Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ తో ఇంటర్వ్యూ

interview with anupama parameshvaran

నాకూ బోలెడ‌న్ని ప్రేమ‌క‌థ‌లున్నాయి - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

గ్లామ‌ర్ భామ‌ల విష‌యంలో తెలుగు తెర‌కు కొద‌వ లేదు. కాక‌పోతే కాస్త న‌టిస్తూ, అందంగా క‌నిపిస్తూ, చిన్న చిన్న మూమెంట్స్‌తోనే మన‌సుని మెలిక‌లు తిప్పించే భామ‌లు అరుదు. అందాన్ని ప‌క్క‌న పెట్టి కేవ‌లం అభిన‌యంతో నెగ్గుకు రాగ‌ల‌రు అనే న‌మ్మ‌కం ఇచ్చిన క‌థానాయిక‌లు చాలా చాలా త‌క్కువ‌. అయితే.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని చూస్తుంటే ఆ న‌మ్మ‌కం క‌లుగుతోంది. అ.ఆతో గ‌య్యాళి పాత్ర‌లో మెరిసింది అనుప‌మ‌. ఇప్పుడు ప్రేమ‌మ్‌లోనూ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకొంది. ఇప్పుడు శ‌త‌మానం భ‌వ‌తి సినిమా కోసం శ‌ర్వానంద్‌తో జ‌త క‌ట్టింది. ఈ సంద‌ర్భంగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో గో తెలుగు చేసిన చిట్ చాట్ ఇది. 

* హాయ్ అనుప‌మ‌..
- హాయ్‌..

* ప్రేమ‌మ్ విజ‌యాన్ని బాగా ఆస్వాదిస్తున్నారా?
- చాలా... చాలా.. ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్‌. మ‌ల‌యాళంలో ఈ సినిమా చేస్తున్న‌ప్పుడే ఆ క‌థ‌తో, నా పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోయా. ఈ సినిమాని ఏ భాష‌లో రీమేక్ చేసినా, మేరీ పాత్ర‌లో నేనే న‌టించాలి అన్నంత స్వార్థం పెరిగింది. తెలుగులో రీమేక్ చేయ‌డం, మేరీ పాత్ర నాకే ద‌క్క‌డం, ఆ సినిమా కూడా బాగా ఆడ‌డం.. ఇవ‌న్నీ గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి.

* తెలుగులో మీ ప్ర‌యాణానికి మంచి టేకాఫ్ దొరికిన‌ట్టే క‌దా?
- ఇంకా అనుమానం ఎందుకు?  ఎలాంటి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకొన్నానో అలాంటి సినిమా ద‌క్కింది. ఇంత‌కంటే ఏం కోరుకోను?

* అ.ఆలో మీ పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు క‌దా.. ఆ సినిమా ఎందుకు ఒప్పుకొన్న‌ట్టు?
- ప్రాధాన్యం లేద‌ని ఎందుకు అనుకొంటున్నారు?  క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర‌లో నాదీ ఒక‌టి. పైగా.. ఆ సినిమాలో నా పాత్ర‌ని ఒక్క‌సారి గుర్తు చేసుకోండి. సాధార‌ణ‌మైన అమ్మాయినా?  ఓ అమ్మోరు టైపు పాత్ర నాది. ప్రేమించిన వ్య‌క్తికి మ‌రొక‌రితో పెళ్ల‌వుతున్నా.. హాయిగా ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుంటా. అలాంటి టిపిక‌ల్ పాత్ర‌లు అంద‌రికీ దొరుకుతాయా?

* ఈ రెండు సినిమాల‌తో ఏం నేర్చుకొన్నారు?  టాలీవుడ్ ఎలా అనిపిస్తోంది?
- హార్డ్ వ‌ర్క్ చేస్తే త‌ప్ప‌కుండా ఫ‌లితం వ‌స్తుంది. ఈ విష‌యం నా రెండు సినిమాలూ నిరూపించాయి. ప‌నిని ఆస్వాదిస్తూ చేయ‌డంలో ఓ ఆనందం ఉంటుంది. అది హిట్ అయిన సంతోషం కంటే ఎక్కువ‌. ఇక టాలీవుడ్ గురించంటారా.. ఇక్క‌డంతా బాగానే ఉంది. అయితే ఎవ్వ‌రితోనూ పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేవు. ఎందుకంటే షూటింగ్ అవ్వ‌గానే ఫ్లైట్ ఎక్కేస్తా. మ‌ళ్లీ షూటింగ్ అంటే.. అక్క‌డ నుంచి ఇక్క‌డికి వ‌స్తా.. ఎవ్వ‌రి గురించీ పెద్ద‌గా తెలీదు.

* క‌నీసం తెలుగు సినిమాలైనా చూస్తున్నారా?
- ఓ.. చాలా. ఈమ‌ధ్యే జ‌న‌తా గ్యారేజ్ చూశా. త‌ణుకులో శ‌త‌మానం భ‌వతి షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ అయ్యింది. మా టీమ్ తో క‌ల‌సి థియేట‌ర్లో ఈ సినిమా చూశా.

