Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bhandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/
issue183/526/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి)  

ఒక టిటెక్టివ్‍కి నేను  మెయొల్ రాయడం ఇదే మొదటి సారి. అసలు నాకు ఇలాంటి అవసరం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. సరే వచ్చింది. అందుకే రాయక తప్పడం లేదు. అయితే, నా సమస్యని పరిష్కరించడానికి మిమ్మల్లే ఎంచుకోవడానికి కారణం ముంబయిలో ఉన్న డిటెక్ట్‍వ్లందరిలోకీ మీకున్న మంచి పేరు!  మీమీద ఎన్నో ఎంక్వయిరీలు చేసిన తరువాత మాత్రమే మీకీ మెయిల్ రాస్తున్నాను. (డిటెక్టివ్‍ల మీదే డిటెక్షన్ చేసాననుకుంటున్నారా? అనుకోండి. నా అవసరం అలాంటిది మరి!). 

నా సమస్యని పరిష్కరించగల డిటెక్టివ్ తెలుగు వారైతే బాగుంటుందని అనుకున్నాను. అదృష్టవశాత్తూ మీకున్న మంచిపేరుతో పాటూ మీరు తెలుగు వారు కావడం నాకు మరింత కలిసి వచ్చినట్టనిపించి సంతోషంగా ఈ మెయిల్ రాస్తున్నాను.  నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని నమ్ముతూ, నాకు తెలిసిన ఒక రహస్యాన్ని మీతో పంచుకుంటున్నాను.  

మన దేశంలో కాలగతిన  పూర్వీకుల సంపద హరించుకుపోయి పేరుకు మాత్రమే రాచరికం మిగిలిన ఎన్నో రాజవంశాలలో మాదీ ఒకటి.  తర తరాల వారసత్వంగా సంక్రమించిన కోట, రాజరికాలు అంతమైనప్పుడు ప్రభుత్వానికి సమర్పించగా మిగిలిన  భూములు, మమ్మల్నే అంటి పెట్టుకుని మాకు సేవ చేసే పరిచారగణం ఇదీ మా సంస్థానం స్వరూపం.  అలాంటి మా సంస్థానంలో  కొద్ది కాలం క్రితం ఒక పురాతన నిధి బయట పడింది. దాన్ని ‘నిధి’ అనచ్చో లేదో నాకు తెలియదు.  దాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడు మా పూర్వీకుల ఉద్దేశం ఆ సంపదని ముందు తరాలకి అందించాలని కాదు. కనుక దాన్ని ‘నిధి’ అని చెప్పలేము. అనుకోకుండా బయటపడిన సంపద అనచ్చు.   

ఇంకా వివరంగా చెప్పాలంటే, పూర్వకాలంలో  పెద్ద పెద్ద రాజులూ, సంస్థానాధీశులూ చనిపోయినప్పుడు వారిని  వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చి పెట్టే ఆచారం ఉంది.

మా వంశీకులందరికీ డబ్బన్నా, బంగారు నగలన్నా అత్యంత ప్రీతి. అలా మా వంశీకులలో ఎవరో చనిపోయినప్పుడు వారి భౌతిక కాయంతో పాటూ పూడ్చి పెట్టిన   పెద్ద పెద్ద బంగారు నగలు కొన్ని ఇటీవల మా కోట ఆవరణలో నాకు లభ్యమయ్యాయి. సాధారణంగా తవ్వకాలలో ఇలాంటి వస్తువులు అస్థిపంజరాలతో సహా బయట పడినప్పుడు వాటిని  చనిపోయిన వారి ప్రీత్యర్ధం వారితో పాటూ పూడ్చిపెట్టిన వస్తువులుగా గుర్తించి, ఆ అచారాన్ని గౌరవిస్తూ తిరిగి అస్థిపంజరలాతో పాటూ పూడ్చి పెట్టి సమాధి కట్టడం చిన్నప్పటినుంచీ మా వంశంలో  నేను చూస్తున్న  పద్దతి.

అయితే, ఈసారి బయట పడినవి సామాన్యమైన నగలు కాదు. నిపుణులతో రహస్యంగా పరీక్షింప చేయగా తెలిసినదేమిటంటే  అవి ప్రపంచంలోనే అతి అరుదైన వజ్రాలతో, మణులతో చేసిన నగలు.  వారి అంచనా ప్రకారం వాటి విలువ ప్రస్తుతం సుమారుగా  రెండు వందల  కోట్లు ఉంటుంది. అంత విలువైన సంపదని కేవలం ఒక ఆచారాన్ని గౌరవించడం పేరిట, మా పూర్వీకుల ఆత్మశాంతి కోసం తిరిగి భూ స్థాపితం చెయ్యడానికి నాకు మనసు అంగీకరించడం లేదు.

సిర్నాపల్లి సంస్థానానికి ఏకైక వారసుడిగా, భూగర్భ నిధి నిక్షేపాలతో సహా  ఈ సిర్నాపల్లి  కోట మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి.  నేను ఏం చేసినా కాదనేవారు ఎవరూ లేరు.  అందుకే  దొరికిన నగలలో నామమాత్రం విలువున్న నగలని మాత్రమే  తవ్వినప్పుడు బయటపడ్డ ఆ అస్థిపంజరాలతో  పూడ్చి పెట్టి సమాధులు కట్టించాను.  కోట్ల విలువైన ఆ సంపదని భద్రంగా ఇనప్పెట్టెలో దాచి ఉంచాను.  

రాచరికాలు పోయి చాలా యేళ్ళయినా, మా పూర్వీకులు ఈ సంస్థానంలోని ఉన్న గ్రామాలకి చేసిన సేవల వల్ల ఇప్పటికీ మమ్మల్ని ఈ ప్రాంతంలో  ప్రభువులుగానే గౌరవిస్తారు.  ఒకప్పుడు ఈ సంస్థానం క్రింద ఉండే రెండొందల గ్రామాలు ప్రస్తుతం కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి.  ప్రజలు  కనీస సౌకర్యాలు లేకుండా బాధపడుతున్నారు.   ఈ సంపదతో వాళ్లకి ఏమైనా చెయ్యాలన్నది నా ఆలోచన.  సరైన ప్రణాళిక వేసి నా ఆలోచనని ఆచరణలో పెట్టేంత వరకూ ఈ నిధి గురించి కనిసం మా కుటుంబ సభ్యులకి కూడా చెప్ప కూడదనుకున్నాను.

అలాంటిది ఈ విషయాన్ని ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే,  గత కొద్దికాలంగా నా భద్రత మీద నాకు అనుమానం వేస్తోంది.  ఏదో ప్రమాదం నా వెనుక పొంచి ఉందని బలంగా అనిపిస్తోంది. అందుకే నాకు మీ సహాయం కావాలి.   మీరు ఒకసారి మా సంస్థానానికి వచ్చి, నా  అనుమానం వెనుకనున్న నిజానిజాలు నిర్ధారించి, నా ఆశయం  నెరవేరేంత వరకూ నా భద్రతా విధులు నిర్వర్తించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని నాకోరిక.  

మీకు అంగీకారమైన పక్షంలో తిరుగు మెయిల్ ఇవ్వండి. మీ ప్రయాణం ఏర్పాట్లు చేస్తాను.  మీకు ఇష్టం లేని పక్షంలో దయచేసి ఈ మెయిల్‍ని డిలీట్ చేసెయ్యండి.  మా సంస్థానంలో బయట పడ్డ సంపద గురించి ప్రస్తుతం ఎవరికీ చెప్పవద్దని మనవి. వినమ్రతతో,

రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ

మెయిల్ చదువుతున్న పాణి అందులో ఎంతగా లీనమైపోయాడంటే, చేతిలో ఉన్న కప్పులో కాఫీ చల్లారిపోయిందన్న విషయాన్ని  కూడా  గుర్తించకుండా కప్పు ఎత్తి  గట గటా తాగేసి కప్పు ఖాళీ చేసేసాడు.

కాఫీ కప్పు పక్కన పెట్టి అతడు తలెత్తేసరికి  గది గుమ్మం దగ్గర చేతిలో కాఫీ కప్పుతో అంజలి కనపడింది.  ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టై, సర్దుకుని చిన్నగా నవ్వాడు. “ఏమిటి అప్పుడే లేచావు?” అన్నాడు.

“ఎవరో ఆడ డిటెక్టివ్ మిమ్మల్ని వల్లో వేసుకుని మీతో  ఎఫైర్ నడుపుతున్నట్టు కలొచ్చి మెలకువ వచ్చేసింది”   అతడి ఎదురుగా కుర్చీలో  కూర్చుంటూ చెప్పిందామె.

ఆమె మాటలకి పాణి పక పకా నవ్వాడు “తెల్లవారు ఝామున వచ్చే కలలు నిజమౌతాయట... జాగ్రత్త!”  అన్నాడు

అంజలి సీరియస్‍గా  చూసింది అతడి వంక. జోక్‍గా నైనా సరే, అలాంటి విషయాలని భరించలేదు ఆమె. పాణికి మాత్రం తన విషయంలో ఆమె అలా ఇన్ సెక్యూర్డ్ గా ఫీలవ్వడం ఆనందాన్నిస్తుంది. భర్త తన చేతిలోంచి జారిపోతాడేమోననని భార్య ఎంతగా భయపడుతుంటే, అంతగా అమె అతడ్ని ప్రేమిస్తోందని అర్ధం.

“ఏమిటి పొద్దున్నే అంత సీరియస్‍గా చదువుతున్నారు?” అంది ఆమె మాట మారుస్తూ.

పాణి మానిటర్ ఆమె వైపు తిప్పి తనకి వచ్చిన మెయిల్ చూపించాడు.  ఆమె కాఫీ తాగుతూ మెయిల్ చదివింది.

“ఎవరీ రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ?  ఇది నిజమైన వాళ్ళు ఇచ్చిన మెయిలేనా లేక ఎవరైనా  ఆట పట్టించడానికి ఇచ్చిన మెయిలా?”   ఆలోచిస్తున్నట్టుగా అంది.

“ఆట పట్టించడానికి ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసే తీరిక, ఓపిక ఈరోజుల్లో ఎవరికీ ఉండడం లేదు” అన్నాడు పాణి.

“అయితే ఇది నిజంగా రాజ్ బహద్దూర్ రాజేంద్ర వర్మ అన్న వ్యక్తి ఇచ్చిన మెయిలేనంటారా?”  అనుమానంగా అంది అంజలి.

(అసలు రహస్యం ఏమిటి?... వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam