Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue187/537/telugu-serials/atulitabandham/atulitabandham/

 

( గతసంచిక తరువాయి)  దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ కళ్ళు తుడుచుకోవాలని చీర కొంగు ముందుకు లాక్కోబోయింది వినత. చీర కొంగు తగలలేదు... మళ్ళీ తడుముకుంది... మెత్తని శాటిన్ నైటీ తగిలింది...

గబుక్కున మెలకువ వచ్చేసి,  ఒక్క ఉదుటున లేచి కూర్చుంది వినత. ఆమె కళ్ళ నుండి ఇంకా కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి... తాను కలగన్నానని అర్థమైంది... కానీ దుఃఖం మాత్రం ఆగటం లేదు. ఇది కలా? కలేనా? నిజం కాదు కదా? చుట్టూ చూసింది. మసక వెలుతురులో తన గది, గదిలోని వస్తువులూ కనిపించాయి. అబ్బా, ఎంత భయంకరమైన కల! ఎంత పరుషమైన మాటలు!!

పవన్ తన అన్నయ్యతో మాట్లాడిన మాటలు విని చెదిరిపోయిన మనసుతో, ఎంతో దుఃఖంతో గదిలోకి వచ్చి ఏడుస్తూ పడుకుంది తను. విడిపోవటం అంటూ జరిగితే అన్నయ్య ఇంట్లో తన పరిస్థితి ఇంతేగా? భవిష్యద్వాణి కల ద్వారా చెప్పేసింది...

మధు వదిన ఎంత మంచిది, సాత్వికురాలు అయినా తన మీద కోపం ఎలా పోతుంది? ఆ రోజు ఆమె జారి పడాలని, ఆమె గర్భాన ఉన్న బిడ్డ ఆమెకి దక్కకూడదని ఏ ఆడదీ చేయకూడని పని తాను చేసింది... అదసలు ఎవరైనా క్షమించగలిగే నేరమేనా? పశ్చాత్తాపంతో వినత కళ్ళల్లోంచి మళ్ళీ  గంగాయమునలు ప్రవహించసాగాయి. మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ బల్ల మీద ఉన్న వాటర్ బాటిల్ ఎత్తి నీళ్లన్నీ తాగేసింది.

ఇంతలో హాల్లోంచి సన్నగా మాటలు వినబడసాగాయి.  పవన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు...

“అయ్యో, మధూ, కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను...” మొబైల్ మాట్లాడుతూ లోపలికి వచ్చి, బట్టలు మార్చుకున్నాడు.

“ఏమైంది?” గాబరాగా అడిగింది వినత.

“ఏం లేదు వినతా... నువ్వు పడుకో...” పర్సు తీసి జేబులో పెట్టుకుంటూ చెప్పాడు పవన్.

“కాదు, నిజం చెప్పండి పవన్, ఏమైంది?”   దీర్ఘంగా నిట్టూర్చాడు పవన్. “మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందట... హాస్పిటల్ లో ఉన్నాడు... కానీ డోంట్ వర్రీ... ప్రాణానికి ఏమీ భయం లేదు...కాలికి దెబ్బ తగిలింది అంతే... సరేనా, నేను వెళ్లి వస్తాను... అందరూ పడుకున్నారు... ఎవరికీ చెప్పకు, కంగారు పడకు...”

“కాదు... నేనూ వస్తాను మీతో...”

“నో... ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నాడు... ఎవరినీ ఇప్పుడు రానీయరు... నేను చెబుతున్నాను కదా, ఏం భయం లేదు... నేను అక్కడినుంచి ఫోన్ చేస్తాను...లోపలి నుంచి తలుపు వేసుకో...”

అతని వెనుకనే వచ్చి తలుపు వేయబోతూ, “పవన్, అయామ్ ఆ ఫుల్లీ సారీ... నాకు... నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది... అవకాశం ఇస్తారు కదూ?” అంది పూడుకుపోయిన గొంతు పెగుల్చుకుంటూ...