* తెలుగులో మ‌ల‌యాళీ భామ‌ల తాకిడి ఎక్కువ‌య్యింది. ప్ర‌త్యేక‌మైన కార‌ణాలున్నాయా?
- తెలుగులో అవ‌కాశాలు ఎక్కువ‌. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ది. అంద‌రికీ కావ‌ల్సిన‌న్ని అవ‌కాశాలొస్తాయి క‌దా?  అందుకే అంద‌రి చూపూ ఇటు వైపు ఉంటుంది. మ‌ల‌యాళం అని కాదు.. అన్ని భాష‌ల నుంచీ ఇక్క‌డికి క‌థానాయిక‌లు వ‌స్తున్నారు క‌దా?

* తెలుగులో పారితోషికం ఎక్కువ ఇస్తారు.. అదీ ఒక కార‌ణం అనుకోవొచ్చా?
- మిగిలిన క‌థానాయిక‌ల మాట నాకు తెలీదు. నేనైతే పారితోషికం కోసం రాలేదు. తెలుగులోనూ న‌టిగా నిరూపించుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నా.

* ఓ సినిమా ఎప్పుకొనేట‌ప్పుడు ఏయే అంశాల‌కు ప్రాధాన్యం ఇస్తారు?
- నా పాత్ర నాకు ఛాలెంజ్ అనిపించాలి. నూటికి నూరు శాతం కొత్త‌గా లేక‌పోయినా.. క‌నీసం 20 శాత‌మైనా నేను కొత్త‌గా ట్రై చేయ‌డానికో, నేర్చుకోవ‌డానికో ఏదోటి క‌నిపించాలి. అలాంటి పాత్ర‌లే చేస్తా.

* తెలుగు నేర్చుకొంటున్నారా?
- ఇప్పుడే మొద‌లెట్టా. అర్థం అవుతోంది.. తిరిగి అదే స్థాయిలో మాట్లాడ‌లేను. త్రివిక్ర‌మ్ గారి బ‌ల‌వంతంపై అఆ కోసం నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పా. చందూ సార్ కూడా.. నువ్వే డ‌బ్బింగ్ చెప్పాలి అన్నారు. అలా.. ప్రేమ‌మ్‌కీ డ‌బ్బింగ్ చెప్పాల్సివ‌చ్చింది.  

* ప్రేమ‌మ్‌లా మీకూ ప్రేమ‌క‌థ‌లున్నాయా?
- ప్రేమ అని తెలియ‌న‌ప్పుడు ఓ ఆక‌ర్ష‌ణ‌కు లోన‌వుతాం క‌దా?  అలాటి క్ర‌ష్‌లు నాకూ చిన్న‌ప్పుడు బోలెడ‌న్ని ఉన్నాయి. ప్ర‌స్తుతానికైతే అలాంటి ధ్యాస లేదు.

* రెండు సినిమాల్లోనూ ప‌ద్ద‌తిగా క‌నిపించారు..  గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు మీరు సిద్ద‌మేనా?
- గ్లామ‌ర్ అంటే నా దృష్టిలో అర్థం వేరు. పాత్ర అందంగా క‌నిపించాలి. దాంతో పాటు హుందాగా ఉండాలి. ద‌ర్శ‌కుడు మ‌న‌సులో ఏం అనుకొని ఆ పాత్ర‌ని రాసుకొన్నారో నేను గ్ర‌హించి, ఆ పాత్ర‌కు నేను స‌రిపోతాన‌నుకొంటే ఎలా క‌నిపించ‌డానికైనా సిద్ద‌మే. అయితే.. కేవ‌లం గ్లామ‌ర్ తోనే ప‌రిశ్ర‌మ‌లో నెగ్గుకు రాలేం. న‌టిగా నాకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన పేరు తెచ్చుకోవాల‌ని ఉంది.

* ప‌రిశ్ర‌మ‌లో గురువు ఎవ‌రూ లేరా?
- తెలుగులో త్రివిక్ర‌మ్ గారికి ఆ స్థానం ఇచ్చా. ఎందుకంటే నేను ఎలాంటి సినిమాలు చేయగ‌ల‌నో, ఏ పాత్ర‌లు నాకు బాగా న‌ప్పుతాయో... ఆయ‌న‌కు బాగా తెలుసు. వాటి గురించి మేం చాలా సంద‌ర్భాల్లో మాట్లాడుకొన్నాం. ఆయ‌న సూచ‌న‌లు, స‌ల‌హాలు ఎప్ప‌టికీ గుర్తుంటాయి.

* అగ్ర‌హీరోల‌తో సినిమాలెప్పుడు?
- చూడాలి.  ఇప్ప‌టికిప్పుడు నేనంటే ఏమిటో చాటి చెప్పుకోవాలన్న తొంద‌ర లేదు. ఏ టైమ్‌లో ఏం జ‌రుగుతుందో అదే జ‌రుగుతుంది.

* త‌దుప‌రి సినిమా?
- శ‌ర్వానంద్‌తో శ‌త‌మానం భ‌వ‌తి షూటింగ్ జ‌రుగుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ.. 

-
కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
mega star with lakshmi rai