Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaaki ghosha

ఈ సంచికలో >> కథలు >> నిర్ణయం

nirnayam

సంవత్సరం లో జరిగే నాలుగయిదు బోర్డు మీటింగుల్లో షేర్ హోల్డర్ల జనరల్ బాడీ మీటింగ్ ముందు జరిగే బోర్డు మీటింగ్ చాలా ముఖ్యమైంది. అందులోనే డైరెక్టర్ల రిపోర్ట్ మొదలయిన ముఖ్య విషయాలు ఫైనలైస్ చేస్తారు. దానికి సంబంధించిన అజెండా వివరాలు ఆఫీసులో ఉండగా పూర్తి అవలేదు. వాటిని పూర్తి చేద్దామని ఇంటికి రాగానే కళ్యాణి  ఇచ్చిన కాఫీ తాగి కంప్యూటర్ ముందు కూర్చున్నా. సెల్ ఫోన్  స్విచ్ ఆఫ్  చేసి  ల్యాండ్  లైన్ కి యేమ న్నా వస్తే, మా ఎండీ దగ్గరనించి తప్ప, మిగతావి  ఏవీ ఇవ్వవద్దని  చెప్పాను కళ్యాణి కి.
 
నేను అన్నీ పూర్తి చేసి క్లియరెన్స్ కోసం మా ఎండి కి మెయిల్ పెట్టి లేచాను. ఈ లోపులో రెండు మూడు కాల్స్ వచ్చాయి. ఒకటి ఎక్కువ సేపు మాట్లాడినది, బహుశా మా పెద్ద వదిన నుంచి అయి ఉండవచ్చు అనుకున్నాను.
 
సిస్టం ముందు నుంచి లేచి వస్తూ " ఏమిటి విశేషాలు? " అన్నాను? తను ఎలాగా చెబుతుందని తెలిసి కూడా
 
"మీ పెద్ద వదిన గారు. రాంబాబు విషయం చెబుతున్నారు"
 
.  రాంబాబు మా పెద్దన్నయ్య రెండో  కొడుకు. కల్యాణి ఏదయినా చెబితే ,  చెప్పిన  పద్దతి బట్టి చాలా గ్రహించ వచ్చు.. ప్రస్తుతం సూచన ఏమిటంటే ఏదో పెద్ద విశేషమే ఉండి  ఉండాలి.
 
" ఏమిటి రాంబాబు గురించి? " జాబ్ ఏమన్నా మారుతున్నాడా? " అన్నాను  అంతకన్న ఇంకేమిటి ఉంటుందని.
 
  మా పెద్దన్నయ్యకి నాకూ పదిహేను ఏళ్లు తేడా ఉంది. మధ్యలో ముగ్గురు అన్నయ్యలూ, ఇద్దరు అక్కలూ, ఆ తరువాత నేను. మా నాన్నగారు నరసాపురం దగ్గర కొప్పర్రు లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా చేసేవారు. ఉండడానికి నలభయి ఎకరాలు ఉన్నా, రాబడి అంతంత మాత్రంగా ఉండడంతో అంత  పెద్ద సంసారాన్ని కష్టం గా ల్లాక్కొ చ్చారు.పెద్దన్నయ్య చిన్న వయసులోనే బిఈడి చేసి నరసాపురం లో టైలర్ హైస్కూల్లో  టీచర్ గా చేరాడు. ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళూ నాన్నగారు ఇదయింతరువాత  పెద్దన్నయ్య ఆధ్వర్యం లోనే జరిగాయి. మా ఊళ్ళో హైస్కూల్ లేదు కాబట్టి మా చదువులన్నీ పెద్దన్నయ్య దగ్గరే జరిగాయి
 
" రాంబాబు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడట"  అంది విషయం బయట పెట్టి వంటింటి వైపు వెడుతూ
 
నేను చివాలున సోఫా నుంచి లేచి కల్యాణి వెనకే వెళ్లి " ఏమిటి వేరే కులం అమ్మయినా ? పెద్ద అన్నయ్య ఒప్పుకున్నాడా? "
 
" మొదటగా మీ వదినతోనే చెప్పాడట. ఇంకా మీ అన్నయ్య దాకా వేళ్ళ లేదు. ఈ విషయంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవ అవుతుందేమో నని మీ వదిన కి భయంగా ఉందట"  
 
 ఇంకా పెద్దన్నయ్య దాకా వెళ్ళని విషయం కళ్యాణి తో పెద్ద వదిన చెప్పిందంటే, దానికి కారణం లేకపోలేదు. అందరి  తోడికోడళ్ళతోనూ పెద్ద వదిన సఖ్యత గానే ఉంటుంది కానీ, కల్యాణి తో ఎక్కువగా ఉండడానికి కారణం, కళ్యాణి వాళ్ళ చిన్నాన్నగారి కూతురు కావడమే.
 
  రాంబాబు ప్రేమలో పడడం అందులో వేరే కులం అమ్మాయితో !.  పెద్దన్నయ్య ఎలా దీనికి స్పందిస్తాడో !  ఈ సమాచారంతో  నాలో పెద్ద కుతూహలమే రేగింది . అందుకు కారణం లేకపోలేదు.
 
నేను గతంలో ఎదుర్కొన్న పరిస్థితే ఇప్పుడు రాంబాబు ఎదుర్కుంటున్నాడన్నమాట. కళ్యాణి ఇచ్చిన సమాచారం నాలో పెద్ద ప్రశ్న లేపడమే కాకుండా నన్ను గత జ్ఞాపకాలలో పడేసింది.
 
*****
 
 ఇది జరిగి పన్నెండు ఏళ్ళు అయినా నా మనసులో ఇంకా అప్పుడప్పుడు మెదులుతూనే ఉంటుంది. నేను సిఏ  పూర్తి చేసిన వెంటనే  ఓ కంపెనీ లో  ఫైనాన్స్ మేనేజర్ గా చేరాను . చేరిన ఆరునెలలకే  ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ తలపెట్టింది. దానితో చాలామాట్లు  ముంబయికి  ఫ్లయిట్ లో వెళ్ళ వలసి వచ్చేది. ఒక మాటు నా పక్క సీట్లో ఒక అమ్మాయి ప్రయాణం చేసింది. పేరు రజని. చాలా కలుపుగోలు మనిషి అవడంతో, కొద్దీ సమయంలోనే పరిచయం అయి సంభాషణలో పడ్డాము. రజని ఓ పెద్ద కంపెనీ లో కంపెనీ సెక్రెటరీ గా  హైదరాబాద్ లోనే  పనిచేస్తోంది. మాటల సందర్భంలో, నేను ముందు ప్లాన్ చేసుకోక పోవడం వల్ల, హోటల్ బుక్ చేసుకోలేదని తెలిసి, వాళ్ళ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని ఆహ్వానించింది.  ఆ పరిచయం హైదరాబాద్ తిరిగి వచ్చినతరువాత  బాగా పెరిగింది. చాలా మాట్లు  కలవడం, సినీమాలకి వెళ్లడం జరిగేది. వాళ్ళ వాళ్లు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. ఇద్దరు అన్నయ్యలు వేరే రాష్ట్రాల్లో ఐఎయస్  ఆఫసర్లు గా చేస్తున్నారు. వదినలు కూడా ఐఎయస్ ఆఫీ సర్లే.  ఆమె ప్రోత్సాహంతోటే ఏసిస్ కోర్సు ప్రారంభించా.
 
 ఒక ఏడాది లో చాలా దగ్గర అయ్యాము. నాకు రజని వ్యక్తిత్వంలో చాలా విషయాలు నచ్చాయి. ఆమె  ఏ విషయాన్నయినా ఎక్కువగా మనసుకు పట్టించుకుని ఎక్కువసేపు ఆలోచిస్తూ కూచోదు. జరగవలిసింది జరుగుతుంది మనం బుర్ర పాడు చేసుకోవడం కంటే, చేయవలిసింది చేసుకుంటూ పోవడం ఉత్తమం అన్న తత్వం ఆచరణ లో పెడుతుంది. ఆర్ధికంగా మంచి స్థితి లో ఉన్నా వీలయినంత గా అవసరం లో ఉన్న వాళ్లకి సహాయపడుతూ ఉండే  ఆమె తత్వం నాకు బాగా నచ్చింది . ఇలాటి వన్నీ కలిసి ఎప్పుడో నాకు తెలియకుండానే నాలో ఒక ఆలోచన చోటు చేసుకుంది.  ఇద్దరం ఎందుకు పెళ్లి చేసుకో కూడదని. ఒక ఏడాది గడిచే వరకూ  ఆ ఆలోచన రాక పోవడానికి కారణం లేక పోలేదు. కులాల వ్యత్యాసం. వాళ్లంతా పక్కా మాంసాహారులు. మేము గుడ్డు కూడా తినని శాఖాహారులం. అయినా నాకు ఎందుకో ముందుకు వెళ్లాలని  అని పించింది. కానీ పెద్దన్నయ్య తో సంప్రదించకుండా ముందుగానే రజని తో కదపడం నాకిష్టం లేక పోయింది. తన  వైపు నుంచి అభ్యంతరం ఉండదని నాకు తెలుసు. నాలో ఏమి చూసి ఒప్పుకుంటుందని అని అడిగితే, ఏమీ చెప్పలేను. బయటికి చెప్పని బహుశా నా కళ్ళలో కనపడే ఆరాధనా భావం అనుకోవచ్చేమో.
 
మూడు రోజులు సెలవలు వస్తే, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్లి వద్దా మినిపించి  బయలు దేరా. "గోదావరి వైపు ఊళ్లు ఎప్పుడూ చూడలేదు నేను కూడా వస్తానని బయలుదేరింది రజని కూడా"
 
మా పెద్దన్నయ్య ఇల్లు పెద్దదే కానీ పాత కాలం ఇల్లు. బాత్ రూములూ అవీ అంత బాగుండవు. నరసాపురం లోనే నా చిన్నప్పటి క్లాస్మేట్ రామం రొయ్యలు వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు, వాడు అధునాతనం గా పెద్ద ఇల్లుకట్టుకున్నాడు నరసాపురం లోనే.  నాన్నగారు, అమ్మ తరువాత కొప్పర్రు లో ఎవరూ ఉండడం లేదు. అక్కడ ఇల్లుని అన్నయ్యలు వ్యవసాయం పనులకి వాడుతూ అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటారు. రామం తో చెప్పి  చెప్పి రజనీని అక్కడ దింపి నేను అన్నయ్య ఇంటికి వెళ్లాను. వదిన తో చెప్పాను రజని వచ్చిన సంగతి. ఇంటికే తీసుకు రాక పోయావా ? అంది
 
ఉండడానికి రామం ఇంట్లో అయినా, రజని చాలా సేపు అన్నయ్య ఇంట్లోనే అందరితో ఎక్కువ సమయం ఉండి అందరితోనూ కలిసి పోయింది. అన్నయ్య కూతురు బాల తోటీ కొడుకులు రాజా , రాంబాబు ల తోటీ బాగా కలిసి పోయింది గోదావరి పరిసర ప్రాంతాలు, కొబ్బరి చెట్లు, పచ్చని తివాసీ లాంటి  వరి పొలాలూ  అవీ చాలా బాగా నచ్చాయి రజనికి. పోతే హైరాబాద్ కంటే హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి ఫ్యాన్ గానీ, ఏసీ గానీ లేకుండా ఇళ్లల్లో కష్టమని గ్రహించడానికి అట్టే సేపు పట్టలేదు  పెద్దన్నయ్య తప్ప అందరం కలిసి  అంతర్వేది అవీ చూసి వచ్చాము . .
 ఆ మరునాడు ప్రొద్దుట రాజా రజనీని గోదావరి మీద పడవ షికారు కి తీసుకు వేళ్ళాడు.
 
 
నేను పెద్దన్నయ్యతో మాట్లాడుతూ ఉండిపోయాను. మిగతా వాళ్లు పట్ట లేదు కానీ పెద్ద  వదిన పసి కట్టేసింది. పెద్దన్నయ్యతో ఉండగానే వదిన వచ్చి " ఏమయ్యా రజని, స్నేహితురాలేనా ? ఇంకా ఆలోచన ఏమన్నా ఉందా ? అంది నవ్వుతూ
 
నాన్నగారి తరువాత పెద్దన్నయ్యే అన్ని విషయాలు చూస్తునందువల్ల అన్ని ముఖ్య విషయాల లోనూ అందరం పెద్దన్నయ్యతో సంప్రదించి చేయడం అలవాటు. మా కుటుంబం లోనే  కాకుండా, అతని పాత విద్యార్థులు, ఊళ్లో చాలామంది తెలిసిన వాళ్ళు పెద్దన్నయ్య సలహా చాలా విషయాలలో తీసుకోవడం కద్దు. అదీ కాకుండా చేస్తున్నది స్కూల్ లో టీచర్ ఉద్యోగమయినా పెద్దన్నయ్య ప్రాపంచిక విషయాల యితే నేమి, ఆధ్యాత్మిక విషయాలయితే నేమి చాలా చదివాడు. అవి ఇచ్చిన సమరస్త్వము దృష్ట్యా చాలా మంది ఆయన అభిప్రాయానికి విలువ ఇవ్వ డం చూస్తూనే ఉన్నాము.
 
పెద్దన్నయ్యతో ఎలా కదపాలా అని నేను సందేహిస్తోంటే వదిన అలా అడగడం అవకాశం గా తీసుకుని నేను పెద్దన్నయ్యతో అన్నాను
  " రజనిని చూశావు కదా?"      అన్నాను అభిప్రాయం అడుగుతున్నట్టు
"చాలా చలాకీ గా ఉంది అమ్మాయి. బాగానే ఉంది. చెప్పిన విషయాలు బట్టి వాళ్ళు మన వాళ్ళు కాదేమో"  అన్నాడు ఆమె కేస్ట్ దృష్ట్యా.
 
" అవును మన కేస్ట్ కాదు. అది పెద్ద ముఖ్య విష్యం కాదేమో"  అన్నాను డిఫెన్సివ్ గా
 
" నేను చిన్నప్పటి నుంచీ నిన్ను చూస్తున్నాను కదా!, నా నిర్ణయం చెప్పమంటే, నువ్వు ముందుకు వెళ్లడం మంచిది కాదేమో. అలా అయితేనే నువ్వు భవిష్యత్తులో ఆనందంగా ఉంటావేమో! " ఒక్క 'కేస్ట్' విషయం  దృష్ట్యా ఈ నిర్ణయం చెప్పటం లేదు, అది  ముఖ్య విషయం  కాదన్నావు.  ముఖ్య విషయం అవునా కాదా అన్నది ఒక సాధారణ విషయం గా కాకుండా అందరు వ్యక్తుల కీ ఒకే విధంగా కాకుండా, వ్యక్తి వ్యక్తి కీ అతని మనస్తత్వం దృష్ట్యా చూడక పోతే సరయిన నిర్ణయానికి రాలేమేమో "  
 
"అంటే ?" అన్నాను పూర్తిగా అర్థం కాక పోయినా , కొంత చూచాయగా నా మనస్తత్వానికి  ముడి పెడుతున్నాడని గ్రహించి
 
" మనం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు  ప్రస్తుత ఎమోషన్ దృష్ట్యానే కాకుండా కొంచెం ముందు జరగ బోయే విషయాలు కూడా ఊ హించుకుని మన వ్యక్తిత్వం దృష్ట్యా విశ్లేషించు కోవడం మంచిదేమో.  కొంచెం వివరాల లోకి  వెడదాము. కేస్ట్ వినగానే మాంసాహారులని పించినా, ఈ రోజుల్లో చాలామంది స్వచ్ఛందం గా శాఖాహారం పాటిస్తున్నారు. దాని దృష్ట్యా ఆ అమ్మాయి నాన్ వెజ్ తీసుకుంటుందా లేదా  అన్నది నాకు తెలియదు "
 
"  తను నాన్ వెజ్ తీసుకుంటుంది"
 
" ఓకే. నా అభిప్రాయం ఏదయినా, నిర్ణయం తీసుకోవాలిసింది నువ్వే. అయితే నేను చెప్పబోయే రెండు విషయాలు నువ్వు దృష్టి లో ఉంచుకుని, బాగా అలోచించి నిర్ణయం తీసుకో.  రెండిటి లో మొదటిది ఆహార విషయాలు. చిన్నప్పుడు చిన్నన్నయ్యని ఓ వారం రోజులు గుడ్డుని  పాలల్లో తీసుకోమని డాక్టర్ చెబితే వాడు ఓ గ్లాసు వాడాడు. అమ్మ దానిని వేరే ఒక చోట పెట్టించినా. నువ్వు ఒక రోజు పొరపాటున దానిని వాడి, గ్లాసు బాగా కడిగినా, అందులో వచ్చిన వాసన కి వాంతి చేసుకుని అందరినీ తిట్టి పోశావు. ఆ వేళ మన ఇంట్లో ఉన్న నా  క్లాస్ మేట్ నారాయణ వేళాకోళం గా  " వీడి పెళ్ళాం గుడ్డు తింటే ఆమె దగ్గరికి వేళ్ళడేమో" అని అంటే అందరం నవ్వుకున్నాము.
 
ఇక రెండోది కొంచెం రిమోట్ విషయం అనిపించినా ఇప్పుడు తప్పకుండా ఆలోచించ వలసిన విషయం. నీకూ పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దవాళ్లు అవుతారు. వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలి. ఇప్పుడు నువ్వు రజని ని పెళ్లిచేసుకోవడం వల్ల , నీపిల్లలకి నీ కేస్ట్ లో వాళ్ళకే ఇచ్చి చేయడం వీలు కాక పోవచ్చు. ఎందుకంటే తెలిసీ నీ కేస్ట్ వాళ్ళు ముందుకు రారు. ఇప్పుడు అలా జరుగుతున్న కేసులు చూస్తున్నాము. అయితే నువ్వు రజనీ వాళ్ళ కేస్ట్ లో ఇవ్వడానికి సిధ్ధ  పడాలి. అప్పటికి కేస్ట్ పట్టింపులు సమసి పోతాయి అని భ్రమ లో ఉండకు. గతం లో కంటే ఇప్పుడు  కేస్ట్, సబ్ కేస్ట్ వారీగా మేరేజ్ బ్యూరో లు పుట్టుకు రావడం చూస్తూనే ఉన్నాము, రాజకీయం గా కానీ, సాంఘికం గా కానీ అవి ఇప్పట్లో సమసి పోతాయని ఆసించకండా మనం సిద్ధపడడం తెలివయిన పని.  అయితే  సాంఘికం గా, ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయి లో ఉన్న కుటుంబాలలో కేస్ట్ ప్రభావం ఎక్కువ ఉండక పోవచ్చు. అది సినిమా తారలు, క్రికెట్ తారలు విషయంలో చూ స్తూనే ఉన్నాము. కానీ మనలాంటి కుటుంబాలలో కొన్ని సమస్యలు తలా ఎత్త  వచ్చేమో"   అని ముగిస్తూ  "నా అభిప్రాయం ముందే చెప్పాను కాబట్టి. ఆలోచించి నిర్ణయం నువ్వే తీసుకో "  అన్నాడు
 
నేను అప్పటికి ఆ విషయం మళ్ళీ కదప లేదు
 
****
పెద్దన్నయ్య చెప్పినవి మనసులో మెదులుతూ హోమియో మందులా లోలోపలే పనిచేసి చివరికి రజని వద్ద ఆ విషయం ఎత్త కుండానే అణగి పోయింది. నిర్ణయం నాకే వదిలేశాడు కాబట్టి ఎప్పుడూ ఆయన్ని ఏమీ అనుకోక లెకపొయాను.
 
ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు రాంబాబు వార్త తో మళ్ళీ గుర్తుకు వచ్చాయి. రాంబాబు పెదఅన్నయ్యతో ఆ విషయం  చెబుతాడా? చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అన్న ప్రశ్నలకి  జవాబు కోసం ఎక్కువ రోజులు ఆగ నక్కర లేక పోయింది.
 
కల్యాణికి పెద్ద వదిన నుంచి వచ్చిన ఫోన్స్ ద్వారా తెలిసింది ఏమిటంటే మంజరి అనే వాడి కొలీగ్ తో  మ్యారేజ్ ఫిక్స్ అయిందని.

ఆ తరువాత పెద్దన్నయ్యే ఫోన్ చేసి చెప్పాడు. పెళ్ళి హైద్రాబాద్ లోనే జరుగుతుందని.  నేను చేయవలసిన పనులు కొన్ని పురమాయించి కార్డు పంపాడు. అనుకున్నట్టే కార్డు బట్టి చూస్తే వధువు తాలూకు వాళ్ళు వేరే కేస్ట్ అన్నది స్పష్టం గానే ఉంది. పెద్దన్నయ్య మనస్ఫూ ర్తి  గానే ఒప్పుకున్నాడా అన్న సందేహం నన్ను దొ లుస్తూనే ఉంది
 
పెళ్ళికి మూడు రోజులముందు పెద్దన్నయ్య వాళ్ళు మా ఇంట్లోనే దిగారు. నా కుతూ హలం అణచుకో లేక వాళ్ళు సెటిలయింతరువాత అన్నాను పెద్దన్నయ్యతో " అమ్మాయి వాళ్లు  వేరే కేస్ట్ లా  ఉందే "  అన్నాను.
 
"నీ ప్రశ్న అర్థమయిందిరా. నీ విషయంలో  అలా చెప్పి, రాంబాబు విషయంలో ఎలా ఒప్పుకున్నాన నే కదా? నీ సందేహం?
సరిగ్గా నీకు ఎలా చెప్పానో వాడికీ అలాగే చెప్పాను. నువ్వు ముందుకు వెళ్ళలేదు. వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. అది వాడి  నిర్ణయం. మనం చేయగలిగింది ఏముంది? " అన్నాడు పెద్దన్నయ్య నిర్లిప్తంగా
 
రాంబాబు కొచ్చిన్ లో పనిచేస్తున్నాడు. పెళ్ళికి ముందు ఆఫిస్ పనిమీద కెనడా వెళ్లినందున, పెళ్ళికి ఒక రోజు ముందే వచ్చాడు హైదరాబాద్. అందరూ పెళ్లి హడావిడి తో ఉండడంతో నేను వాడితో మాట్లాడడం కుదరలేదు.
 
కళ్యాణ మంటపానికి అందరూ కార్లలో బయలుదేరారు. నన్నూ రాంబాబునీ ఒక కారు లో రమ్మన్నారు. దారిలో అడిగాను " ఎరా మరి
నాన్ వెజ్ తినడానికి ప్రిపేర్ అయిపోయావా? "అన్నాను నవ్వుతూ.
 
"బాబాయ్ ఒక రహస్యం చెబుతాను  "నాన్ వెజ్ మానేస్తానని మంజరికి ప్రామిస్ చేశాను"
 
"అదేమిటి ? నువ్వు ప్రామిస్ చేయడమేమిటి? అన్నాను అర్థం కాక
 
ఐఐటీ హాస్టల్ లో ఫ్రెండ్స్ తో బాగా నాన్ వెజ్ అలవాటయింది బాబాయ్. మంజరీ వాళ్ళూ కేస్ట్ పరంగా నాన్ వెజ్ అయినా, వాళ్లంతా స్ట్రిక్ట్ వెజ్.
 
ఇంక నేను మాట్లాడ లేదు

మరిన్ని కథలు