Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue184/528/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి)  

 “లాజికల్‍గా ఆలోచిస్తే,  ఇందులో నిజా నిజాల మాట ఎలా ఉన్నా, ఇది నాకు ఎవరో ఉద్దేశ పూర్వకంగా ఇచ్చిన మెయిలే అయి ఉంటుందనిపిస్తోంది. ఒక్కోసారి డిటెక్టివ్‍లతో కొందరు ‘బ్రెయిన్ గేమ్’ ఆడుతూ ఉంటారు. ఒక కేసులో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, వాళ్ళ కాన్సంట్రేషన్ చెడగొట్టి  దృష్టిని మళ్ళించడానికి  వాస్తవాలు లేని ఒక తప్పుడు కేసు వాళ్ళ దగ్గరకి తీసుకు వస్తుంటారు. ఆ కేసులో ఉన్న గందరగోళం గురించి ఆలోచించడం వల్ల మొదటి కేసు పరిశోధన మదగింప చేయడం వాళ్ళ ఉద్దేశం”

“ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ముఖ్యమైన కేసులు ఏంటి?” అడిగింది అంజలి. పాణి మనసులో అప్పుడు తను పరిశోధిస్తున్న కేసులు మెదిలాయి. వాటిలో నిందుతులకి  తను ఆయా కేసులు పరిశోధిస్తున్నట్టు తెలిసే అవకాశం లేదు.  ఆ విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంతే కాక, తనని తప్పుదోవ పట్టించి పరిశోధనని మందగింప చేయడానికి ప్రయత్నించాల్సినంత ముఖ్యమైన, పెద్ద కేసులేమీ ప్రస్తుతం తన దగ్గర లేవు.

ఆ విధంగా చూస్తే ఈ రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ నుంచి వచ్చిన మెయిల్ లో ఎటువంటి మోసమూ ఉండి ఉండదు. ఆ మెయిల్లో రాసినది నిజమే అయి ఉండాలి. అదే చెప్పాడు ఆమెతో.

“ఎక్కడుంది ఈ సిర్నాపల్లి సంస్థానం?!” మెయిల్ ని మరోసారి పరిశీలిస్తూ అంది ఆమె.

“పేరుని బట్టి  చూస్తే తెలుగు ప్రాంతలోనే ఉండి ఉండాలి. అతడు మెయిల్ లో రాసిన దాని ప్రకారం రెండు వందల కోట్ల సంపద అతడి దగ్గర ఉండడం వల్ల  చుట్టూ ఉన్న వారు అతడికి ప్రాణ హాని తల పెట్టడంలో ఆశ్చర్యం లేదు. అయితే, కేవలం ఒక చిన్న మెయిల్ అధారంగా కేసుని  తీసుకోవాలా వద్దా అన్నది నిర్ణయించుకో లేను. అదీ కాక, ఆ కేసుని టేకప్ చెయ్యడం వల్ల కొన్నాళ్ళు ముంబయి నగరాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సి ఉంటుంది.  ఇక్కడి కేసులు డిస్టర్బ్ అవుతాయి”  అంటూ ఆ మెయిల్‍ కి ఏ రిప్లై ఇవ్వకుండా మెయిల్ బాక్స్ క్లోజ్ చేసేసి వేరే పన్లు చూసుకోవడం మొదలు పెట్టాడు.

“అదేమిటీ? డిటెక్టివ్‍వి అయి ఉండీ, ఒక విషయం గురించి పూర్తిగా నిజా నిజాలు నిర్దారించుకోకుండా వదిలేస్తారు?” ఆశ్చర్యంగా అంది ఆమె.
పాణి చిన్నగా నవ్వాడు “పరిశోధన అన్నది అవసరాన్ని ప్రాతిపదికగా చేసుకుని సాగాలి కానీ, ఆసక్తి ప్రాతిపదికగా కాదు. అనవసర విషయాల మీద పరిశోధన చెయ్యడమన్నది మేధస్సుని, శ్రమనీ వృధా చేసుకోవడమే!”

“ఇది యదార్ధమైన మెయిలే అయి ఉండి, అవతలి వ్యక్తి నిజంగా అవసరంలో ఉండి ఉంటే?”

పాణి మళ్ళీ నవ్వాడు. “ఆ వ్యక్తి నిజంగా అంత ఆపదలో ఉంటే, నన్ను మళ్ళీ ఏదో ఒక విధంగా సంప్రదిస్తాడు. అప్పుడు ఆలోచిస్తాను”అతడు పనిలో పడడంతో ఆమె ఖాళీ కప్పులని తీసుకుని బయటికి వెళ్ళి పోయింది. బయటికెళ్తుంటే, అప్పటి దాకా తాత్కాలికంగా మర్చిపోయిన కల మళ్ళీ గుర్తొచ్చింది.  కలలో పాణితో పాటూ కనిపించిన ఆ యువతి గుర్తొచ్చి, అసహనంగా చేతిలోని కాఫీ  కప్పులని సింక్ లో విసురుగా పడేసింది.

తనకి వచ్చిన మెయిల్ సంగతి పాణి వెంటనే మర్చి పోయాడు కానీ, తెల్లవారు ఝామున వచ్చిన ఆ కలని గురించి మాత్రం అంజలి అంత తేలికగా మర్చి పోలేక పోయింది.

****

పై సంఘటన  జరిగిన  రెండు నెలల తరువాత ఒక రోజు-  నిజామా బాద్ జిల్లా లోని  సిర్నాపల్లి గ్రామం.

ఉదయం ఏడున్నర అయినా, మబ్బులు సూర్యుడ్ని మూసేయడంతో ఇంకా తెల్లవారినట్టుగా అనిపించడం లేదు. వాతవారణం అంతా చీకటిగా, ఏదో ఉపద్రవానికి సంతాపాన్ని తెలియ చేస్తున్నట్టుగా దిగులుగా ఉంది. ఊరికి ఉత్తర దిక్కులో ఉన్న సిర్నాపల్లి రాజ కోట అసలే చుట్టూ దట్టమైన చెట్లతో నిండి ఉండడం వల్ల మరింత చీకటిగా ఉంది.

రోజూ ఆరున్నరకే సందడి మొదలయ్యే ఆ రాజ ప్రాసాదం ఆవరణలో ఆరోజు ఇంకా తెల్లవారినట్టుగా కూడా లేక పోవడానికి కారణం వాతావరణం మబ్బు పట్టి ఉండడం కాదు, యజమాని రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ ఆ రోజు ఇంకా నిద్ర లేవక పోవడమే. ఇరవై ఆరేళ్ళ రాజేంద్ర సింగ్‍కి ఉదయాన్నే లేచి ఎక్సర్ సైజులూ. జాగింగ్ చెయ్యడం అలవాటు. 

వంట గదిలో అతడి కోసం వేడి వేడి ఫిల్టర్ కాఫీ తయారై గంట దాటుతోంది. ఒక బంట్రోతు అతడి జాగింగ్ డ్రస్, షూస్ సిద్దం చేసి పెట్టి చాలా సేపయింది. మరో బంట్రోతు  పట్నం నుంచి తెప్పించిన పేపర్లని హాల్లోని టీపాయ్ మీద అటూ ఇటూ తిప్పి అప్పటికి నాలుగు సార్లు అమర్చాడు  ఏమీ తోచక. ఆరోజు వంటకి ఏమేం చెయ్యాలో ఆదేశం తీసుకోవడం కోసం వంట మనిషి వంట గది లోంచి లోపలకీ బయటకీ తచ్చాడుతున్నాడు. మేడ మెట్ల మీద నుంచి రాజా వారు దిగుతున్న అలికిడి ఎంతకీ లేక పోయే సరికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అతడు కోటలో ఉన్న ఏ రోజూ ఉదయం ఆరు తరువాత నిద్ర లేవడం ఎవరూ చూడలేదు.

క్రింద గదిలో పెద్ద రాజా వారు కూడా ఇంకా నిద్ర లేవ లేదు. ఆయన వయసు ఢబ్బయ్యారేళ్ళు ఉంటుంది. మామూలుగాఅ కూడా ఉదయానే నిద్ర లేవ లేడు ఆయన. ఆస్త్మా ఉండడం వల్ల చలి కాలంలో ఐతే, తొమ్మిదింటికి కానీ లేవడు. ప్రస్తుతం ఉన్న వాతావరణం కారణంగా తొమ్మిదిన్నరకి కానీ ఆయన గది లోంచి బయటికి వస్తాడని నౌకర్లు అనుకోవడం లేదు. ఆ ఇంట్లో ఉండే మరో వ్యక్తి రాజా వారి మేన బావ సురేష్ వర్మ. అతడు ప్రస్తుతం ఊర్లో  లేడు. పని మీద ముందు రోజు రాత్రే హైదరాబాద్ వెళ్ళాడు. అలవాటైన దైనిందిన చర్య ఇంకా మొదలవ్వక పోవడంతో  ఎవరికీ ఏమీ తోచడం లేదు.

రెండు అంతస్థులలో  నిర్మించిన ఆ రాజ మహల్ లోని పై అంతస్థుని మొత్తం బ్రహ్మ చారి అయిన రాజేంద్ర వర్మ మాత్రమే ఉపయోగిస్తాడు. ఆ అంతస్థు లోనే అతడి పడక గది, పుస్తకాల గది, జిమ్ ఉన్నాయి.  మరికొన్ని గదులు, పెద్ద పెద్ద హాల్స్  ఉన్నా  అవి ప్రస్తుతం నిరుపయోగం గానే ఉంటున్నాయి. ఉదయం ఆరున్నరకి రాజా వారు నిద్రలే చి క్రిందకి వచ్చాక ఒక పని మనిషి పైకి వెళ్ళి అన్ని గదులనీ శుభ్రం చేసి వస్తుంది. పెద్ద రాజా వారికి మోకాళ్ల నొప్పుల కారణంగా మెట్లు ఎక్కి  పై అంతస్థులోకి ఎప్పుడూ వెళ్ళరు. సురేష్ వర్మ కూడా రాజా వారు ఉపయోగించే  పై అంతస్థులోకి చాలా అరుదుగా వెడుతూ ఉంటాడు.  ఆ గదులలోకి  స్వేచ్చగా వెళ్ళ గలిగేది ఇంట్లో ఉండే ముగ్గురు యజమానుల  తరువాత ఆ పని మనిషి ఒక్కత్తే.

రాజా వారు ఎంతకీ   క్రిందకి దిగక పోయే సరికి చూసి, చూసి, తన పనులు తను చేసుకుందామని ఆ పని మనిషి మేడ మీదకి వెళ్ళింది.  ఆమె మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన రెండు నిమిషాలకి కెవ్వు మని ఆమె పెట్టిన పెద్ద కేకతో ఆ రాజ మహల్ గోడలు  ప్రతిధ్వనించాయి !!

ఆమె పెట్టిన కేకకి-  రాజ మహలే కాదు, మొత్తం ఆ సిర్నాపల్లి సంస్థానం క్రింద ఉన్న రెండొందల గ్రామాలు కూడా ఉలిక్కి పడి నిద్ర లేచాయి !!

(మేడమీద గదిలో పనిమనిషి చూసిన దృశ్యం ఏమిటి?... వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్