Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

atulita bandham

గతసంచికలో ఏం జరిగిందంటే..... http://www.gotelugu.com/issue188/540/telugu-serials/atulitabandham/atulitabhandham/

( గతసంచిక తరువాయి)

“పాపం కదా.. చాలా మంచి వాడు వేణూ...”

“అవును కార్తీ... హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు... కుడి కాలు ఫ్రాక్చర్ అయింది... ఆరువారాలు బెడ్ రెస్ట్ అన్నారు... ఇంకా ఇంటికి రాలేదు, వాళ్ళ ఆడపడుచు వినత ఇంట్లో ఉన్నారు వాళ్ళు... ఆదివారం నాడు వెళ్ళి చూసి వస్తాను...” చెప్పింది ఐశ్వర్య.

“నేను కూడా వస్తాను ఐశూ...”

“కానీ నేను ఉదయమే వెళదామని అనుకుంటున్నాను...”

“సరే... నేను పదకొండు గంటలకి వచ్చి చూసి వెళతాను... ట్రైనింగ్ లో  చాలా ఆత్మీయుడు అయ్యాడు వేణు నాకు... చెప్పాను కదా...”

“ఊ... అవును...”

“ఇంటికి వెళుతున్నావా?”

“అవును...”

“నా వర్క్ కూడా అయింది...  అటే వస్తున్నాను... నిన్ను డ్రాప్ చేస్తాను...”

“ఉహు, వద్దులే కార్తీ... నేను వెళతాను...”

“ఐశూ... అయితే నన్ను నీ స్నేహితుడిలా కూడా చూడలేక పోతున్నావా? సరే, నీ ఇష్టం...” కార్తీక్ ముఖం బాధతో ఎర్రబడింది... ఇదివరలో అతనికిలాంటి భావనలు కలిగేవి కావు... (నిజానికి ఐశ్వర్య నుంచి ఎలాంటి వ్యతిరేకతలు వ్యక్తం అయ్యేవి కావు) కానీ, ఇప్పుడు...

“అయ్యో, అదేమీ కాదు...” ఇబ్బందిగా కదిలింది ఐశ్వర్య...

“సరే ఐశ్వర్యా, నువ్వు వెళ్ళు...”తలూపి లేచి నిలబడింది ఐశ్వర్య... ఆశాభంగం చెందిన వాడిలా, ఫైల్స్ ఉన్న బీరువా లాక్ చేసి, డ్రా సొరుగులన్నీ మూసి, లాక్ చేసి, బ్రీఫ్ కేస్ తీసుకుని లేచాడు కార్తీక్. ఆఫీసు బయటకు వచ్చి చూస్తే ఆటో కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది ఐశ్వర్య. లేత నీలం రంగు చీరలో సాగర కన్యలా ఉంది... అతన్ని చూసి బై చెపుతున్నట్టుగా చిరునవ్వు నవ్వింది. ఉక్రోషంగా తల తిప్పుకుని, కార్ పార్కింగ్ వైపు వెళ్ళాడు కార్తీక్.

తనలో తానే నవ్వుకుంది ఐశ్వర్య.

***

శనివారం సాయంకాలం ఏడుగంటల సమయం. చట్నీస్ – హిమాయత్ నగర్ బ్రాంచ్ చాలా రష్ గా ఉంది. 

“హాయ్, అయామ్ నీరజ... నీరూ...” అతనికి షేక్ హాండ్ ఇస్తూ చెప్పింది చిరునవ్వుతో నీరజ.


“ఓహ్, నీరూ... యు ఆర్ మార్వలెస్... టూ ప్రెట్టీ...” షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె చేయిని గట్టిగా నలిపేసాడు మొరటుగా ఆ వ్యక్తి. 
చేయి వదిలించుకుని, నవ్వుతూనే అతని ఎదురుగా కూర్చుంది నీరజ. నీరజ తో పాటుగా వచ్చిన ఐశ్వర్య వాళ్ళ టేబుల్ పక్కనే మరో చిన్న టేబుల్ దగ్గర కూర్చుంది.

నీరజ తన ఎదురుగా ఉన్న శ్రీచైతన్యను పరిశీలనగా చూసింది... ముప్పై ఐదేళ్ళ వయసు ఉంటుంది అతనికి. బట్టతల కూడా వస్తోంది... మరీ పొడుగ్గా కాకుండా మధ్యస్తంగా ఉన్నాడు... గుబురు మీసాలు... అతని కళ్ళలో విపరీతమైన కాంక్ష కనిపిస్తోంది... నీరజను చూపులతోనే తినేస్తున్నాడు... 

అప్పటికే ఐశ్వర్య మాటల వలన ప్రిపేర్ అయిపోయిన నీరజకు పెద్దగా ఆశాభంగంలాంటిదేదీ కలగలేదు... కానీ మగవాడు ఎలా ఆడదాని బలహీనతతో ఆడుకుంటాడో మాత్రం అర్థమై, బాగా జ్ఞానోదయం కలిగినట్టు అయింది...

“నీరూ... ఎప్పటి నుంచి ఊరిస్తున్నావు... కలుద్దామని ఎన్ని సార్లు చెప్పినా నీకు దయ కలగలేదు... ఇన్నాళ్ళకి కుదిరింది...” సగం నిష్టూరం, సగం సంతోషం కలగలిపి మాట్లాడుతూ, “ఏం తింటావు?” అని అడిగాడు మెనూని అటూ ఇటూ తిరగేస్తూ...

“లైట్ గా టిఫిన్ ఏదైనా...”

“సరే... పనీర్ దోసె చెబుదాం... బావుంటుంది... ఇంతకూ... నువ్వు హాస్టల్ లో ఉంటున్నావు కదా...”

“ఊ...”

“నువ్వు చాలా అందంగా ఉన్నావు నీరూ...”

“థాంక్స్!” నవ్వింది నీరజ...

“నిన్ను చూస్తుంటే నాలో చాలా ఉద్రేకం కలుగుతోంది... యు ఆర్ టూ...”

“ఒన్ సెకండ్...” అతని మాటను కట్ చేస్తూ, ఆమెకి వచ్చిన ఫోన్ కాల్ అటెండ్ అయింది నీరజ.

“అబ్బ, నీ చెయ్యి ఎంత మెత్తగా ఉందో...” ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ఒత్తాడు...

“ప్లీజ్...” చేయి లాక్కుంది నీరజ. టిఫిన్స్ వచ్చాయి... మౌనంగా దోశె తుంచుకుని ఐదు రకాల చట్నీలతో కలిపి తింటూ మధ్య మధ్యలో స్పూన్ తో సాంబార్ చప్పరిస్తూ, ఆ రుచిని ఆస్వాదించ సాగింది నీరజ.

“అన్నట్టు మీకు ఇంకా పెళ్ళి కాలేదా?” ఉన్నట్టుండి అడిగిన ప్రశ్నకు అతనికి పొలమారింది... గబుక్కున మంచి నీళ్ళు తాగి స్థిమితపడ్డాడు...

“ఊ, అయిందంటే అయింది... కాలేదంటే కాలేదు...”

“అదేమిటి? అప్పుడెప్పుడో పెళ్ళి కాలేదని చెప్పినట్టు గుర్తు?”

“అంటే, ఈ పెళ్ళి అయినా కాలేదన్నట్టు అర్థం అన్న మాట... నా భార్య పరమ గయ్యాళి... ఆరోగ్యం బాగోదు, సంసారానికి పనికి రాదు...”

“అయ్యో... మరి మరో పెళ్ళి చేసుకోకపోయారా?”

“చేసుకుందామనే అనుకున్నాను... కానీ నీకు తెలుసుగా నీరూ, మన సమాజంలో రెండో పెళ్ళానికి ఎంత మాత్రం విలువుందో... కోరికలు తేనెటీగలై నన్ను కుట్టి చంపేస్తున్నాయి... నిద్ర పట్టదంటే నమ్ము... రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వే గుర్తు వస్తావు... ప్లీజ్ నీరూ... మనిద్దరం....”

“ఛీ... మీకిదేమి బుద్ధండీ? మీ ఆవిడా మీలాగే అనుకుంటే?”

“చాల్లే, అన్యాయం అయిపోయింది నేను... నీరూ, నువ్వు ఒప్పుకుంటే, మనిద్దరం వీకెండ్స్ కలిసి గడుపుదాం... కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి... తర్వాత పెళ్ళి చేసుకో...”

“ఎవరినీ? మిమ్మల్నా?” నవ్వాపుకుంటూ అంది నీరజ. పూరీ సాగ్ తింటున్న ఐశ్వర్య పరిస్థితీ అదే...కర్చీఫ్ తో కవర్ చేసుకుంటున్నా ఆగటం లేదు.

“నన్ను కాదులే, ఇంకెవరినైనా... ఈలోగా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు?”

“ఇంతకూ, మీ పేరు నిజంగా శ్రీ చైతన్యేనా?”

“అంటే, పెద్దవాళ్ళు పెట్టిన పేరు చిన్నారావు అనుకో... నేనే మోడరన్ గా మార్చుకున్నాను...” వెకిలిగా నవ్వాడు...
నీరజకి తన మీద తనకే విరక్తి కలిగింది... ఈ వ్యక్తినా  తాను అంతగా ఆరాధించింది? ఆ రాతలను, కవితలను చూసి పడిపోయిందా? అసలవి ఇతని స్వంతమేనా? ఇలా ఎంత మందిని మోసం చేస్తున్నాడో...

కాఫీ తాగాక, తానే బిల్లు చెల్లించింది నీరజ. మాటవరసకీ, మొహమాటానికైనా తాను ఇస్తానని అనలేదు శ్రీ చైతన్య ఉరఫ్ చిన్నారావు. పైగా రిలీఫ్ గా నిట్టూర్చినట్టు అనిపించింది నీరజకి.

“సరేనండి చిన్నారావు గారూ... మళ్ళీ కలుద్దాం...”

“అయ్యో అదేమిటి, నేను చెప్పిన దానికి నువ్వేమీ అనలేదు... రేపు ఫ్రీ యేనా? మధ్యాహ్నం నుంచి కలుద్దామా?”

“అబ్బే, రేపు  మా పిన్ని వస్తోంది ఊరినుంచి... బిజీ అండీ... మళ్ళీ వీలున్నప్పుడు కలుద్దాం లెండి...”

“సరే, మనిద్దరం ఇలా బయట కలుసుకున్నట్టు ఎవరితోనూ అనకే, ఫేస్ బుక్ లో అందరూ నీకు నాతో ఫ్రెండ్ షిప్ అయిందని కుళ్ళి చచ్చిపోతున్నారు... అందుకని...”

“అబ్బే, నేను ఎవరితో అంటాను? పైగా అంటే పోయేది నా పరువేగా?”

“ఓహో... భలే! ఆ సంగతి గుర్తుంది కదా... సరే నీరూ... మళ్ళీ కలుద్దాము... మళ్ళీ కలుసుకునే దాకా నా ఆత్మ... నీ చుట్టూనే... మనసంతా నీ వైపు పరుగు తీస్తూనే...  వస్తాను మరి...” నీరజ బుగ్గ మీద చిటికె వేసి బయటకు నడిచాడు. కనీసం ‘నువ్వెలా వెళతావు?’ అని కూడా అడగలేదు.

అతను బయటకు వెళ్ళగానే ఐశ్వర్య వచ్చి నీరజ పక్కనే కూర్చుంది... ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారిద్దరూ... నీరజ నవ్వుతూనే ఐశ్వర్య భుజమ్మీద తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది... 

“థాంక్ యు ఐశూ... థాంక్ యు... ఎంత పిచ్చిదాన్ని అయ్యాను, నువ్వు చెప్పకపోయి ఉంటే...” ఆమె గొంతు రుద్ధమైంది...

“సరేలే, వాడి రాతలూ, కవితలూ అంత గొప్పగానే ఉంటాయ్... ఎవరైనా మోసపోతారు... సరే, ఏం చేయదలచుకున్నావు?”

“ఏం చేసినా కాస్త స్ట్రాంగ్ గానే చేస్తాను... సరే, వెళదామా?”

“వెళదాం... ఛీరప్... అతని నిజస్వరూపం తెలిసినందుకు మనం హ్యాపీగా ఫీలవాలి...”

“అవును... నిజం... నాతో వచ్చినందుకు థాంక్స్ ఐశూ...” 

“ఇట్స్ ఓకే... ఫ్రెండ్స్ మధ్యన థాంక్స్ లు ఏమిటీ? పద... నిన్ను డ్రాప్ చేసి నేను వెళతాను...” అంటూ బయటకి వచ్చి ఆటోని పిలిచింది ఐశ్వర్య.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్