Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణిస్తున్నాడు  పరమశివుడు.

నియమాంతంబున సత్యా
ప్రియరూపముతోడఁ గూడఁబెనఁచిన యంత
ర్నయనము సడలిచి పితృపా
ద యుగార్చాధీనబుద్ధిఁ దహతాహ వెఱుగన్                  (కం)

నియమము అంటే యోగ నియమము అంటే క్రితం చెప్పుకున్నట్టు కుండలినీ యోగ  మార్గంలో, సహస్రారంలో శ్రీకృష్ణ దర్శనం చేసుకున్నతరువాత, సత్యాప్రియుని  రూపముతో పెనవేసుకున్న అంతర్నయనమును సడలిస్తాడు పుండరీకుడు. అంటే  ఆ యోగ తాదాత్మ్య స్థితినుండి బయటకు వచ్చి, తండ్రి పాదసేవ చేయాలని తహతహ  పడతాడు.

పావన దృగ్విలాసములు బాహ్యగతిం బచరించి, చంద్రికా
శ్రీవిభవంబులం బలుచ సేయు ముఖప్రభ లుల్లసిల్లఁగా
మై వదలించి, పూర్వమగు మట్టున గాడ్పును సాఁగనిచ్చి, పైఁ 
గావలియిడ్డ శక్తుల సగౌరవదృష్టిఁ బరిగ్రహించుచున్                 (ఉ)

కుండలినీయోగ సమాధిస్థితి నుండి తన పవిత్రమైన దృష్టులను బాహ్యప్రపంచానికి  మరలిస్తాడు. చంద్రుని వెన్నెలకాంతులను చులకనచేసే తన ముఖకాంతులు  వ్యాపిస్తుండగా శరీరాన్ని అంతవరకూ ఉన్న ఆసన స్థితినుండి సడలిస్తాడు. పూర్వపు  విధంగా, మామూలుగా ఉఛ్ఛ్వాస నిశ్వాసాలను సాగిస్తాడు. అంతవరకూ బాహ్యప్రపంచ  విషయాలను తన మనసులోకి జొరకుండా కావలి అన్నట్టు నియమించిన యిఛ్ఛా, క్రియా  జ్ఞాన శక్తులను విరమింపజేస్తాడు. యింత వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా యోగ  మార్గ విధానాన్ని వేరెవరూ చెప్పి ఉండరు బహుశా.  ఒక్కొక్క గ్రంథిని భేదిస్తూ, ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ షట్చక్రభేదనం చేస్తూ,  సహస్రారాన్ని చేరుకున్న సాధకుడు అక్కడ సహస్రదళకమలములో తన యిష్టదైవాన్ని  ప్రతిష్టించి ధ్యానిస్తాడు. ఆ ధ్యాన ఫలితమైన అమృత రసాన్ని ఆస్వాదిస్తాడు. తిరిగి  మరలా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెనక్కు, క్రిందకు వచ్చి మూలాధారాన్ని చేరుకొని,  అక్కడ కుండలినీ శక్తిని మరలా విశ్రమింపజేసి, నెమ్మదిగా సమాధిస్థితినుండి బాహ్యస్థితికి  వస్తాడు. యిది కుండలినీ యోగం. ఈ మార్గాన్ని కుండలినీ మార్గం అని వ్యవహరిస్తారు.  కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకుని, పడగను విప్పిన సర్పమువలె ఉంటుంది,  తన తోకను తన నోట కరచుకున్న సర్పమువలె ఉంటుంది అని కుండలినీ యోగమార్గ  రహస్యాలు చెబుతాయి. జగద్గురువు ఆదిశంకరులు తమ 'సౌందర్య లహరి' స్తోత్రంలో  రెండు అద్భుతమైన శ్లోకాలలోఈ రహస్యాలను నిక్షిప్తం చేశారు.

తనువుతోఁ జరియించు ధర్మదేవతవోలె 
మెలపున వనవాటిఁ గలయఁదిరిగి,
గణనమీఱిన శార్ఙ్గిగుణములు హృదయసం
పుటి నించుక్రియ విరుల్ బుట్టిఁబెట్టి,
తనకు బవిత్రవర్ధనమె కృత్యంబను 
కరణి నూతన కుశోత్కరముఁ గూర్చి,
యపవర్గఫలసిద్ది హదనైనఁ జేపట్టు 
కైవడి బహుఫలోత్కరములొడిచి,                   (సీ)

యోగ యాగంబు సలుపుచో నూర్మిపశు వి
శసనమొనరించుటకు యూపసమితిఁ దెచ్చు 
భాతి సమిధలుగొని, మహాప్రాజ్ఞుఁడతఁడు 
వచ్చు లేఁబగటికి నిజావాసమునకు                 (తే)

ధర్మదేవత రూపుదాల్చి వచ్చినట్టు మెళకువ వచ్చీ రాగానే వనవాటిలో కలయ  తిరుగుతాడు. లెక్కించడానికి అవధులు మించిన శార్ఙ్గి శ్రీ మహా విష్ణువు గుణములను  హృదయ సంపుటిలో చేర్చినట్లు పూలను బుట్టలో పెడతాడు కోసుకుని. తనకు  పవిత్రతను వృద్ది జేయడమే, చేసుకొనడమే పని అన్నట్లు పవిత్రమైన కుశలను, దర్భలను సేకరిస్తాడు. అదనుగా మోక్షఫలమును చేపట్టినట్టు రకరకాల ఫలములను 
సేకరిస్తాడు. యోగము అనే యాగమును చేసేప్పుడు షడూర్ములు అనే పశువులను  వధించడానికి, నాశనం చేయడానికి, కట్టేయడానికి యూప స్తంభములు తెచ్చి నిలబెట్టినట్లు సమిధలను సేకరిస్తాడు. షడూర్ములు అంటే ఆరు బాధలు. శరీరము మూడు విధాలు అని భారతీయ సంప్రదాయం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనేవి ఆ మూడు. స్థూల శరీరానికి  జరా మరణములు అనే రెండు ఊర్ములు ఉంటాయి. సూక్ష్మ శరీరానికి క్షుత్పిపాసలు  అనే రెండు ఊర్ములు ఉంటాయి. కరణ శరీరానికి శోక మొహాలు ఉంటాయి అని భారతీయ  సంప్రదాయం. స్థూల, సూక్ష్మ, కరణ శరీరాలకు కలిగే ఆరు ఊర్ములు అనే ఆరు పశువులను  వధించే యాగమే యోగ యాగం! యిది చమత్కారంగా, ప్రతీకాత్మకంగా చెబుతున్నాడు  మహాకవి తెనాలి రామకృష్ణుడు! యిలా సమస్త పదార్ధములను సేకరించుకుని లేత పగటి  వేళకు, అంటే పగటిపూట యింకా ముదరకముందే, అంటే కొద్దిగా పొద్దెక్కిన ఉదయ  కాలానికి యింటికి తిరిగివస్తాడు పుండరీకుడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
navvandi - navvinchandi