Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue182/522/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

‘‘వలదు ఆచార్యా. అసలు శిక్షే కూడదన్నది నా వాదన. మీరు జాలి పడి తగ్గించు శిక్ష నాకు అక్కర లేదు. స్త్రీ యందు వివాహ మందు ధన మాన ప్రాణ విత్త హాని యందు బొంక వచ్చు అది తప్పు గాదన్నది శుక్ర నీతి గదా. తమరు చెప్పినదే. కాని ఏ స్థితి యందును నేను సత్యమునే పలికితి. అనృతములాడలేదు. సత్య వాక్కునకు మీ పాతాళ లోకమున మరణ దండనే శిక్ష అనునేని అదియే విధింప వచ్చును. ప్రాణము కొరకు ప్రాధేయ పడు అల్పుడు కాడీ ధనుంజయుడు’’ అన్నాడు.

ధనుంజయుని మాటలు మరొక్క మారు సభికులను ఉలికి పడేలా చేసాయి. సభలో గుస గుసలు ఆరంభమయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో ఎవరికీ అంతు చిక్కటం లేదు. చట్టమా, ధనుంజయుడా... రెంటిలో ఏది న్యాయమో ఎవరూ నిర్ధారించుకోలేక పోతున్నారు. ఈలోపల`

కొంత సమయం శుక్రా చార్యులు బలి చక్రవర్తితో తగ్గు స్వరమున మంతనాలు సాగించారు. చివరికి ఒక నిర్ణయానికొస్తూ బలి చక్రవర్తి గుబురు మీసంత దువ్వి ధనుంజయుని వంక చూసాడు.

‘‘ధనుంజయ నామ ధేయా... నీకు శిక్ష లేకుండా ఒక మధ్యే మార్గమును సూచించెద. ఎత్తెరంగున నీవు మా పాతాళమునకు వచ్చితివో అదే విధముగ తిరిగి భూ లోకమునకు మరలి పొమ్ము. ఈ అవకాశమునుపయోగించు కొనినచో నీకు దోషిగా ఎలాంటి శిక్షా విధింప బడదు.’’ అన్నాడు.

ఆ మాటకు నవ్వాడు ధనుంజయుడు.

అతడి సంకెళ్ళు కణకణా ధ్వనించాయి.

‘‘బాగున్నది మహా బలి. ఏమంటివి? ఎటుల వచ్చితినో అటులనే మరలి పోవలెనా! ఎటు? మరలి పోవు మార్గము తెలిసిన అప్పుడే మరలి పోయేడి వాడిని గదా. మీ భటుల కంట బడు వాడనా. అది తెలియకనే గదా మీ ముందు సంకెళ్ళతో బంధీగా నిలిచితి. మీరు మార్గము చూపండి. నేనటులనే వెడలి పోయెద’’ అన్నాడు.

‘‘అసంభవం.’’ అన్నాడు బలి.

‘‘మార్గము మేము చూపిన తిరిగి తిరిగి వచ్చి పోవుటకా? మార్గము అడిగి అతి తెలివి చూపకుము. ఎటుల మరలి పోవుటయో అది నీ సమస్య’’ అంటూ భటుల వైపు చూసి`

‘‘ఇతడిని విడిది గృహమునకు గొనిపోయి సంకెళ్ళు తొలగించండి. భోజనాది వసతులు కల్పించండి. ఎనిమిది జాముల పర్యంతం అవకాశం ఇవ్వండి. ఈ సమయమును ఉపయోగించు కొని ఇతడు తన లోకమునకు పోవలె. అటుల పోకున్న తొమ్మిదవ జామున తిరిగి సంకెళ్ళతో బంధించి మన కారాగారమున చెర వాసమున ఉంచ వలె’’ అంటూ ఆజ్ఞాపించాడు.

‘‘ఇది అసంభవము... శిక్ష అన్యాయము’’ అనరిచాడు ధనుంజయుడు.

‘‘ఇది మాకు న్యాయ సమ్మతమే మానవా. ఈ అవకాశమును నీవు సద్వినియోగ పరుచుకో వలె. లేని పక్షమున నీకు ఇచట కారాగార వాసము తప్పదు. ఆమరణ పర్యంతము... ఆఁ’’ అంటూ హుంకరించాడు బలి చక్రవర్తి. వెంటనే సభ చాలిస్తున్నట్టు ప్రకటించి లేచి గదా యుధాన్ని భుజాన వేసుకొని సింహాసనం వెనుక పరదా వెనక్కు వెళ్ళి పోయాడు.ఇంత జరిగినా`

శుక్ర చార్యుల పెదవుల మీద దరహాసమెందుకో, తననే ఆ మహనీయుడు ఎందుకు చూస్తున్నాడో ధనుంజయునికి అర్థం కాలేదు. తల ఎత్తి పై నడవా పరదా వెనక్కు చూసాడు. ఆమె పరదా వెనక నీడలా అలాగే నిల బడుంది. మాట మాటకీ కన్నీరు తుడుచుకుంటోంది. తన గురించి కన్నీరు కార్చటమా. ఎవరా లతాంగి? ఆమె వివరాలు తనకు ఎవరు చెప్తారు?

ధనుంజయుని ఆలోచనలు ఓ కొలిక్కి రాక ముందే రాక్షస భటులు అతడిని సంకెళ్ళతో సభా మందిరం నుండి బయటకు నడిపించారు.

***************************************

విడిది గృహము.

అది అంతఃపుర ఉద్యానవన సమీపమున గల ఒక సుందర మందిరము. అచట గవాక్షము నుండి వీక్షించిన, అద్భుత మగు ఉద్యాన వనము కనుల పండువుగా దర్శనమిస్తుంది. వనాంతర్భాగమున అందముగ తీర్చి దిద్ద బడిన అనేక పొదలు లతలు, తీగలు, వృక్షములు చిరు చీకట్లలో కూడ కాన వస్తున్నాయి.

ఉద్యాన వనమంతటా అచటచట పొదగ బడిన రత్నకాంతుల వెలుగు జిలుగులతో బాటు అచటి వృక్షములే కొన్ని స్వయం ప్రకాశముగా శోభిల్లుచున్నవి. చిత్ర విచిత్రములగు పుష్ప జాతులు, ఫల వృక్షములు, సూర్య కాంతి లేకయే అవి బ్రతుకుట, పుష్పించుట, ఫలించి ఫలము నొసంగుట అది అంతు చిక్కని విషయమే. ఉద్యాన వన సుమ సౌరభాలతో ఆ ప్రాంతమంతా గుబాళిస్తోంది.

అంతే కాదు`

విడిది గృహంలో ఉద్యాన వన అభి ముఖంగా కొంత మేర గోడ లేదు. అచట గృహ పై భాగాన ఎచటి నుండో స్వచ్ఛమైన జల ధార గోడ లేని భాగం పొడవునా బయటకు అద్దంలా జాలు వారుతోంది. ఆ నీరు దిగువ నుండి ఉద్యాన వనం లోకి ప్రవహిస్తూ విడిది గృహాన్ని చల్లగా ఉంచుతోంది. ఉద్యాన వన కాంతులు ఆ జల ధార మీద ప్రతిఫలించి వింత అనుభూతిని కలిగిస్తున్నాయి.

ధనుంజయుని అచటికి నడిపించుకొచ్చిన రాక్షస భటులు అతడి సంకెళ్ళు తొలగించారు. జల ధార సమీపంలో ఒక పట్టు పరుపులు రెండు తల దిండ్లు వేసారు. పక్కనే ఒక పీట మీద బంగారు పళ్ళెరంలో ఆహార పదార్థములుంచి మూత పెట్ట బడింది. ఒక కూజా నిండుగా మంచి నీరు, తాగడానికి లోటా ఉంచ బడ్డాయి. మరో కుజాలో మధిర ఉంచ బడింది. ఏర్పాట్లు పూర్తి చేయగానే ధనుంజయుని స్వేచ్ఛగా వదిలి మందిరం బయటకు పోయి కాపలా కూచున్నారు.

బంధనాలు తొలగినప్పటికీ`

ధనుంజయుని మనసు వికలమై`

అస్తవ్యస్తంగా వుంది.

కిం కర్తవ్యం?

తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

ఇప్పుడు తను ఏం చేయాలి?

తనకు ఎనిమిది జాముల గడువు యివ్వ బడింది. అంటే రాత్రి నాలుగు జాములు పగలు నాలుగు జాములు కలిపి ఒక రోజు సమయమది. ఈ సమయమును ఉపయోగించుకొని తను భూ లోకమునకు మరలి పోవలెనా? ఎటుల? ఏది మార్గము? ఎలా పోగలడు?
గోడనానుకొని నిలబడి జల ధారను చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా తనకు మార్గము కన్పించటం లేదు. ఎవరో ఒకరు తనకు సాయం చేయాలి. ఎవరు చేస్తారు? అలాంటి వారున్నారా..? గుండె లోతుల్లో ఎక్కడి నుంచో వున్నారని సమాధానం వస్తోంది. ఉంటే ఎవరది...? గుర్తుకు రావటం లేదు.

అదే సమయంలో`

తన ప్రాణ సఖియు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు గుర్తుకొచ్చి మనసు వేదన పడుతోంది. కళ్ళలో నీరు సుడి తిరుగుతోంది. ఆలయంలో తనను గానక, ఏమి జరిగిందో తెలియక ఆ అబల లిరువురూ ఎంతగా తల్లడిల్లుతున్నారో గదా. తను వచ్చు వరకు ఆయం వద్దే ఎదురు చూస్తుంటారో లేక తనను గాలిస్తూ ముందుకు సాగి పోతారో తెలీదు.

భద్రా దేవి సాటి లేని వీర వనిత. ఆపైన ఆమె మంత్ర శక్తికి తిరుగు లేదు. గాబట్టి వక్ర దంతుడు ఉలూచీశ్వరిని నాగ లోకానికి అపహరించుకు పోతాడన్న భయం లేదు. కాని... ఏమో! ఆ నీఛుడు భద్రా దేవిని మోస పుచ్చి ఉలూచీశ్వరిని అపహరించినాడేమో... తనను వాళ్ళకు దూరం చేయుటలో ఆ ధూర్తుడి ఉద్దేశం అదే గదా. ఉలూచీశ్వరిని తీసుకెళ్ళి నాగ రాజు ఆశీస్సులతో వివాహం చేసుకోవాలన్నది వాడి దురాశ.
ఈ విధంగా ఆలోచనలు సాగుతూండగానే`

చట్టున ధనుంజయుని కళ్ల ముందు మెదిలాడో యక్షుడు. శాప వశంగా అగ్ని సర్పంగా మారి నాగ లోకంలో దాస్యుడిగా వున్న అతడికి తన మూలంగా శాప వియోచన కలిగింది. ఆ సందర్భంగా యక్షుడు తనకు మిత్రుడైనాడు. ఎప్పుడు అవసరమైనా తనను తలచుకొని తన పేరును బిగ్గరగా పిలిస్తే చాలు తక్షణం వచ్చి సాయ పడదునని ఆనాడు మాటిచ్చాడు. కాని... కాని... అతని పేరు... అదో విచిత్రమైన పేరు. ఎంత ఆలోచించినా యక్షుని పేరు గుర్తుకు రావటం లేదు. ఈ ఎనిమిది జాము సమయంలో గుర్తుకు రాకుండా ఉంటుందా? చూద్దాం అనుకున్నాడు. అంత లోనే అతడి ఆలోచనలు తను పాతాళ లోక కోటలో ప్రవేశించినప్పట్నుంచి తనను వెంటాడుతున్న అజ్ఞాత సుందరి వైపు మళ్ళాయి.

ఆమె తన కోసం చాలా ఆత్ర పడింది. అక్కర చూపింది. దుఖ్ఖించింది. ఆ విషయం తను గ్రహించాడు. కాని ఎవరా సుందరి? ఆమెకు తనకు ఏమి సంబంధం? ఆమె ఎవరో తెలుసు కోవాలని మనసు తొందరిస్తున్నా ఎవరినడిగి తెలుసుకోగలడు. కనీసం ఆమె నామ ధేయం కూడ తనకు తెలీదు. తను పాతాళ లోకం విడిచి వెళ్ళే వరకు ఆమె తనకు ఓ ప్రశ్నగానే మిగిలి పోతుందేమో.

ధనుంజయుని మనసుకి బాధగా వుంది.

ఆ బాధలో భోజనం చేయాలనిపించటం లేదు. అసలు ఆ పళ్ళెరంలో ఏ విధమైన భోజ్య పదార్థాలున్నాయో కూడ చూడ లేదు. మనసున వ్యధ, శరీర గాయాల బాధ అతడ్ని ఎక్కువ సేపు నిలువనీయటం లేదు. ఇంత వరకు దివ్య నాగ మణిని సంపాదించ లేక పోయానే అనే వేదన మరో పక్క బాధిస్తోంది. వచ్చి పరుపు మీద కూచున్నాడు. ఆకలి వేస్తున్నా భోజనం మీదికి మనసు పోలేదు. కొద్దిగా మంచి నీరు తాగాడు. పిమ్మట రెండు లోటాల మధిర సేవించాడు.

నర నరాన మధిర మత్తు ఆవహించగానే ఇక సకల బాధలు, వ్యధలు అన్నీ మర్చి పోయి పరుపు మీద వెల్లికిలా పడుకుని గాఢ నిద్ర లోకి జారుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో అతడికి తెలీదు.

ధనుంజయుడు నిద్రా వశుడైన అర్ధ జాము తర్వాత, పద మంజీరాలు ఘల్లు ఘల్లున సద్దు చేస్తుండగా, కర కంకణాలు మృదు శబ్ధాలు ఆలపించగా సకలా భరణ భూషితమై మేలి ముసుగు వేసుకుని, మెరుపు తీగ లాంటి లతాంగి ఒకామె  చేతిలో బంగారు పళ్ళెరంతో అంతఃపుర దిశ నుండి విడిది గృహ ప్రవేశ ద్వారం వైపు వచ్చింది.

అప్సర భామను ధిక్కరించు అతి లోక సౌందర్య వతి, కుసుమ కోమలి. ఆమె రాకను గమనించిన కావలి రాక్షసులు నలుగురూ అదిరి పడి లేచి నిలుచుని వంగి వంగి ప్రణామాలు చేసారు. ఆమె వారితో ఏదో చెప్పింది. నలుగురూ భయ భక్తులతో తల వూపి అక్కడి నుండి దూరంగా వెళ్ళి పోయారు.,

ఆ సుందరాంగి సరా సరి`

విడిది గృహంలో ప్రవేశించింది.

నేరుగా ఆమె ధనుంజయుని వద్దకొచ్చింది. ఎదురుగా నిలబడి కొన్ని లిప్తల పాటు కనులార అతడినే చూస్తూ నిలబడింది. గాయాలతో డస్సి పోయి అలసటతో గాఢ నిద్రా వశుడైన ధనుంజయుని చూస్తుంటే ఆమె కనులు జల పాతాలే అయ్యాయి. అతడు భోం చేయ లేదని గ్రహించింది.

మేలి ముసుగు తొలగించింది.

పళ్ళెరాన్ని పక్కన వుంచింది.

ముందుగా వంగి అతడి పాదాలకు నమస్కరించింది. పిమ్మట వచ్చి పరుపు మీద ధనుంజయుని పక్కనే ఆసీనురాలయింది. తను తెచ్చిన పళ్ళెరం మీది పట్టు వస్త్రాన్ని తొలగించింది. అందులో ఘమ ఘమ లాడే వంటకాలతో కూడిన అద్భుత భోజ్య పదార్థాలున్నాయి. వాటి పక్కనే చిన్న పసిడి గిన్నెలో వెన్నె పూస లాంటి తెల్లని మెత్తని పదార్థం వుంది. ఆ గిన్నెను అందుకుందా సుందరి. దాన్ని పక్కన ఉంచింది. పట్టు వస్త్రాన్ని కూజా లోని నీటితో తడిపి పిండి ఆ వస్త్రంతో ముందుగా ధనుంజయుని వంటి మీది రక్తపు మరకల్ని గాయాల్ని చక్కగా తుడిచింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabandham