Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue186/533/telugu-serials/atulitabandham/atulitabhandham/

( గతసంచిక తరువాయి)

“ధైర్యంగా నిజం మాట్లాడటానికి తాగనక్కరలేదు బావా...”

“నా చెల్లెలు ఏం తప్పు చేసిందని పుట్టింటికి పంపేస్తావు?” కోపంగా అన్నాడు వేణు.

“అసలు ఆమె ఎప్పుడైనా సవ్యంగా సంసారం చేసిందా బావా? అయాం సారీ, ఈ పిలుపు బాంధవ్యం కోసం కాదు, నిన్ను పేరు పెట్టి పిలవ లేక... వినతకి ఇల్లాలి లక్షణాలు ఏవీ లేవు... ఎంత సేపూ సరదాలు, షికార్లు... స్నేహాలు, విహారాలు... ఒక బాధ్యత కలిగిన ఇంటి కోడలిగా ఎప్పుడూ ప్రవర్తించ లేదు... పెళ్ళికి ముందు నేను కూడా నా దాంపత్య జీవితం గురించి చాలానే కలలు కన్నాను బావా... భర్తతో భార్య ఉండే విధంగా మీ చెల్లెలు ఎప్పుడూ నాతో లేదు... పోనీ మాట తీరు ఏమైనా స్నేహ పూర్వకమా అంటే ఈటెల గాయాలే... పుల్ల విరుపు మాటలూ, సాధింపులతో నా జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. ఒక్కో సారి ఇంటికి రావాలంటే ఎంతో భయం వేసేది... అమ్మ కనుక నాతో లేక పోతే, విరక్తితో  నేను దేశాలు పట్టి పోయే వాడినేమో...

ఏం కావాలన్నా, ఏడుపులూ, అలకలూ... అడిగింది ఇచ్చేయాలి... ప్రతీ నెలా ఆమె కోసం డబ్బివ్వాలి... రక రకాల పెర్ఫ్యూమ్ లు, కాస్మెటిక్స్, ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు... లేటెస్ట్ మోడల్ ఏది వచ్చినా అది ఆమె అప్పటి కప్పుడు తెచ్చేసుకో వలసిందే... ఇవి కాక కిట్టీ పార్టీలు...వారం వారం సినిమాలు... పిక్నిక్ లు...  మీ ఇంట్లో ఎలా గడిచిందో నాకు తెలియదు కానీ నా ఇంట్లో మాత్రం ఆమె అలాగే ఉంది, రాజసంగా  కావలసినవి అన్నీ సాధించుకుంటూ ఉంది.

పోనీ తోచటం లేదేమో అని, చదువుకోమని అన్నాను. ఇంట్రెస్ట్ లేదని చెప్పింది... నాతో పాటు మా ఆఫీసుకు రమ్మనీ, పని నేర్చుకోమనీ, చెప్పాను. నాది స్వంత బిజినెస్ కాబట్టి తానూ సహకరిస్తే ఎంతో బాగుంటుందని ఆశ పడ్డాను. రాను గాక రానని తెగేసి చెప్పింది... నేను బలవంతం చేయ లేక ఊరుకున్నాను.

నా ఇంటి వంటింట్లో స్టవ్వు ఎలా ఉంటుందో తనకి తెలియదు... ఈ వారం రోజుల నుంచీ మాత్రమే  వంట చేస్తోంది, చేయిస్తోంది కానీ, ఇది వరకెప్పుడూ ఆ గది లోకి అడుగు పెట్ట లేదు... అత్త గారికి సేవలు చేయటం మానె, కనీసం ఆప్యాయంగా ఓ పలకరింపు లేదు... మీ నాన్న గారు ఉన్నంత కాలం వినతను సరి చేయాలని ఎంత గానో ప్రయత్నించారు. నేను కూడా ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ విషయాన్ని పెద్దది చేయ లేదు. అన్నీ తెలిసిన ఆయనతో ఆమె మీద నేరాలూ చెప్ప లేదు.

నాకు సంసార సుఖం ఎప్పుడూ దక్క లేదు... ఇక పిల్లలెలా పుడతారు? అయినా నాలోనే లోపం ఉందని అందరికీ చెప్పింది... ఆ అవమానాన్ని కూడా  భరించాను... ఇంకా చిన్న తనం పోలేదు, తానే మారుతుందని ఆశించాను... నా సౌమ్యత ఆమెకు అసమర్థతలా కన బడింది. కాలం గడిచి పోతోంది కానీ తనలో మార్పు రాలేదు...

ముందు రోజు నుంచే అమ్మకి కొద్దిగా ఆయాసంగా ఉంది... మా అక్క వచ్చే రోజు దగ్గర అవుతోంది... అప్పటికే వినత అరకు లోయ ట్రిప్ వేసేసుకుంది... నేను ఎంత గానో ప్రాధేయ పడ్డాను. అమ్మకి బాగా లేదని, ఈ ఒక్క సారికి టూర్ మానేయమని చెప్పాను. విన లేదు... నన్ను ఓ పురుగును చూసినట్టు చూసి తన మానాన తాను వెళ్ళి పోయింది... అంతే కాదు... అమ్మకి అటాక్ వస్తే, హాస్పిటల్ లో జాయిన్ చేసి, అడ్వాన్స్ చెల్లించటానికి  డెబిట్ కార్డు ఇస్తే బాలెన్స్ లేదని రిజెక్ట్ అయింది... కారణం తెలుసా? నాకు చెప్పకుండా వినత లక్ష రూపాయలు విత్ డ్రా చేసేసింది... తెలిసిన వాళ్ళే కనుక, నా ఫరం కరెంట్ ఎకౌంటు లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది కనుక మర్నాడు తెచ్చి కట్టేస్తానని వాళ్ళతో చెప్పి ఒప్పించాను. అవసరం గట్టెక్కింది... కానీ హాస్పిటల్ స్టాఫ్ ముందు నా  పరువు పోయింది.
ఇక ఆ రాత్రి అమ్మ ఆయాసంతో, పెద్ద శబ్దంతో  రొప్పుతూ ఉంటే, బాధతో ఆమె గుండెలు ఎగసి ఎగసి పడుతూ ఉంటే,  నాకు ప్రాణం పోయినంత పని అయింది. అమ్మను ఐసిసియు లో ఉంచి నన్ను బయట కూర్చోమని చెప్పారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. నేను ఒంటరిగా బయట బిక్కు బిక్కుమంటూ ఒక్కడినీ బాధగా, భయంగా, బరువుగా... తెల్లారి రాబోయే అక్క కోసం ఎదురు చూస్తూ, అసలు ‘అక్క వచ్చే సరికి అమ్మ ఉంటుందా,’ అని మథన పడుతూ... ఆ రాత్రి ఎంత ఘోర నరకాన్ని అనుభవించానో నీకు తెలుసా బావా? ఆ సమయంలో నా భార్య పక్కన ఉండి, ‘ఏం ఫర్వా లేదండి, అత్తయ్యకి ఏమీ కాదు... దేవుడు కరుణిస్తాడు... డాక్టర్లు చూస్తున్నారు కదా, తగ్గిపోతుంది...’ అని భుజమ్మీద చేయి వేస్తే, ఒక చిన్న మంచి మాటతో ఊరడిస్తే ఆ క్షణం నేను ఎంత గుండె ధైర్యాన్ని తెచ్చుకుని ఉండే వాడిని?  అసలు పెళ్ళి చేసుకునేది అలాంటి తోడు కోసం కాదా బావా? మధు చెల్లాయి నీకు అలాంటి తోడు కాదా?

ఈ రోజు లోకానికి భయ పడో, మీరేమైనా అంటారనో తాను ఒద్దికగా ఉంది... కానీ, అదెంత సేపు? లాగి పట్టుకున్నంత సేపే కదా కుక్క తోక సరిగ్గా నిలిచేది... వదిలామో వెంటనే  వంకర అయి పోతుంది... ఇప్పుడు మా అక్కా, పిల్లలూ అమెరికాకి వెళ్ళి పోగానే, వినత పాత వినత అయి పోతుంది... నాకు ఈ జీవితం మీదే విరక్తిని కలిగించిన ధీర వనిత మీ వినత... వద్దు బావా... లాయర్ గారిని తీసుకుని,  మీ ఇంటికి వస్తాను... అన్నింటికీ సిద్ధ పడండి... మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు తీసుకుంటే త్వరగా వచ్చేస్తాయి... ఆమెకీ స్వేచ్ఛే, తన సరదాలు తీర్చుకోవచ్చు... నాకూ హాయి... శేష జీవితాన్ని ప్రశాంతంగా గడప వచ్చు... మీరూ ఆలోచించండి... ఇంత కన్నా గత్యంతరం లేదు నాకు...” చెప్పటం ముగించి, బాధగా నుదురు రాసుకున్నాడు పవన్.

పవన్ మాటలన్నీ వింటుంటే, వేణు కోపమంతా ఏమైందో ఏమో, జావ గారినట్టు అయిపోయి, పాలి పోయిన ముఖంతో, జీవం లేని మనిషిలా అయి పోయాడు. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి...పవన్ చెప్పినవి అన్నీ, కాదన లేని నిజాలే!

తల్లీ, తనూ కలిసి అతి గారాబంతో వినతను చాలా చెడ్డ దానిగా తయారు చేసారు... పసి వాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లలు అందరూ మంచి వాళ్ళే... వాళ్ళు పెరిగిన వాతావరణాలూ, కుటుంబ సభ్యులే వారి మనస్తత్వాలను తీర్చి దిద్దుతాయి అనేది అక్షర లక్షల విలువైన సత్యం...
అయితే ఇక వినతను వదిలేస్తాడు పవన్... తనకు అర్థమై పోయింది... చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎవరు చెప్పినా వినేట్టు లేడు... ప్రపంచానికీ, బంధు వర్గానికీ తెలుసు -  వినత ఎలాంటిదో... పవన్ ని ఎవ్వరూ తప్పు పట్టరు కూడా... నిజానికి అతను అనుభవించిన నరకం కన్నా, వినతా, తామూ అనుభవించ బోయేది చాలా చిన్నది...

తమకిలా జరగాల్సిందే ... కళ్ళలో పెట్టుకుని పెంచిన చెల్లెలి బ్రతుకు ఇకపై పుట్టింట్లోనే... ఒక్క క్షణం మధు ముఖం కనుల ముందు మెదిలింది... ఆమెను క్షోభ పెట్టినందుకేనేమో తమ ముఖాన ఇంత నరక యాతన అనుభవించమని రాసాడు ఆ దేవుడు! ఇలాగే, ఆమెకు తెలియకుండా జాయింట్ అకౌంట్ లోంచి డబ్బు వాడేసాడు తను... అచ్చు వినత లాగానే... ‘చెల్లుకు చెల్లు’ అన్నట్టు తమ అందరి పాపాలకూ, తప్పులకూ చెల్లు చీటీ రాయాల్సిన సమయం వచ్చేసింది...

స్వప్నావశిష్టుడిలా బయటకు వచ్చాడు వేణు... యాంత్రికంగా బైక్ స్టార్ట్ చేసాడు... ఇంటికి బయలు దేరాడు...

***

ఆఫీసులో కార్తీక్ ని చూడగానే ఐశ్వర్య కళ్ళలో ఇంద్ర ధనుసులు విరిశాయి. కళ్ళ నిండుగా అతన్ని చూసుకుంటూ, మనసులో ఆనందాన్ని నింపుకుంటూ అలాగే ఉండి పోయింది...

ఫైల్ ని స్టడీ చేస్తున్న కార్తీక్ ఏవో చూపుల తూపులు తనను గుచ్చుతున్నట్టు అనిపిస్తూంటే గబుక్కున తలెత్తి చూసాడు. వెంటనే తల దించుకుంది ఐశ్వర్య. ఆమెను చూస్తూంటే మనసు ఝల్లుమన్నట్టు అయింది కార్తీక్ కి... ఇది వరలో ఎప్పుడూ లేనిది... కలిసి కాపురం చేసినప్పుడు సైతం కలగనిది... తొలి చూపులో ప్రేమ లాంటి ఒక రకమైన మధుర భావన! ఒక్క క్షణం తనకు తానే  కొత్తగా అనిపించాడు కార్తీక్ కి. తనను తాను సంబాళించుకుంటూ, తిరిగి ఫైల్ వైపు దృష్టి మరల్చాడు.

మధ్యాహ్నం ఆమెను తన టేబుల్ దగ్గరకు పిలిచాడు. ఐశ్వర్య రాగానే సీట్ ఆఫర్ చేసి, తనతో పాటు తీసుకు వచ్చిన ఒక కవర్ అందిస్తూ, “ఐశూ... నీ కోసం ముంబై నుంచి తీసుకు వచ్చాను...” అని అందించాడు. లోపల చక్కని హాండ్ బాగ్...

“ముంబై లో నేను స్టే చేసిన హోటల్ లోనే షాప్ ఉంది... ఇది నీకు బాగుంటుందనిపించింది... నీకు నచ్చిందా?”

“బావుంది... థాంక్ యు కార్తీక్...” మెల్లగా చెప్పింది ఐశ్వర్య.

“అన్నట్టు... మీ ఫ్రెండ్ మధూ వాళ్ళ ఆయన వేణు కూడా ట్రైనింగ్ కి వచ్చాడు... ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం...”

“ఓహో...”

“ఏమిటి డల్ గా ఉన్నావు? ఒంట్లో బాగా లేదా?” ఆదుర్దాగా అడిగాడు...

కార్తీక్ లో ఎప్పుడూ కనబడని కొత్త కోణాలు కనబడుతూ ఉంటే కొద్దిగా ఆశ్చర్యం గానే, “ఏం లేదే, బాగానే ఉన్నాను...” అంది తడబడుతూ...
“నేను అప్పగించిన పనులు...”

“పూర్తి చేసాను... ఉదయం నుంచీ బిజీగా ఉన్నావని రాలేదు...”

“సరే, సాయంత్రం రా... డిస్కస్ చేద్దాం... ” ఆమెను అలాగే చూస్తూ ఉండి పోవాలని, మాట్లాడుతూ ఉండాలని ఉంది అతనికి... ‘లేత గులాబీ రంగు సల్వార్ సూట్ ఆమెకు చక్కగా అమరింది...’ అనుకున్నాడు ఆమె లేచి వెళుతూ ఉంటే... ఒక ఆడదాని శరీరాన్ని గురించి, అందులోని ఒంపు సొంపుల గురించే తప్ప, వస్త్ర ధారణ గురించీ, రూప లావణ్యం గురించి, మనో సౌందర్యం గురించీ ఏనాడూ ఆలోచించని కార్తీక్ మనసులో ఏవేవో కొత్త భావనలు చిక్కని అరుణ రాగాల్లా అలరిస్తున్నాయి...

ఆమె కావాలి... యస్... ఐశ్వర్య తనకు కావాలి! ఎప్పటికీ అచ్చంగా తనకే కావాలి!! అంతే!!!

***

“వదినా, బాగా తల నొప్పిగా ఉంది... కొంచెం కాఫీ ఇస్తావా?” దీనంగా అడిగింది వినత.

“అమ్మా వినతా, నువ్వు అడిగినప్పుడల్లా కాఫీలు, టీలు రెడీ గా అందించటానికి ఇది హోటల్ కాదు, నేను నీ వంటమ్మాయినీ కాదు... పని మనిషి రావటం లేదు, పనితో నేను సతమతమై పోతున్నాను... బట్టలు ఉతకమని చెప్పాను... ఉతికావా?” అడిగింది మధు బాల.

“వాషింగ్ మెషిన్ వేసాను వదినా...”

“ఊ... బాబి గాడు లేచే వేళయింది... ఈ పాలు తీసుకెళ్ళి రెడీగా ఉంచుకో... ఏడిస్తే వాడికి పట్టు...” ఫీడర్ నిండా పాలు నింపి ఇచ్చింది మధు బాల.

“బట్టల పని చూడు... కాఫీ ఇస్తాను...” ముక్త సరిగా చెప్పి పనిలో మునిగి పోయింది.

హాల్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న వేణుతో, “అమ్మ ఎప్పుడు వస్తుంది అన్నయ్యా?” అంది వినత.

“ఏమోనే... ఫోన్ చేస్తే కలవటం లేదు... ఎప్పుడొస్తుందో ఏమో మరి...” త్రుంచినట్టే జవాబు చెప్పాడు. బట్టల పని అయి, డ్రైయర్ లోంచి తీసి, బాల్కనీలో ఆరేసి, క్లిప్పులు పెట్టి లోపలికి వచ్చే సరికే బాబి గాడు నిద్ర లేచి, ఇంటి కప్పు ఎగిరి పోయేలా ఏడుస్తున్నాడు... గబుక్కున వచ్చి ఎత్తుకుంది వినత. అప్పటికే పక్క తడి చేసాడేమో, వాడి తడి బట్టలు వినతకి అంటుకున్నాయి... వాడిని పక్కన పడుకో బెట్టి వాష్ చేసుకుని వచ్చే లోగా మరింత  గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు...

లబలబలాడుతూ వచ్చేసింది మధు బాల...

“వినతా, చెప్పాను కదా పాలు పట్టమని?” కోపంగా అడిగింది వాడిని ఎత్తుకుంటూ...

“అదీ... తడి బట్టలు అంటుకున్నాయి వదినా, కడుక్కుని వస్తున్నాను...”

“వాడికి డ్రాయర్ మార్చకుండా, ఆ చెమ్మ బట్టలతో ఉంచేసి, అర్జెంటుగా కడుక్కుని వచ్చేయటానికి వెళ్ళావా? మరీ అంత సుకుమారమా? అసలు... పిల్లల్ని లాలించటం నీకేం తెలుసులేమ్మా, ఒక్క బిడ్డను కని ఉంటే తెలిసేది...” బాబుకి పొడి చెడ్డీ వేస్తూ అన్నది మధు బాల సాధింపుగా...

చివ్వున కన్నీళ్లు చిమ్మాయి వినత కళ్ళ లోంచి...

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam