Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

నాగ‌చైత‌న్య‌తో ఇంట‌ర్వ్యూ

interview with nagachaitanya

స‌మంత‌ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంటుందినాగ‌చైత‌న్య‌

సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు నాగ‌చైత‌న్య‌.

జోష్ టైమ్‌లో చూస్తే.. హీరోగా రాణించ‌లేడేమో అనే సందేహాలు వ‌చ్చాయి.

ఏం మాయ చేశావే కి అవ‌న్నీ ప‌టాపంచ‌లైపోయాయి. 

ప్రేమ‌క‌థ‌ల‌కే స‌రిపోతాడ‌నుకొంటే.. త‌న‌లోని యాన్ కోణాల్నీ చూపించాడు. మ‌నంలో న‌టుడిగానూ.. నాలుగు మెట్లెక్కాడు. ఇప్పుడు ప్రేమ‌మ్‌లో మూడు విభిన్న‌షేడ్స్‌తో సాగే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాతో క‌చ్చితంగా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవ‌డం ఖాయం అనిపిస్తోంది. ఈ ప్రేమ‌మ్ ఈ శుక్ర‌వారమే వ‌స్తోంది. ఆ సినిమా క‌బుర్లు, త‌న ప్రేమ సంగ‌తులూ నాగ‌చైత‌న్య ఇలా చెప్పుకొచ్చాడు. 

 హాయ్ చైతూ...
- హాయ్‌...

* ప్రేమ‌మ్ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఎలా అనిపిస్తోంది..?  కాన్ఫిడెన్స్‌గానే ఉన్నారా?
- మ‌నం టైమ్‌లో ఎంత న‌మ్మ‌కంగా ఉన్నానో... ఇప్పుడూ అంతే న‌మ్మ‌కంగా ఉన్నా. నాకు అన్నివిధాలా సంతృప్తినిచ్చింది. కొన్ని సినిమాలు సెట్లో ఉండ‌గానే ఫ‌లిత‌మేమిటో అర్థ‌మైపోతాయి. మ‌ల‌యాళంలో గొప్ప విజ‌యం సాధించిన చిత్ర‌మిది. క‌థ ప‌రంగా.. త‌ప్పు జ‌ర‌గ‌దు. మంచి క‌థ దొరికిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం ఉంటుంది.

* మ‌ల‌యాళ ప్రేమ‌మ్ చూసిన‌వాళ్లు, దాని గురించి తెలిసిన వాళ్లు ప్రేమ‌మ్‌పై ఆశ‌లు భారీగా పెట్టుకొన్నారు. అదేమైనా మీపై ఒత్తిడి పెంచిందా?
- ఒక విధంగా చెప్పాలంటే.. పెంచిన‌ట్టే. నిజంగా ఈ స్థాయిలో ఈ సినిమాపై అంచ‌నాలు పెట్టుకొంటార‌ని ఊహించ‌లేదు. ప్రేమ‌మ్‌లానో, ప్రేమ‌మ్ కంటే గొప్ప సినిమానో చేయాల‌ని మేం ఈ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ప్రేమ‌మ్ చూసిన‌ప్పుడు బాగా న‌చ్చింది. ఇలాంటి సినిమా తెలుగులోనూ చేస్తే బాగుంటుంది క‌దా అనిపించింది. రీమేక్ రైట్స్ తీసుకొని చేశాం. అన్ని రీమేక్ సినిమాల్లానే దీన్నీ చూడాలి.

* ప్రేమ‌మ్‌లో మీకు క‌నెక్ట్ అయిన విష‌యాలేంటి?
- చాలా ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు త‌మ ప్రేమ‌క‌థ‌ల్ని గుర్తు చేసుకొంటారు. నాక్కూడా అలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. చిన్న‌ప్పుడు స్కూల్లో కొన్ని క్ర‌ష్‌లు ఉన్నాయి. అవ‌న్నీ నాకు గుర్తొచ్చాయి. ప్రేక్ష‌కుల‌కూ అదే అనుభూతి క‌లుగుతుంది. ఎప్పుడైతే ప్రేక్ష‌కులు త‌మ జీవితాన్ని గుర్తు చేసుకొంటారో.. అలాంటి సినిమాల‌కు తిరుగుండ‌దు.

* ప్రేమ‌మ్‌కి త‌గ్గ‌ట్టుగా మీ ప్రేమ‌క‌థ కూడా ఈమ‌ధ్య జోరుగా న‌డిచింది క‌దా?
- (న‌వ్వుతూ) అవ‌న్నీ తెలిసిన విష‌యాలే క‌దా?  నేనూ... స‌మంత ఎప్పుడు ల‌వ్‌లో ప‌డ్డామో మాకే తెలీదు. అదంతా ఓ మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది.