“ఇది సమయం కాదు... నన్ను వెళ్ళనీ...” రెండు నిమిషాల్లో కారు స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది... ఏం చేయాలో తోచక, తనను తాను నిందించుకొంటూ, ఒక్క అవకాశం ఇవ్వమని దేవుడిని వేడుకుంటూ, అన్న గారి కోసం ప్రార్థిస్తూ వీధి తలుపు మూసి, లోపలికి వచ్చింది వినత. ఎల్లవేళలా విశ్వవిజేతలా ఉండే వినత ఇప్పుడు సర్వస్వం కోల్పోయిన దీనురాలిలా ఉంది.

***

పవన్ మాట్లాడిన మాటలు విన్నాక వేణు చాలా డిస్టర్బ్ అయ్యాడు. పవన్ తాను వినత వలన పడిన బాధలు, అనుభవించిన మానసిక క్షోభ చెబుతూ ఉంటే తనకు తానే ఒక దోషిలా ఫీలయ్యాడు...

ఇంటికి బయలుదేరాడే కానీ, మనసులో పవన్ మాటలు, అతను తీసుకున్న నిర్ణయం మారు మ్రోగుతూ ఉండగా, బైక్ కి అడ్డం వచ్చిన కుక్కపిల్లని తప్పించబోయి, లెఫ్ట్ కి కట్ చేసి, మరో బైక్ కి ఢీ కొట్టి, క్రింద పడిపోయాడు.

ఆ బైక్ మీదున్న అబ్బాయికి పెద్దగా దెబ్బలు తగల్లేదు... కానీ వేణుకు మాత్రం చేతులూ, కాళ్ళూ చెక్కుకుపోవటంతో పాటుగా కుడి  కాలికి బాగా దెబ్బ తగిలింది... కాలు కదల్చ లేకపోయాడు....వేరే బైక్ మీది అబ్బాయి వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళితే వెంటనే జాయిన్ చేసేసుకున్నారు. అక్కడి నుంచి మధూకి ఫోన్ చేసాడు వేణు.

పవన్ వెళ్లేసరికి పరిస్థితి ఏమిటంటే, ఫస్ట్ ఎయిడ్ చేసి, గాయాలకు ప్లాస్టర్లు వేసారు. కదల్చలేకపోతున్న కుడి కాలికి ఎక్స్ రే తీసారు. అనుమానించినట్టే మేజర్ ఫ్రాక్చర్ ఉంది... మర్నాడు సర్జరీ చేయాలని, సర్జరీ అయ్యాక ఆరు వారాలు కంపల్సరీగా బెడ్ రెస్ట్ తీసుకోవాలనీ పవన్ తో చెప్పారు...

మధుబాలకి ఫోన్ కాల్ వచ్చేసరికి కంగారు పడిపోయింది. ఒక్క ఉదుటన ఇంట్లో ఉన్న డబ్బు బాగ్ లో కుక్కుకుని, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు పట్టుకుని, బాబుతో బయలుదేరిపోయి వచ్చేసింది. ఒంటి  మీద  గాయాలతో, కాలు నొప్పితో మూల్గుతున్న భర్తను చూడగానే ఆమెకు దుఃఖం ఆగలేదు... బాధ పడుతూనే, డాక్టర్స్ చెప్పిన ప్రకారం హాస్పిటల్ లో అడ్వాన్స్ డబ్బు కట్టి, అతని దగ్గర ఉండి, వాళ్ళకు సహకరిస్తూ, వాళ్ళు చెప్పినట్టు చేస్తూ నిలబడి ఉంది. బాబును ఎత్తుకుని అలా చేయటం ఆమెకు కష్టమే అయినా తప్పలేదు. ఆ స్థితిలో కూడా వేణుకు, తన కోసం ఎంతో తాపత్రయ పడుతున్న మధుబాలను చూస్తుంటే ఎంతో బాధ, వేదన, అపరాధ భావన  కలిగాయి. ఇదేనా వివాహ బంధం అంటే? ఒక కప్పు క్రింద ఉన్న ఇద్దరి మనుషుల మనసుల మధ్య ఇంతగా అనుబంధమనే తీగ అల్లుకుంటుందా?
వేణును స్పెషల్ రూమ్ కి తరలించారు. “మధూ, బాబుతో నువ్విక్కడ ఉండటం చాలా కష్టం... మనింటికి వెళదాం... అక్కడ ఉందువు గాని... బావను నేను చూసుకుంటాను... హాస్పిటల్ వాతావరణం లో బాబును ఉంచటం అంత మంచిది కాదమ్మా...” అన్నాడు పవన్.
ఏమనాలో తెలియలేదు మధుబాలకు... కానీ పవన్ చెప్పింది కూడా నిజమే...

“నువ్వుండి చేసేదేముంది మధూ? బావకు నిద్రకి మందు ఇచ్చారు... రేపటి వరకూ విశ్రాంతిగా పడుకుని ఉంటాడు. వెయ్యాల్సిన మందులూ, డ్రిప్ పెట్టటం అన్నీ హాస్పిటల్ స్టాఫ్ చూసుకుంటారు. నేను ఆయన పక్కనే ఉంటాను... పదమ్మా...” అంటూ, అక్కడ నర్సింగ్ స్టాఫ్ కి ఇరవై నిమిషాల్లో వస్తానని చెప్పి, మధును తనింటికి తీసుకు వచ్చేసాడు, పవన్.

మధుబాలను వినతకు అప్పగించి, తాను మళ్ళీ హాస్పిటల్ కి వెళుతూ ఉంటే “అన్నయ్యా, వేణుకు ఏం ఫర్వాలేదు కదూ?” అని దీనంగా అడిగింది మధుబాల. ఆ స్వరంలో వినిపించిన దుఃఖానికి పవన్ హృదయం కదిలిపోయింది.

“ఫర్వాలేదమ్మా... నీ మంచితనమే అతనికి శ్రీరామ రక్ష!” ఆమె తల నిమిరి వెళ్ళిపోయాడు. వినత నిద్ర పోతున్న బాబును ఎత్తుకుని తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అలికిడికి లేచి వచ్చిన అవంతితో విషయం చెప్పింది వినత విచారంగా... మధు నీరసంగా సోఫా మీద కూలబడింది.

“మధూ, ఏమీ బాధ పడకమ్మా, వేణు త్వరగానే కోలుకుంటాడు... ప్రాణానికి ఏమీ భయం లేదని చెప్పారు కదా... రేపు ఆపరేషన్ సవ్యంగా జరిగిపోతుంది... నువ్వేమీ కంగారు పడకు... అత్తయ్యకు మాత్రం విషయం చెప్పకండి... కంగారు పడి వచ్చేస్తారు...” అంది అవంతి ధైర్యం చెబుతూ... తలూపింది మధు.

మేనత్త చనిపోవటం వలన సుగుణమ్మ పల్లెలోనే ఉండి పోయింది. పదిరోజుల వరకూ రానని ముందు రోజునే ఫోన్ చేసింది... “మీరు వెళ్ళి పడుకోండి వదినా... మధు వదిన నా రూమ్ లో పడుకుంటుంది...” చెప్పింది వినత. “సరేనమ్మా... జాగ్రత్త... గుడ్ నైట్...” అని చెప్పి వెళ్ళింది అవంతి. వంటగదిలోకి వెళ్లి పాలు వేడి చేసి ఓ గ్లాసులో పోసి తీసుకువచ్చి, మధుకు ఇచ్చింది  వినత. వద్దనకుండా తాగేసింది మధు...

“రా వదినా... పడుకో...”ఆదరంగా ఆమె చేయి పట్టుకుని తన బెడ్ రూమ్ వైపు నడిపించింది వినత. వాన వెలసిన తరువాత ఆకాశంలా వినత హృదయం నిర్మలంగా ఉందిప్పుడు...

***

వేణుకు ఆపరేషన్ జరిగింది. మోకాలి కిందుగా స్టీల్ ప్లేట్ వేసి ఆపరేట్ చేసారు. నొప్పిని భరించలేకపోతున్నాడు వేణు... వినత ఇంట్లో  బాబును చూసుకుంటూ ఉంటే, మధు హాస్పిటల్ లోనే ఉండిపోతోంది... వేణుకు కావలసినవి అన్నీ క్షణంలో అమరుస్తోంది...
అవంతి వంట చేసి, మధుబాలకు పంపిస్తోంది... వేణుకు కావలసిన డైట్ మాత్రం హాస్పిటల్ వాళ్ళే ఇస్తున్నారు.

ఆపరేషన్ అయిన రెండవరోజు ఉదయం బెడ్ మీద అనీజీగా కదులుతుంటే, తనకు బెడ్ పాన్ పెడుతున్న భార్య కనిపించి వేణుకు హృదయం మెలిపెట్టినట్టే అయింది...

దేహ బాధ తీరి, వార్డ్ బాయ్ వచ్చి బెడ్ పాన్ తీసేసి వెళ్ళగానే,  “అయామ్ వెరీ వెరీ సారీ మధూ... నిన్ను చాలా బాధపెట్టాను... నాకు నిష్కృతి లేదు...” అన్నాడు ఆమె చేతిని పెదవులకు చేర్చుకుని... గెడ్డం దగ్గర తగిలిన గాయం నొప్పి పుడుతూ ఉంటే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడతను...

“ష్... మాట్లాడకండి... నొప్పి పుడుతుంది...” గడ్డం మీదున్న గాయాన్ని చూపిస్తూ అంది మధుబాల... వార్డ్ బాయ్ సహాయంతో అతనికి బ్రష్ చేయించింది. నర్స్ వచ్చి మందులు వేసి వెళ్ళింది... బ్రేక్ ఫాస్ట్ అయ్యాక డాక్టర్ వచ్చి చూసి రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్ళారు.

***

“ఐశూ...” ఆఫీసయ్యాక, ఇంటికి వెళ్ళటానికని బాగ్ సర్దుకుంటున్న ఐశ్వర్య దగ్గరకు వచ్చింది నీరజ.

“ఆ... చెప్పు నీరూ...”

“ఈ ఆదివారం నీకేమైనా పని ఉందా? నాతో రాగలవా? శ్రీ చైతన్య ను చట్నీస్ రెస్టారెంట్ లో కలుద్దామని ప్రపోజ్ చేసాను... నువ్వూ నాతో వస్తే...”

“ఆదివారం కాదు కానీ, శనివారం కూడా మనకి సెలవే కదా... వీలైతే నీ ప్రోగ్రాం ముందుకు మార్చు... నేను తప్పకుండా వస్తాను. ఆదివారం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి... తప్పనిసరి...” చెప్పింది ఐశ్వర్య.

“సరే, ఏ సంగతీ నీకు రేపు చెప్తాను ఐశ్వర్యా...”

“ఓకే నీరూ... బట్  డోంట్ లూజ్ యువర్ హార్ట్... సరేనా? కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి... తప్పదు!” అంది ఐశ్వర్య నీరజ భుజం తడుతూ...

“అవును ఐశూ... అండ్ థాంక్ యు ఫర్ ది సపోర్ట్...” చేయి ఊపి వెళ్ళిపోయింది నీరజ.

“ఐశూ, ఓ సారి రాగలవా?” ఇంటర్ కాం లో పిలిచాడు కార్తీక్.

“యా, కార్తీ, ఏమైనా పనుందా?” అతని సీట్ దగ్గరకు వెళ్లి ఎదురుగా కూర్చుంది ఐశ్వర్య.

“పనేమీ లేదు కానీ, మీ మధు వాళ్ళ హజ్బెండ్ వేణుకి యాక్సిడెంట్ అయిందట...” “అవును...” విచారంగా అంది ఐశ్వర్య.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam