Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/
issue183/525/telugu-serials/atulitabandham/atulitabandham/

( గతసంచిక తరువాయి) 

మనసు ఉండబట్ట లేని సుగుణమ్మ ఆరోజు వియ్యపురాలిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగిందో, వినత ఎలా ప్రవర్తించిందో వివరంగా కోడలితో చెప్పింది.

వింటున్న మధు మనసులో ఎన్నో భావాలు... వినతలో  మార్పు రావటం ఆశ్చర్యమే అయినా మంచి పరిణామమే... అయితే అది ఎప్పటికీ ఆమెలో అలా నిలచిపోతే అంతే చాలు... అనుకుంది. పైకి మాత్రం తన భావాలను వ్యక్తపరచలేదు.

“రేపు ఆదివారం నేనూ వెళ్లి చూసి వస్తాను అత్తయ్యా...” అని మాత్రం అంది.

“ఆ  టైముకి అబ్బాయి వచ్చేస్తాడు, ఇద్దరూ కలిసి వెళ్ళిరండి అమ్మా...” అంటున్న అత్తగారివైపు అదోలా చూసింది మధుబాల.

ఆ చూపులను  పట్టించుకోలేదు సుగుణమ్మ...

***

ఆఫీసులో కార్తీక్ లేకపోవటం వలన స్టాఫ్ మెంబర్స్ కి కంట్రోల్ కాస్త తప్పింది. పైగా ఇంకా సరిగ్గా పనులు ప్రారంభం కాకపోవటంతో జస్ట్ కాలేజీకి వచ్చి వెళ్లినట్టు అనిపిస్తోంది అందరికీ... ఐశ్వర్య మాత్రం కార్తీక్ అప్పజెప్పిన పనులు పూర్తి చేయటమే కాకుండా, మిగిలిన వారిని కూడా అలెర్ట్ చేస్తూ, కార్తీక్ వచ్చేసరికి కొన్ని ప్లాన్స్ రాసి ఉంచటం లో మునిగిపోయింది.

నీరజ మాత్రం ఎప్పుడూ ఫేస్ బుక్ లోనో, వాట్స్ ఆప్ లోనో మునిగి తేలుతూ ఉంటుంది. ఒక రోజు లంచ్ టైములో అడిగింది ఐశ్వర్య.

“నీరూ,ఆఫీస్ టైములో ఛాటింగ్ ఏమిటి? మనకి వైఫై ఉందని దాన్ని ఇలా దుర్వినియోగం చేయకూడదు కదా!”

నిర్లక్ష్యంగా చూసింది నీరజ.

“ఛాటింగ్ ఎవరితోనేమిటి, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తోనా?” ఈ సారి కాస్త సౌమ్యంగా, స్నేహంగా నవ్వుతూ అడిగింది ఐశ్వర్య.

“అవును ఐశూ... నాకు ఒకతనితో ఫ్రెండ్షిప్ అయింది. అతనికీ నేనంటే చాలా ఇష్టం... నన్ను ప్రేమిస్తున్నానని అన్నాడు...” కళ్ళలో మెరుపులు ముఖాన్ని కాంతివంతం చేస్తూ ఉండగా అన్నది నీరజ. ఈసారి ఆమె స్వరంలో కోపానికి బదులుగా ఉరకలు వేసే ఆనందం.

“ఓ, ఎక్కడ ఉంటాడు అతను?”

“హైదరాబాద్ లోనే... మనలాగే సాఫ్ట్ వేర్ ఇంజినీర్...”

“అవునా, పేరు?”

“శ్రీ చైతన్య... అయితే మేమింకా కలవలేదు...”

“శ్రీ చైతన్యా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే... మహేష్ బాబు ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా అతనికి?” సాలోచనగా అంది ఐశ్వర్య...

“అరె, నిజం... నీకెలా తెలుసు?” ఆశ్చర్యపోయింది నీరజ.

“నా ఫ్రెండ్ లిస్టు లో ఉండాలి... ఉండు చూస్తాను...” మొబైల్ లో ఫేస్ బుక్ ఆన్ చేసింది ఐశ్వర్య. తన ఫ్రెండ్ లిస్టు లో ఉన్న అతన్ని చూపగానే నీరజ ముఖం వాడిపోయింది...

“అయితే నీతో కూడా ఫ్రెండ్ షిప్ ఉందా అతనికి?”

“నీరూ, నాతోనే కాదు, ఇంకా నూటేభై అమ్మాయిలతో ఉంది... పైగా నాకు అతనిచ్చిన మెసేజ్ లు చూస్తావా? నేను ఎందుకులే అని ఇగ్నోర్ చేసేసాను... అసభ్యంగా లేవు కానీ, కొంచెం ఓవర్ గానే ఉంటాయి...” అంటూ మెసెంజర్ ఓపెన్ చేసి చూపించింది.

ఐశ్వర్య ఫోటోలని చూసి, ఆమె అందాన్ని పొగుడుతూ ఇచ్చిన కాంప్లిమెంట్స్, ఆమె ఫోన్ నంబర్ కావాలంటూ రిక్వెస్ట్స్, వీలుంటే యఫ్బీ స్నేహాన్ని మించి ఎక్కడైనా కలుద్దా మంటూ ప్రపోజల్స్... చాలా వరకూ ఐశ్వర్య జవాబులు మర్యాద పూర్వకంగానే ఉన్నాయి. మూడు నెలల క్రితం వరకూ మెసేజ్ లు ఇచ్చి  ఇక ఊరుకున్నాడు.

“ఇలాంటి అబ్బాయి, నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్ళి చేసుకుంటాడని అనుకోవటం అసలు కరెక్ట్ కాదు. అసలు అతని టైం లైన్ చూసావా? ఎక్కడా అతని ఫోటోలు కానీ, అతన్ని గురించిన సమాచారం కానీ లేదు. ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఫేస్ బుక్ సభ్యులే ఉన్నారు. ఒక పని చేయి నీరూ... ఈ సారి నీకు మెసేజ్ చేసినప్పుడు కలుద్దామని ప్రపోజ్ చెయ్యి. కలిసాక, అన్నీ బాగుంటే ముందుకు అడుగు వేయవచ్చు. అతనికి ఇష్టం లేకపోయినా, కలవడానికి సుముఖత చూపకపోయినా వదిలేద్దాం... ఏమంటావు?” చెప్పింది ఐశ్వర్య.

ఐశ్వర్యతో అతను చేసిన ఛాటింగ్ చూసిన తర్వాత నీరజ కళ్ళు గిరగిరా తిరిగాయి. ఆ తర్వాత వివేకంతో ఆలోచిస్తే ఐశ్వర్య చెప్పినదంతా నిజమని అనిపించింది. కానీ తన ఆశలన్నీ కల్లలై పోయినందుకు ఎంతో బాధతో ఆమె ముఖం కమిలిపోయింది.

“ఇప్పుడు ఏం చేయమంటావు ఐశూ!” అడిగింది నీరసంగా కళ్ళు నీళ్ళతో నిండిపోతూ ఉండగా...

“సింపుల్... ఓ ఆదివారం నాడు కలుద్దామని, ఫలానా చోటికి రమ్మనీ మెసేజ్ ఇవ్వు... నీతో పాటుగా నేను కూడా వస్తాను... అరె, ఇదేమిటి? లైట్ తీసుకో నీరూ... ఇవన్నీ మనసుకు పట్టించుకోకు నీరూ... నాకు నీ బాధ అర్థమౌతోంది... ఇదంతా ఒక వర్చువల్ వరల్డ్... ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అంటే నిజంగా ఫ్రెండ్స్ అవరు అన్ని వేళలా... ఎక్కడో నూటికీ కోటికీ ఓ సందర్భంలో, ఒక వేవ్ లెంగ్త్ కలిసిన మనుషులు స్నేహితులు అయితే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా చేరువ అవుతారు... అది చాలా అరుదు...

నువ్వంటే మంచి అమ్మాయివీ, సెంటి మెంటల్ గా మనసుతో ఆలోచించే దానివీ కాబట్టి కానీ, ఇదిగో ఇలా మెసెంజర్ లో అబ్బాయిల మెసేజ్ లకు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా జవాబులు ఇస్తూ, పిచ్చి పిచ్చిగా ప్రొవోక్ చేసే ఫోటోలు పెడుతూ, వాళ్ళ ఇరోటిక్ టాక్ ని ఇష్టపడుతూ, తామూ అలాగే మాట్లాడుతూ ఎంజాయ్ చేసే అమ్మాయిలూ చాలా మంది ఉన్నారు... వాళ్లకి అదొకరకం ఆట...

అసలు సోషల్ మీడియా అంటే ఒక కత్తి లాంటిది... కత్తితో పండు కోసుకోవచ్చు, పీకల్నీ తెగ నరకవచ్చు... ఇప్పుడు ఇవి అలాగే తయారు అయ్యాయి... నిజమైన స్నేహంతో ఒకరికొకరు ఆలంబన అవుతూ, సమాజసేవలో పాలు పంచుకుంటూ, సాహితీప్రస్థానంలో కలిసి మెలిసి అడుగులేస్తున్న స్నేహితులు కొందరు ఉన్నారనుకో... అలాగే, ఫేస్ బుక్ ని వాళ్ళ వాళ్ళ కెరీర్ కి ఓ సోపానంగా ఉపయోగించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకున్నవారు కూడా  ఎంతో మంది నాకు తెలిసిన వారున్నారు...

నాణేనికి మరో వైపులా ఇలాంటి వికారాలు మాత్రం ఎన్నో... సరే, నేను చెప్పినట్టు చేసి నీ భవిష్యత్తును అందంగా మలచుకో...” నీరజ భుజం తట్టింది ఐశ్వర్య.

“సరే” నని తలూపి, అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది నీరజ.

***

ఆదివారం ఉదయం పది గంటలు...

రాత్రి యు ట్యూబ్ లో ఏదో పాత సినిమా చూసి, ఆలస్యంగా నిద్ర లేచింది ఐశ్వర్య. సాధారణంగా ప్రతీ ఆదివారం ఉదయం ఏడుకల్లా లేచి స్నానాదులు కావించుకొని, ఏదో ఒక టిఫిన్ చేసుకుని అప్పుడు అమల వాళ్ళింటికి వెళ్ళటం రివాజు అయింది ఆమెకు. అమలతో, రూపతో సాన్నిహిత్యం బాగా అలవడింది. కార్తీక్ తో ఎక్కువగా మాట్లాడకపోయినా అతని ఉనికినీ, సామీప్యాన్ని, స్నేహాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది... ఆ వారానికి కావలసినంత సంతోషాన్ని గుండెల నిండా నింపుకొని, సాయంత్రం ఐదు ఆరు గంటల ప్రాంతం లో ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది.

ఈ వారం మాత్రం ఎందుకో అటు వెళ్లాలని అనిపించలేదు... అక్కడ కార్తీక్ ఉండడు కనుక అమలకు ఫోన్ చేసి తనకు వేరే పనుందనీ, రావటం కుదరదనీ చెప్పేసింది.

మధుబాల దగ్గరకు వెళ్లాలని బలంగా అనిపించింది. మధు అత్తగారింటికి వచ్చేసిందని తెలుసు, కానీ కలవటం కుదరలేదు. బాబిగాడిని చూసి కూడా చాలా రోజులు అయింది... ఉదయమే వెళ్ళటం కన్నా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వెళితే సరి... సాయంత్రం వరకూ ఉండి రావచ్చు... కానీ... అక్కడ తనను ఆదరిస్తారా? వేణుకి తానంటే ఉన్న భావన తనకు  తెలుసు... మధుతో అతను గొడవ పడటానికి ఆమె తనతో చేసిన స్నేహం కూడా ఓ కారణమని గ్రహించింది తను... అయినా వెళ్ళాలనే ఉంది...

అవును... తాను మధు కోసం వెళుతోంది... ఒక వేళ అలాంటి పరిస్థితే వస్తే, ఎక్కువసేపు ఉండకుండా మధుతో కాసేపు మాట్లాడి, బాబీని చూసి వచ్చేస్తుంది... అంతే... వెళ్లాలని స్థిర నిశ్చయం చేసేసుకున్న ఐశ్వర్య త్వర  త్వరగా వంట చేసేసుకుంది చకచకా...

మధ్యలో అన్నపూర్ణ పిన్నిగారు వచ్చి, తాను చేసిన కూరలు తెచ్చి ఇచ్చింది.  మాటల సందర్భంలో తమ పిల్లలు త్వరలో తమను చూడటానికి వస్తున్నట్టు చెప్పింది. ఆ కళ్ళలో ఎంతటి సంతోషమో... కట్టుకున్న వాడి గురించి మాట్లాడినా, కన్న పిల్లల గురించి తలచుకున్నా అతివకు ఎందుకో అంత సంతోషం... బహుశః పెళ్ళి అనే బంధంలో ఉన్న తీయదనం ఇదేనేమో మరి... తన పురుషుడు, తన సంతానం... హు... తనకి ఎప్పటికీ ఆ భాగ్యం లేదా? తింటున్న భోజనం సయించలేదు ఐశ్వర్యకు...

ఐశ్వర్య చిరునామా వెదుక్కుంటూ మధుబాల ఇంటికి వెళ్లేసరికి రెండున్నర అయింది. కావాలనే ఫోన్ చేయలేదు, సర్ప్రైజ్ ఇవ్వాలని. కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది...

“హాయ్ మధూ...” అంటూ ఆమెను చుట్టేయబోయి, తలుపు తెరిచింది మధు కాదన్న విషయం ఆఖరు క్షణంలో గ్రహించి, తనను తాను  సంబాళించుకొని, “అయ్యో, సారీ ఆంటీ!” అంది నాలుక కరచుకుంటూ...

“రామ్మా! నువ్వు?” సుగుణమ్మ అడిగింది ఐశ్వర్యను పరీక్షగా చూస్తూ...

“నా పేరు ఐశ్వర్య ఆంటీ... మధు స్నేహితురాలిని...” చేతులు జోడించి నమస్కరించింది.

ఆమె పేరు వినగానే లిప్తపాటులో చిరుచేదు భావం కదలాడింది సుగుణమ్మ మనసులో... దానిని కప్పిపుచ్చుకుంటూ, “ఓ, నువ్వేనా అమ్మా... రా... కూర్చో...” అంటూ సోఫాలో కూర్చో బెట్టి తాను ఎదురుగా కూర్చుంది.

“మంచి నీళ్ళు తాగుతావా అమ్మా?” అంటూనే లేచి, ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి, గ్లాసులో పోసి అందించింది.

“మధు మా వియ్యాలవారింటికి వెళ్ళింది అమ్మా... ఇందాకే వెళ్ళింది... ఓ గంటలో వచ్చేస్తుంది...” అని చెప్పింది సుగుణమ్మ.

ఐశ్వర్యకు నిరాశగా అనిపించింది... తన డిజప్పాయింట్ మెంట్ ముఖంలో ప్రతిఫలిస్తూ ఉండగా, “అరెరే... దానికి సర్ప్రైజ్ ఇవ్వాలని ముందుగా ఫోన్ చేయకుండా వచ్చాను ఆంటీ... బాబు బాగున్నాడా అండీ?” అని ఆరాటంగా అడిగింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam