Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue182/521/telugu-serials/atulitabandham/atulitabhandham/

 

సుందరమ్మను డిశ్చార్జ్ చేసారు. ఆమెకు వేయాల్సిన మందులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, తినకూడని ఆహారపదార్థాలు పెద్ద జాబితా ఇచ్చారు డాక్టర్లు. ఆయాసం కంట్రోల్ అయింది కానీ ఆవిడకి బాగా నీరసం వచ్చేసింది. ఇంటికి వచ్చిన తరువాత, సాధ్యమైనంత వరకూ మందులు వేసుకుని పడుకుని ఉంటోంది.

కబురు తెలిసిన వెంటనే సుగుణమ్మ వియ్యపురాలిని చూడటానికి వచ్చింది. ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే సుందరమ్మ అలా నీరసంగా పడుకుని ఉండటం చూసి ఎంతో బాధపడింది. అవంతిని పలకరించి, ఆమె పిల్లల దగ్గర కూర్చుంది సుగుణమ్మ.

అవంతికి ఇద్దరూ ఆడపిల్లలే. పదిహేను, పన్నెండు సంవత్సరాల అమ్మాయిలు అమెరికాలోనే పుట్టి పెరగటంతో వారికి తెలుగు వచ్చినా అమెరికన్ యాక్సెంట్ తో చిత్రంగా ఉంటాయి వాళ్ళ మాటలు. పొడుగ్గా, దానికి తగ్గ లావుతో, చక్కని ఫ్రాక్ లు వేసుకుని, పోనీలతో అమెరికా అమ్మాయిల్లాగానే ఉన్నారు.

“నమస్టే గ్రాణీ!” అన్నారిద్దరూ సుగుణమ్మను చూస్తూనే. చిరునవ్వుతో వాళ్ళను దగ్గరకు తీసుకుంది సుగుణమ్మ.

“అమ్మా, ఎలా ఉన్నావు?” దగ్గరకు రాబోయింది వినత. అంతలోనే వంటమ్మాయి సావిత్రి పిలవటంతో వంటగదిలోకి వెళ్ళింది.

“కాఫీ తీసుకో మమ్మీ...” ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కాఫీ కప్పుతో వచ్చింది వినత.

“పరిమళా, సౌరభా... మీకు మిల్క్ తీసుకురానా?” అడిగింది.

“వద్దు అట్టా! ఇక్కడ మిల్క్ ఈజ్ నాట్ దట్ మచ్ గూడ్...” నసిగింది సౌరభ.

“బట్ ఫర్ ఎనర్జీ సేక్ యు హావ్ టు డ్రింక్ డియర్...” ఇద్దరికీ చెరో పాల  గ్లాసూ తెచ్చి అందించింది వినత. వాళ్ళు ఇబ్బందిగానే తాగేశారు.

“వదినా, కూరలు ఏం చేయించను? మీరేం తింటారు? అత్తయ్య గారికి ఏం వండించాలి?” అవంతిని అడిగింది వినత.
అవంతి వివరంగా చెబుతూ ఉంటే జాగ్రత్తగా విని సావిత్రికి చెప్పింది వినత. విమలమ్మ సావిత్రికి సాయంగా వంటింట్లో పని చేస్తోంది.
వినతను చూస్తూంటే ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతున్నాయి సుగుణమ్మకు. ఎంతో బాధ్యతగా మసలుకుంటున్న వినతను చూస్తూంటే అబ్బురంగా అనిపించింది... ఇది ఇలాగే కొనసాగితే ఎంత బావుంటుందో అనుకుంది మనసులో...

ఇదివరకట్లా తన దగ్గర చేరి గారాబాలు పోవటం లేదు... ఆడబడుచు మీద ఈర్ష్యా దృక్కులు లేవు... అత్తగారికి అలా అయినందుకు ఎంతో బాధపడుతూ, బాధ్యత గల ఇంటి కోడలుగా అటూ ఇటూ తిరుగుతోంది...

కాసేపటి తర్వాత, తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది వినత.

“నీ ట్రిప్ అంతా బాగా జరిగిందా విన్నూ?” అడిగింది సుగుణమ్మ...

“ఫర్వాలేదు అమ్మా... కానీ పవన్ వద్దంటున్నా  అనవసరంగా వెళ్లాను... వెళ్ళగానే అత్తయ్యగారు సిక్ అయ్యారు...” దిగులుగా అంది వినత.

“అన్నయ్య బాగున్నాడా? బాబు ఎలా ఉన్నాడు? మధుబాల బాగుందా?” అడిగింది గబగబా...

“అందరూ బాగానే ఉన్నారు విన్నూ... అన్నయ్య ముంబై వెళ్ళాడు, ఏదో ట్రైనింగ్ ఉందని...”

“అమ్మా... నీతో కాస్త పర్శనల్ గా మాట్లాడాలి... ఒకసారి అలా నా గదిలోకి రామ్మా...” రహస్యంగా చెప్పి తాను  ముందుగా గదిలోకి వెళ్ళింది వినత.

‘హు, దీనిలో మార్పు రావటం కల్ల! మళ్ళీ ఏవో నేరాలూ, చాడీలు చెబుతుంది కాబోలు...’ దీర్ఘంగా నిట్టూర్చి కూతురి వెనకాలే వెళ్ళింది సుగుణమ్మ.

తల్లి రాగానే తలుపులు దగ్గరికి వేసి, ఆవిడ భుజమ్మీద తల పెట్టుకుని, “నాకు చాలా భయం వేస్తోంది అమ్మా...” అంది వినత గద్గద స్వరంతో. సుగుణమ్మ మనసు ద్రవించింది... కూతుర్ని గుండెలకి హత్తుకుంటూ, “ఎందుకురా? ఎందుకు భయం?” అన్నది అనునయంగా...

“పవన్ కి చాలా కోపంగా ఉందమ్మా... నాతో మాట్లాడటం లేదు... నేను కాఫీ తెచ్చిస్తే తాగటం లేదు... నేను అతనికి ఇష్టం లేకుండా టూర్ కి వెళ్ళటం నిజంగా తప్పే... అప్పుడు నాకు తెలియలేదు... హాస్పిటల్ లో తన తల్లి చావు బతుకుల మధ్య ఉంటే ఒక్కడూ... ఒక్కడూ ఆ నరకాన్ని అనుభవించాడు అమ్మా... నేను పక్కనుంటే బాగుండని అనుకుని ఉంటాడు కదా... అతను ఆ బాధలో ఉంటే, నేను జాలీగా, హాయిగా స్నేహితులతో షికార్లు చేసి వచ్చాను! ఎందుకమ్మా నేను ఇలా అయ్యాను? నాకు... నాకు... మొట్ట మొదటి సారిగా చాలా గిల్టీ గా అనిపిస్తోంది అమ్మా...” వినత కళ్ళనుండి కన్నీరు కాలవలు కట్టింది.

“ఛ, ఊరుకో విన్నూ... నిజానికి నువ్విలా అవటంలో నా పాత్ర కూడా చాలానే ఉందిరా... చిన్న పాపవి అని గారాబం చేసి, నువ్వు అడిగిందీ, అడగందీ కూడా ఇచ్చే దాన్ని... అక్కనీ, అన్నయ్యనీ కూడా నిన్ను బాగా చూసుకోవాలని చెపుతూ, నీ కోసం  కొండ మీది కోతిని కూడా తెచ్చి ఇవ్వాలని ప్రయత్నించే దాన్ని... మీ నాన్న నీ మూర్ఖపు పట్టుదలకి, మొండితనానికి విసుక్కుంటున్నా, నిన్ను మందలించినా నేను వెనకేసుకు వచ్చే దాన్ని...  సరే, అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు నీకే తెలుస్తోంది కదా విన్నూ...  పవన్ మళ్ళీ మామూలుగా అవుతాడు లే... భయపడకు...” అంది కూతురి వెన్ను రాస్తూ...

“వినతా...” అవంతి పిలుపు వినబడటం తో, “సరేనమ్మా... నువ్వు నా వెనకాల రా...” అంటూ గబగబా ముఖం వాష్ చేసుకుని, తుడుచుకుంటూ, తలుపులు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది వినత... ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుకగా మారుతున్న కూతుర్ని చూస్తూ ఆనందంగా నిట్టూర్చింది సుగుణమ్మ.

***

“అత్తయ్యా, ఎలా ఉంది పెద్దమ్మ గారికి?” అత్తగారికి ఎదురేగుతూ అడిగింది మధుబాల.

“ఫర్వాలేదు మధూ... గండం గడిచింది... బాబేడీ? పడుకున్నాడా?”

“ఇప్పటివరకూ పాలుతాగి ఇప్పుడే పడుకున్నాడు అత్తయ్యా... వినత ఎలా ఉంది? పవన్ అన్నయ్య బాగున్నారా? అవంతి అక్కయ్య గార్ని మనింటికి రమ్మని పిలిచారా?”

“లేదమ్మా... ఇప్పుడు వాళ్ళు కాస్త ఇదిగా ఉన్నారు కదా... అందులోంచి బయటకు రానీ... అవంతి నెలా పదిహేను రోజులు ఉంటుంది... పిలుద్దాములే... నా భోజనం అయిపోయింది అక్కడే... నువ్వు తిన్నావా అమ్మా?”

“లేదు అత్తయ్యా, మీరు వచ్చాక తిందామని తినలేదు ఇంకా...”

“అయ్యో, బాగా ఆలస్యం అయిందిగా?  తినేయమ్మా... నేను బాబు దగ్గర కూర్చుంటాను...” కోడలితో చెప్పింది సుగుణమ్మ.

