Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue188/539/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

( గతసంచిక తరువాయి) ముందుకు పోవడానికి` మరో మార్గం కన్పించ లేదు వక్ర దంతుడికి. కూలిన వృక్షాల సమీపంలో అశ్వాలు ఆగి పోయాయి.

అవతల ప్రచండ వేగంతో ఉగ్ర రూపంతో తన మచ్చల గుర్రం మీద దూసుకొచ్చేస్తోంది భద్రా దేవి. ఇక పోరు తప్పని పరిస్థితి. ధనుంజయుని పాతాళ లోకానికి పంపించినట్టు ఎవరూ గమనించక ముందే ఉలూచీశ్వరిని నాగ లోకానికి చేర్చాలనుకున్న పథకం ఇంత దారుణంగా బెడిసి కొట్టడంతో వక్ర దంతుడికి మతి పోయినట్టయింది. దాంతో `

‘‘వెళ్ళండిరా... పొండి... వేగిరం ఆ పిశాచి ఇక్కడికి రాక ముందే బాణాలు వేసి అశ్వంతో సహా నేల కూల్చండి. త్వరగా...’’ అంటూ పిచ్చి పట్టినట్టు అరిచాడు.

అతడి అరుపుతో నాగ దండు చైతన్య వంతమైంది.. అశ్వికులు యాభై మందీ రథాన్ని అక్కడే వదిలి తమ అశ్వాలను వెనక్కు మళ్ళించారు. వస్తున్న భద్రా దేవికి ఎదురు వెళుతూ బాణాలను ప్రయోగించ నారంభించారు.

వాళ్ళ ఉద్దేశాన్ని దూరం నుండే గమనించింది భద్రా దేవి. వెంటనే ఖడ్గాన్ని ఒరలో వుంచి, ఒక చేత్తో ఈటె, ఒక చేత్తో బరిసె అందుకుంది. అశ్వం కళ్ళాలు వదిలేసింది. దాన్ని కాళ్ళ తోనే అదుపు చేస్తూ, ఈటెను, బరిసెను ఇరు వంకలా చక్ర వ్యూహంలా తిప్పుతూ వస్తున్న బాణాల్ని వస్తున్నట్టే గాల్లోనే ఎగర గొడుతూ ముందుకు సాగింది. బరిసె తిప్పటంలో ఆమె నేర్పు చూసి నాగ దండే కాదు, అదృశ్య రూపంలో గమనిస్తున్న యక్షుడు రుచికుడు కూడ ఆశ్చర్య పోయాడు. ఎంత వేగమంటే ఆమె చేతిలో విష్ణు చక్రాల్లా తిరుగుతున్న ఈటెను, బరిసెను దాటి ఆమెను గాని అశ్వాన్నిగాని ఒక్క బాణం కూడ తాక లేక పోతోంది. మచ్చల గుర్రం ఢాకిని నేరుగా వేగంగా భద్రా దేవిని నాగ దండు అశ్వాల మధ్యకు తీసుకొచ్చేసింది. వస్తూనే, వీరావేశంతో` ‘‘రేయ్‌ నీఛులారా! మోసం చేసి ఉలూచిని తీసుకు పోతార్రా. మీ అంతు చూసెద. పిరికి పందలారా...’’ అని చిరుతలా రంకె లేస్తూ బరిసెతో కొందరి ధనస్సుల్ని ధ్వంసం చేసింది. కొందరిని పొడిచి అశ్వాల నుంచి కూల్చింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో సంకుల సమరం ఆరంభమైంది. ఇంత జరుగుతున్నా పొరబాటున కూడ వక్ర దంతుడు యుద్ధ గళంలో ప్రవేశించ లేదు. భద్రా దేవి దావానలంలా విరుచుకు పడి దొరికిన వాడ్ని దొరికినట్టు చీల్చి చెండాడుతోంది.

అదే సమయంలో`

రథం వెనక అశ్వం మీద కూచుని మిర్రి మిర్రి చూస్తున్న వక్ర దంతుడి మీద పడింది భద్రా దేవి దృష్టి. తమ మనోహరుని తమకు దూరం చేసాడు. ఇప్పుడు ఉలూచీశ్వరిని మోసంతో గొనిపోవ సిద్ధమైనాడు. నిప్పులు కరుస్తున్న కళ్ళతో` ‘‘నాగ లోక నీచ నికృష్ణుడా! ఎక్కడికి పోయెదవురా...’’ అనరుస్తూ చేతిలో ఈటెను సూటిగా వాడి గొంతుకి గురి చూసి విసిరింది భద్రా దేవి.

అదిరి పడ్డాడు వక్ర దంతుడు.

తృటిలో అశ్వాన్ని పక్కకు దూకించి తప్పించుకున్నాడు గాని లేకుంటే ఆ క్షణమే ఈటె నాటుకుని వాడి ప్రాణాలు పోయేవి.

ఈటెను అటు విసర గానే ఆ చేత్తోనే తన ఖడ్గాన్ని ఒర నుంచి సర్రున దూసింది భద్రా దేవి. ప్రత్యర్థులకు చిక్కకుండా ఒక పక్క బరిసెతో మరో పక్క ఖడ్గంతో దొరికిన వాడ్ని దొరికినట్టు దయా దాక్షిణ్యం లేకుండా అడ్డంగా నరికేస్తూ తన అశ్వం మీద వీర విహారం చేయనారంభించింది.
ఇక్కడ వక్ర దంతుడి ఆలోచన వేరుగా వుంది. అక్కడ భద్రా దేవి నాగదండుతో పోరాటంలో మునిగి వుండగానే తను రథంలోని ఉలూచీశ్వరిని తన అశ్వం మీద వేసుకుని అడవిన బడి తన దారిన నాగ లోకం వెళ్లి పోవటం మంచిదనిపించింది. లేకున్న భద్రా దేవిని ఆపటం కష్టం. తను అడవి లోకి వెళ్ళి పోతే ఇక భద్రా దేవికి తన జాడ తెలిసే అవకాశమే లేదు. ఈ ఆలోచన యిచ్చింది పక్కనున్న మాయా శృంగుడు.

‘‘వక్ర దంతా ఏమి ఆలస్యం... త్వరగా’’ అంటూ పక్క అశ్వం మీదున్న మాయా శృంగుడు హెచ్చరిస్తున్నాడు.

వక్ర దంతుడు అశ్వం దిగి`

ఉలూచీశ్వరి కోసం రథం ఎక్కాడు.

పోరాటంలో మునిగి వున్న భద్రా దేవి వాడి ఉద్దేశం గమనించ లేదు గాని యక్షుడు రుచికుడు గమనించాడు. ఉలూచీశ్వరిని వాడు ఎత్తుకు పోతే వాడి జాడ భద్రా దేవికి గాని, ధనుంజయునికి గాని తెలీదు. పడిన శ్రమ వృధా అవుతుంది. చూస్తూ వూరుకో లేక పోయాడు. అదృశ్య రూపంలో మరో సారి కల్పించుకున్నాడు.

ఉలూచీశ్వరి కోసం రథం ఎక్కిన వక్ర దంతుడు ఆమెను తాకుటకు ముందే ఎవరో తనను ఎత్తి విసిరేసినట్టు గింగిరాలు తిరుగుతూ గాల్లోకి ఎగిరి చివ్వున వచ్చి తన అశ్వం కాళ్ళ దగ్గర పడ్డాడు. అంతలో రథ ఛోదకుడు కూడ ఎవరిదో అదృశ్య హస్తం తనను తాకినట్టు కెవ్వున అరిచి తన స్థానం లోంచి ఎగిరి అవతల పడ్డాడు.

రథ అశ్వాల కళ్ళాలు తాముగా గాల్లోకి లేచాయి. ఎవరో అదిలించినట్టు అశ్వాలు కదిలాయి. అర్ధ చంద్రాకారంలో రథం వెనక్కి తిరిగి వచ్చిన దారినే పరుగు ఆరంభించింది. ఈ మాయ ఏమిటో అర్థం గాక లేచి కూచుంటూ తెల్లబోయాడు వక్ర దంతుడు. అదే సమయంలో ఎగువ నుంచి తమ వైపు వాయు వేగంతో దూసుకొస్తున్న శ్వేతాశ్వాన్ని, ఆ అశ్వం మీది ధనుంజయుని ముందుగా చూసిన మాయా శృంగుడి కళ్ళు పెద్దవయ్యాయి. అది కలో నిజమో అర్థం గాక కళ్ళు నులుముకుని చూసాడు. ధనుంజయుని గుర్తు పట్టగానే భయంతో కెవ్వున అరిచాడు.
‘‘వక్ర దంతా! నీ జాతకం యిలా తగలడిందేమిరా... లే... లేచి త్వరగా అశ్వం ఎక్కు. వాడు వచ్చేస్తున్నాడు.’’ అనరిచాడు.

‘‘ఇక్కడ ఎవడో అదృశ్య రూపంలో ఉన్నాడు.. ఎవడు వాడు? ఆ సంగతి చూడుము’’ అనరుస్తూ లేచాడు వక్ర దంతుడు.

‘‘వాడి సంగతి తర్వాత... అటు చూడుము. ధనుంజయుడు ధనుష్టంకారం గావిస్తూ కాల యముడిలా వచ్చుచున్నాడు. మనం వెంటనే పారి పోవుట మంచిదనుకొందును.’’ అంటూ హెచ్చరించాడు.

అప్పుడు చూసాడు వక్ర దంతుడు ధనుంజయుని. అప్పటికి తెల్ల వారి సూర్యోదయం గావటంతో స్పష్టంగా చూడ గలుగుతున్నారు. పాతాళ లోకం నుండి ఎలా ధనుంజయుడు తప్పించు కొచ్చాడో బుర్ర చించుకున్నా వక్ర దంతుడికి అర్థం గాక పిచ్చి పట్టినట్టు చూసాడు. ధనుంజయుడు రంగ ప్రవేశం చేస్తే ఇక పరిస్థితి తమ చేయి దాటి పోయినట్టేనని గ్రహించాడు. ప్రాణాలు దక్కించుకోవాలంటే మాయా శృంగుడు చెప్పినట్టు తోక ముడిచి పారి పోక తప్పదనిపించింది. అప్పటికే మాయా శృంగుడు తన అశ్వాన్ని వెనక్కి తిప్పేసాడు.
ఇక క్షణం కూడ ఆలస్యం చేయకుండా ఎగిరి తన అశ్వం మీద కూచుని కళ్ళాలు అందుకున్నాడు వక్ర దంతుడు. మరు క్షణమే ఎవరూ చూడక ముందే వక్ర దంతుడు, మాయా శృంగుడి అశ్వాలు అడవి లోకి అదృశ్యమయ్యాయి.

ఈలోపల`

నాగ దండుతో తను ఒక్కతే పది మంది పెట్టుగా హోరా హోరీ పోరాటంలో మునిగి వున్న భద్రా దేవి చివరి క్షణంలో గాని రథం తమ పక్క నుంచే వెళ్ళటం గమనించ లేదు. రథ ఛోదకుడు లేడు. అటు చూస్తే వక్ర దంతుడు, మాయా శృంగుడి జాడ లేదు. రథంలో ఉలూచీశ్వరి ఉందో వాళ్ళు తీసుకు పోయారో తెలీక కంగారు పడుతూ అడ్డు వచ్చిన రెండు అశ్వాల్ని, నాగ సైనికుల్ని తెగటార్చి తన అశ్వాన్ని రథం వైపు దూకించ బోయింది. ఎగువ నుంచి వచ్చేస్తున్న శ్వేతాశ్వాన్ని, ధనుంజయుని అప్పుడు చూసింది. చూడగానే ఆ ప్రయత్నం విరమించుకుంది. ఆమె ముఖారవిందం సూర్యుని గాంచిన కలువలా ఆనందంతో విచ్చుకుంది. అంతే` రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ప్రత్యర్థుల మీద విరుచుకు పడింది. కొద్ది దూరం వెళ్ళిన రథం అక్కడే ఆగింది. వస్తున్న ధనుంజయుడికి రథం లోని ఉలూచీశ్వరిని చూసాక గాని మనసు కుదట పడ లేదు. ఇక అక్కడి నుండే నాగ సైనికుల మీద అంప వర్షం కురిపిస్తూ దూసుకు వచ్చేసాడు.

చావగా మిగిలిన నాగ దండు సైనికులకు దిక్కు తోచ లేదు. అటు చూస్తే వక్ర దంతుడు, మాయా శృంగుల జాడ లేదు. ఇటు చూస్తే ఇప్పటికే పది అశ్వాలను, ఇరవై మందికి పైగా తమ సైనికులను తెగటార్చింది భద్రా దేవి. ఇప్పుడు ధనుంజయుని బాణాలకు అశ్వాలు, భటులు కూడ నేల కూలుతున్నారు. ఇక తాము ఎవరి కోసం పోరాడాలి? ప్రాణాలు అర చేత పట్టుకు పారి పోవటం మంచిదనిపించింది. అంతే` ఒకరి కొకరు కూడ బలుక్కుని అశ్వాల్ని మళ్ళించి చావగా మిగిలిన వాళ్ళు అడవి లోకి పారి పోయారు. ఆ పోరాటం మొత్తంలో పది మంది మాత్రమే తప్పించుకు పోయి వుంటారు.

భద్రా దేవి చేతిలో పాతిక మంది, ధనుంజయుని బాణాలకు పదిహేను మంది, మొత్తం నలభై మంది హతులు కాగా ముప్ఫై అశ్వాల వరకు నేలకొరిగాయి. పది అశ్వాలు గాయాలతో అడవి లోకి పారి పోయాయి.

క్కడ మరో విశేషమేమంటే`

నాగ లోక భటులు ప్రాణాలు కోల్పో గానే వారి శరీరాలు పురుషాకృతిని కోల్పోయి తమ నిజ రూపమగు సర్పాలుగా మారి పోవటం. ఎటు చూసినా నెత్తుటి మడుగులు ఖండిత సర్ప శరీరాలే కన్పిస్తున్నాయి. పోరు జరిగిన చోట మహా పథం రక్త సిక్తమైంది. అప్పటికీ కోపం తీరక భద్రా దేవి ఇంకా కొస ప్రాణాంతో మూలుగుతున్న నలుగురైదుగుర్ని తన బరిసెతో గుచ్చి ప్రాణాలు తీసింది. ఆమె చేతుల్లోని బరిసెలు, ఖడ్గం నెత్తురొడుతున్నాయి. దుస్తులు రక్తాభిషేకం చేసినట్టు ఎర్ర బడి పోయాయి. అదే సమయంలో గగన తలంలో గరుడ పక్షులు సర్ప శరీరాల కోసం కారాడటం కన్పించింది. ఇప్పుడో కాసేపటికో అవి నేలకు వాలే అవకాశం వుంది.
ఇంతలో ధనుంజయుడి శ్వేతాశ్వం భద్రా దేవి సమీపం లోకి వచ్చి ఆగింది. కొన్ని లిప్తల కాలం పాటు ఒకరి నొకరు ఆరాధనగా చూసుకుంటూ వుండి పోయారు. ఇరువురి కళ్ళ లోనూ నీరు చిప్పిల్లుతోంది.

ధనుంజయుడు అశ్వం దిగి తన ధనస్సును అశ్వం జీనుకు తగిలించి భద్రా దేవి కోసం చేతులు చాపాడు. అంతే`

ఒక్క దూకులో తన అశ్వం దిగిన భద్రా దేవి బరిసెను, ఖడ్గాన్ని నేలకు గుచ్చింది. రివ్వున వచ్చి ధనుంజయుని కౌగిట వాలి పోయింది. ఆమెను ప్రేమగా గుండెకు హత్తుకున్నాడతడు. దుఖ్ఖం ఆపుకో లేక ఏడ్చేసింది. కొద్ది సేపు మాటలు పెగల్లేదు ఇరువురికీ. నాలుగు రోజుల ఎడబాటు నాలుగు యుగాలుగా వుంది. బిగి కౌగిట కొద్ది సేపు సేద దీరారు.

‘‘భయ పడితి ప్రభూ! ఈ జన్మలో తమ దర్శనం లభించ దేమో నని భయమందితి. ఆ శంకర స్వామి, వేణు గోపాల స్వామి మమ్ము కరుణించి నారు. ఆ ధూర్తుడు వక్ర దంతుడు వంచనతో ఉలూచిని అపహరింప జూచినాడు. తృటిలో తప్పించ కొనె, లేకున్న వాడిచటనే అంతమై వుండేవాడు...’’ అంటూ ఆ పైన మాటలు పెగక వెక్కి వెక్కి ఏడ్చింది భద్రా దేవి.

ధనుంజయుడు ఆమె ముఖం పైకెత్తి ప్రేమతో కన్నీరు తుడిచాడు.

‘‘నాకంతయు తెలిసె సఖీ. భూతం ఘృతాచి చెప్పినది. ఇక నీ వీరోచిత పోరాటము, ఆవేశము, ఉలూచీశ్వరిని కాపాడిన తీరు కడు శ్లాఘ నీయము భద్రా. నిన్నెలా అభినందించాలో తెలియుట లేదు’’ అంటూ ముదమార గాఢంగా హత్తుకుని నుదుట ముద్దాడాడు. పులకించింది భద్రా దేవి.

ఇద్దరూ అశ్వాలను వదిలి` రథం వైపు నడిచారు. ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చినట్టు విభ్రాంతి చెంది ధనుంజయుని వంక చూసింది భద్రా దేవి.
‘‘ప్రభూ! ఇచటెవరో అదృశ్యమున మనకు సాయ పడినారు. అదో... ఆ  పెను వృక్షాలను కూల్చి నాగ దండును ఆడ్డుకున్నారు. చోదకుడు లేకుండానే రథము వెనక్కి వచ్చి ఇచట ఆగినది. లేకున్న వక్ర దంతుడు ఉలూచీని తన అశ్వం మీద గొని పోయి ఉండే వాడు’’ అంది.
అలా సాయ పడినది ఎవరో` ధనుంజయునికి తెలుసు.

తను రంగ ప్రవేశం చేయకుండా పరోక్షంగా భద్రా దేవికి సాయం చేసాడు. ఇప్పుడు కూడ ఇచటనే ఎక్కడో అదృశ్యంగా వున్నాడు.
‘‘ఆ శక్తి ఎవరో నాకు తెలుసులే దేవీ. అది నా మిత్రుడు యక్షుడు రుచికుడు. నను పాతాళమున చెర వాసము నుండి రక్షించి తక్క సమయమున ఇటకు చేర్చింది అతడే’’ అంటూ క్లుప్తంగా చెప్పాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham