Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

 

డబ్బు...  ఈ  ప్రపంచంలో ఎన్నో సమస్యలని పరిష్కరించగలదు! ఎన్నో సమస్యలని... సృష్టించగలదు కూడా !!

****

కంప్యూటర్ ముందు కూర్చుని, కీ బోర్డు మీద ఉంచిన అతడి చేతి వేళ్ళు చిన్నగా ఒణుకుతున్నాయి.  ఏదో  విషయం మీద అంతర్మధనం చెందుతున్నట్టుగా అతడి పెదవులని పళ్ళు నొక్కుతున్నాయి.  చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ  గూగుల్ లోని  సెర్చ్ బార్లో  ఒణుకుతున్న చేతులతో ఒక  వాక్యాన్ని టైపు చేసాడు.

“హత్య చేసి సులువుగా తప్పించుకోవడం ఎలా?”

వాక్యం టైపు చేసి ఎంటర్ బటన్ నొక్కగానే తెర మీద ప్రత్యక్షమైన రకరకాల వెబ్ సైట్లని వివిధ టాబ్స్ లో ఓపెన్ చేసి  చేసి చదవడం మొదలు పెట్టిన అతడి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. "

నీతో శారీరిక సంబధం ఉన్న మనిషిని ఎప్పుడూ మర్డర్ చెయ్యాలనుకోకు. చేసినా, ఆ వ్యక్తికి వేరే ఇతర వ్యక్తులతో కూడా సంబధాలుండేలా చూసుకో. ఆ ఇతర వ్యక్తులకి  నీకన్నా  నేర చరిత్ర ఉండాలన్న సంగతి గుర్తుంచుకో”

మొదటి వాక్యం చదవగానే ఆ సైట్లో ఉన్న సమాచారం ఆసక్తికరంగా అనిపించింది. బ్రౌజర్ లో మిగిలిన ట్యాబ్స్ ని మూసేసి ఒక సారి చుట్టు పక్కల చూసి, తిరిగి ఆ సైట్లో కనిపిస్తున్న సూచనలని చదవసాగాడు.

“మర్డర్ చేసేటప్పుడూ, శవాన్ని మాయం చెయ్యడానికి వెళ్ళేటప్పుడూ సెల్ ఫోన్ తీసుకు వెళ్ళకు. అత్యవసరమైతే  ఆ సెల్ ఫోన్ ని క్యాష్ పేమెంటు ద్వారా ఒక బిజీ స్టోరులో తీసుకో (లేదా దొంగిలించిన సెల్ ఫోన్ ని వాడు)

మర్డర్ చేసే సమయంలో పెనుగులాట జరిగితే శవం తాలూకు గోళ్లని శుభ్రం చెయ్యాలని మర్చిపోకు. శవాన్ని  మాయం చెయ్యాలనుకుంటే, ముక్కలు చేసి పారేయడం మంచి  పద్దతి”

భయంతో నోరు తడారి పోగా, ఒక్కసారి గుటక మింగి మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు.

“శవాన్ని , హత్యాయుధాలని నదిలో పారేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. వాటిల్లో శవం డి కంపోజ్ అయ్యినప్పుడు వచ్చిన గ్యాస్ పేరుకుని తొందరగా నీటి పైకి తేలే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్ వల్ల శవం కూడా తొందరగా పాడవదు.  అది ప్రమాదకరం. ప్లాస్టిక్ బ్యాగ్ కన్నా గోను సంచిలు వాడడం మంచిది.  శవాన్ని కట్టిన బ్యాగుల మీద సూపర్ బజార్ల పేర్లు ఉండకుండా చూసుకోవాలి. అలాంటి పేర్ల ఆధారంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ సులభం అవుతుంది. శవాన్ని పాతిపెట్టేటప్పుడు సున్నపు రాళ్ళని దానితో ఉండేట్టు చూసుకోవాలి. సున్నపురాళ్ళు శవాన్ని తొందరగా డి కంపోజ్ అయ్యేట్టు చేస్తాయి. శవాన్ని మినిమం ఐదు అడుగులు లోతులో వున్న గోతిలో పాతి పెట్టాలి. లేకపోతే పోలీసు కుక్కలు  వాసన పసిగట్టే అవకాశం ఉంది.

వీలైతే  హత్యా ప్రదేశంలో ఆధారాలు దొరకకుండా తగలపెట్టడం మంచి పద్దతి. హత్యా ప్రదేశంలో నిప్పు పెట్టవలసి వచ్చినప్పుడు ఫర్నీచర్ని అంటించడం కన్నా  కర్టెన్లనీ బెడ్ షీట్లనీ అంటించడం మంచిది. అవి తొందరగా అంటుకుంటాయి. ఒక వేళ కారులో హత్య చేస్తే, కారుని తగలబెట్టడం మాత్రం అనుకున్నంత సులభం కాదు. దానికన్నా, నదిలోకి తోసెయ్యడం మంచిది”

అరచేతులకి పడుతున్న చెమటలని తుడుచుకుని తిరిగి చదవడం మొదలు పెట్టాడు.

“హత్య జరిగిన రోజు బలమైన ఎలిబీ ఉండేలా చూసుకోవడం అవసరం. ఒకవేళ పోలీసులు అనుమానించినా కూల్ గా ఉండడం అవసరం. అవసరమైతే  ఒక పెగ్గు వెయ్యడం ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి.

పోలీసులని, డిటెక్టివ్ లనీ తక్కువగా అంచనా వెయ్యకూడదు.  హంతకుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా,  కేసుని ఎంతగా తప్పుతోవ పట్టించాలని ప్రయత్నించినా,  వాళ్ళ అనుమానం ఎలాగోలా నేరుగా అసలైన హంతకుడి మీదకే వస్తుంది. వాళ్ళకుండే శక్తి అది.  అలా అనుమానం నీ మీదకి తిరగ్గానే ఖంగారు పడకూడదు. పోలీసుల లై డిటెక్టర్ టెస్టులో ఫెయిలనా కూడా నువ్వు నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఫెయిలయినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు.  నువ్వు నెర్వస్ అవడం వల్ల ఫెయిలయ్యావని  వాదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మొదట చెప్పిన కథకి కట్టుబడి ఉండాలన్న సంగతి మర్చిపోకూడదు”

అతడు ఆసక్తిగా చదువుతుంటే ఉన్నట్టుండి కరెంటు పోయింది.  యు.పి.ఎస్. కనెక్షన్ లేని  కంప్యూటర్ కూడా ఆగిపోయి చుట్టూ గాఢాంధకారం అలముకుంది.

“ఛీ... ఈ పల్లెటూర్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు...” విసుక్కున్నాడు అతడు.  కరెంటు పోవడం వల్ల ఆ  వెబ్ సైట్ లో  ఉన్న ఒక ముఖ్యమైన సూచనని అతడు చదవలేకపోయాడన్న సంగతి అతడికి తెలియదు.

ఆతడు చదవలేకపోయిన ఆ  ముఖ్యమైన ఆఖరి సూచనః  హత్య చేసే ముందర హత్య ఎలా చెయ్యాలీ, శవాన్ని ఎలా మాయం చెయ్యాలి అన్న విషయం మీద ఇంటర్నెట్ లో ఏదీ చదవద్దు.  నువ్వు బ్రవుజింగ్ హిస్టరీ చెరిపేసినా,  దాన్ని పట్టుకోవడం కంప్యూటర్ ఫోరెన్సిక్ నిపుణులకి క్షణాల మీద పని!!

*****

ముంబై లోని ఇంపీరియల్ టవర్స్ లోని నాలుగో అంతస్థులోని ఒక అధునాతనమైన  ఫ్లాటుః   

తెల్లవారు ఝామున నాలుగున్నర గంటల సమయం... మెత్తటి కుషన్ బెడ్ మీద నిద్రిస్తున్న పాణికి అలారం మోతతో మెలకువ వచ్చింది.  కళ్ళు తెరిచి చూసాడు కానీ కదలలేక పోయాడు. కారణం అతడి  భార్య అంజలి అతడి మెడ చుట్టూ చెయ్యి వేసి అతడి తలని గట్టిగా తన వైపు హత్తుకుని పడుకుని ఉంది. 

ఆమె చేతిని  నెమ్మదిగా తప్పించి కొంచెం పైకి లేచి, ఆమెకి నిద్రాభంగం కాకుండా మొదట మోగుతున్న అలారాన్ని ఆపు చేసాడు.  ఆ తరువాత  కప్పుకున్న రజాయిని తొలగించి  పైకి లేవడానికి ప్రయత్నించాడు.  రజాయి తొలగగానే పక్కనే పడుకున్న అంజలి రూపం నడుము పైనుంచి నగ్నంగా కనిపించింది. అతడి ఒంటి మీద కూడా నామ మాత్రపు ఆచ్చాదన మాత్రమే ఉంది.  అతడికి  అప్రయత్నంగా రాత్రి ఆమె చేసిన అల్లరి గుర్తొచ్చి  నవ్వొచ్చింది.

ఆమె ఒంటి మీద నిండుగా రజాయి కప్పి, తను నైట్ గౌన్ వేసుకుని వాష్ రూమ్ లోకి వెళ్ళాడు.  ముఖం కడుక్కుని  కిచెన్లోకి వెళ్ళాడు.  రోజూ తెల్లవాఝామునే  లేవడం అతడి అలవాటు. అంజలికి మాత్రం ఏడున్నరకి కానీ నిద్ర లేచే అలవాటు లేదు.  పాణికి నిద్ర లేవగానే కాఫీ కావాలి. అందుకే అంజలి రాత్రే కాఫీ కలిపి  ఫ్లాస్క్‍లో పోసి పెడుతుంది.  కిచెన్లో ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న ఫ్లాస్కులోని కాఫీని కప్పులో ఒంపుకుని తన ఆఫీసు గదిలోకి వెళ్ళాడు అతడు. 

అతడు నగరంలో ఈగల్స్ ఐ అనే డిటెక్టివ్ ఏజన్సీ రన్ చేస్తున్నాడు. ఆధునిక జీవితంలో  మనుషులకి ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది.  నమ్మకం కన్నా, తర్కమే మనుషుల్ని నడిపించే సాధనం కావడంతో, ముఖ్యంగా ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాలలో  డిటెక్టివ్ ఏజన్సీల వ్యాపారం బాగా పుంజుకుంది.  

వ్యాపార సంస్థలే కాదు, సామాన్య కుటుంబీకులు కూడా  పెళ్ళి నిశ్చయమైన సందర్భాల్లో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు గురించి ప్రి మారిటల్ ఎంక్వైరీలకీ, పెళ్ళైన వాళ్ళు భాగస్వామి ప్రవర్తన మీద అనుమానం వస్తే పోస్ట్ మారిటల్ ఎంక్వైరీలకూ , పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ కుటుంబంలో టీనేజ్‍లో ఉన్న తమ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచడం లాంటి చిన్న చిన్న అవసరాలకి కూడా డిటెక్టివ్ ఏజన్సీల మీద ఆధారపడడం మామూలైపోయింది.  

కంప్యూటర్ ఆన్ చేసి, అలవాటు ప్రకారం మెయిల్స్ తెరిచి  చదవసాగాడు పాణి కాఫీ త్రాగుతూ.   ముందుగా తన అసిస్టెంట్ల నుంచి వచ్చిన మెయిల్స్ చూసాడు.  వాళ్ళు  రెగ్యులర్‍గా పంపించే వెరిఫికేషన్ రిపోర్టులూ, డ్యూ డెలిగెన్సు రిపోర్టులూ  చూసి,   సంబధిత క్లయింట్స్ తాలూకు ఫోల్డర్ల లోకి బదిలీ చేసాడు  వాటిని తన రిమార్క్సు తో వాళ్ళకి పంపించడానికి వీలుగా.

తరువాత  క్లయింట్లు ఎలక్ట్రానిక్ పేమెంట్ల ద్వారా తన ఫీజులు చెల్లించి పంపిన రిసీట్లని అక్కౌంట్స్ ఫోల్డర్ లోకి కాపీ చేసి రిలాక్సవుతుండగా, అప్పుడు కనపడింది తెలియని వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన  ఒక కొత్త మెయిల్.    ఆ మెయిల్ తెరిచి చదవడం మొదలు పెట్టాడు.

“డిటెక్టివ్ పాణి గారికి,

నమస్కారం...      నా పేరు రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ.   సిర్నాపల్లి రాజ సంస్థానానికి ఏకైక వారసుడిని...” 

ఆ పేరు చదవగానే పాణికి ఏదో తెలియని ఆసక్తి కలిగింది.  అప్పటిదాకా క్యాజువల్ గా  మెయిల్ చదువుతున్నవాడల్లా అలర్టై ముందుకు వంగి ఉత్సుకతతో చదవడం మొదలు పెట్టాడు.

(అసలు రహస్యం ఏమిటి?... వచ్చేవారం)  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్