Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్షలు - ..

 

కథ : కడుపుతీపి
రచయిత : పి.బి. రాజు 
సమీక్ష : రాచమళ్ళ ఉపేందర్ 
గోతెలుగు 172వ సంచిక!

సృష్టిలోని జీవరాశి అంతటిలో మనిషి ఉన్నతమైనవాడు. నాటి హొమొసేపియన్ దశ నుంచి మనిషి ఎదిగిన తీరు అమోఘం... అశ్చర్యం.. అత్యద్భుతం. శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో తన మేథస్సుతో నూతన ఆవిష్కరణలు గావిస్తున్న మనిషి అభినందనలకు అర్హుడే కానీ...

మనిషంటే మమతలుండాలి. ప్రేమతత్వాన్ని విరబూయించే మానవత్వముండాలి అని చాటి చెప్తుంది గోతెలుగు వారపత్రికలోని 172వ సంచికలో ప్రచురితమైన "కడుపుతీపి" కథ.

కథకు ముగింపు జీవంలాంటిది. అలాంటి జీవమున్న ముగింపుతో "కడుపు తీపి" అనే మంచి కథను అందించిన శ్రీ పి.బి. రాజు గారికి అభినందనలు.

నేటి సమాజం పతనం దిశగా పయనిస్తున్న రోజులివి. ఈ కలికాలంలో చెత్త కుండీల ప్రక్కన కళ్ళు తెరవని పసికందులు అమానుషంగా విసిరివేయబడుతున్నారు.  ఈలాంటి హృదయ విదారక సంఘటనను కథా వస్తువుగా తీసుకొని అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా రచయిత కథను మలిచిన తీరు అద్భుతంగా ఉంది. 

కథలోకి వస్తే... యథావిధిగా నేను, రాంబాబు వాకింగ్ కి బయలుదేరాం. అంటూ మొదలవుతుంది. తెల్లవారుతుండగా రామాలయం దగ్గరి పొదల్లో శిశువు పడివుండటం... జనం గుమిగూడటం... ఆ శిశువు పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా సానుభూతి ప్రకటించటం. ఇంతలో అనాథ ఆశ్రమం వాళ్ళు రావటం... శిశువు బాధ్యత తీసుకోవటం. ఇలా సహజంగా సాగిపోతున్న కథలో రచయిత నోరు లేని జీవి కుక్క పాత్రను ప్రవేశపెట్టడంతో పాఠకునిలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. 

కనీసం కుక్కకున్న ప్రేమ నేటి మనిషికి లేకుండా పోయిందే అన్న మానసిక భాధను.... అంతర్గత సంఘర్షణను రచయిత క్రింది వాక్యాల్లో అద్భుతంగా పండించారు. 

"నోరులేని జీవి కుక్క. తన పిల్లను ఎవడో చంపేశాడని కసిగా ప్రతి కారునీ వెంటాడుతుంది. శక్తికి మించి పరుగెడుతోంది. కారు కాబట్టి సరిపోయింది. ఆ క్షణంలో దాని నోటికి ఎవరు దొరికిన ముక్కలు ముక్కలు చేసి తన పగను తీర్చుకొనేది. అంత కసి... అంత కక్ష.... అంత పగ దాని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పాపం మూగ జీవి. అంతకన్నా ఇంకేం  చేయగలదు. అయినా పట్టుదల వీడటం లేదు. ప్రతి కారునీ వెంటాడి వేటాడుతోంది." కుక్క పట్ల సానుభూతి ప్రకటిస్తూనే... దాని  ప్రేమలోని గొప్పతనాన్ని ఉన్నతంగా చిత్రించారు.
ఈ  పేరాతో పాఠకుని కళ్ళు చెమర్చేలా చేశారు రచయిత.

"అన్నీ వుండీ నోరులేని పసికందును ముళ్ళ పొదల్లో పడేసింది ఒక మానవతల్లి. తన బిడ్దను చంపిన హంతకుని కోసం ప్రతి కారు వెంటా పరుగులు తీస్తోంది అవిశ్రాంతంగా మూగగా రొప్పుతూ, రోదిస్తూ, అరుస్తూ ఒక కుక్క తల్లి. కుక్కకున్న కడుపుతీపి మనసుల్లో కరువయిందని విచారిస్తూ వెనుదిరిగాం."

ఈ కథలో వర్ణనలు పెద్దగా లేనప్పటికి, సరళమైన భాషతో పాఠకులను బాగా అకట్టుకున్నారు. విలక్షణ చిత్రకారులు శ్రీ మాధవ్ గారి కుంచెలోంచి జాలువారిన అద్భుతచిత్రం ఈ కథకు గీసిన బొమ్మ. రచయితలోని ఆర్తినీ, అలోచనను కడుపుతీపంత కమ్మగా బొమ్మలోనే దృశ్యరూపం గావించటం మాధవ్ గారి ప్రతిభకు నిదర్శనం. కథ పాఠకుడికి ప్రత్యక్ష దర్శనం.

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు....  http://www.gotelugu.com/godata/images/201608/153_822_862_katha-sameekshalu-logo1.jpg

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam