్నుగాఁగ నుతియించుచు మ్రొక్కుడుఁ గేలుసాచి వే
గ్రుచ్చి కవుంగలించి వలిగుబ్బలపట్టియు వాఁకదాల్పుడున్          (ఉ)

లోపలకు ప్రవేశించి, తామరపూవుల రేకులపై వ్రాలే తుమ్మెదల గుంపును ఎగతాళి చేస్తున్న ముంగురులు తల్లిదండ్రుల పాదాలపై వ్రాలేట్లు నమస్కరించాడు! పితృపాదాలు తామర రేకుల్లా ఉన్నాయి, వాటిమీద ముసురుకున్న ఈయన ముంగురులు తుమ్మెదలలాగాఉన్నాయి, ఏమి వర్ణన! దర్శనం యివ్వడం మొదలైన వర్ణనలతో నుతించి మ్రొక్కాడు.ద సెనం , దరిసెనం అంటే పెద్దలను దర్శించినపుడు యిచ్చే కానుక అని కూడా అర్థం.తల్లిదండ్రులు, వలిగుబ్బలపట్టి అంటే మంచుకొండల ముద్దులపట్టి అంటే పార్వతి, వాఁకదాల్పుడు, వాక అంటే ప్రవాహాన్ని, అంటే గంగాప్రవాహాన్ని శిరసుపై ధరించిన పరమశివుడు. వారు చేతులు సాచి కుమారుని గుచ్చి గుచ్చి కౌగిలించి, హత్తుకుని సంబర పడ్డారు.

సమ్మదాశ్రులు కనుఁగవఁ గ్రమ్ముదేర
నాఱుమోములబాలు నిజాంతరమున
నిలుప నతఁడొప్పె రోహిణీ జలజవిమత
మధ్యమున నున్నతారాకుమారు బోలి      (తే)

ఆనందబాష్పాలు కనులలో నిండగా, ఆ ఆరుముఖాల కుమారుడిని తమ యిరువురి మధ్యనకూర్చోబెట్టుకున్నారు. రోహిణికి, చంద్రుడికి మధ్యన తారాకుమారుడిలా తళుకులీనాడు కుమారస్వామి. రోహిణి అంటే రోహిణీ నక్షత్రము, చంద్రుడి భార్య. జలజము అంటే పద్మము. కలువలు కూడా జలజములే. జలజ విమతుడు అంటే పద్మములను ఇష్టపడని వాడు,  పద్మములకు యిష్టుడు కానివాడు, చంద్రుడు. చంద్రుడు కలువలకు ప్రియుడు. రోహిణీదేవికి,  చంద్రుడికీ మధ్యనున్న తారాకుమారుడిలా అంటే బుధుడిలా, చిన్ని నక్షత్రంలా మెరిసిపోయాడు కుమారస్వామి. యిది పద్యానికి అర్ధం.

నిటలాక్షువలన నప్పుడు
ఘటసంభవముఖ్యమునులు గనిరెంతయు ము
చ్చటఁ బిలిచి పీటలిడి యు
త్కటకృపతో నొసఁగు పరమగౌరవ మొప్పన్   (కం)

ఫాలాక్షుడు ముచ్చటగా, అత్యంత కరుణతో పిలిచి పీటలేసి, అంటే గౌరవించి అనుగ్రహం చూపడంతో పులకించిపోయారు అగస్త్యాది మహర్షులు, మునులు.

అలవోకఁ గనకాద్రి సెలయుచో విరిసిన
హరివరాహముదంష్ట్ర నవతరించె
నెద్ది, మున్నపరంజి యిసుక రానేలలఁ 
జరియించు గంధర్వపరిబృఢునకుఁ
జిత్రాశ్వునకు నెద్ది చేకూరె, నెద్ది త
చ్ఛుధ్దాంత కామినీ సురత ఖేద
మపనయింపఁగఁ జాలెఁ దపవాసరంబుల
నంచయై గరుదంచలానిలముల                (సీ)

నెద్ది ప్రాపించె నా ఖేచరేంద్రు గెలుపు
గొన్న తారకునకు, వాని గుహుఁడు దునిమి
తెచ్చెఁ దా నెద్ది యమ్ముత్యమిచ్చె నచల
సుతకు శితికంధరునకు, నిచ్చుటయు నలరి  (తే)

ఆదివరాహ రూపంలో మేరుపర్వతాన్ని ఖేలగా శ్రీహరి ఎగరవేసినప్పుడు ఆయన కోర నుండి పుట్టింది ఒక ముత్యం. చిత్రాశ్వుడు అనే గంధర్వుడు ఆ మేరుపర్వత ప్రాంతంలో ఉన్న బంగారు యిసుకరాతి సీమలలో విహరించేప్పుడు ఆతడికి దొరికింది ఆ ముత్యం.  దాన్ని తన అంతఃపురంలోని కామినులకు ఆ గంధర్వుడు బహూకరించాడు. అది ఆ కామినులకు  రతిక్రీడవలన కలిగిన తాపాన్ని ' వేసవిలో హంసల రెక్కలతో వీచిన చల్లని గాలిలా' ఉపశమింపజేసింది! ఆ గంధర్వునితో పోరాడి గెలిచిన తారాకాసురునికి లభించింది ఆ ముత్యం. ఆ తారకాసురుని సంహరించి, దానిని తెచ్చాడు కుమారస్వామి. తల్లిదండ్రులకు 'యిద్దరికీ కలిపి' కానుకగా దానిని సమర్పించాడు యిప్పుడు. ఇరువురూ ఒకటే కనుక, ఒకటే కానుక తెచ్చాడన్నమాట యిద్దరికీ.

హరుఁడు శిరంబునన్ జెవిఁ గరాంబురుహంబునఁ దాల్పఁ జంద్రికాం
కురపరభాగమై యురగకుండలమై, స్ఫటికాక్షసూత్రమై,
గిరిజ కచాళిఁ గర్ణమునఁ గేల వహింపఁ బ్రసూనమాలికా
కరిరదపత్ర విభ్రమశుకంబులునై మణి యుల్లసిల్లుచున్                       (చం)

ఆ మణిని అందుకుని శివుడు ముచ్చటగా తలపై, చెవికి, పద్మమువంటి చేతిలో ఉంచుకుని మురిసిపోయాడు, కొడుకు తెచ్చిన కానుక కదా మరి. తలలో పెట్టుకున్నపుడు చంద్రరేఖకు మించి ప్రకాశించింది, చెవికి పెట్టుకున్నపుడు సర్పకుండలంలా మెరిసింది, చేతిలో ఉంచుకున్నపుడు స్ఫటిక అక్షమాలలా, జపమాలలా ప్రకాశించింది ఆ ముత్యం. భర్త చేతిలోనుండి పార్వతి చేతికి వచ్చినపుడు ఆ ముత్యం ఆమె కురులలో మల్లెల మాలలా, చెవికి పెట్టుకున్నపుడు చెవికమ్మలా, చేతిలో ఉంచుకున్నపుడు చిలుకలా ప్రకాశించింది ఆ ముత్యం. అలా వారి వారి మనసులలో ఉన్న అభిలాషల ప్రకారం ఆయా రూపాలను ధరించి వారిని ఆనందింపజేసింది ఆ దివ్యమణి. అప్పుడు పరమశివుడు వాత్సల్యంతో కుమారుడిని యిలా ప్రశ్నించాడు.

'మత్సామీప్యమునకు నీ
సత్సంయమివరులు, నీవు జనుదెంచుట కో
వత్సా! ఎయ్యది కత' మని       
వాత్సల్యము గదురఁ బంచవదనుఁడు పలుకన్          (కం)

ఈ సన్ముని శ్రేష్ఠులు, నువ్వు నా వద్దకు వచ్చిన కారణం ఏమిటి నాయనా, ఏమి పని పడింది?అని ప్రేమగా తండ్రి అడగడంతో కుమారస్వామి తాము వచ్చిన కారణం చెప్పడం ప్రారంభించాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu