Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
adhikaarulatO chelagaatam

ఈ సంచికలో >> కథలు >> పెళ్లయ్యింది

pellayyindi

కైలాస గిరి కి  చాలా సంబంధాలు చూశాడు అతడి తండ్రి అహోబలరావు. జాతకాలు నప్పక ఓ పట్టాన ఏదీ కుదర లేదు. అతని జాతక రీత్యా ఆ సంవత్సరం కుదరక పోతే, ఇంకో నాలుగేళ్ళ దాకా పెళ్లి యోగం లేదన్నాడు జాతక రత్న మిడతం భొట్లు గారు. పైగా, “మనవడి పెళ్ళి చూస్తేనే గాని నా ప్రాణం పోదు. ఎనభై అయిదేళ్లొచ్చి ఇప్పుడిలా మంచాన పడిన నాకు  మీరు  చాకిరీ చేయ లేక, మాన లేక కిరికిరి పడతారు. నన్ను ఏ అనాధాశ్రమం లోనో చేర్పించే ప్రయత్నం చేస్తే, నా ఆస్తి మొత్తం నన్ను చివర్లో ఎవరు చూస్తారో వాళ్లకే చెందుతుందని ముందే వీలు వ్రాసేశాను కనుక, ఆ ఆస్తి ఏదో వాళ్లకే పోతుంది. అలా నా వీలు అమలు జరక్కుండా ఉండాలంటే, మీకు  వీలు లేకపోయినా నన్ను చచ్చేదాకా చూడాల్సిందే.” అని ఫిటింగ్ పెట్టిన తల్లికోసమైనా ఇంకా లేటు చెయ్యకుండా ఈఏడాది కొడుక్కి పెళ్ళిచేసేయాల్సిందే అన్న నిర్ణయానికొచ్చేశాడు అహోబలరావు. 

దాంతో తీవ్ర పెళ్లి ప్రయత్నాలు యుద్ధ ఫ్రాతిపదికన చేసి, మొత్తానికి పర్వత వర్ధనితో పెళ్ళి ఖాయం చేశాడు అహోబల రావు. 
అయితే, కైలాసగిరి ముందు ఒప్పుకోలేదు. “వద్దు నాన్నా ఆ అమ్మాయి నిజం గానే పర్వతం లాగుంది. ఇప్పుడే ఇలాగుంటే, పెళ్ళైయ్యాక ఇంకా వర్ధిల్లితే పర్వత వర్ధని పేరు సార్ధకం అవుతుంది. నాకొద్దన్నాడు.” దానికి తండ్రి, “ఒరే, నువ్వు మాత్రం తక్కువున్నావా? కైలాస గిరి అన్నపేరుకి తగ్గట్టుగా లేవూ? ఇంక నీకు ఇంత కన్నా మంచి సంబంధం నేను తేలేను. ఒప్పేసుకో. పైగా ఈ యేడు నీకు పెళ్లి కాక పోతే, ఇంకో నాలుగేళ్ళ దాకా అవదన్నాడు శాస్త్రులు గారు. అప్పటికి పరిస్థితులు ఎలా మారి పోతాయో? ఈపాటి కట్న కానుకలు కూడా వస్తాయో రావో తెలీదు. పైగా నువ్వెంత అందగత్తెని చేసుకున్నా, ఆ పిల్ల కూడా పెళ్ళైయ్యాక లావవదని గారంటీ ఉందా? అదీ కాక ఈ పిల్ల ఇప్పుడే పెరగాల్సినంత పెరిగి, సాట్యురేషన్ పాయింట్ కొచ్చేసింది. ఇంక తగ్గడమే గానీ పెరగడం ఉండదు. పైగా ఆ పిల్ల తండ్రి పెళ్ళి నాటికి ఆ అమ్మాయి స్లిమ్ గా కన బడేలా ఏదో మూణ్ణెల్లో, ఆర్నెల్లో గేరంటీ ఇచ్చే ఒబేసిటీ సెంటర్ లో చేర్పించే ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు.

ఇది నీకు బోనస్ పాయింట్. నా మాటినుకోరా!” అని వాస్తవాలు చెప్పడంతో ప్రారంభించి, భవిష్యత్ భయాలు, ఆశలు వగైరా ఉటంకిస్తూ, చివరిగా “ఇప్పుడీ సంబంధం నువ్వొప్పుకోక పోతే,  నీ నాయనమ్మ కోరిక తెలుసుగా?!... ఆవిడ నీ పెళ్లయే దాకా పోదు. ఇంకో నాలుగేళ్లు ఆవిడ్ని చూసే ఓపిక నాకు, మీ అమ్మకి లేదు. అయితే.. నీ పెళ్లవ గానే ఆవిడ బకెట్ తన్నేస్తుందనే గారంటీ లేదు. కష్ట పడి ఏ ఫస్ట్ గేర్ లోనో అప్ ఎక్కేసిన పాత కాలం బండి ఈజీగా డౌన్ దిగి పోయినట్టు, ఈవిడ నీ పెళ్ళైన తర్వాత ఇంకా హాపీగా బ్రతికేసినా బ్రతికేస్తుంది. అలాగని రిస్క్ తీసుకో లేను. ఇవన్నీ ఒకెత్తయితే, నీకింక పెళ్ళి సంబంధాలు వెతికే ఓపిక నాకు లేదు! ఆపై నీ ఇష్టం!” అని శుభం కార్డు వెయ్యకుండా  ‘ఇది అంతం కాదు! ఆరంభం’ అని  ముగించేసే సినిమాలా ఆపేశాడు అహోబలరావు. 

‘ఆస్తి చేతిలో ఉంచుకుంటే గానీ నీ మాట వినరే వీళ్ళు’ అని చెప్పి పోయిన మొగుడి మాట ప్రకారం ఇప్పుడు వీళ్ళని  ఓ ఆట ఆడిస్తున్న సదరు నాయనమ్మ, భాగీరధమ్మ ఈ సంభాషణలు విని ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అది చూసి, ఇదో పిచ్చిది.. ఎప్పుడూ నవ్వుతుందో, ఎప్పుడూ మూలుగుతుందో తెలీదు అనుకుంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు అహోబారావు.  ఆవిడ చాలా రోజులై, తన గురించి వీళ్లేమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఒకటే మార్గమని, తనకి చెవుడు వచ్చినట్టుగా నటించ సాగింది. తన గురించి వాళ్ళు అనుకునేవి విన్నప్పుడు, నచ్చితే నవ్వుకోవడం, లేక పోతే ఏదో నొప్పి కలిగినట్టుగా మూలగడం నేర్చుకుంది. ఆ విషయం చాలా రహస్యంగా మేనేజ్ చేస్తోంది ఆవిడ ఆ వయసులో కూడా. ఇవేవీ తెలీని, అహోబలరావు ఆవిడకి వినబదులే అనుకునే కొడుక్కి ఆ పెళ్ళి విషయం ఆవిడ ఎదురు గానే చెప్పాడు. 

ఇంత జరిగాక, ఇప్పుడు మొండికేస్తే, ఇంకో నాలుగేళ్ళ దాకా పెళ్లి కాదనే భయంతో, ‘కొంచెం లావే గానీ, పర్వత అన్న విశేషణం తీసేస్తే వర్ధనికేం? బానే ఉందిగా! నాన్నా చెప్పిందీ నిజమేగా’ అనుకుని పెళ్లికొప్పేసుకున్నాడు కైలాస గిరి, అసలీయన్ని మించిన సమర్ధుడు ఎవరు’ అని గతంలో తెగ తిట్టిన నోటి తోనే పొగిడినట్టుగా.  ఆపై వర్ధని పై మనసు పారేసుకుని, ఆమెతో సెల్లులో  సొల్లు సంబాషణ, పెళ్లి కుదిరిన అందరు పిల్ల ల్లాగే తానూ మొదలెట్టాడు. “నిన్ను గిరీ అని పిలిచేదా?” అనడిగింది మొదటి సంభాషణ లోనే వర్ధని. అది వింటూనే ‘ఆహా ఏమీ నా భాగ్యమూ! నా పేరులో కైలాసం, తన  పేరులో పర్వతం .. రెండూ హిమాలయాలకి పోయి కైలాస పర్వతంలా స్థిరంగా ఉండి పోయాయి.’ అని ఆనందించి, “వావ్! ష్యూర్!” అన్నాడు.

వర్ధని తండ్రి మైనాక మూర్తి కొంచెం మైనర్ కుటుంబం నుంచే రావడం వల్ల కొన్ని కొన్ని ఖర్చుల విషయంలో కాస్త మైజర్ (పిసినారి) గానే ఉంటాడు.  పెళ్ళి విషయంలో అతనికి కొన్ని స్థిర అభిప్రాయాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు తగ్గించి, కావలిస్తే ఆ డబ్బులు పిల్లలకే ఇచ్చేస్తే వాళ్ళేవైనా వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగ పడతా యనేది అతని భావన. ఆ ప్రకారమే అతను సంబంధం ఖాయం చేసుకోవడానికి ముందే, పెళ్ళి తంతు, పెళ్ళి ఖర్చులు అన్నీఎలా ఉండ బోతాయో  చాలా వివరంగా తన కాబోయే వియ్యంకుడు అహోబలరావుకి చెప్పి, చివరిగా తను చేయ బోయే ఏర్పాట్లెలా ఉంటాయో కూడా ఒక ఊహా చిత్రాన్ని చూపించేశాడు. ఆ  ఊహా చిత్రంలో మైనాక మూర్తి చేయ బోయే పెళ్ళి ఫుల్ లెంగ్త్ లో కనబడి, “ఇదేంటండీ బావ గారు!? మరీ కక్కుర్తిగా పెళ్ళి చేశారని నలుగురు అనుకోరా? నాకేం నచ్చలా” అన్నాడు అహోబలరావు.

“అనుకునే వారు ఎప్పుడూ అనుకుంటారండీ. మనం ఎంత ఘనంగా ఏర్పాట్లు చేసి పెళ్ళి చేసినా, వచ్చిన వాళ్ళల్లో ఒకరిద్దరికి ఎక్కడో అసౌకర్యం కలిగిందనుకోండి “ ఏర్పాట్లేమీ బాగా లేవు. భోజనాల దగ్గరైతే చచ్చేమనుకో” అన్న స్థాయి లో అనేస్తారు. అలాంటి వాళ్ళతో మనకేం పని బావ గారు. మీరే చెప్పండి ! ఏ పెళ్ళిలో చూసినా, కళ్యాణ మండపం అద్దె రోజుకి లక్షో లేదా ఆరు గంటలకి అరవై వేలు చొప్పునో  ఉంటోంది.  పైగా  కరెంటు, లైట్ల డెకరేషన్, స్టేజి డెకరేషన్ కి వేరే లక్షల్లో పెట్టాలి. పెళ్ళిముహూర్తం ఎలాగూ రాత్రే అయింది కనుక, మీరంతా రావడానికి, ఉండడానికి కళ్యాణ మండపం రెండ్రోజుల అద్దె, ఆ రెండ్రోజుల డెకరేషన్ వగైరాలకి ఓ పది లక్షల దాకా అయేటట్టుంది. ఇంత చేసినా పెళ్ళి ముహూర్తం టైం కి ఉండేది మీ వేపైనా, మా వేపైనా బాగా దగ్గరి బంధువులు, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు మాత్రమే. ఆ ఫోటో గ్రాఫర్లు, వీడియో వాళ్లు కూడా కళ్యాణ మండపం చుట్టూ గుమిగూడి, కనీసం ఆ ఉన్న వాళ్లని కూడా పెళ్ళి చూడనివ్వరు. అందరూ ఆ తర్వాత తీరిగ్గా ఇంటరెస్ట్ ఉంటే వీడియోలు, ఫోటోలు చూసుకోవడమే. 

ఇక పెళ్ళికి పిలిచిన వాళ్ళందరూ, పెళ్ళి భోజనాల టైం ఎప్పుడైతే అప్పుడే వస్తారు. వాళ్ళ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసి  పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని కూర్చో బెడితే వాళ్ళ చేతిలో ఏ గిఫ్టో పెట్టి, తినేసి వెళ్లి పోతారు. అందుచేత పూర్వ కాలం సామెతలా పిల్ల పెళ్లి చెయ్యవా అని అడగకుండా  ”పప్పన్నం ఎప్పుడు పెడతావ్?” అనడిగినట్టు, పెళ్ళంటే “భోజనమే!”.  అసలీ కాలం లో పెళ్ళి భోజనం అనేది కూడా ఓ పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది. ప్లేటుకి  ఆరు వందల చొప్పున ఇస్తేనే గానీ ఎవడూ కేటరింగ్ కి రాడు. పైగా  ఇప్పుడు ఈసుకి,  గొప్పకి  ఓ ఇరవై  కౌంటర్లు పెట్టి వాటిలో ఇడ్లీలు, రక రకాల దోసెలు, రోటీలు, పూరీలు, పానీ పూరీలు, ఛాట్లు, సమోసాలు, బార్బికీలు,  అయిదారు రకాల ఫ్రైడ్ రైసులు, రక రకాల కూరలు, సాంబార్లు, రసాలు..పదిరకాల అప్పడాలు, పచ్చళ్లు.. ఇవికాక ఇంకో పదిరకాల స్వీట్లు, ఐస్ క్రీంలు...ఇలా అంతులేని తిళ్ళతో మనల్ని మనమే దోచేసుకుని, ఎవడి చేతిలోనో ఆ డబ్బు పెట్టాలి. ఇంతా చేసి, తీరా పెళ్ళి తంతు అంతా అయ్యాక మనం భోజనానికెళ్తే, అక్కడ చాలా అయిటెమ్స్ అయిపోయి మనకి ఒక పప్పో, కూరో మిగుల్తుంది అదే ఆరు వందల ప్లేట్ ఖరీదుకి. ఇవి కాక మన ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం తప్పించుకో లేని బట్టల, నగల ఖర్చు ఎలాగూ ఉండనే ఉంటుంది. . 

అందువల్ల వీటన్నిటిలోంచి నేను తప్పించ గలిగే ఖర్చు కళ్యాణ మండపాలు, లైట్లు, డెకరేషన్లు, భోజనాలు  వగైరా.  అసలు కొంత మందైతే తమ ఇంటి ముందు రోడ్ బ్లాక్ చేసి, షామియానా వేసి మరీ హేపీగా పెళ్ళి చేసేస్తున్నారు. మరీ అంతలా కాకపోయినా కాస్త హుందాగా  మా సెల్లార్లో పెళ్ళి ఏర్పాటు చేస్తా. మా అపార్ట్ మెంట్ లోని ఓ రెండు పోర్షన్లు ఖాళీ గా ఉన్నాయి. వాటిని మీకు విడిదిగా ఏర్పాటుచేస్తా. ఇవన్నీ చిన్నచిన్న ఖర్చులే. అంతగా దగ్గర వాళ్ళు అడిగితే, కళ్యాణ మండపాలు అస్సలు దొరకందే!? అని ఓ నిస్సహాయపు మొహం పెడదాం.  ఏమంటారు?" అని గుక్క తిప్పుకోకుండా చెప్పి, ఓ క్షణం ఆగి, అహోబలరావు ఏమైనా అనేస్తాడేమో నని, మళ్ళీ తానే మొదలెట్టాడు మైనాక మూర్తి. 

"అసలు పెళ్ళి శుభ లేఖ లోనే రిసెప్షన్ ఫలానా చోట అంటే చాలు అందరూ అక్కడికే చేరి పోతారు. ముహూర్తం ఎప్పుడన్నది కూడా చూడరు. అందుచేత పెళ్లయ్యాక ఏదో ఒక హోటల్ లోనో, ఫంక్షన్ హాల్లోనో ఓ సాయంత్రం డిన్నర్ ఇచ్చేద్దాం. అదీ శనివారం పెట్టామనుకోండి, సింపుల్ గా పుల్కాలో, పూరీలో, ఇడ్లీలో పెట్టి ఆపై కడుపులో ఉపశమనానికి దద్ధోజనం పెడితే సరిపోతుంది. మన వాళ్లకి శని వారం రాత్రి టిఫిన్ అలవాటు ఎక్కువేగా.  దాంతో పెళ్ళి భోజనం పెట్టినట్టూ ఉంటుంది, ఖర్చు తగ్గించినట్టూ ఉంటుంది. అలా మిగిల్చిన డబ్బులు పిల్లలకే గిఫ్ట్ కింద మనం ఇచ్చేద్దాం! ఏమంటారు? అసలేమనద్దు! మీరు ఊ అనండి చాలు! నేనెలాంటి ఏర్పాట్లు చేస్తానో చూద్దురుగానీ అన్నాడు మైనాకమూర్తి , ఇంకో ఛాన్స్ మీకు లేదు 'ఊ!' అనడం తప్ప అన్నట్టు.

 'ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?' అన్న సినిమా టైటిల్లా అహోబలరావు ఊ అనలేక, ముందు ఉలిక్కిపడి, ఆపై కాస్త మావాళ్ళతో ఆలోచించుకొనీండి అని బయట పడి, ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళతో అత్యవసర సమావేశం పెట్టాడు, అంతా విని అప్పటికే వర్ధనితో ఛాటింగ్ మోజులో పడ్డ గిరి, ‘ఊ’ అన్నాడు, ఉలిక్కి పడితే వర్ధని ఎక్కడ మిస్ అయిపోతుందో ననే భయంతో. ముసిముసి నవ్వులు నవ్వుతూ, అంతలోనే మూలుగుతున్న అత్తగార్నే చూస్తూ, ఏమనాలో తోచక, ‘ఊ’ అంది అతని భార్య.  వాళ్ళిద్దరు ఊ అన్నాక, తను ఉలిక్కి పడితే ... నాలుగేళ్ళ దాకా పెళ్ళి కాని కొడుకు, అప్పటి దాకా బ్రతికే ఉంటానని ఛాలెంజ్ చేసిన అమ్మ నాలుగేళ్ళ తర్వాత ఎలా ఉంటారో కళ్ళ ముందు మెదిలి, అర్జెంట్ గా  మైనక మూర్తి కి ఫోన్ చేసి “ఊ!” అన్నాడు అహోబల రావు ఇంక ఒంట్లో బలం లేని వాడిలా. 

ఆ ప్రకారం మైనాక మూర్తి  పెళ్ళి తన అపార్ట్మెంట్ సెల్లార్లో ఏర్పాటు చేశాడు, అపార్ట్మెంట్ అసోసియేషన్ కి ఓ పాతిక వేలు డొనేషన్ ఇవ్వడానికి, అందులో ఉంటున్న వాళ్లందర్నీ పెళ్లి రోజు రెండు పూటలా టిఫిన్, భోజనాలకి పిలిచే కండిషన్ మీద. అనుకున్నట్టు గానే అర్ధరాత్రి ముహూర్తంలో ఓ ముప్ఫై మంది దగ్గరి బంధువుల నడుమ, అట్టహాసంగా కాక పోయినా మందహాసాలతో.. ఫోటో, వీడియో గ్రాఫర్ల డైరెక్షన్ మధ్య నిమిత్త మాత్రుడైన పురోహితుని సాక్షిగా గిరి వర్ధనిల పెళ్ళి జరిగి పోయింది. ఆతర్వాత వచ్చిన శని వారం నాడు ఓ హోటల్లో సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసి, ఇడ్లీల పుల్కాల విందు ఏర్పాటు చేశాడు మైనాక మూర్తి. ఆ రిసెప్షన్ కి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళికి పిలవ లేదేం అని శాంపిల్ గా కూడా అడగకుండా శని వారపు టిఫిన్లు సుస్టుగా ఆరగించి,

“టిఫిన్లు పెట్టి మంచి పని చేశారు. మీరు గాని ఏ షోడశ రుచుల విందు గాని ఏర్పాటు చేసుంటే, శనివారపు నియమం వదులుకో లేక, వాటిని తినడం మాన లేక తెగ ఇబ్బంది పడుండే వాళ్లం. అల్కాగా పుల్కాల విందు భలే ఉంది” అని వధూ వరులని దీవించడం మర్చి పోయి, పుల్కాలని మెచ్చుకు వెళ్లిపోయారు. మొత్తానికి సెల్లార్లో పెళ్ళేంటయ్యా బాబూ అని ఎవరూ అనకుండా, పెళ్ళి బాగా జరిగి పోవడంతో అహోబలరావు చాలా సంతోషించి, మైనాక మూర్తిని మెచ్చుకున్నాడు. మైనాక మూర్తి తనన్నమాట ప్రకారం గిరి, వర్ధనిల పేర చెరో మూడు  లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. మనవడి పెళ్లిని ముసిముసి నవ్వుతో వీల్ ఛైర్లో కూర్చుని తిలకించిన భాగీరధమ్మ,” అమ్మయ్య! వీడి పెళ్ళి చూసాను. ఇంక వీడి కొడుకునో, కూతుర్నో చూసి అప్పుడు పోతే పోలా!?.. అయినా ఇప్పుడేమంత వయసు మించి పోయిందనీ నాకు!?” అనుకుంది ఆనందంగా. 

మరిన్ని కథలు
shock