Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

భేతాళుడు చిత్ర సమీక్ష

betaludu movie review

చిత్రం: భేతాళుడు 
తారాగణం: విజయ్‌ ఆంటోనీ, అరుంధతి నాయర్‌, చారుహాసన్‌, మహేంద్ర, కమల్‌ కృష్ణ, కిట్టీ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: ప్రదీప్‌ కలిపురయత్‌ 
నిర్మాణం : మానస్‌ రుషి ఎంటర్‌ప్రైజెస్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ 
నిర్మాతలు: ఫాతిమా విజయ్‌ ఆంటోనీ, మల్కాపురం శివకుమార్‌ 
దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి 
సంగీతం: విజయ్‌ ఆంటోనీ 
విడుదల తేదీ: 1 డిసెంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు దినేష్‌ (విజయ్‌ ఆంటోనీ). ఐశ్వర్య (అరుంధతి నాయర్‌)ని పెళ్ళాడతాడు దినేష్‌. కాపురం సజావుగా సాగుతుందనుకున్న సమయంలో దినేష్‌కి చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరికీ వినిపించని ఓ గొంతు తనకే విన్పిస్తూ, 'జయలక్ష్మిని చంపెయ్‌ చంపెయ్‌' అని వెంటాడుతుంటుంది. మానసిక సమస్య అని భావించి, మానసిక వైద్యుడి వద్దకు వెళితే, హిప్నాటిజం ద్వారా గత జన్మ జ్ఞాపకాల్లో జయలక్ష్మి (అరుంధతి నాయర్‌) తన భార్య అని తెలుసుకుంటాడు. ఆ జన్మలో తన పేరు శర్మ అని తెలుస్తుంది. ఆ శర్మే ఇప్పుడు తనను వెంటాడుతున్నాడని అర్థమయ్యాక దినేష్‌ ఏం చేస్తాడు? అనేది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
దినేష్‌, శర్మ అనే రెండు పాత్రల్లోనూ బాగా నటించాడు విజయ్‌ ఆంటోనీ. తన బలమేంటో, బలహీనతలేంటో తెలుసు గనుక, కథల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకుంటాటాడు. ఈ సినిమాకి కూడా అదే చేశాడు. రెండు పాత్రల్నీ అవలీలగా పోషించేశాడు. పెద్దగా వైవిద్యం ఉండదు ఆ రెండు పాత్రల్లోనూ. మాస్‌ హీరో అనిపించుకోడానికో ఏమో, ఫైట్లు కూడా చేసేశాడు బాగానే. అరుంధతి నాయర్‌ నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా ఓకే అనిపిస్తారు. 
సరికొత్త కథాంశాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. దర్శకుడు సినిమాని ఫస్టాఫ్‌లో బాగా ఎగ్జిక్యూట్‌ చేసినా, సెకెండాఫ్‌లో కొంచెం గాడి తప్పుతుంది. పూర్తిగా థ్రిల్లర్‌ జోనర్‌లోనే నడిపి ఉంటే బాగుండేది. కథ విడిచి సాహసం చేస్తున్నారనిపిస్తుంది సెకెండాఫ్‌ పూర్తయ్యేసరికి. కథ బాగుంది. కథనం విషయంలో కొన్ని లోపాలున్నాయి. మాటలు ఓకే. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగాకుదిరింది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ ఇంకాస్త బాగా పని చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ బాగా కుదిరాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. 
ఫస్టాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ తర్వాత కూడా సినిమా ఆసక్తికరంగానే మారుతుంది. అయితే షడెన్‌గా సినిమాలో సాగతీత పెరుగుతుంది. సస్పెన్స్‌ వీడిపోయాక సినిమా ఎక్కువ సేపు నడవడం పెద్ద మైనస్‌. సస్పెన్స్‌ వీడిపోయేదాకా మాత్రం సినిమాని చాలా బాగా నడిపించాడు దర్శకుడు. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. థ్రిల్లర్‌ జోనర్‌ని ఇష్టపడేవారికి ఫస్టాప్‌ బాగా నచ్చుతుంది. సెకెండాఫ్‌లో కొంత భాగం కూడా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మాస్‌ జనాల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా సినిమా బాగానే ఉందనిపిస్తుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
'భేతాళుడు' ఓకే అనిపిస్తాడు. 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with purna