Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

గతసంచికలో ఏం జరిగిందంటే ....http://www.gotelugu.com/issue189/544/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి) చెయ్య వలసిన పనులన్నీ అయి పోవడంతో నెమ్మదిగా నడుస్తూ రాజ మహల్లోని ఒక్కో గదినీ పరిశీలిస్తూ పచార్లు చెయ్య సాగింది ఇంద్ర నీల వరండాలో.  ఏదో రహస్యాన్ని తనలో దాచుకున్నట్టుగా  గుంభనంగా ఉన్నట్టనిపింది ఆ రాజ ప్రాసాదం.

నడుస్తూ  నడుస్తూ  నెమ్మదిగా రాజేంద్ర శవం ఉన్న గది వైపు  వచ్చింది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని  ఆమె  డిపార్టు మెంట్ లో చేరి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. ఇంకా ఆమెకి మర్డర్లూ శవాలూ పూర్తిగా అలవాటు కాలేదు.  శవం ఉన్న గది లోకి వెళ్ళాలంటే మనసులో సహజంగా అందరికీ ఉండే బెరుకే ఆమెకీ ఉంది.  కానీ అదేమీ పైకి కనిపించ నివ్వకుండా  మళ్ళీ ఆ గది లోకి అడుగు పెట్టింది.   అక్కడ కాపలాగా ఉండి కబుర్లు చెప్పుకుంటున్న  ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆమె రాకతో  అలర్టై నట్టుగా నిటారుగా నిల బడ్డారు.

శవాన్ని ఫోటోలు తీయించడం వగైరా పనులు అయి పోవడంతో,  నిండుగా దుప్పటి కప్పి పడుకో పెట్టారు మంచమ్మీద. ముఖం మీద కప్పిన దుప్పటి గాలి కెగిరి  రాజేంద్ర విశాలమైన నుదురూ, ఒత్తైన కను బొమలూ మూసుకున్న  పెద్ద పెద్ద కనురెప్పలూ సూటిగా ఉన్న ముక్కూ కనిపించాయి.  ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండి పోయింది ఆమె.  నిర్జీవంగా పడి ఉన్న రాజేంద్రని  చూస్తుంటే,  ఆమె మనసులో ఇదీ అని చెప్పలేని భావం... ఒక రకమైన కసి... కోపం...

తనకి కావాల్సిన రహస్యాన్ని చెప్ప గల ఒకే ఒక్క వ్యక్తి అతడు.  తను ఎవరి కోసమైతే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందో,   ఆ వ్యక్తి మరణం కేసుని పరిశోధించాల్సి రావడం నిజంగా విధి విచిత్రం.

‘ఎన్ని ఆటంకాలు వచ్చినా ...తను అనుకున్న పని సాధించి తీరుతుంది’   పట్టుదలగా అనుకుంది. ఆమె అలా ఆలోచిస్తుండ గానే ఆమె సెల్‍ ఫోన్ రింగయ్యింది.  ఉలిక్కి పడ్డట్టుగా ఫోన్ ఎత్తింది.  స్క్ర్రీన్ మీద డిస్‍ప్లే అవుతున్న నెంబరుని చూసి మరింత ఉలిక్కి పడింది. గబ గబా ఫోన్ ఎత్తి “హలో” అంది.

“ఏమైంది?  ఏమైనా తెలిసిందా?”  అవతలి వ్యక్తి కంఠం అత్రుతగా అంది.

“ఏమిటి తెలిసేది? మూడు నెలలుగా తెలియని విషయం ఒక్క రోజులో తెలిసి పోతుందా?  మనక్కావల్సిన వ్యక్తి మనం చంపకుండానే శవమై పడున్నాడు.  ఇప్పుడు నేనేం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి”

“అలా ఎందుకనుకుంటావు?   రాజ మహల్లోకి ఎంట్రీ అవ్వడానికి ఇది నీకొక అవకాశం అనుకో. మహల్ మూల  మూలలా వదల కుండా శోధించు. మనకి కావాల్సిన ఆధారం దొరకక పోదు”

“ప్రస్తుతం నేను  చేస్తున్నది అదే.  ఐనా  అత్యవసరమైతే తప్ప నిన్ను నాకు ఫోన్ చెయ్యద్దన్నాను కదా?  అవసరమైనప్పుడు నేనే చేస్తాను.  ఫోన్ పెట్టెయ్యి ”  అని  ఖంగారుగా ఫోన్ పెట్టేసిందామె.