***

ఆరోజు పగలంతా ట్రైనింగ్ క్లాసులు అయ్యాక, సాయంత్రం ఆరు గంటలకి రూమ్ కి తిరిగి వచ్చారు కార్తీక్, వేణుగోపాల్.

“మీరు ఎక్కడికీ వెళ్ళరుగా?” అడిగాడు కార్తీక్...

“ఉహు, ఈ ట్రాఫిక్ లో ఎక్కడికి వెళతాం? అయినా రూమ్ లోనే చాలా ప్లెజంట్ గా ఉంది... లైక్ టు హావ్ అ కప్ ఆఫ్ టీ!” అన్నాడు వేణుగోపాల్.

“అలాగే, ఆర్డర్ చేస్తాను... ఫ్రెష్ అయి రండి, నెక్స్ట్ నేను వెళతాను...” అన్నాడు కార్తీక్ టీవీ ఆన్ చేసి ఛానల్స్ తిప్పుతూ...
ఇద్దరూ ఫ్రెష్ అయి టీ తాగి రిలాక్స్డ్  గా కూర్చున్నారు.

“మధుబాల గారు బాగున్నారా? మీకు ఒక బాబు అనుకుంటా కదా? పేరేం పెట్టారు?” ఆసక్తి గా అడిగాడు కార్తీక్. ఉన్నట్టుండి వేణుకు  గుర్తు వచ్చింది బాబును ‘బాబీ’ అని పిలుస్తున్నామనీ, ఇంకా పేరేమీ పెట్టలేదనీ... అంతే కాదు, మధుబాలను దూరం చేసుకున్నందుకు కలిగిన బాధతో అతని ముఖం మ్లానమైంది...

“మధుబాల, బాబు బాగానే ఉన్నారు కార్తీక్... చాలా రోజులు ఒకరికొకరు దూరంగా ఉన్నాము... ఈ మధ్యే అంటే ఓ పదిహేను రోజుల క్రితం తను మళ్ళీ ఇంటికి వచ్చింది బాబుతో...” చెప్పాడు వేణు.

“ఓహ్, ఏమైంది? ఏమైనా అపార్థాలా? సారీ, ఇది మీ పర్శనల్ అని తెలుసు అనుకోండి... మీ పెళ్ళికి మేము వచ్చినప్పుడు ఇద్దరిదీ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ జంట అని మురిసిపోయింది ఐశ్వర్య... నిజానికి మీరిద్దరూ అలాగే ఉంటారు...” బాధగా తలపంకించాడు వేణు.

“ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు కార్తీక్... మనం భార్యలను చాలా ప్రేమిస్తామని అనుకుంటాము కానీ, వాళ్ళను కన్నా మనం మన ఈగోలను ఎక్కువగా ప్రేమిస్తాము... మన స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తాము... అక్కడే మన వాళ్ళను దూరం చేసుకుంటాము...”

“ఊ...” సాలోచనగా అన్నాడు కార్తీక్.

“ఇప్పుడు తను మళ్ళీ ఇంటికి వచ్చింది... కానీ కేవలం  లోకం కోసమో, వాళ్ళ నాన్నగారి కోసమో, బాబు కోసమో... అంతే... నాకోసం మాత్రం కాదు... అసలు నాకోసం తను రావాలన్నది నా దురాశే... మా ఇద్దరి మధ్యా ఇప్పుడు ఏ అనుబంధం లేదు కార్తీక్... ఆమె మనసులో కొండంత బాధ, అంతులేని ఆవేదన నేనే కలిగించాను... ఇప్పుడు నేను ఎంత  బాధపడినా దానిని తొలగించలేను... అందుకే అంటారు, ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’ అని... ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక కప్పు కింద తలదాచుకున్న బాటసారులం మేమిప్పుడు...”

“మీ మధ్య ఉన్న దూరాన్ని తొలగించటానికి మీ వంతుగా మీరు కృషి చేయండి వేణూ... అపార్థాలు నల్లమబ్బుల్లాంటివి... కురిసే వరకే వాటి ప్రతాపం... తరువాత ఆకాశం నిర్మలంగా మారిపోతుంది కదా....”

“మీరు వాడిన పోలిక బాగుంది... కానీ నిజజీవితంలో అది అంత తేలిక కాదు కార్తీక్... దానికి కాలమే అతుకులు వేయాలి!”

“ఇంతకూ మీ అబ్బాయి పేరు చెప్పలేదు...”

“బాబీ అని పిలుస్తున్నాము... అసలు పేరు ఇంకా పెట్టలేదు...

“హహ, అదేమిటి?” నవ్వాడు కార్తీక్.

“అదంతే మరి! ఆ ఘడియ ఇంకా రాలేదు...” తనూ నవ్వాడు వేణు.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam