Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayammu nischayammuraa movie review

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీ‌నివాస‌రెడ్డితో ఇంటర్వ్యూ

interview with srinivas reddy
ఉద్యోగాలు రావ‌ట్లేద‌ని.. సినిమాల్లోకి వ‌చ్చా!  - శ్రీ‌నివాస‌రెడ్డి

శ్రీ‌కాంత్ జుత్తు గెట‌ప్‌లో ఉండే... శ్రీ‌నివాస‌రెడ్డి ని చూస్తే బుద్దిగా సాఫ్ట్ వేర్  ఉద్యోగిలా, క్లాస్‌గా క‌నిపిస్తాడు. కానీ మ‌హా అల్ల‌రోడు. తింగ‌రోడిలా క‌నినిపించే చిలిపి కృష్ణుడు. సైలెంట్‌గా ఉంటూనే పంచ్‌లు వేస్తాడు. ఆ స్టైలే.. క‌మెడియ‌న్ల‌లో శ్రీ‌నివాస‌రెడ్డికంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క‌ల్పించింది. ఊర కామెడీ చేయ‌డు.. అత‌ను పంచే వినోదం నీట్‌గా.. ఉంటుంది. అదే శ్రీ‌నివాస‌రెడ్డి ప్ల‌స్ పాయింట్‌. ఉన్న‌ట్టుండి శ్రీ‌నివాస‌రెడ్డి హీరో అయిపోయాడు.. గీతాంజ‌లి సినిమాతో. అది బాగానే ఆడింది. ఇప్పుడు జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దేశ‌వాళీ వినోదం అంటూ వెరైటీ క్యాప్ష‌న్ పెట్టారు ఈ సినిమాకి. ఆ క్యాప్ష‌న్ ఏంటో, శ్రీ‌నివాస‌రెడ్డి క‌థేమిటో తెలుసుకొందాం.. రండి. 


* దేశ‌వాళీ ట‌మాటాల్లా... ఈ దేశ‌వాళీ వినోదం ఏమిటి?
- అంటే మ‌న‌దైన న‌వ్వుల‌న్న‌మాట‌. ఎరువులు, పురుగులు వేసి పెంచిన ట‌మాటాల కంటే స‌హ‌జంగా పండిన‌వే రుచిగా ఉంటాయి. అదే ఆరోగ్యం. అలాంటి న‌వ్వులే మేం కూడా అందిస్తున్నాం. అందుకే ఆ క్యాప్ష‌న్ పెట్టాం.

* విడుద‌ల‌కు ముందే ప్రీమియ‌ర్లు వేశారు. అంత న‌మ్మ‌కం ఏమిటి?
- మాది చిన్న సినిమా అండీ. చూస్తున్నారు క‌దా, స్టార్లు లేరు. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడు. జ‌నం థియేట‌ర్‌కి ఎందుకు రావాలి??  మౌత్ టాక్‌తోనే ఈ సినిమా జ‌నంలోకి వెళ్లాలి. మేం మంచి సినిమా తీశాం. ఆ సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు తెలియాలి. అలా తెలియాలంటే ముందు మేం సినిమా చూపించాలి. రెండు రాష్ట్ర్రాల్లో క‌ల‌సి 5 చోట్ల ప్రీమియ‌ర్లు వేశాం. వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా చాలా చాలా బాగుంద‌ని అంటున్నారంతా. ఆ మౌత్ టాక్ చాలు. 

* మొత్తానికి హీరో అయిపోయారు.. ఎలా ఉందీ ఈ ఫీలింగ్‌?
- నిజం చెప్పాలంటే కొంచెం క‌ష్టంగా ఉంది. నేను హీరో అయిపోదాం అని ఎప్పుడూ అనుకోలేదు. స్నేహితులు, ఇంట్లోవాళ్లు 'ఇప్పుడు ఇదంతా అస‌న‌ర‌మా?' అన్న‌ట్టు చూశారు. మ‌ళ్లీ మ‌ళ్లీ నేను చెప్పేదేంటంటే.. నేను హీరోని కాదు. కేవ‌లం క‌థ‌ని న‌డిపే పాత్ర మాత్ర‌మే. ఈ సినిమాలోనే కాదు, ఇక మీద‌ట నేను చేసే ప్ర‌తీ సినిమాలోనూ క‌థే హీరో. ఆ త‌ర‌వాతే నేను.

* అంటే ఈ సినిమాలో హీరోయిజం ఉండ‌దంటారు..?
- ఉంది.. అది క‌థ‌లోనే ఉంది. స‌న్నివేశాల్లో హీరోయిజం ఉంది. అదేంటి?  ఎలా?  అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

* శ్రీ‌నివాస‌రెడ్డి సినిమా.. అందులోనూ హీరోగా చేస్తున్నాడు. సినిమాలో కామెడీ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ట్రైల‌ర్‌లో మాత్రంం సెంటిమెంట్ తో పిండేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకిలా? 
- భ‌లేవారే. ఈ సినిమాలో కామెడీ లేక‌పోడం ఏమిటి?  ట్రైల‌ర్‌లో చూపించిన‌ది క‌థ‌లో కీల‌క‌మైన స‌న్నివేశాల్లో క‌నిపించే భాగాలు.  కావ‌ల్సినంత కామెడీ ఉంది. అయితే వాటితో పాటు హార్ట్ ట‌చింగ్ సీన్లు కూడా ఉన్నాయ‌ని చెప్ప‌డ‌మే మా ఉద్దేశం.

* తొలిసారి క‌థ విన్న‌ప్పుడు ఏమ‌నిపించింది?
- కొన్ని కొన్ని సార్లు 'ఇలాంటి క‌థ చేస్తే బాగుంటుంది క‌దా' అనే ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అయితే అన్నిసార్లూ మ‌న ఆలోచ‌న‌లు, క‌ల‌లు నిజం కావు. నేను చాలా సార్లు 'ఈ త‌ర‌హా క‌థ నాకు ఎవ‌రైనా చెబితే బాగుణ్ణు' అనుకొనేవాడ్ని. నా అదృష్టం కొద్దీ అలాంటి క‌థ‌.. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురాతో దొరికింది. విన‌గానే చాలా థ్రిల్ ఫీల‌య్యా. ఐ యామ్ సో ల‌క్కీ అనుకొన్నా.  

* హీరో అయిపోయారు.. ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టేనా?
- చెబితే న‌మ్మ‌రు గానీ.. నేనెప్పుడూ న‌టుడ్ని అవ్వాల‌నుకోలేదు. నేను ఇండ్రస్ట్రీకి రాలేదు. నా స్నేహితులు పంపేశారు. బీకాం పూర్తయ్యాక చాలా ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశా. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఉద్యోగాలు రావ‌డం లేద‌నే ఇండ్ర‌స్ట్రీ కి వ‌చ్చా. నిజానికి నేను ద‌ర్శ‌కుడ్ని అవ్వాల‌నుకొన్నా.  అనుకోకుండా న‌టుడ్ని అయ్యా. మంచి న‌టుడిగా పేరు సంపాదించుకొంటే చాలు అనుకొన్నా. నేను కోరుకొన్న స్థానం సంపాదించా. అంత కంటే పెద్ద ల‌క్ష్యాలేం లేవు.

* క‌మెడియ‌న్‌గా బాగానే వెన‌కేశారా?
- కోట్లకు కోట్లు సంపాదించ‌లేదు. నేను నిల‌బ‌డి, గ‌ర్వంగా బతికేంత సంపాదించా. నాకు పెద్ద కోరిక‌లేం లేవు. అన్నింటికంటే మించి మంచి మిత్ర‌బృందం, వాళ్ల ఆశీస్సులు, ప్రేమ సంపాదించా. ఒక‌రి ద‌గ్గ‌ర అప్పు అడ‌క్కుండా బ‌త‌కాలి అన్న‌ది నా సిద్దాంతం. నా అదృష్ట‌మో, క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌ల‌మో ఆ అవ‌స‌రం ఇంత వ‌ర‌కూ రాలేదు. ఇక ముందూ రాకూడ‌ద‌నే అనుకొంటున్నా.

* అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారా?
- తిరగాలి క‌దండీ మ‌రి. అయితే నేను మ‌రీ అంత క‌ష్టాలేం ప‌డ‌లేదు. మేక‌ప్ వేసుకొన్న ద‌గ్గ‌ర్నుంచి ఖాళీగా ఉన్న‌ది చాలా త‌క్కువ‌. 

* ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాక ఏం నేర్చుకొన్నారు?
- ఒక‌టి కాదు, చాలా విష‌యాలు నేర్చుకొన్నా. గ‌ర్వం ఉండ‌కూడ‌దు. మ‌నకేం వ‌చ్చినా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిందే. లేదంటే.. ఎదురు దెబ్బ‌లు తిన‌డం ఖాయం.

* హీరో అయిపోయారు.. ఇప్పుడు మిగిలిన హీరోలు మిమ్మ‌ల్ని ఎలా చూస్తున్నారు?
- అంద‌రూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. పెద్ద మార్పులేం లేవు. ముందే చెప్పాక‌దా, నేను హీరో కాదు అని. మ‌న హీరోలంతా ప‌డిన‌, ప‌డుతున్న క‌ష్టం.. వాళ్ల ఎఫెక్ట్స్‌, వాళ్ల టాలెంట్ నాకు బాగా తెలుసు. అందులో నాకు కొంచెం కూడా లేదు. నేను వాళ్ల‌లా డాన్సులు చేయ‌లేను, ఫైట్లు చేయ‌లేను.. అందుకే న‌న్ను నేను హీరోగా చూసుకోవ‌డం లేదు.

* పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌జ‌ల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ త‌రుణంలో మీ సినిమా విడుద‌ల అవుతోంది. ఆ ఎఫెక్ట్ మీ సినిమాపై ప‌డ‌దంటారా?
- తొలి రోజుల్లో అంద‌రూ ఇబ్బంది ప‌డ్డారు. అలా ఇబ్బంది ప‌డిన‌వాళ్ల‌లో నేనూ ఉన్నా. అయితే ఇప్పుడు ప‌రిస్థితుల‌న్నీ కుదుట ప‌డుతున్నాయి. జ‌నాలు థియేట‌ర్‌కి వ‌స్తార‌న్న న‌మ్మ‌కం నాకుంది.

* ఓకే.. మీక్కూడా జ‌యం నిశ్చ‌యంగా దొర‌కాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌..

కాత్యాయని

-
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka