Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ekkadiki potavu chinnavaada movie review

ఈ సంచికలో >> సినిమా >>

నిఖిల్ తో ముఖాముఖీ

interview with nikhil

అన్ని సినిమాలూ హిట్ట‌వ్వ‌డానికి నేనేం దేవుడ్ని కాదు క‌దా?

- నిఖిల్‌

క‌థ‌ని, కాన్సెప్ట్‌నీ న‌మ్ముకొన్న‌దెవ‌రూ చెడిపోయిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు!

ఈ మాట‌ని గ‌ట్టిగా న‌మ్మాడు నిఖిల్‌. న‌మ్మ‌డ‌మే కాదు.. దాన్ని ఆచ‌ర‌ణ‌లోనూ పెట్టేస్తుంటాడు. స్వామి రారాతో అత‌ని జాత‌కం మొత్తం మారిపోయింది. అదేం గాలివాటంగా వ‌చ్చిన విజ‌యం కాద‌ని... కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య సినిమాల‌తో నిరూపించాడు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన శంకరాభ‌ర‌ణం సినిమా బాగా దెబ్బ‌కొట్టింది. అందులోంచి తేరుకొని చేసిన సినిమా... 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నిఖిల్ చెప్పుకొచ్చిన 'స‌మ్‌'గ‌తులు...

* చిన్న‌వాడు ఎక్క‌డికి వెళ్తున్న‌ట్టు..?

- (న‌వ్వుతూ) అది సినిమా చూస్తేనే తెలుస్తుంది.  బేసిగ్గా ఈ సినిమా క‌థ‌, క‌థ‌లో క‌థానాయ‌కుడి ప్ర‌యాణం అంతా ఈ టైటిల్ చుట్టూ తిరుగుతుంటుంది.

* ప్ర‌చార చిత్రాల్లో సీసా కూడా చూపిస్తున్నారు.. దానికీ ఏమైనా ప్రాధాన్యం ఉందా?

- ఫ‌స్ట్ షాట్ సీసాపైనే ఉంటుంది.. లాస్ట్ షాట్ కూడా దానిపైనే. మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న‌దే క‌థ‌.

* అంద‌రూ చేస్తున్నార‌ని మీరూ హార‌ర్ జోన‌ర్‌లోకి దిగిపోయారా?

- అదేం కాదండీ. ట్రెండ్‌ని ఫాలో అయితే... మ‌ళ్లీ మూస ధోర‌ణిలో ప‌డిపోతాం. అంద‌రూ అనుకొన్న‌ట్టు ఇందులో హార‌ర్ ఎలిమెంట్ ఒక్క‌టే కాదు.. ఫాంట‌సీ కూడా ఉంటుంది. బేసిగ్గా ఇదో ల‌వ్ స్టోరీ. అందులో మిగిలిన‌వ‌న్నీ పార్టు పార్టుల‌గా వ‌స్తాయి. దెయ్యం అంటే రెగ్యుల‌ర్ సినిమాల్లో క‌ళ్ల కింద కాటుక పెట్టుకొని భ‌య‌పెట్టే దెయ్యాలు ఈ సినిమాలో అస్స‌లు క‌నిపించ‌వు.

* ఇంత‌కీ మీరు దెయ్యాల్నీ, ఆత్మ‌ల్నీ న‌మ్ముతారా?

- న‌మ్ముతా. కాక‌పోతే.. దానికున్న సైంటిఫిక్ రీజ‌న్స్ వెదుకుతుంటా. మ‌నిషి చ‌నిపోయిన త‌ర‌వాత అత‌ని శ‌రీర బ‌రువు 21 గ్రాముల‌కు త‌గ్గిపోతుంద‌ట‌.  సైన్స్ కూడా ఇదే మాట చెబుతోంది. ర‌ష్యాలో ఓ అమ్మాయి స‌డ‌న్‌గా లేచి తెలుగు మాట్లాడేసింద‌ట‌. ఆ అమ్మాయికి గానీ, ఆ కుటుంబంలో వ్యక్తుల‌కు గానీ.. తెలుగు భాష‌తో అస్స‌లు సంబంధ‌మే లేదు. ఇవ‌న్నీ విన్న‌ప్పుడు ఆత్మ అనేది క‌థ‌, భ్ర‌మ మాత్ర‌మే కాద‌ని అనిపిస్తుంటుంది. 

* మీ కెరీర్‌లో ఇదే హై బ‌డ్జెట్ సినిమా అట‌... నిజ‌మేనా?

- కార్తికేయ‌కీ, ఈ సినిమాకీ ఇంచు మించుగా ఒకే స్థాయిలో ఖ‌ర్చు పెట్టాం. నేనెప్పుడూ బ‌డ్జెట్ లిమిట్స్‌ని దృష్టి లో ఉంచుకొంటా. అవ‌స‌ర‌మైతే నా పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి, నా సౌక‌ర్యాల్ని ప‌క్కన పెట్టడానికి కూడా సిద్ద‌మే.

* ద‌ర్శ‌కుల ప‌నిలో మితిమీరిన జోక్యం చేసుకొంటున్నార‌ని మీపై మ‌రో రూమ‌ర్ వినిపిస్తోంది..

-  అది నిజంగా రూమ‌రేనండీ. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పి.. దాన్ని లాక్ చేశాక‌.. ఫ‌స్ట్ కాపీ వ‌చ్చేంత వ‌ర‌కూ నేనేం జోక్యం చేసుకోను. క్రియేటీవ్ ఫీల్డ్‌లో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ ఉండ‌దు. ద‌ర్శ‌కుడి ప‌నిలో జోక్యం చేసుకొంటే... క‌చ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది ద‌ర్శ‌కుడి సృజ‌న‌. దానికి ఎవ్వ‌రూ అడ్డురాకూడ‌దు. ప్ర‌మోష‌న్ ప‌రంగా నాకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. అవి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పంచుకొంటా. అంతే. 

* యువ హీరోలంతా యేడాదికి మూడు సినిమాలు చేస్తున్నారు. మీరు కొంచెం స్లో అయ్యారు..

- స్పీడుగా సినిమాలు చేయాల‌న్న ఉద్దేశం నాకు అస‌లు లేదు. స‌రైన క‌థ దొరికేవ‌ర‌కూ ఎదురు చూడ‌డం చాలా అవ‌స‌రం. అంకె పెంచుకోవాల‌ని చూస్తే.. నాణ్య‌త దెబ్బ‌తింటుంద‌ని నా భ‌యం.

* శంక‌రా భ‌ర‌ణం త‌ర‌వాత నిర్ణ‌యాలేమైనా మారాయా?

-  మొహమాటానికి పోయి సినిమా ఒప్పుకోకూడ‌ద‌నిపించింది. ఫ్లాపులు అంద‌రూ ఇస్తారు. నేనేం దేవుడ్ని కాదు క‌దా, అన్ని సినిమాలూ హిట్ట‌వ్వ‌డానికి.

* కానీ ఆ సినిమాపై మీరు చాలా హోప్స్ పెట్టుకొన్నారు క‌దా?

- ప్ర‌తీ సినిమాకీ హోప్స్ ఉంటాయి. కానీ... మితిమీరిన కాన్ఫిడెన్స్ ఏమాత్రం ఉండ‌దు. ఎంత‌మంచి సినిమా చేసినా స‌రే.. రిలీజ్‌కి ముందు టెన్ష‌న్ ప‌డతా. నా సినిమా రిలీజ్ అయ్యాక థియేట‌ర్లో కూడా సినిమా చూడ‌ను. ఎందుకంటే థియేట‌ర్లో కూర్చుంటే బీపీ పెరిగిపోతుంది. డ‌బ్బింగ్ అయ్యాక నా సినిమాల్ని నేను చూసుకొన్న‌ది లేదు. అది సెంటిమెంట్‌గా మారింది.

* మెడీ నిర్ణ‌యం దేశ‌మంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ద‌శ‌లో సినిమా రిలీజ్ చేయ‌డం సాహ‌సం క‌దా?

- మోడీ నిర్ణ‌యాన్ని నేను స‌మ‌ర్థిస్తున్నా.. ఎందుకంటే నా ద‌గ్గ‌ర బ్లాక్ మ‌నీ లేదు కాబ‌ట్టి.. (న‌వ్వుతూ). నిజం చెప్పాలంటే.. పెద్ద నోట్ల ర‌ద్దు తో వ‌సూళ్లు త‌గ్గే అవ‌కాశం ఉంది. అయితే ఆ హీట్ కాస్త త‌గ్గింద‌నే అనుకొంటున్నా. ఏటీఎమ్‌ల ద‌గ్గ‌ర క్యూ త‌గ్గుతోంది. దానికితోడు సినిమా అనేది చాలా చ‌వ‌కైన వినోద సాధ‌నం. వంద రూపాయ‌ల‌కే టికెట్ దొరుకుతుంది. కొన్ని చోట్ల రూ.50కీ, రూ.20కీ టికెట్లు దొరుకుతాయి. అంద‌రి ద‌గ్గ‌రా సినిమాకి వెళ్ల‌గ‌లిగే సొమ్ములున్నాయ‌ని నా న‌మ్మ‌కం.

* హీరోలు బ్లాక్‌లో డ‌బ్బులు తీసుకోవ‌డం త‌గ్గుతుందంటారా?

- ఏమో... నేను మాత్రం ఎప్పుడూ వైట్‌లోనే తీసుకొంటుంటా..

* చేతిలో ఉన్న సినిమాలేంటి?

- సుధీర్ వ‌ర్మ‌తో ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. కార్తికేయ 2 స్క్రిప్టు రెడీగా ఉంది. అయితే చందూ మొండేటికీ, నాకూ కొన్ని క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. అవి పూర్త‌య్యాక సెట్స్‌పైకి వెళ్తుంది.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌

- థ్యాంక్యూ...

 

కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
raj tarun as blimd