Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నరుడాడోనరుడా..

narudadonaruda movie review

చిత్రం: నరుడా డోనరుడా 
తారాగణం: సుమంత్‌, పల్లవి సుభాష్‌, తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి, సుమన్‌ శెట్టి తదితరులు. 
సినిమాటోగ్రఫీ: షనీల్‌ డియో 
నిర్మాణం : అన్నపూర్ణా స్టూడియోస్‌ 
నిర్మాతలు: సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట 
దర్శకత్వం: మల్లిక్‌రామ్‌ 
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల 
విడుదల తేదీ: 4 నవంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

విక్కీ (సుమంత్‌), ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌)ని ప్రేమించుకుంటారు. తనకు ముందే పెళ్ళయ్యిందనీ, అతనితో విడాకులు తీసుకున్నానని విక్కీకి, తన గురించి ముందే చెప్పేస్తుంది ఆషిమా రాయ్‌. అయితే తన గురించిన ఓ నిజాన్ని మాత్రం విక్కీ, ఆషిమాకు తెలియకుండా జాగ్రత్తపడతాడు, ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అయితే, విక్కీ స్పెర్మ్‌ డోనర్‌ అనే విషయం పెళ్ళయ్యాక తెలుసుకుంటుంది ఆషిమా రాయ్‌కి. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు బలవంతపెట్టడంతో స్పెర్మ్‌ డోనర్‌గా మారతాడు విక్కీ. అదే ఆషిమా, విక్కీ మధ్య విభేదాలకు కారణమవుతుంది. మరి, ఆషిమాని విక్కీ ఎలా ఒప్పిస్తాడు? తన వైవాహిక జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

విక్కీ పాత్రలో సుమంత్‌ ఒదిగిపోయాడు. కాదు, జీవించేశాడనడం కరెక్ట్‌. ఎందుకంటే చాలా ఈజ్‌తో తన పాత్రను చేసుకుంటూ పోయాడు సుమంత్‌. సన్నివేశానికి తగ్గట్టుగా తనను తాను మార్చేసుకున్నాడు. ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌లోనూ, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీలో చాలా మార్పులు చేసుకున్న సుమంత్‌, ఈ సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరించాడు. 
సుమంత్‌ తర్వాత ఆ స్థాయిలో సినిమాని భుజాన మోసింది మాత్రం తనికెళ్ళ భరణి అని చెప్పక తప్పదు. తనదై డైలాగ్‌ మాడ్యులేషన్‌తో తనికెళ్ళ తన ప్రెజెన్స్‌ని ఎంటర్‌టైనింగ్‌గా మార్చేశాడు. పల్లవి సుభాష్‌ బాగానే చేసింది. చాలాకాలం తర్వాత తెరపై పూర్తిస్థాయి పాత్రలో కన్పించిన శ్రీలక్ష్మి, బాగా చేసింది. తనికెళ్ళ భరణికి అసిస్టెంట్‌గా సుమన్‌ శెట్టి బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో రాణించారు.

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'విక్కీ డోనర్‌'కి ఇది తెలుగు రీమేక్‌. కథ విషయంలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. సన్నివేశాల పరంగా కూడా మక్కీకి మక్కీ దించేశారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డైలాగుల్ని స్పాంటేనియస్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఒరిజినల్‌ ఫ్లేవర్‌ని ఏమాత్రం పాడు చేయకపోవడం దర్శకుడి క్రెడిట్‌. సుమంత్‌ని కొత్తగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. మాటలు బాగున్నాయి. రీమేక్‌ సినిమా గనుక స్క్రీన్‌ప్లే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోడానికి ఉండదు. సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణపు విలువలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌నెస్‌ని ఇచ్చింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అవసరమైనంత మేర సినిమాకి హెల్ప్‌ అయ్యాయి.

రీమేక్‌ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించెయ్యవు. ఒరిజినాలిటీని దెబ్బతీయకుండా తెరకెక్కించినప్పుడే రీమేక్‌లు విజయాలు అందుకుంటాయి. రీమేక్‌లు అయినా నేటివిటీకి తగ్గ ఫీల్‌ ఉండాలి. అక్కడే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఈ సినిమా వరకూ దర్శకుడు బాగానే బ్యాలెన్స్‌ చేశాడు. అయితే కథ పరంగా తెలుగు ప్రేక్షకులకు ఇది చాలా కొత్తది. స్పెర్మ్‌ డోనర్‌ అనే కాన్సెప్ట్‌ జీర్ణించుకోవడం కష్టమే. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కువగా జొప్పించాడు దర్శకుడు డైలాగ్స్‌ రూపంలో. సరదా సరదా సంభాషణలతో కాన్సెప్ట్‌లోని 'తేడా'ని కొంతవరకు అధిగమించగలిగాడు. సరదాగా ఆలోచిస్తే సరదానే, అభ్యంతరకరం అన్న ఆలోచన రాకుండా చేయడానికి దర్శకుడు మాటల రచయితని మేగ్జిమమ్‌ ఉపయోగించుకున్నాడు. సుమంత్‌, తనికెళ్ళ కాంబినేషన్‌ సినిమాని సరదా సరదాగా సాగేలా చేసింది. ఓవరాల్‌గా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. పబ్లిసిటీ బాగా చేశారు గనుక, సినిమాకి ఓపెనింగ్స్‌ కూడా బాగానే వుండే అవకాశముంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

నరుడా డోనరుడా సక్సెస్సే కదా నీ కోరిక

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with sumanth