* మీడియాలో మీ ల‌వ్ స్టోరీ గురించి క‌థ‌లు క‌థ‌లుగా చ‌ర్చకు వ‌స్తోంటే మీరిన్నాళ్లూ మౌనంగా ఎందుకున్న‌ట్టు?
- నేను పార్టీల‌కు దూరంగా ఉంటా. బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌ను. మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యే అవ‌కాశం రాలేదు. సోష‌ల్ మీడియా ఉన్నా. నేనే దాన్ని సినిమాల కోసం ఉప‌యోగిస్తానంతే. నా వ్య‌క్తిగ‌త విష‌యాల్ని పంచుకోవ‌డానికి వీలుండ‌దు. ప్రేమ‌మ్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది క‌దా. అందుకే మీడియా ముందుకు వ‌చ్చా.. ఇలా మీకు దొరికిపోయా (న‌వ్వుతూ)

* మ‌రి మీ ప్రేమ‌క‌థ ఇంట్లోవాళ్ల‌కు ఎప్పుడు చెప్పారు?  వాళ్లెలా స్పందించారు?
- ఇంట్లోవాళ్ల‌కూ లేట్‌గానే తెలిసింది. ముందు నాన్న‌గారికి చెప్పా. `స‌మంత గురించి మాకు ముందే తెలుసురా` అన్నారు న‌వ్వేస్తూ. వెంట‌నే నేనూ రిలాక్స్ అయిపోయా. 

* పెళ్ల‌య్యాక స‌మంత న‌టిస్తుందా, లేదా?
- దీనిపై ముందే క్లారిటీ ఇచ్చేశా. స‌మంత త‌న కెరీర్ గురించి చాలా క‌ష్ట‌ప‌డింది. మంచి స్థాయికి చేరుకొంది. త‌ను చేసిన సినిమాలు, పాత్ర‌లు నాకు బాగా న‌చ్చుతాయి. త‌న‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతుంటా. అలాంటిది కెరీర్ వ‌దిలేయ‌మ‌ని ఎలా చెబుతా?

* యాక్ష‌న్ క‌థ‌ల్ని వ‌దిలేసి మ‌ళ్లీ ల‌వ్ స్టోరీల‌వైపు చూస్తున్న‌ట్టున్నారు?
- ప్రేమ‌క‌థ‌లు నాకు బాగా న‌ప్పుతాయి. అలాంటి పాత్ర‌ల్లో ఈజీగా ఇమిడిపోతాను. అయితే స్వ‌త‌హాగా నాకు యాక్ష‌న్ క‌థ‌లంటే ఇష్టం. ఏదో భారీ ఎత్తున ఫైట్లు చేసేవి కావు. స‌హ‌జంగా ఉండాలి. అలాంటి సినిమాలూ చేయాలి. ప్ర‌స్తుతం ప్రేమ‌క‌థ‌ల జోరు న‌డుస్తోంది. మంచి క‌థ‌లు దొరికితే త‌ప్ప‌కుండా యాక్ష‌న్ సినిమాల్నీ చేస్తా.

* మీ కెరీర్ ప‌ట్ల నాన్న‌గారు సంతృప్తిగానే ఉన్నారా?
- త‌ప్ప‌కుండా. అయితే ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాల‌న్న‌ది ఆయ‌న కోరిక‌. క‌థ‌ల విష‌యంలో పెద్ద‌గా జోక్యం చేసుకోరు. నాకే ప్ర‌తీ క‌థా ఆయ‌న‌కు చెప్పాల‌నిపిస్తుంటుంది. నీకు సంబంధించిన నిర్ణ‌యాలు నువ్వే తీసుకోవాలి అంటుంటారాయ‌న‌.

* క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నిన్నే పెళ్లాడ‌తా టైపు సినిమా చేస్తున్నార్ట‌..
- అవును.. నిన్నే పెళ్లాడ‌తా క‌థ‌కీ, దీనికీ చాలా తేడా ఉంటుంది. అయితే.. ఆ ఫ్లేవ‌ర్ క‌నిపిస్తుంటుంది. మాస్‌కి బాగా న‌చ్చే సినిమా అవుతుంద‌ని నా న‌మ్మ‌కం.

* సాహ‌సం శ్వాస‌గా సాగిపో మాటేంటి? ఆ సినిమా ఆల‌స్యం అవ్వ‌డానికి కార‌ణం ఏమిటి?
- త‌మిళం వైపు నుంచే స‌మ‌స్య‌లున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తీసిన సినిమా అది. ఒకేసారి రెండు చోట్లా విడుద‌ల చేయాలి క‌దా?  అందుకే మంచి స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాం. న‌వంబ‌రులో వ‌చ్చేయొచ్చు.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ..

కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
young ladies tailor is arriving