Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు

kamanu veedhi kathalu
"పథిక్' పేరు వినగానే పెదాలపై నవ్వులు...కంటికొసల్లో నీళ్లు ఒకేసారి వచ్చేస్తాయి. ఈ ఫీలింగ్ ఇప్పటిది కాదు. దాదాపు నాల్గు దశాబ్దాల కిందటిది. అదేం చిత్రమో...ఇప్పటికీ ఆ పేరు నాలో కొత్తగానే మెరుస్తోంది. వాడి పరిచయం నాకే కాదు...అప్పట్లో మా ఈడు పిల్లలందరికీ ఓ అద్భుతమే! నిలువెత్తు నిర్లక్ష్యం...ఎప్పుడూ నల్గురిని వెంటేసుకుని తిరగడం...అల్లరి చిల్లరి వేషాలు...ఎవరినీ లెక్కచేయనితనం...పతిక్ ను పట్టిచ్చే ఆనవాళ్లు ఇవే! ఇంత చెబుతున్నాను కదా అని పతిక్ మా కమానో...చింతకుంట...కుంబార వీధి పిలగాడో అనుకోకండి. అసలు వాడిది మా ఊరే కాదు. ఏ ఊరో కూడా తెలీదు. అసలు ఎక్కడున్నాడో చెప్పలేను. ఫ్రెండ్ అంటున్నావ్...ఎక్కడుండే వాడో తెలుసుకోలేదా? అని మీరడగవచ్చు. కానీ వాడు కనిపిస్తేగా అడగడానికి. కనిపించని ఫ్రెండ్ జ్ఞాపకాలు మీతో పంచుకోవాలంటే నేను కచ్చితంగా వెనక్కి వెళ్లాల్సిందే!

"పథిక్ చక్రవర్తి వాజ్ రింగ్ లీడర్ అమంగ్ ద బాయిస్ ఆఫ్ ద విలేజ్...' ఇంగ్లిష్ పాఠాలను బట్టీ పట్టడం తప్ప మరో దారి లేదనుకునే వాళ్ల నోటెమ్మడి పదే పదే పలికే వాక్యాన్ని వినడం వల్ల కాబోలు...పథిక్ మా బుర్రలో పాతుకుపోయాడు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన సుప్రసిద్ధ కథ "హోమ్ కమింగ్' పదో తరగతి ఇంగ్లిష్ లో ఉండేది. నేను ఏడో తరగతి నుంచే ఆ కత వింటూ పెరిగాను. నాన్న ట్యూషన్ లో ఈ కత చెబుతున్నప్పుడల్లా నా మనసు పరవశించిపోయేది. ఎన్నిసార్లు విన్నా విసుగెత్తని ఈ కత నాకు పథిక్ ను ఎంతో దగ్గర చేసింది.  నా ఫ్రెండ్స్ రఘు,బుస్సి..వేణు, నగేష్, ఆచారి లాగా పథిక్ కూడా నా ఫ్రెండ్ లిస్టులో చేరిపోయాడు. నేనే కాదు మా ఈడు పిలగాళ్లం అందరం వాడి హీరోయిజానికి ఫిదా అయిపోయాం. మిగిలిన వాళ్ల మాటేమో గానీ నావరకు పథిక్ నాకూ చాలా విషయాల్లో పోలికలున్నాయనిపించేది. ఇలా అనుకోవడమే చిత్రంగా ఉంటుంది. కానీ నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనల్ని పోల్చి చూసుకుంటే...నిజమే కదా అనిపిస్తుంది. చిన్ననాటే తండ్రిని పోగొట్టుకున్న పథిక్ తల్లికి ఎప్పటికీ కొరకరాని కొయ్యే! సముద్రతీరాన ఉన్న ఆ పల్లెలో ఎలాగోలా సంసారం లాక్కొస్తున్న ఆమెకు పథిక్ పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. ఏ క్షణాన ఎవరు ఏ ఫిర్యాదు మోసుకొస్తారో అని ఆందోళన చెందేది. ఓ సారి అనుకోకుండా వచ్చిన మేనమామ బిషంబర్ పథిక్ ను కోల్ కతాకు తీసుకెళతానంటే...

ఆ తల్లి హమ్మయ్యా అక్కడన్నా వీడు బాగుపడతాడేమో అని ఆనందిస్తుంది. లేగదూడలా ఉత్సాహంగా గెంతుతూ తుళ్లుతూ కోల్ కతాకు వెళ్లిన పథిక్...అక్కడి వాతావరణంలో ఇమడలేకపోతాడు. నగరజీవనం ఇరుకుగానే కాదు..కృతకంగానూ అనిపించి లోలోపలే ఉక్కిబిక్కిరి అయిపోతాడు. పల్లెలో పిల్లకాల్వలా స్వేచ్ఛగా పరుగులు తీసిన పథిక్ కు నగరం ఓ నరకంలా కనిపిస్తుంది...ఊరిలో స్నేహితులతో తను గడిపిన క్షణాలు ప్రతి క్షణం గుర్తుతెచ్చుకుంటూ...గుండెలో గూడుకట్టుకున్న బెంగతో ...రెక్కలు తెగిన గువ్వలా విలవిల్లాడిపోతాడు. కెరటంలా ఎగిసిపడే కన్నీళ్లలో తడుస్తున్న పథిక్...వేదనకు ప్రతిరూపంలా కనిపిస్తాడు.

ఈ కతలో నాకూ వాడికీ సంబంధించిన ఒకే పదం "బెంగ'. ఎంతటి మనిషినన్నా కుదేలు చేసే శక్తి ఈ బెంగకుంది. పథిక్ ఏ బెంగతో తల్లడిల్లిపోయాడో...నేనూ అదే భావనతో అల్లాడిన ఓ విచిత్ర సందర్భం జీవితంలో చోటుచేసుకుంది. ఏడో క్లాసు సెలవులకు మా చిన్నమ్మ ఊరికి వెళ్లాను. పాణ్యం దగ్గర సిమెంట్ నగర్. మామూలుగా సెలవులొస్తే మేం వెళుతున్నదొకే ఊరికి ...అమ్మ వాళ్లూరు సింగేపల్లి. అయితే ఈసారి సిమెంట్ నగర్ అనేసరికి ఎగిరిగంతేశాను. కనీసం ఓ నెల అయినా అక్కడ బాగా సరదాగా గడపొచ్చని నా ఆశ. ఉత్సహాన్ని వెంటబెట్టుకుని వెళ్లనైతే వెళ్లాను కానీ...నాల్గోరోజుకే మొహం మొత్తేసింది. కమానులో అంతమంది ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా గంతులేస్తుండే నన్ను ఒక్కసారిగా ఎవరో కట్టిపడేసినట్టయింది. ఊరికెళతానని చెప్పడానికి మొహమాటం అడ్డొచ్చింది. కమాను మాటలు..ఆటలతో హడావుడిగా సందడిగా ఉంటే...నిశ్శబ్దంగా , గంభీరంగా ఈ సిమెంటునగరు ఏందిరా నాయనా అనుకున్నా. ఆడుకోడానికి ఈడు పిలగాడు ఒక్కడూ కనిపించలేదు. పాపం చిన్నమ్మ టైముకు తిండి పెట్టేది. స్వీట్లు చేసేది. కానీ ఇవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. చిన్నాన్న డాక్గరు. ఆయన ఓ రోజు రూములో నన్ను నిల్చోబెట్టి చేతికి బేండేజి ఎలా వేయాలో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆ మద్దేనం ఎందుకో తెలీదు...ఒక్కసారిగా గుండెలోంచి ఏడ్పు ఎగదన్నుకొచ్చేసింది. వలవలా ఏడ్చేశా! ఇద్దరూ బాగా కంగారుపడ్డారు.ఏందిరా ఏమైంది నీకు?

ఎందుకేడుస్తున్నావంటే...నేనూరికి పోతా...ఇప్పుడే పోతా అంటూ వెక్కిళ్లమధ్య చెబుతుంటే వారికి నేనెందుకలా చేస్తున్నానో ఓ పట్టాన అర్థం కాలేదు. ఆ తర్వాత వారు నా పరిస్థితి తెలుసుకున్నారు. అదేందిరా ఇక్కడ బాగానే ఉందిగా...నెల ఉంటానన్నావుగా...అన్నారే గానీ పాపం నా మనసు తెలుసుకుని నా తిరుగుప్రయాణానికి సర్వం సిద్ధం చేశారు. ఇంకేముంది రెండ్రోజుల్లో మా ఊరిలో ప్రత్యక్షమయ్యాను. అమ్మానాన్న...నా ఫ్రెండ్స్ అందరూ ఆశ్యర్యపోయారు. నెల్నాళ్లుంటానని గంతులేసుకుంటూ వెళ్లవ్...వారం తిరక్కుండానే దిగిపోయావేందిరా...అంటుంటే నేనేం మాట్లాడలేకపోయా! అప్పుడే నాకు అర్థం అయింది. ఊరిని వదిలి..ఈ కమాను వదిలి స్వర్గమైనా మాకు బేకులేదు అని! ఈ మాట అమ్మానాన్నతో అనలేదు గానీ..ఆ రోజు సాయంత్రం ఆడుకుంటూ ఫ్రెండ్స్ తో...ఏమోరా...ఈడ ఉన్నట్టు యాడా ఉండదనుకో! ఆరె గోలీలు, బొగిరీలు పట్టుకున్నోడు ఒక్కడంటే ఒక్కడు లేదేందిరా? ఈ ఆటలన్నీ వదిలేసుకుని ఎట్టా సచ్చేదిరా నాయనా...అందుకే వచ్చేసిండా అంటూ దీర్ఘంగా నిట్టూర్చా! బెంగ పదం ఎంత పెద్దదో...అది ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు బాగా తెలిసొచ్చింది. ఆ ఈడు పిల్లలకు సొంతూరి కన్నా స్వర్గం ఏదీ ఉండదని టాగూరు అన్నమాటలో ఎంత నిజముందిరా అనిపించింది.
ఊరినుంచి వచ్చిన ఉత్సాహంలో ఎండలోఎడాపెడా తిరిగేసరికి రెండ్రోజులకే జ్వరం వచ్చేసింది. ఇంకేముంది మంచమెక్కేశా! ఆ రోజు మధ్యాహ్నం ౩ గంటలు...జ్వరంతో మంచంపై పడుకుని ఉన్నా. నాన్న పక్కనే కూర్చొని టెన్త్ వాళ్లకి హోమ్ కమింగ్ కత చెబుతూ..పథిక్ కు ఇంటిపై బెంగ అంతకంతకూ ఎలా పెరిగిపోయిందో నాటకీయంగా వివరిస్తున్నాడు.

మధ్యలో నన్ను చూపుతూ వీడిలా అన్నమాట...అంటుంటే అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. మేనమామ బిషంబర్ పథిక్ ఊరిలో అడుగుపెట్టినపుడు...చక్రవర్తి ఇల్లు ఏదీ అని అడిగితే పథిక్ ఏమాత్రం ఖాతరు చేయకుండా ..బిషంబర్ మొహంకూడా చూడకుండా...అక్కడా అంటూ గాలిలో చేయి చూపించిన తీరు...దుంగపై కూర్చొన్నది తమ్ముడు అని కూడా చూడకుండా "రేయ్ వాడితో సహా దాన్ని తోసేయండ్రా...' అంటూ తన గ్యాంగుపిలగాళ్లకు ఆర్డరేసిన విధానం...నాన్న భలే చమత్కారంగా చెప్పేవారు. అసలు ఈ కతపై ఆసక్తి పెరగడానికి ఇది కూడా ఓ కారణమే! ఓ వైపు ట్యూషన్ అవుతుండగా నాకు ఉన్నట్టుండి జ్వరం బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే దుప్పటి కూడా వేడెక్కేంత. ఆ వేడి తట్టుకోలేక నేనే భయంకరంగా మూల్గుతుంటే...నాన్న కంగారుగా నా వంటిపై చేయివేశారు. "ఏంటి వీడి వళ్లిలా కాలిపోతోంది' అంటూ లేచారు. ట్యూషను అర్ధాంతరంగా ముగిసిపోయింది. అందరిలో కంగారు. ఇంట్లో ఉన్నట్టుండి ఓ ఉద్రిక్త వాతావరణం. అమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. క్షణాల్లో నాకు జ్వరమన్న విషయం కమాను అంతటా పాకిపోయింది. అందరూ ఇంట్లోకి వచ్చేశారు. ఈ హడావుడి నాకు లీలగా కనిపిస్తోందే కానీ ఏం జరుగుతోందో నా బుర్రకు అందడం లేదు. ఈలోగా పెదనాన్న ఇంటినుంచి భీమప్పతాత వచ్చాడు. ఆయన ఆయుర్వేద వైద్యుడు. నా నాడిపట్టి చూశాడు. అప్పుడు ఆయన కళ్లల్లో ఆందోళన నాకు కనిపించింది.

"ఏంటి వీడికింత జ్వరం...'అంటూ తాతయ్య నాన్నతో అంటున్నారు. ఇక లాభం లేదని నాన్న హడావుడిగా గాయత్రి డాక్టరు వద్దకెళ్లారు. కమానులో ఎవరికి ఏ జబ్బు వచ్చినా వెంటనే గుర్తొచ్చేది ఆ డాక్టరేగా! అదృష్టం బాగుండి ఆయన ఇంట్లోనే ఉన్నారు. నాన్న పిలవగానే ఏ కళలో ఉన్నారోగానీ వచ్చారు. అన్నీ పరీక్షలు చేశారు. నోట్లో థర్మామీటరుంచి తీసి చూశారు. దగ్గరదగ్గర...107 డిగ్రీల జ్వరం. చూడండి అంటూ నాన్నకు చూపించారు. నాన్న పాపం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. గాయత్రి డాక్టరు ఇది సన్ స్ట్రోక్ అని నిర్ధారించారు. నాన్న ఆదుర్దా గమనించిన  ఓ స్టూడెంటు ఐస్ గడ్డ తెస్తానని సైకిల్ పై వెళ్లాడు. ఇంట్లో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. మరో మాటలో చెప్పాలంటే ఇక నాపై ఆశలు వదులుకోవాల్సిన స్థితి. మృత్యు అంచుల్లోకి వెళ్లిపోతున్న నన్ను గాయత్రి డాక్టరే ఆపగలిగారు. ఆ క్షణాన ఆయన బుర్రలో ఏం వెలిగిందో గానీ చకచకా చీటీపై ఓ ఇంజక్షన్ పేరు రాసి అర్జంటుగా తీసుకురండని ఆదేశించారు. అది వేసిన ఓ అయిదునిమిషాలకే కడుపు దేవినట్టయి ఒక్కసారిగా వాంతి అయింది. ఇక అంతే...విచిత్రంగా అప్పట్నుంచి చాలా వేగంగా టెంపరేచర్ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం అయ్యేసరికి మామూలు స్థితికి వచ్చేశాను. ఆ రోజు గాయత్రి డాక్టరు రాకున్నా...కాస్త ఆలస్యంగా వచ్చి ఉన్నా ఎలా ఉండేదో...ఏమై ఉండేదో ఊహకు అందని విషయం.వడదెబ్బ తగలడం...ప్రాణం పోయేంతగా జ్వరం రావడం ఒక ఎత్తయితే..చిన్నమ్మ ఊరికి వెళ్లడం...అక్కడ్నుంచి కమానుపై బెంగతో వచ్చేయడం...పథిక్ కత వింటూనే అనుకోకుండా అయినా మృత్యుముఖంలోకి వెళ్లి బతుకు జీవుడా అంటూ బైటపడటం...అంతా ఓ కతలా జరిగిపోయింది!!

పథిక్ జీవితంలోలాగే నా జీవితంలోనూ దాదాపు ఒకేరకం ఘటనలు చోటుచేసుకున్నాయి. పథిక్ చదువుకోడానికి మేనమామ వెంట కోల్ కతాకెళితే...నేను సెలవులని చిన్నమ్మ ఊరికి వెళ్లాను. వాడూ ఊరిపై బెంగ పెంచుకున్నాడు. నేనూ అదే బెంగతో ఉండలేక ఊరికొచ్చేశాను. బెంగ ఎక్కువై వాడు మృత్యుముఖంలోకి వెళ్లిపోయాడు. నేను కారణం వేరే అయినా జ్వరంతో మృత్యువుకు దాదాపు షేక్ హ్యాండ్ ఇచ్చినంత పనిచేసి బైటపడ్డాను. వాడికీ ఆటలు, ఫ్రెండ్స్ అంటే ఇష్టం...నేను సేమ్ టు సేమ్. ఇంకో విచిత్రం ఏంటంటే...వాడు క్లాసుపుస్తకం పోగొట్టుకుని మేష్టారుతో మౌనంగా దెబ్బలు తింటే...నేను తెలుగు నోట్సు పోగొట్టుకుని దాదాపు పదిహేను రోజుల దాకా సారు బెత్తంతో కొడుతుంటే ఓర్చుకున్నాను. ఇన్నివిధాల పోలికలు ఎలా సాధ్యం అని అప్పట్లో ఆశ్యర్యపడ్డా...తర్వాత నాకే కాదు..నాలా టీనేజీ పిల్లవాళ్లకు ఇలాంటి సుగుణాలే ఉంటాయని అర్థమైంది. అర్థం కానిదొక్కటే ఆ వయసు  ఆలోచనలు...మానసిక స్థితి...అభిరుచులు టాగూరు అంత సరిగ్గా ఎలా ఊహించగలిగారా అని. కతలో పథిక్ ను నిలిపిన తీరు ఎంత చెప్పినా తక్కువే! ప్రారంభంలో వాడు చేస్తున్న ఆల్లరి...వాడి తిరుగుళ్లు ఎంత ముచ్చటగా ఉంటాయో...కోల్ కతాకు ఎళ్లనప్పటి నుంచి వాడి మనసు ఎంతలా కుమిలిపోతుందో తలచుకుంటున్నకొద్దీ కళ్లెంబటి నీళ్లొస్తాయి. అసలు ఈ టీనేజీ వయసు పిల్లల మనసు అటు ఇటుగా ఎలా ఊగుతుందో చెబుతూ ...ఈ వయసే అంత. పిల్లల్లో కలిస్తే...ఏరా చిన్నోళ్లతో ఆటలా సిగ్గులేదూ...అంటారు. పోనీ అని పెద్దల ముచ్చట్లో మాట కలిపితే...ఏరా అప్పుడే అంత పెద్దోడివయ్యావా అనేస్తారు. ఎవరితో కలవాలో తెలీక సతమతమయ్యే మానసిక స్థితి ఆ వయసు పిలగాళ్లది. ఇంట్లో పెద్దోళ్ల మాటలు ఏమాత్రం వినక చెలరేగే వీరిలో ఎంత సున్నిత భావాలుంటాయో టాగూరు మనసుకు హత్తుకునేలా చెప్పారు.

స్కూల్లో వాడు ఎవరితోనూ ఇమడలేక ఒంటరిగా మౌనంగా కూర్చోవడం..ఊరు..అక్కడి సముద్రం..విశాల తీరం...స్నేహితుల సరదా సంభాషణలు...అందరూ తనను హీరోలా గుర్తించిన సందర్భాలూ తలచుకుంటున్న కొద్దీ పథిక్ మనసు ఎంత కన్నీరు కార్చిందో! చివరికి ఉండబట్టలేక మేనమామను "నాకు ఊరు చూడాలని ఉంది' అంటూ బేలగా అడిగితే...సెలవులు వస్తాయిగా అప్పుడెళుదువు గానీ సరేనా...అన్నప్పుడు పాపం ఆ చిట్టి గుండె ఎంత కుంగిపోయిందో! నిర్లక్ష్యానికి మరో పేరుగా పెరిగిన పథిక్ ఆ క్షణాన మేనమామ మాటకు బదులు చెప్పలేక...పెదాలపై మౌనాన్ని నిలుపుకొని...తలదించుకుని వెళుతుంటే...వాడిపై ఒంటరితనం చేస్తున్న యుద్ధం ఎంత భయంకరంగా ఉందో ఊహించుకుంటేనే నా గుండె కలుక్కుమనేది. వంటిపై జ్వరం ఉన్నా...వర్షం హోరున కురుస్తున్నా...ఇంటికెళ్లాలి అనే పిచ్చికోరికతో పథిక్ తడిసి ముద్దయి వణుకుతూ మేనమామ ఇంటిముంగిట చేరిన తీరు దారుణం.మృత్యువు క్రూర హస్తాలతో లాక్కెళుతుంటే...అంత సంధిలోనూ "బై ది మార్క్ త్రీ పాథమ్స్...బై ది మార్క్ ఫోర్ పాథమ్స్...' అంటూ ఉద్విగ్నంగా...కలవరింతగా అరుస్తూ...ఆ నేలలో ప్రతి మట్టి కణాన్ని...ఆ సముద్రంలోని ప్రతి అలనూ...బేలగా...స్నేహంగా...ఆర్తిగా... ఆహ్వానిస్తూ అరిచే ఆ అరుపులు నన్ను వెంటాడి వేటాడుతుంటే ఎన్ని నిద్రలేని రాత్రుల్లో నా కళ్లు నిశ్శబ్దంగా దిండును తడిపేశాయో!! చివర్లో అమ్మ..."పథిక్ నా కన్నా...చూడరా నాన్నా...' గుండెలవిసేలా ఏడుస్తుంటే...వాడు మగతగా కళ్లు తెరచి పై కప్పుకేసి  చూస్తూ..."అమ్మా ...సెలవులొచ్చేశాయ్..' అన్న చివరి మాట నా గుండెలో గునపాల్నే దింపింది.

ఒరేయ్ పథిక్...మనమిద్దరం కలుసుకోలేదు...కనీసం మాట్లాడుకోలేదు...మరి నా జీవితంలోకి ఎలా వచ్చావురా? ఎందుకొచ్చావురా? ఇప్పటికీ నీ కబుర్లు ఊహించుకుంటుంటే గుండెపొంగుతుంది...వెళ్లిపోతూ నువ్వన్న మాటలు మనసును ఎంత గాయం చేశాయో నీకేం తెలుసు? ఎన్నైనా చెప్పు...నువ్వలా ఉన్నట్టుండి మమ్మల్ని వదిలేసి వెళ్లి ఉండాల్సింది కాదు. ఒంటరిగా నువ్వెళ్లిపోయావ్...మమ్మల్ని ఒంటరి చేసేశావ్! టాగూరు లేడు కానీ...ఉంటే కచ్చితంగా ఎందుకిలా చేశారు? నా పథిక్ ను అని కచ్చితంగా నిలదేసేవాణ్ని...నిజం!!
మరిన్ని కథలు
karteekadeepaalu