Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ....http://www.gotelugu.com/
issue183/524/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

( గతసంచిక తరువాయి)  

ధనుంజయుని ఛాతీ మీద అంగీని విప్పి పక్కకు తొలగించింది. పిమ్మట పసిడి గిన్నెలోని తెల్లటి పదార్థాన్ని అతడి గాయాలకు పూయటం ఆరంభించింది. అది ఏ దివ్య ఔషధమో గాని పూసిన వెంటనే గాయం మటు మాయమై పోతోంది. ఆమె పక్కన కూచుని అంతగా సేవలు చేస్తున్నా ధనుంజయునికి వెంటనే మెలకువ రాలేదు. ఆమె వెచ్చని కన్నీరు నాలుగు చుక్కలు ఛాతీ మీద స్వాతి చినుకుల్లా రాలగానే దిగ్గున మెలకువ వచ్చింది.

ఏం జరుగుతోందీ అర్థం కాలేదు.

చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు.

ఆశ్చర్యంతో అతడి కళ్ళు విశాలమయ్యాయి.

సోయగాల హరివిల్లులా వున్న లేబ్రాయపు సౌందర్య రాశి తన పక్కన కూచుని సేవలు చేస్తోంది. కన్నీరు విడుస్తోంది. అప్పటికే తన వంటి మీది గాయాలన్నీ మటు మాయమై శరీరానికి కొత్త శక్తి ఏర్పడినట్టుంది. మధిర తాగిన మత్తులో తను చూస్తున్నది స్వప్నమో, భ్రాంతియో అర్థం గాక ఆమె ముఖారవిందాన్ని అలాగే చూస్తుండి పోయాడు.

అందంలో తన ప్రియ భామలు భద్రా దేవి, ఉలూచీశ్వరిలతో పోటీ పడే అద్భుత సౌందర్య రాశి. ఇరువది వత్సరాల లేబ్రాయపు చిగురు బోణి. తాకితే కందిపోతుందనిపించే మేలిమి బంగారు దేహ ఛాయ, శంఖం లాంటి పొడవగు మెడ భాగం, ఆ కర్ణాయత నేత్రాలు, తామర తూండ్ల వంటి చేతులు, వుందా లేదా అన్పించే సన్నటి నడుము, పగడాలను పొడుము చేసి అద్దినట్టున్న పెదవులు, యవ్వనాన్ని ప్రతిఫలించే బుగ్గలు, సకలాభరణ శోభిత యగు ఆమెను చూస్తుంటే ఖచ్చితంగా ఆమె ఒక యువ రాణి అయి వుండాలని తోచింది ధనుంజయునికి. అంతే కాదు, కోటలో అడుగిడినప్పటి నుండి తనను వెంటాడిన అజ్ఞాత సుందరి కూడ ఆమేనని గ్రహించాడు. ఆమె ముఖారవిందం ఎంత చూసినా తనివి తీరదనిపించింది. అంతే కాదు, ఈ సుందరాంగిని తను ఇంతకు మునుపెన్నడూ ఎక్కడా చూసిన గుర్తే లేదు. అలాంటి అపరిచిత యగు భామా మణి తన పట్ల ఇంత అక్కర ఆపేక్ష కన పర్చటం, ఎంతో కావలసిన యువతిలా యిలా నేరుగా తన పక్క కొచ్చి కూచుని సేవలు చేయటం ధనుంజయునికి వింత గానూ ఆశ్చర్యం గాను వుంది.

కొన్ని లిప్తల కాలం తర్వాత గాని`

ధనుంజయుడు కనులు తెరిచి తననే గమనిస్తున్న సంగతి ఆమె గమనించ లేదు. వెంటనే ఆమె పసిడి బుగ్గలు సిగ్గున కెంపులు పూచాయి. తత్తర పాటుతో దిగ్గున లేవ బోయింది. చట్టున ఆమె కరము అందుకుని కూచుండ జేసాడు.

‘‘వెడలి పోకుము సుందరీ... ఇప్పుడైనను నీ వివరములు తెలియకున్న జీవితాంతము నీవు నాకు అజ్ఞాత సుందరి గానే మిగిలి పోదువు’’ అన్నాడు.

మృదువు గా చేయి విడిపించుకుందామె.

‘‘లేదు ప్రభూ. మీ పాద దాసిని, ఎలా వెళ్ళ గలను? మీ తోనే ఉంటాను.’’ అంది. వీణ మీటినట్టు మధురంగా వుంది ఆమె స్వరం.

ఆమె మాటలు ధనుంజయుని ఆశ్చర్యాన్ని మరో మెట్టు పైకి చేర్చాయి.

‘‘పరదా మాటు నుండి అక్కరగా నను వీక్షించినది నీవే కదూ?’’ అడిగాడు.

అవునన్నట్టు తల వూపింది.

‘‘ఎవరు నీవు? ఇచటందరూ నను దోషి అంటుంటే నీవు మాత్రము నను వేరుగా భావించుట వింతగా యున్నది. చూచుటకు యువ రాణి వలె ఉంటివి. పాద దాసినంటూ నను కించ పరచకు.’’

‘‘లేదు ప్రభూ. కించ పరుచుట లేదు. వాస్తవమే వచించితి. మీరు నాకు ముందే తెలియు. మీరు రత్నగిరి యువ రాజు ధనుంజయులని తెలియు. మీరే నా ప్రాణము... నా సర్వస్వముగ భావించితి’’ అంది.

ధనుంజయుడు ఉత్కంఠ భరితుడై పోయాడు. తను ఈ అంగనా మణికి తెలుసునా? ఎలా? ఆ పైన తన వివరములు కూడ చెబుతున్నదే. చూస్తుంటే తనను వరించినటు అర్థమగుచున్నది. ఏమిటీ మాయ?

‘‘అయ్యో దేవీ. నీ పలుకులు అర్థము గాకున్నవి. ఎవరు నీవు? నీ నామ ధేయమేమి?’’ లేచి తల దిండ్లను అనుకొని కూచుంటూ అడిగాడు.

ఆమె బదులు యివ్వ లేదు.

మౌనంగా లేచి వెళ్ళి జల ధారలో చేతులు శుభ్ర పరుచు కొని వచ్చి ధనుంజయుని సరసనే కూచుంది. పళ్ళెరం అందుకుంది.

‘‘మీరు ఏమియు భుజింప లేదు. ముందు భోజనము చేయండి. పిమ్మట మీ సందేహములన్నియు తీర్చ గలను’’ అంది.

‘‘నాకు ఆకలి లేదు. నీ గురించి తెలియాలె’’ అన్నాడు పట్టుదలగా.

‘‘ఆకలి ఎందుకు లేదు? ఉంది. తిన వలె’’ అంది తనూ పట్టుదలగా.

‘‘నా భోజనము పక్కన సిద్ధముగ వున్నది. చూడ నీవింకను భుజించి నటు లేదు. సుందరమగు నీ ముఖారవిందము ఒకింత వాడినది నీవు భుజింపుము.’’

‘‘అది బంధీలకు ఒసగు నాసి రకము భోజనము. మీరు తినలేరు. కాదనకండి’’ అంటూ చనువుగా ముద్ద కలిపి తనే అతడి నోటికి అందించింది. వారించ లేక పోయాడు.

అది ఏ తృణ ధ్యాముతో చేసిన వంటకమో ఏమి దినుసులు కలిపి వండి వార్చినారో గాని జీవితంలో ఎన్నడూ తిని ఎరుంగని ఓ సరి కొత్త కమ్మటి రుచితో అద్భుతంగా వుంది. ఆశ్చర్యం ఏమంటే ధనుంజయుడికి తినిపిస్తున్న అదే చేత్తో తనూ భుజించింది. అతడి ఎంగిలిని ఆస్వాదించింది. ఆ విధంగా ఆరంభమే ఇరువరి మధ్య ఓ బంధం ఏర్పడి పోయింది.

‘‘ఇప్పుడయినా నీ వివరాలు చెబుతావా?’’ భోజనానంతరం అడిగాడు.

ఆమె అతడి చేయి అందుకుని గోముగా ముద్దాడింది.

‘‘నేను బలి చక్రవర్తి దంపతుల దత్త పుత్రికను. యువ రాణి మణిమేఖలను’’ అంది. అంతే`

అదిరి పడ్డాడు ధనుంజయుడు.

‘‘ఏమంటివి? దత్త పుత్రికవా... యువ రాణివా!’’ అనడిగాడు ఉత్కంఠత భరించ లేక.

‘‘అవును. అలాగని రాక్షస వంశం కాదు నాది. నేనూ మానవినే. వైశ్య కన్యను. ప్రతి సంవత్సరము మలబారు ప్రజలు మహా బలి ఆశీస్సులు కోరి ప్రార్థనలు చేయుట మీకు తెలిసియే వుంటుంది. ఆ దినమున బలి చక్రవర్తుల వారు అదృశ్య రూపమున భూలోక సంచారము జేసి ప్రజల కష్ట సుఖములు గమనించి వలసిన వారికి తగు సాయమొనర్చి వచ్చుట పరిపాటి.

ఓసారి అలా వెళ్ళినపునడు అటవీ మార్గాన తల్లి దండ్రుల శవము వద్ద సంవత్సరం నిండని పసి బిడ్డనైన నేను ఏడ్చుచున్నానట. ధనవంతులైన వైశ్య దంపతులు నా జననీ జనకులు తమ సిబ్బందితో ఆ మార్గమున నగరమునకు పయనించగా బంది పోటు దొంగలు మా సిబ్బందిని అడ్డు పడిన నా తల్లిదండ్రులను హతమార్చి దోపిడి చేసినారట. పసి బిడ్డనని జాలి పడి నను చంపక వదిలి పోయిరట. ఆ విషయం గ్రహించిన మహా బలి నను చూచి ముచ్చట పడి జాలి గొని తన వెంట పాతాళమునకు తెచ్చి మహా రాణికి ఇచ్చినారట. అప్పటి నుండి వారే నా తల్లిదండ్రులైనారు. నను దత్తత తీసుకుని సొంత బిడ్డ వలె అల్లారు ముద్దుగా పెంచి యువ రాణిని జేసి నారు. శుక్రా చార్యుల వారి శిష్యురాలినై సకల విద్యలు అభ్యసించితి. వారి దయ వలన దైవీక శక్తులును సిద్ధించినవి.

యుక్త వయస్కురాలినయిన నా కొరకు నా జనకుడు బలి చక్రవర్తు వారు తగిన వరుని కోసం లోకాన్నీ గాలిస్తున్నారు. నాకు ఎవరును నచ్చ లేదు. నేను శివ కేశవుల భక్తు రాలను. హరుని హరిని కూడ నిత్యము ఆరాధించుదానను. నా బాధ్యతను వారికే వదిలి సరియగు పతిని చూపమని వేడుకునే దాన్ని.

ఇలా ఉండగా ఓ రాత్రి స్వప్నమందు శతాధిక వృద్ధుడైన వేణు గాన ప్రియుడగు ఓ హరి భక్తుని ధర్శించితి. చింతిల్లకు బాలిక. భూలోకమున రత్నగిరి రాజ్యానికి యువరాజు మహా వీరుడు ధనుంజయ నామధేయుడు నీకు పతి కాగల అన్ని అర్హతలు వున్న వాడు. త్వరలోనే మీ పాతాళ మరు భూమిపై కాలుమోప గలడు. అతండే నీకు తగిన వరుడు. అని జెప్పి అదృశ్యమైనాడు. పిమ్మట మరు భూమిలో గ్రుమ్మరుచున్న మిమ్ము స్వప్నమున దర్శించితి. అప్పటి నుండి మీ రాక కొరకు ఎదురు తెన్నులు చూసితి. ఇటుండ మా భటులు మిమ్ము నిందితుని జేసి సంకెళ్ళ బంధించి నడిపించుట జూచి ఆత్ర పడితి, దుఖ్ఖించితి’’ అంటూ చెమర్చిన కనులు పైట చెంగుతో వత్తుకుంది మణి మేఖల.

ఆమె చెప్పిన స్వప్న వృత్తాంతము విని ధనుంజయుడు మరింత ఉత్కంఠ భరితుడై పోయాడు.

‘‘నీ స్వప్నమందు సాక్షాత్కరించిన ఆ హరి భక్తుడు ఎటుండె? శతాధిక వృద్ధుడా... చేతిలో మురళి వున్నదా? నీల మేఘ శ్యాముడు, ఉత్సాహ వంతుడు గదూ. మెడలో పారిజాత సుమాలతో కూడిన తులసి మాల ధరించినాడు గదూ?’’ అడిగాడు.

ఈసారి మణి మేఖల అచ్చెరువొందింది.

‘‘అవును ప్రభూ... ఆయనే... మీరు ఆయన్ని దర్శించినారా?’’ అంది విభ్రాంతురాలై.

‘‘నీకు బాగా గురుతున్నాదా? ఆ స్వామి తన నామ ధేయము మాధవ స్వామియని, హరి భక్తుడనని వచించినాడా?’’

‘‘అవును. ఆయన మాధవ స్వామియట హరి భక్తుడననే చెప్పినాడు.’’

ఆ మాటలు వినగానే ధనుంజయునికి ఒకటొకటిగా అర్థం గాసాగింది. ఆలయంలో దైవ సన్నిధి లోనే ఆ ధూర్తుడు వక్ర దంతుడు తనను అపహరిస్తున్నా ఆ శివయ్య గాని ఈ వేణు మాధవుడు గాని ఎందుకు మిన్నకున్నారో ఇప్పుడు తెలిసి వస్తోంది. తనను పతాళమునకు మణి మేఖల కోసం పంపించుటకే మిన్నకున్నారు. దీనికి వక్ర దంతుడు తనకో సాధనమైనాడు. విషయం తెలీగానే ఆశ్చర్య సంభ్రమాలతో ఉక్కిరి బిక్కిరవుతూ` ‘‘అయ్యో... అయ్యో...’’ అంటూ నుదురు కొట్టుకున్నాడు ధనుంజయుడు.

‘‘హే జగన్నాటక సూత్రధారి... ఏమిటయ్యా నీ లీల. నన్నిలా ఇరికించినావేమి? అష్ట భార్యల బహు కుటుంబీకుడవని నాకును ఇటు వరుస బెట్టి వధువులను ఎంపిక జేసి వేడుక చూస్తుంటివా. ఇది యేమి చోద్యము. ఉన్న కష్టములు నాకు చాలవా?’’ అంటూ అంగలార్చాడు. నీ మాటలు వినుచున్నానులే అన్నట్టు సుదూరంలో ఎచటి నుండో మోహన రాగంలో మధురంగా విన రాసాగింది వేణు గానం.

‘‘ప్రభూ! ఏమైనది?’’ తత్తర పడుతూ అడిగింది మణి మేఖల.

‘‘ఇంకా ఏమి కావలె. స్వప్న మందు నీవు దర్శించిన స్వామి నిజముగా హరి భక్తుడు కాడు. సాక్షాత్తూ ఆ హరియే. మా ఇల వేలుపు, సదా నేను ఆరాధించు నా గురువు, దైవం, సఖుడు అతడే. ఆయనే సాక్షాత్తూ ఆ వేణు మాధవుడు. ఆ స్వామి సంకల్పం ఇప్పుడు గదా అర్థమైనది.’’ అన్నాడు. అంతే కాదు, శుక్రా చార్యుల వారి దరహాసమెందుకో, తననే నిశితంగా చూచుట ఎందుకో తెలిసి వచ్చినది. తన జాతకము ఆ పురాణాల పురుషునికి తెలియకుండునా!

మణి మేఖల ముగ్ధు రాలవుతూ`

మరింత దగ్గరగా జరిగింది.

అతడి ఛాతీ మీద వాలుతూ`

తన సొగ కనులతో అతడిని చూసింది.

‘‘చెప్పండి ప్రభూ! ఆ స్వామియే మనల కలిపినాడు. ఇక మీరే నా సర్వస్వం, నా ప్రాణం. ఈ దీనురాలిని మీ పాద దాసిగా స్వీకరిస్తారా?’’ అంటూ ఆర్తిగా అడిగింది.

ఆ ముద్ధరాలికి ఏమి సమాధానం చెప్పాలో ధనుంజయునికి అర్థం కాలేదు. ఆలోచిస్తున్నాడు. అతడి మౌనం మణి మేఖలకు బాధ కలిగించింది. ‘‘చెప్పండి ప్రభూ! నేను మీకు సరి జోడి కాదని ఒక్క మాట చెప్పండి. ఇచటనే ప్రాయోపవేశం చేసి ప్రాణ త్యాగమొనర్చెద’’ అంది కన్నీళ్ళతో.

చట్టున ఆమెను బిగి కౌగిట బంధించి`

కన్నీరు తుడిచాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్