Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of kashmir

ఈ సంచికలో >> శీర్షికలు >>

అలా... ఇలా..... - భమిడిపాటి ఫణిబాబు

alaa..ilaa

ఈ రోజుల్లో ఎవరిని చూసినా, ఎవరి మాటవిన్నా, ప్రతీవారూ అనేదేమిటంటే, ఫలానావి  కనుమరుగైపోతున్నాయీ,మారోజుల్లో అలా ఉండేదీ, ఇలా ఉండేదీ.. అనడమే. నిజమే కదా, కాలంతోపాటు అన్నిటిలోనూ మార్పులు వస్తాయే. కాలానికి అనుగుణంగా మారాలితప్ప, ఊరికే బాధపడితే ప్రయోజనం ఉండదుగా. మనుషుల మనస్థత్వాలలో మార్పొచ్చింది, అలవాట్లలో మార్పొచ్చింది.

తెలుగు భాష గురించి చాలామందే బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా ఇంగ్లీషూ, హిందీయే. తెలుగులో మాట్టాడడం చిన్నతనంగా భావిస్తున్నారు చాలామంది.అడిగినా అడక్కపోయినా, కనీసం పెళ్ళయేవరకూ, కడుపు నింపడానికి అమ్మ కావాలి, కానీ భాష దగ్గరకొచ్చేసరికి ఆవిషయం మర్చిపోతున్నారు చాలామంది.అసలు మాట్లాడడమే తక్కువ. ఎక్కడ మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే భయం. ఈ(e) పేమెంట్ల ధర్మమా అని ఎక్కడో ఏ ఆఫీసుకో వెళ్ళి వివరాలు అడగవలసిన పరిస్థితి లేదు.ఎయిర్, రైల్ రిజర్వేషన్ల దగ్గరనుంచి ప్రతీదీ ఓ మీట నొక్కితే అయిపోతోంది.

ఇదివరకటి రోజుల్లో తల్లితండ్రులు కనీసం ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలతోనూ, తల్లితండ్రులతోనూ మాట్టాడేవారు. ఇప్పుడు అసలా అవకాశమే కలగడమేలేదాయె. ఎప్పుడు చూసినా చెవిలో ఓ"పువ్వు", మెడవంచేసి ఏదో క్లయంటుతో కాల్స్ అంటూ. రోడ్డు మీద నడుస్తూంటే కాల్స్, కార్లు డ్రైవు చేస్తూ కాల్స్, ప్రొద్దుటే ఫలహారం చేస్తూ కాల్స్, టాయిలెట్లలోకి వెళ్తే కాల్స్, చివరాఖరికి భార్యాభర్తలు రాత్రెప్పుడో పడకెక్కినా, పక్కనే ఆ మాయదారి సెల్ ఫోన్ లేకుండా గడవదు. ఈ కాల్స్ ధర్మమా అని బయటివారితో రాకపోకలూ తగ్గిపోతున్నాయి. కర్మ కాలి ఎవరైనా వచ్చినా, నోరెత్తకూడదు, ఒకళ్ళమొహం ఒకళ్ళు చూసుకుంటూ సైగలతోనే కాలక్షేపం.అదేదో "Silent valley" చూడ్డానికి ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు. నేను చూసిందేమిటంటే, మిగిలిన భాషలు మాట్టాడేవారు, కొంతవరకైనా మాతృభాషలో మాట్టాడడానికీ, రాయడానికీ కనీసం ప్రయత్నమైనా చేస్తారు.

కానీ, తెలుగు వచ్చేసరికి అది బహుతక్కువగా కనిపిస్తోంది. ఈరోజుల్లో చాలామంది, అంతర్జాలం పుణ్యమా అని, చాలావేదికల్లో రాస్తున్నారు. అక్కడైనా తెలుగులో వ్రాస్తారా అంటే అక్కడా ఇంగ్లీషే, ప్రపంచం అంతా చదవొద్దు మరీ? పోనీ ప్రసారమాధ్యమాల్లో ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అక్కడ ఉండే యాంకర్లు వాక్యానికి కనీసం నాలుగైనా ఇంగ్లీషు పదాల్లేకుండా మాట్లాడలేరు. ఇంక సినిమాలంటారా, ఏదో తెలుగులో పేరు పెడితే చూడరేమో అని భయం. అధవా పెట్టినా , వాళ్ళు పెట్టే పేర్లు చూసి ఆ సినిమాహాలు దరిదాపులకే వెళ్ళరూ. తెలుగు వార్తాపత్రికలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తెలుగులో మాట్లాడమంటే అదేదో గ్రాంధికంగా మాట్లాడమనికాదు, అలాగని పాతరోజుల్లోని పద్యాలూ అవీ పాడమనీ కాదూ,మామూలు జనసామాన్యభాషలో మాట్లాడినా చాలు. అదే కరువైపోతోంది. సాధ్యమైనంతవరకూ, ఆంగ్లపదాలని వాడడం తగ్గించినా, కొఁతవరకూ మెరుగే అనుకోవచ్చు.


ఇంక ఇళ్ళల్లోకి వద్దాం.భోజనం చేసేటప్పుడు అన్నంలోకి పప్పూ, దాంట్లోకి నెయ్యి వేసితింటే ఎంతబావుంటుందో. అదేం కర్మమో నెయ్యి అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు ఈరోజుల్లో. ఎవరో చెప్పారుట, నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందనీ, గుండె జబ్బులొస్తాయనీ, శరీరం పెరిగిపోతుందనీ. వాళ్ళ మొహమేమీ కాదూ, నెయ్యితింటే కాదు వళ్ళొచ్చేది, బయట బర్గర్లూ, సబ్ వేలూ, కుర్కురేలూ చెత్తా చెదారమూ తినీ.ఇదివరకటి రొజుల్లో ఇంట్లో నేతిచుక్క వేయకుండా తిండి పెట్టారంటే చిన్నబుచ్చుకునేవారు. ఇప్పుడు ఇంట్లో నెయ్యుందంటే నామోషీ. పోనీ నెయ్యి మానేయడం మూలాన రోగాలు తగ్గాయా అంటే,అదీ లేదూ, వచ్చే రోగాలొస్తూనే ఉన్నాయి.

ఇలాటిదే పంచదార.హయిగా బతికున్నంతకాలమూ తినేదేదో తినేసీ, త్రాగేదేదో త్రాగేసి బతక్క, ఎందుకొచ్చిన గొడవలండి బాబూ ఇవి? ఇదివరకటి రోజుల్లో క్షేమసమాచారాలు ఎలా అడిగేవారో అలాగ, ఎవరింటికైనా వెళ్తే మొదటి ప్రశ్న-- ఏదో కాఫీయో, చాయో ఇవ్వాలిగా -- సుగరాండీ అని! అలాటిదే ఉప్పొకటి. రుచీపచీ లేకుండా తినే తిళ్ళు ఇళ్ళల్లో దొరక్కే అసలు అందరూ బయటి తిళ్ళకి అలవాటుపడ్డారేమో!

ఇది వరకటి రొజుల్లో "పిచికలు" అనేవుండేవి. గుర్తుందా? నగరాల్లోనూ, పట్టణాల్లోనూ అసలు వీటి మాటే లేదు.శుభ్రమైన నీళ్ళ సంగతి అసలు అడగఖ్ఖర్లేదు.ఎక్కడ చూసినా , ఏ నదిచూసినా కలుషిత నీళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే,posterity కోసం భద్రపరచవలసిన వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

అలాగని నేను కూడా తెలుగుభాషని ఉధ్ధరించేస్తున్నాని కాదూ, ఈ వ్యాసం కూడా పూర్తిగా తెలుగులో ఎక్కడ వ్రాసి ఏడ్చానూ, పూర్తిగా అర్ధం అవడానికి, అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు వాడవలసొచ్చినందుకు క్షమించండి.కొంచం ఓపిక చేసికుంటే స్వఛ్ఛమైన తెలుగు భాషలో కూడా రాయొచ్చు. బధ్ధకం కదా..

సర్వేజనాసుఖినోభవంతూ...

మరిన్ని శీర్షికలు
sahiteevanam