Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం 

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు. 

యతిమనోగృహ దీపికాంకూరమగులీల 
గోవర్ధనాచలగుహ మెలఁగుచు
గిరికూట తటనటత్కేకిరాజమురీతి
రాధచన్గవమీఁద వ్రాలి నగుచుఁ  
జిత్రాభ్రములనేలు సుత్రాముకైవడిఁ 
బలువన్నెయాలమందల మెలఁపుచుఁ 
గమలకాననమధ్య కలహంసవిభుభాతిఁ 
గూర్మి నెచ్చెలిపిండు గొని చెలఁగుచుఁ                     (సీ)

జంద్ర బింబంబునకు మృదుస్వనము గరపు        
రచన సంజ్ఞార్హ శంఖమూఁదుచు నొనర్చు
నాటలన్నియుఁ జాలించి యరిగెఁ దపసి 
పర్ణశాలకు దేవకీతర్ణకంబు                                    (తే)

యతుల, మునుల, ఋషుల మనసులు అనే గుహలలో దీపకళికయై వెలిగే మహానుభావుడు  గోవర్ధనపర్వత గుహలలో మెలగుతూ ఆటలు ఆడుకునేవాడు. తన భక్తుల మనసులనే  గుహలలోని అంధకారమును పారద్రోలే ఆటలు ఆడుకునేవాడు. పర్వతముల చరియలలో  నాట్యముచేసే నెమలిరాజు లాగా, మగనెమలిలాగా రాధాదేవి చనుకొండలమీద వ్రాలి  నగవులు చిలుకుతూ ఆటలు ఆడుకునేవాడు. 'నీళా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య  కృష్ణం..' అని, 'నీళాదేవి కుచములు అనే కొండల సానువులలో నిదురించే శ్రీకృష్ణుని  మేలుకొలిపిన తల్లి' అని గోదాదేవిని పరాశరభట్టారకులు స్తుతించినట్లు, యిక్కడ తెనాలి  రామకృష్ణుడు స్తుతిపూర్వక వర్ణన చేస్తున్నాడు. రంగురంగుల మేఘములను పాలించే,  శాసించే దేవేంద్రునిలా, రంగు రంగుల ఆవుల మందలలో మెలగుతూ, వాటిని పాలన 
చేస్తూ ఆటలు ఆడుకున్నాడు. కమలముల వనముమధ్యలో ఒక కలహంసరాజులాగా తన జట్టుగాళ్ళ మధ్యన నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు. చంద్రబింబానికి  మృదువైన సవ్వడిని చేయడం నేర్పుతున్నాడు అని పొగడడానికి అర్హమైనట్లు, చంద్రబింబమువంటి తన ముఖముతో శంఖాన్ని ఊదుతూ, మురళిని ఊదుతూ,  ఆడుకున్నాడు. మురళిని ఊదినా, శంఖాన్ని ఊదినా ఒకటే రకమైన ధ్వని, 'ఓం' అనే ధ్వని, ధ్వని తీవ్రతలోనే తేడా, కనుక 'మృదుస్వనము' అన్నాడు. యిటువంటి  ఆటలు ఆడుకుంటూ వినోదించే ఆ మహానుభావుడు, శ్రీకృష్ణుడు తన ఆటలన్నిటినీ  చాలించి పరుగునా పుండరీకుని కరుణించడానికి బయలుదేరాడు! 

లలితశిరీషపుష్పమృదులంబులు నీచరణంబులక్కటా!
యిలయిది రూక్ష మిట్టులలయించుట గాదని ప్రార్థనామృదూ
క్తులు సెలఁగంగ వేపొదివి తొల్చదువుల్ తగువిన్నపంబులన్
బలుమరుజేయుచందమున బంగరుటందియలుగ్గడింపగన్        (చ)

పరుగునా పుండరీకుని కరుణించడానికి ఆ నల్లనయ్య వస్తుంటే, ఆయన పాదాలకున్న  మువ్వలు సవ్వడి చేస్తున్నాయి. ఆ సవ్వడి 'అయ్యో! నాజూకైన దిరిసెన పూవులలాగా,  మంకెనపూవులలాగా మృదువైనవి నీ పాదాలు! ఈ నేల కఠినంగా ఉన్నది. ఈనేలమీద 
మోపి, పరుగెత్తి నీ మృదువైన పదములను నొప్పించడం భావ్యముకాదు స్వామీ' అని వేదములు ఘోష పెడుతున్నట్లుగా ఉన్నది! ఆ పాదమంజీరనాదం వేదనాదం!     

మెత్తఁగ నూరిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరుకంఠములలనా 
డొత్తిన హత్తిన చేఁదుం 
దిత్తులక్రియఁ దొడల నుడ్డతిత్తులు వ్రేలన్                 (కం) 

మధుకైటభులు అనే రాక్షసులను వధించేప్పుడు వారిని తన తొడలమీద వేసుకుని  వారి కంఠములను కత్తిరించాడు శ్రీమహావిష్ణువు. ఆ రాక్షసులు శ్రీహరితో వంతులు  వేసుకుని పోరాడారు. ఈయన ఒక్కడు, వారు యిద్దరు, వరగర్వితులు. యుగాల  పర్యంతమూ పోరాడినా ఈయన అలసిపోవడమే గానీ వారిని వధించడం కావడంలేదు. ఒకడు పోరాడుతున్నపుడు ఇంకొకడు 'రెస్టింగ్'మరి! ఏమీ తోచని శ్రీహరి 'అమ్మవారిని' వేడుకున్నాడు. ఆమె ఆ రాక్షసులను మాయలో పడేసింది. ఆ మాయాప్రభావంతో  వారు మదమెక్కి, శ్రీహరిని చూసి 'పాపం బాగా కష్టపడుతున్నావు! నీకేం కావాలో కోరుకో! నీకు వరాన్ని ఇస్తాము' అన్నారు. ' నాచేతిలో మీరు మరణించే వరం యివ్వండి నాకు'
అని అడిగాడు శ్రీహరి. వారు యింకా మదం వీడక, 'సరే! తడిలేకుండ ఉన్న స్థలంలో మమ్మల్ని చంపుకో, ఫో' అని వరం యిచ్చారు. సృష్టి అంతా ఏకార్ణవమై ఉన్న ఆ సమయములో, శ్రీహరి తన విరాడ్రూపాన్ని ధరించి, విశాలమైన తన తొడమీద  వారి పీకలను సుదర్శన చక్రముతో కోసి వారిని వధించాడు! అలా వారిని గొంతుకోసి  చంపేప్పుడు, వారి గొంతులలోని తిత్తులు ఆ తొడలకు అంటుకుని అలానే 
ఉండిపోయాయేమో అన్నట్లు శ్రీకృష్ణుని తొడలకు పట్టుకుచ్చులు సంచులు  వ్రేలాడుతున్నాయి, ఆయన ఆడుకునే 'గోళీలు' ఉన్నాయి వాటిలో బహుశా. యిలా  శ్రీకృష్ణుడు పరుగునా పుండరీకుడిని కనికరించడానికి వస్తుంటే ఆ కుచ్చులు  ఊగుతున్నాయి. అలా ఆతృతతో తన భక్తుడిని కనికరించడానికి వస్తున్నాడు ఆ స్వామి! 

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
navvandi. navvinchandi