సరిగ్గా అదే సమయానికి పోస్టు మార్టమ్ కోసం డాక్టర్ల బృందం వచ్చిన వేన్ రాజ మహల్ కాంపౌండ్ లోకి మలుపు తిరిగింది.

****

పాణి చెప్పిన సంగతి విని,  అతడు ల్యాప్ టాప్‍లో చూపిస్తున్న మెయిల్ వంకే తదేకంగా చూస్తూ  ఆలోచనలో పడ్డాడు డి ఎస్పీ ప్రసాద్. “కానీ  మాకు వచ్చిన సమాచారం ప్రకారం రాజేంద్ర వర్మ హత్య చేయబడలేదు. సూసైడ్ నోట్ రాసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు”

“సూసైడ్ ఎలా చేసుకున్నాడు?”

“మణి కట్టు నరాలనీ, కాళ్ళ మీదా చేతుల  మీదా ఉన్న నరాలనీ కత్తితో కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు”

“ఆ గాయాలు హంతకుడు చేసిన గాయాలు కావచ్చుగా?”

“రాత్రి అతడు చని పోయిన గదిలోకి హంతకుడు వెళ్ళిన ఆనవాలు ఎక్కడా లేవు.  కత్తి మీద అతడి వేలి ముద్రలు స్పష్టంగా ఉన్నాయి”

పాణి చిన్నగా నవ్వాడు “మరణం  సుమారుగా ఎన్ని గంటలకి  సంభవించింది?”

“పోస్టు మార్టమ్ రిపోర్టు వస్తే కానీ కచ్చితంగా చెప్పలేం.  కానీ మా డిపార్టుమెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరణం అర్ధరాత్రే సంభవంచి వుండచ్చు.  వీళ్ళు మాత్రం  తెల్ల వారి చాలా ఆలస్యంగా తొమ్మిదిన్నరకి గుర్తించారు”

“సూసైడ్ నోట్ ఉన్నంత మాత్రానా,  హత్యాయుధం మీద హతుడి వేలి ముద్రలే ఉన్నంత మాత్రానా అది ఆత్మహత్యేనని నిర్ధారణకి ఎలా రాగలం? అర్ధ రాత్రి నుంచీ మర్నాడు పొద్దుట  తొమ్మిదిన్నర వరకూ...  ఆనవాళ్ళని మాయం చెయ్యడానికీ, వేలి ముద్రలు మార్చడానికీ ఈ సమయం చాలా ఎక్కువ.  ఏమంటారు?”

ప్రసాద్, పాణి మంచి స్నేహితులు. గతంలో చాలా కేసులకి ఇద్దరూ కలిసి పని చేసారు. పాణితో సంభాషణని అతడు బాగా ఎంజాయ్ చేస్తాడు.  “నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. కానీ   చని పోయిన రాజేంద్ర  శరీరమ్మీద గాయాలని   చూసి అవి అతడు స్వయంగా చేసుకున్నవే అని మావాళ్ళు నిర్ధారించారు.  మామూలు వ్యక్తులకి తెలియక పోయినా,  అనుభవం ఉన్న పోలీసు అధికారులకి ఒక వ్యక్తి లేదా శవం మీద గాయాలని పరిశీలనగా చూస్తే అవి అతడు  స్వయంగా చేసుకున్న గాయాలా లేక ఇతరులు చేసిన గాయాలా అన్నది  తెలుసు కోవడం పెద్ద కష్టం కాదు” అన్నాడు.

“ఎవరా అనుభవమున్న పోలీస్ అధికారి?”  అన్నాడు పాణి ‘అనుభవమున్న’ అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. పాణి మాటలకి ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వునాపుకోవడం ప్రసాద్ వల్ల కాలేదు. పైకే గట్టిగా నవ్వేసాడు. “నీలో  నాకు నచ్చే గుణం అదే పాణీ.   పరిశోధనకి వచ్చే ముందరే అవసరమైన హోమ్ వర్క్ చేసేస్తావు. ఇక్కడికి వచ్చే ముందే నువ్వు ఇంద్ర నీల గురించి ఎంక్వైరీ చేసావు కదూ?”

పాణి నవ్వ లేదు “మొన్ననే ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చి జాయినైన ఏ మాత్రం అనుభవం లేని ఒక జూనియర్ ఎస్సై మాటలని పట్టుకుని, ఆ గాయాలని హంతకుడు స్వయంగా చేసుకున్న గాయాలని ఎలా నిర్దారణకి రాగలరు?”  అన్నాడు సీరియస్‍గా.

“ఇంద్ర నీలకి  మర్డర్ కేసులని పరిశోధించిన అనుభవం లేక పోవచ్చు. కానీ   క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో    శిక్షణ పొందిన అధికారి ఆమె. అదీ కాక ఆమెకి అపారమైన తెలివి తేటలు ఉన్నాయి. ఆమెని చూస్తే ఈ విషయం నువ్వే ఒప్పుకుంటావు”

కొద్ది క్షణాలు పాణి ఏమీ మాట్లాడ లేదు.  ప్రసాదే మళ్ళీ అన్నాడు  “ఇంతకీ నువ్వనేదేమిటి? ఆ రాజేంద్ర వర్మ ఆత్మహత్య చేసుకో లేదు,  వజ్రాల కోసం ఎవరో అతడ్ని హత్య చేసారంటావా?”

“ఇది హత్యా ఆత్మహత్యా అనది కాదిక్కడ విషయం. నేర పరిశోధనలో హత్యకీ ఆత్మహత్యకీ  పెద్దగా తేడా ఉండదు.  ఒక వేళ ఆత్మహత్య అయినంత మాత్రాన  అది పరిశోధనకి  ఫుల్‍ స్టాపూ కాదు.   జరిగిన సంఘటనలో ఉన్న ‘క్రిమినల్ ఇంటెన్షన్’ నే మనం శోధించాల్సింది. ఈ కేసులో  నేను  మీ డిపార్టుమెంట్‍కి  ఇవ్వ దలుచుకున్న హింట్ అదే”

అతడు  ఆ మాట అంటున్న సమయంలో గది తలుపు తెరుచుకుని “ఎక్స్ క్యూజ్ మీ సర్” అని ఒక వ్యక్తి లోపలకి వచ్చాడు. అతడి చేతిలో  ఒక సీల్డ్ కవరు ఉంది.   ఆ కవరుని డి.ఎస్పీ ప్రసాద్ కి అంద చేస్తూ అన్నాడు “రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ గారి పోస్ట్ మార్టమ్ రిపోర్టు”

అతడు గది లోంచి బయటికి వెళ్ళిపోయాక ఆత్రుతగా కవరు చించాడు ప్రసాద్. రెండు నిమిషాల్లో రిపోర్టు మొత్తం చదివేసి  తల పైకెత్తి పాణి వైపు చూసి అన్నాడు “ఈ రిపోర్టులో మరొక కొత్త విషయం బయట పడింది”

“ఏమిటది?” అడిగాడు పాణి.

“మనం అనుకుంటున్నట్టుగా పాణి మరణానికి కారణం గాయాల ద్వారా అయిన రక్త స్రావం కాదు!”

“మరి?!”

“అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగడం వల్ల ఆయన మరణం సంభవించింది!”

పాణి కూడా ఆశ్చర్యంగా చూసాడు అతడి మాటలకి.

(కథ తిరిగిన కొత్త మలుపు ఏమిటి? … వచ్చేవారం !)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam