Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

జయమ్ము నిశ్చయమ్మురా చిత్రసమీక్ష

jayammu nischayammuraa movie review

చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా 
తారాగణం: శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ, రవివర్మ, కృష్ణ భగవాన్‌, జీవా, ప్రవీణ్‌, శ్రీవిష్ణు, జోగి బ్రదర్స్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: నగేష్‌ బానెల్‌ 
నిర్మాణం : శివరాజ్‌ ఫిలింస్‌ 
నిర్మాతలు: శివరాజ్‌ కనుమూరి, సతీష్‌ కనుమూరి 
దర్శకత్వం: శివరాజ్‌ కనుమూరి 
సంగీతం: రవిచంద్ర 
విడుదల తేదీ: 25 నవంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

సర్వేష్‌ అలియాస్‌ సర్వ మంగళం కరీంనగర్‌ నుంచి కాకినాడకి ఉద్యోగరీత్యా వచ్చిన ఓ యువకుడు. మూఢ నమ్మకాలెక్కువ. ప్రతి విషయానికీ మూఢనమ్మకాల్ని ఆశ్రయిస్తాడు, స్వామీజీలను పెంచి పోషిస్తుంటాడు. అనుకోకుండా ఓ సందర్భంలో సర్వేష్‌కి రాణి (పూర్ణ) తారసపడ్తుంది. ఆమే జీవితం అనుకుంటాడు సర్వేష్‌. అయితే తన బాస్‌, రాణిని వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసి షాక్‌కి గురవుతాడు సర్వేష్‌. బాస్‌ నుంచి తన ప్రియురాల్ని రక్షించుకునేందుకు సర్వేష్‌ పడే పాట్లు మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 

భిన్నమైన భావోద్వేగాలు చూపించే పాత్రలో శ్రీనివాస్‌రెడ్డి బాగా నటించాడు. అమాయకుడిగా, మూఢ నమ్మకాలున్న వ్యక్తిగా తనకు దక్కిన పాత్రలో శ్రీనివాసరెడ్డి జీవించేశాడు. అతని పాత్ర నేల విడిచి సాము చెయ్యలేదు గనుక, సగటు వ్యక్తిలా అద్భుతంగా రాణించాడు శ్రీనివాసరెడ్డి. తన పాత్ర ప్రవర్తనతోనే కామెడీ పుట్టించడం చాలా కష్టం. ఆ విషయంలో శ్రీనివాస్‌రెడ్డి సక్సెస్‌ అయ్యాడు. హీరోయిన్‌ పూర్ణ నిండుగా కన్పించింది. నేచురల్‌ బ్యూటీ అయిన పూర్ణ గ్లామర్‌ ఈ సినిమాకి ప్లస్‌ అయ్యింది. హీరో, హీరోయిన్‌ పెయిర్‌ బాగుంది. 
మిగతా పాత్రల్లో కృష్ణ భగవాన్‌ కడుపుబ్బా నవ్విస్తాడు. ప్రవీణ్‌, పోసాని కృష్ణమురళి, జోగి బ్రదర్స్‌ తదితరులంతా సినిమాకి తమదైన కామెడీని అందించి, సినిమాకి హెల్పయ్యారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
కొత్తదనంతో కూడిన కథనం, దానికి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే బాగా కుదిరాయి. అక్కడక్కడా సినిమా కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. మాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త పనితనం ప్రదర్శిస్తే బాగుండేది. సంగీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంది. పాటలు తెరపై చూడ్డానికి కూడా అందంగానే ఉన్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. 

సాదా సీదా యువకుడి కథే అయినా, ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్‌ని అంతర్లీనంగా ఇచ్చారు. మూఢ నమ్మకాలతో మోసపోయే వ్యక్తి, తన బలం తెలుసుకుని, ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనడం ఈ సినిమాలోని ముఖ్య ఉద్దేశ్యం. మామూలుగా హీరో అయంటే డాన్సులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. అయితే అలాంటివాటి జోలికి దర్శకుడు పోలేదు. హీరో కూడా ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం అభినందించదగ్గ విషయమే. సగటు వ్యక్తి కథ, ఇలానే ఉండాలన్పించేలా సినిమాని ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అక్కడక్కడా సినిమా స్లో అవుతున్నట్లనిపించడం మినహా సినిమా ఓవరాల్‌గా మంచి అనుభూతిని మిగుల్చుతుంది. పబ్లిసిటీ బాగా చేయడం, ప్రీ రిలీజ్‌ మంచి టాక్‌ రావడం సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
జయమ్ము ఓ మోస్తరుగా నిశ్చయమ్మేరా 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with srinivas reddy