Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam

పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు  అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు పరమశివుడు.

మను హఠ రాజయోగముల మర్మమెఱింగి తదర్థసిద్ది నె
మ్మనము దవిల్చి, హృజ్జలజ మాసరసౌరభ షట్పదంబు న
ర్జునరథభూషణంబు వెలిఁజూడని నిద్దపు నిట్టచూపునన్
మును గని చొక్కు లోన నిజమూర్ధగళత్సుధ సేదఁ దేర్పఁగన్        (చ)

పుండరీకుని వర్ణన సందర్భంగా తన ఆధ్యాత్మిక, వేదాంత, యోగమార్గముల జ్ఞానపు  లోతులను దర్శింపజేస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. 'మను' అంటే మనన సంబంధమైన, అంటే మంత్ర, జప సంబంధమైన, హఠ, రాజయోగముల మర్మమును తెలిసికొని, ఆ అర్ధ  సిద్దినిమనసులో నిలిపి, హృదయకమలమున దట్టమైన పరిమళమునకు తుమ్మెదవంటివాడు, అర్జునుని రథమునకు ఆభరణము ఐనవాడు, అలంకారము ఐన శ్రీకృష్ణుని, శ్రీహరిని మాత్రమే  చెదరని ప్రేమతో దీక్షతో చూస్తూ, బయటి ప్రపంచాన్ని చూడకుండా, తన శిరస్సునుండి జాలువారే అమృతం వలన సేద దీరేవాడు, తనివి దీర్చుకునేవాడు. 

ఈ పద్యములో కూడా కుండలినీయోగ రహస్యాన్ని చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు. మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ ఈ ఆరు  యోగ మార్గములోని షట్చక్రాలు. ఈ ఆరు చక్రాలూ వరుసగా వెన్నెముక క్రింది కొసభాగాన, నాభికి దిగువన, నాభికి పైన వక్షస్థలము క్రింద, హృదయభాగములో, కంఠస్థానములో, కనుబొమల మధ్యన ఉంటాయి. ఏడవది సహస్రారము, యిది కపాలము మధ్యలో ఉంటుంది.యోగమార్గములో కుండలినీ శక్తిని మేలుకొలిపి, ఒక్కొక్క చక్రాన్నే భేదిస్తూ, సహస్రార చక్రములో తన యిష్ట దైవాన్ని దర్శించుకుంటాడు యోగి. ఆ సిద్ది కలిగితే ఒక అమృతమయమైన ద్రవము  వంటి, చల్లని వెన్నెలవంటి వర్షంలో తడిసిన అనుభూతి పొందుతాడు, సమస్త బాహ్యలోకాన్ని మరిచిపోతాడు, యిదే కుండలినీ సిద్ది. ఈ సిద్ధిని పొందిన పరమయోగి పుండరీకుడు అంటున్నాడు రామకృష్ణుడు. 

ఈ పద్యములో ఉన్న మరొక చిలిపి చమత్కారం శ్రీకృష్ణుడిని 'అర్జున రథభూషణంబు' అనడం. అంటే అర్జునుడి రథానికి వన్నె తెచ్చిన మూర్తి అని మాత్రమే కాక, యుద్ధం చేయకుండా ఉత్తి  అలంకారప్రాయంగా ఉన్నవాడు అని. యిదే భావాన్ని అచ్చుయివే మాటలలో తిరుపతి వేంకట కవులు వెలిబుచ్చారు. ఈ పద్యమే స్ఫూర్తి అన్నా తప్పేమీ లేదు. కౌరవ పాండవ యుద్ధం  నిశ్చయం ఐన తర్వాత శ్రీకృష్ణుని తమ తమ పక్షాన యుద్ధం చేయమని కోరడం కోసం దుర్యోధనుడు, అర్జునుడు యిద్దరూ వెళ్ళడం, మిగిలిన కథ అందరికీ తెలిసినదే. చివరికి  'రథమునం దెన్ని చిత్రంపు ప్రతిమలుండవు? అందు శివుడు, అజుడు, ఎల్ల దేవతలుండవచ్చు, ఆ ఠీవి కృష్ణుడర్జున స్యంద విభూష యగును గాక' అనుకుంటాడు దుర్యోధనుడు తనలో! పూర్వ, ప్రబంధ కవులను చదువుకోకుండా గొప్ప కవులు ఎవరూ కాలేరు, కారు అని చెప్పడం  కోసం ఈ ప్రస్తావన.             

శతపత్రాక్షము, శిక్యసఖ్యభృతి చంచన్మౌళిసన్నాహ, ము
న్నతనాసాముకుళంబు, పూర్ణతరచంద్ర స్నిగ్ధముగ్ధాననం 
బతసీసూన సవర్ణవర్ణ, మతిసౌమ్యం, బబ్జనాభంబు, శ్రీ 
శ్రితవక్షంబు, మహామహంబొకఁడు పర్వెన్ దన్మనః పేటికన్       (మ)

పద్మమువంటి కనులు గలది, తలమీద చిక్కము గలది, మొగ్గవంటి ఉన్నతమైన, పొడవైన  నాసిక గలది, పరిపూర్ణ చంద్రునివంటి కాంతులీనే ముఖము గలది, అవిశె పూల- నల్లని- చామనచాయ వర్ణము గలది, అతి సౌమ్యమైనది, నాభియందు పద్మమును గలది ఐన ' మహా మహమైన' మహత్తత్త్వము ఐన ఒకడు, శ్రీ మహావిష్ణువు ఆ పుండరీకుని మనసు అనే పేటికలో నిండిపోయాడు!  

సనక సనందనాది నిఖిలాంతర్వాణి 
హృల్లీనభావంబు సల్ల వెట్టి 
విశ్వంభరా భోగ వివిధ మూర్త్యంతర 
స్ఫురితానుభావంబు బుజలువైచి,
శింశుమారాకృతి స్వీకృత వైకుంఠ 
షట్కవిహారంబు జారవిడిచి,
క్షీరోద మధ్యస్థలీ రత్న నగ గుహా
గర్భనివాసంబు కచ్చువదలి,                    (సీ)

పుండరీకేక్షణుండు, శిఖండి బర్హ
మండిత శిఖండకుఁడు, నతాఖండలుండు,
పుండరీకుని మానసాంభోజ పీఠి 
మిండతుమ్మెదయై యుండు నిండుకొలువు           (తే)

సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనేవారి, అటువంటి మహానుభావుల హృదయములలో లీనమై ఉండడం అనే మాటను చల్లగా వదిలిపెట్టి, లోకోధ్ధరణం కోసం వివిధ అవతారాలు ఎత్తడం అన్నది వదిలిపెట్టి, మత్స్యావతారము, వైకుంఠములో  షడ్విభూతులను, షడైశ్వర్యములను  వదిలిపెట్టి, పాలసముద్రమును, రత్నమయములైన  గుహలను వదిలిపెట్టి, పుండరీకములు వంటి కనులు గలవాడు, నెమలి పింఛమును  సిగలో ధరించినవాడు, దేవేంద్రాదులచేత నమస్కరింపబడేవాడు ఐన శ్రీహరి పుండరీకుని  మనసు అనే పద్మములో 'మిండ తుమ్మెదయై', మగ తుమ్మెదయై, వశుడైన ప్రియుడై నిండు కొలువు ఉండిపోయాడు! 

అన్వహమున్ బ్రవృద్ధమగు నంబుజనాభ పదారవిందభ
క్తిన్ వహికెక్కుచున్, వసుమతీసుర వంశవతంస మెల్లవా
రున్ వినుతింపఁ బెంపెసఁగు ప్రోదియొనర్చుచుఁ దల్లిఁదండ్రి నే
దున్ వివిధానురూప తనుదోహద భోజన పూజనాదులన్                  (ఉ)

దినదినమూ ప్రవృద్ధమవుతున్న శ్రీహరి పదారవిందములమీద భక్తితో, ఆ బ్రాహ్మణోత్తముడు అందరూ పొగడేట్లు శరీరాలకు సుఖంగా ఉండేట్లుగా తన తల్లి తండ్రులకు భోజనాదులు చక్కగా అమరుస్తూ, పూజలు చేస్తూ, తల్లిదండ్రులను పోషించేవాడు. 

హరిభక్తియు గురుభక్తియు 
నురురక్తియుఁ బుటముగాఁగ యోగీంద్రశిఖా 
భరణము ముక్తామయతా 
స్ఫురణము భువనప్రశస్తముగ జిగిమీఱెన్        (కం)

తనలో హరిభక్తి, గురుభక్తి, మిక్కిలి ప్రేమ ఎల్లరికీ విదితమయ్యేట్లుగా ఆ యోగీంద్ర  శిఖాభరణము ఐన పుండరీకుడు మంచిముత్యాల ఆభరణంలా ప్రపంచ ప్రసిద్ధంగా వన్నె  పొందాడు. 

మును మీనగుటఁ బట్ట మునులు వైచిన బత్తి 
వలఁబోలెఁ జిక్కమౌఁదలఁ దలిర్ప,
వెలితిగాఁ జవిగొన్న వెన్నముద్దయుఁబోలె
శంఖంబు వామహస్తమునఁ దనర,
జగదండవహకాలచక్ర భ్రమణ హేతు 
దండమై నిజధేనుదండమమర,
సంచిఁబట్టిన పద్మజాతాండముల లీల 
వలకేల గ్రచ్చకాయలు ఘటిల్ల,                     (సీ)

గలయఁబూచిన కల్పవృక్షంబుఛాయ,
సరస వనపుష్పమాలికాభర సమగ్ర
విగ్రహముతోడ విలసిల్లు విప్రునెదుట
మందప్రోయాండ్ర కూరిమి మ్రానిపండు   (కం)     

గతములో ఆయన మీనముగా అవతారమును ధరించాడు కనుక, ఆ మీనమును పట్టుకోడానికి వేసిన భక్తి అనే వల లాగా చిక్కముతో (చల్ది కుండలను ఉంచి పట్టుకునే చిక్కముతో) కొద్దిగా తిన్న, కొరికిన వెన్నముద్దలాగా ఉన్న శంఖాన్ని ఎడమ చేతిలో ఉంచుకుని, జగత్తులను కాలచక్రాన్ని సరిగా నడపడం కోసం పట్టుకున్న దండంలాగా తన చేతిలో పశువులను అదిలించే దండాన్ని, బెత్తాన్ని పట్టుకుని, బ్రహ్మాండ భాండములను సంచిలో పెట్టుకున్నట్లు కుడిచేతిలో గచ్చకాయలు పట్టుకుని, నిండుగా పూచిన కల్పవృక్షములాగా ఉన్నవాడు, వనపుష్ప మాలికలను ధరించినవాడు, సుందర విగ్రహుడు, గొల్లభామల ప్రేమఫలము ఐన శ్రీకృష్ణుడు ఆ పుండరీకుని మనః ఫలకం మీద సాక్షాత్కరించేవాడు! అంతటి సమాధి భావంతో నిత్యమూ ఆయనను ధ్యానించేవాడు పుండరీకుడు.

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu