Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue190/546/telugu-serials/atulitabandham/atulitabhandham/

( గతసంచిక తరువాయి)  “నిన్న సాయంత్రం వరకూ ఉంటావని అనుకున్నాను!”

“నాలుగింటి వరకూ ఉన్నాను కార్తీ... నువ్వు వెళ్ళావా అక్కడికి?”

“అవును ఐశూ... నిన్న పగలంతా కుదర లేదు... సాయంత్రం ఐదున్నరకి వెళ్లాను... ఓ అర గంట వేణు  దగ్గర కూర్చుని వచ్చేసాను...”

“ఐశూ... ఐశూ... ఫేస్ బుక్ చూసావా?” సుడి గాలిలా వచ్చింది నీరజ.

“ఏమిటి విశేషం?” నవ్వుతూ అడిగాడు కార్తీక్.

“ఆ అడ్డగాడిద పరువు అంతా తీసేసాను... నా పోస్ట్ లు చూడు...” నవ్వింది నీరజ.

“అవునా?”

“అవును... నాలా మరో ప్రాణి బలి అవ్వకూడదు...” అంటూ తన సీట్ వైపు వెళ్ళింది నీరజ. చేతి లోని మొబైల్ తీసి త్వర త్వరగా ఫేస్బుక్ ఓపెన్ చేసి, నీరజ టైం లైన్ లోకి వెళ్ళింది. తన సరి కొత్త పోస్ట్ ఇలా ఉంది:

“అభినవ కాళిదాసు కవి గారి నిజ స్వరూపం... ఒక పెళ్లి కాని యువకుడిలా తన ఛాట్ లతో అమ్మాయిలను మభ్య పెడుతూ వాళ్ళతో కుదిరినప్పుడు కప్పు కాఫీ అంటూ, బయటకి తీసుకు పోయి, అవకాశం వస్తే అన్నీ అందిపుచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఇతను ఫోటోలో మహేష్ బాబును పెట్టుకున్నా, బయట మాత్రం పెళ్ళి అయి, భార్యా, ఆరేళ్ళ కొడుకూ ఉన్న ఒక మొగుడు... శ్రీ చైతన్య ఉరఫ్ చిన్నారావు ఇదిగో ఇలా ఉంటాడు... (క్రింద ఫోటో పెడుతున్నా చూడండి...)

అతడిది మాత్రమే తప్పు అని నేను అనటం లేదు... అతని రాతలకు, పెట్టిన కొటేషన్ లకు, కవిత్వాలకు పొంగి పోయి, అతనితో చాట్ చేసి, ఇంకాస్త ముందుకు పోయి, కొద్దిగా పులకరించి, ఆశలు పెట్టేసుకుని, అది ఒక ప్రేమగా భావించి, పెళ్లి వరకూ కలలు కనేసి... నిజమండీ బాబు, ఇవన్నీ చేసింది నేనే... అలాంటి ఆడ పిల్లలు ఇంకా ఉండే ఉంటారేమో...

అందుకనే, అతని ఫ్రెండ్ లిస్టు లో ఉండే వాళ్ళందరికీ ఈ పోస్ట్ కనబడాలనే అతని పేరును టాగ్ చేస్తున్నా...” క్రింద అతని ఫోటో గ్రాఫ్ తల వంచుకుని కాఫీ తాగుతున్నప్పుడు మొబైల్ తో క్లిక్ చేసినట్టుంది... అది పెట్టింది... 

“శ్రీ చైతన్య మటాష్...” అంది ఐశ్వర్య కార్తీక్ కి ఆ పోస్ట్  చూపిస్తూ...

“పాపం కదా... నాలాంటి పురుషుడే...”

“అవును... పాపమే మీ అందరిదీ...” నవ్వింది ఐశ్వర్య...

“ఐశూ, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను...” సూటిగా ఆమె కళ్ళలోకి చూడబోయాడు కార్తీక్.

“ఏమిటి? చెప్పు...” అప్రయత్నంగా ఆమె గొంతు వణికింది...

“ఎలా చెప్పాలో, ఐ మీన్ అడగాలో కూడా తెలియటం లేదు...” మాటల్లోనే అతని మొబైల్ మ్రోగుతూ ఉంటే, అది అఫీషియల్ కాల్ కావటంతో ఆమెకు సైగ చేసి అందులో మునిగి పోయాడు కార్తీక్.

తన సీట్ కి వచ్చేసి, పనిలో మునిగి పోయింది ఐశ్వర్య, మదిలో పొంగి పొరలే భావ వాహినిని అణచుకుంటూ...

****

“సారీ బావా... నన్ను క్షమించు...” బాధగా వేణు చేతులు పట్టుకున్నాడు పవన్.

“అయ్యో, ఎందుకు బావా? నేనే నిన్ను క్షమాపణ అడగాలి...”

“కాదులే బావా... వినత మీద ఉన్న కోపం కొద్దీ ఆ రోజు నీతో చాలా పరుషంగా మాట్లాడాను. ఆ బాధ తోనే కదా నీవు యాక్సిడెంట్ చేసి, ఇలా... ప్చ్... అయామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ...”

“బావా, నువ్వు అనుభవించిన మానసిక క్షోభను వివరంగా చెబుతూ ఉంటే నాకు ఎంత గిల్టీగా అనిపించిందో తెలుసా? వినత నిజంగా తప్పే చేసింది... అసలు దాన్ని అలా తయారు చేసిన మేము కూడా దోషులమే... కానీ బావా... అది ఆడపిల్ల. చదువు మీద శ్రద్ధ పెట్టలేదు... ఏదో డిగ్రీ పూర్తి చేసింది కానీ, దానికి బయట ఉద్యోగం చేసి డబ్బు తెచ్చుకుని సంసారం చేసుకునే సమర్థత లేదు... నోటి దురుసు తనం... నువ్వు నీ ఆలోచన విరమించుకో... ప్లీజ్... ఇవి చేతులు కావు... కాలు విరగ్గొట్టుకున్న నన్ను నీ ఇంటికి తెచ్చుకుని ఇంత బాగా చూసుకుంటూ, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న నీ సంస్కారానికి మేము తగము. అయినా నేను నిన్ను అడుగుతున్నాను. వినత మూర్ఖురాలే, కానీ ఆడ పిల్ల. దాన్ని అన్యాయం చేయకు... ఇప్పటికి దాని పరిస్థితి నేను చెప్పకుండానే దానికి అర్థమైంది... అందుకే దాని ప్రవర్తన లోనూ మార్పు వచ్చింది...అంచేత...”

“ఛ, కోపంలో, అప్పటి పరిస్థితిలో బాధ వల్ల అలా అనేసానే కాని, వినత నా భార్య బావా... అగ్నిసాక్షిగా నేను మెడలో తాళి కట్టిన నా ఇల్లాలు. తనను వదిలి నేనూ ఉండలేను... అంతే కాక, పెళ్ళాన్ని వదిలి పెడితే నాకు మాత్రం సంఘంలో పరువు ఉంటుందా? నిజమే వినత చాలా బాగా మారింది... పరిస్థితిని అర్థం చేసుకుని, తన మనసులోని స్వార్థాన్ని తొలగించుకుంటోంది... మనకి కావలసింది అదే కదా... ఒక సారి ప్రేమ దీపం వెలిగిన తరువాత అది కొడిగట్టదు బావా.. తన వాళ్ళందరికీ వెలుగులు పంచుతూనే ఉంటుంది...” అన్నాడు పవన్.
లోపలికి రాబోతూ ఆ మాటలన్నీ విన్న వినతకు కన్నీళ్లు పొంగి వచ్చాయి. తన భర్త ఎంత మంచివాడు? తన వల్ల ఎంత కష్టం, నష్టం కలిగినా తనలో చిన్న మార్పు కలిగినందుకే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాడు... తాను చాలా ఋణ పడి పోయింది అతనికి...

***

పవన్ ఇంట్లో ఒక గెస్ట్ రూమ్ లో వేణును ఉంచారు. అతనికి తోడుగా మధు ఉంటోంది... ఇద్దరి మధ్యా మాటలు జరగటం లేదు... వేణు కూడా మందుల వల్లా, ఫిజియో థెరపీ వల్లా బాగా అలసి పోయి, ఎక్కువ సమయం నిద్ర లోనే గడుపుతున్నాడు. మధు కూడా బాబుతో ఆ గది లోనే వేరే మంచం మీద పడుకుంటోంది... ఇంకో గెస్ట్ రూమ్ లో అవంతి తన పిల్లలతో ఉంటోంది. సుందరమ్మ గదిలో ఆవిడ, ఆవిడతో పాటు విమలమ్మా... సావిత్రి రెండు పూటలా వంట చేసి వెళ్ళిపోతూ ఉంటుంది.

అవంతి పిల్లలతో కబుర్లు చెప్పి, గుడ్ నైట్ చెప్పి తమ రూమ్ కి వచ్చింది వినత. అప్పటికే పవన్ గాఢ నిద్రలో ఉన్నాడు. వినతకు అతనికి ‘సారీ’ చెప్పాలని, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని బలంగా అనిపిస్తోంది... కానీ అతను తనతో మాటలు చాలా తక్కువగా, అవసరమైనంత వరకే మాట్లాడుతున్నాడు. వినత మనసు అతని ప్రేమను కోరుకుంటూ ఉంటే, దేహం అతని స్పర్శను కోరుకుంటోంది...
అతని పక్కనే పడుకున్న వినత నిద్ర పోవాలని ప్రయత్నించింది కానీ నిద్ర పట్టలేదు... పెళ్లి అయినప్పటి నుంచి తనతో పవన్ అనుభవించిన బాధలు, ఎన్నెన్నో సంఘటనలు గుర్తు వచ్చాయి. అహంకారంతో అతన్ని ఎప్పుడూ తూలనాడేది... కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవాన్ని ఇచ్చేది కాదు. అలాంటిది ఈనాడు తాను అతని ముందు దోషిగా నిలబడినా సరే, తనను వదులుకోలేనని చెబుతున్నాడు. అతనికి దగ్గరగా జరిగింది వినత. పవన్ వీపు మీద చేయి వేసి నిమిరింది...  “ఊ...” నిద్రలోనే అటూ ఇటూ కదిలాడు పవన్...

“పవన్... నీతో మాట్లాడాలి...” అతనికి మరింత దగ్గరగా జరిగి చుట్టూ చేతులు వేసింది వినత.

“రేపు మాట్లాడుకుందాం...” నిద్రలోనే గొణిగాడు కానీ ఆమె స్పర్శ అతనికి మెలకువను తెప్పించేసింది.

“ఏమిటి వినతా, నిద్రపోలేదా? ఏమైంది? ఒంట్లో బాగానే ఉంది కదా...” ఆ గొంతులో ధ్వనించిన ఆదుర్దాకి ఆమె మనసు చలించి పోయింది.
“పవన్, అయాం రియల్లీ సారీ... సినిమా డైలాగ్ లా ఉన్నా సరే... ప్లీజ్ నన్ను క్షమించు... నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను... మీకందరికీ ఎంతో క్షోభను కలిగించాను...” అతని గుండెల్లో తల దాచుకుంది కన్నీటితో.

పవన్ కి చాలా జాలి కలిగింది ఆమె మీద... ఆమె దర్పమే తెలుసు అతనికి,  దయనీయత తెలియదు ఇంత వరకూ... మొట్టమొదటిసారిగా ఆమెలో ఒక పసిపాప కనిపించింది అతనికి... ఆమె నుదుట ముద్దు పెట్టుకుంటూ, “అవన్నీ మర్చిపోయి, కొత్త జీవితాన్ని మొదలుపెడదాం విన్నూ...” అన్నాడు...

“థాంక్ యు... నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను... తప్పకుండా... ఐ లవ్ యు పవన్...”

“ఐ టూ లవ్ యు వినతా...మీ అన్నయ్యకి కొంచెం తగ్గగానే మనం టూర్ కి వెళదాం... ఇప్పుడు అక్కయ్య ఉంది కదా అమ్మను చూసుకుంటుంది...” అనునయిస్తూ ఆమెను దగ్గరగా పొదువుకున్నాడు పవన్.

“ఎక్కడికీ వెళ్లొద్దు పవన్... నాకు బాగా బుద్ధి వచ్చింది... మనం ఇక్కడే ఉందాం...”

“సరే... నువ్వెలా అంటే అలాగే... పడుకో... చాలా రాత్రయింది కదా...”

అతని దగ్గరగా, అతని చేతుల్లో హాయిగా ఆదమరచి నిద్రపోయింది వినత ఆ రాత్రి.

పవన్ హృదయంలో ప్రశాంతత నెలకొనసాగింది.

***

మర్నాడు ఉదయమే ఊరి నుంచి వచ్చేసింది సుగుణమ్మ. పవన్ స్టేషన్ కి వెళ్లి ఆమెను ఇంటికి తీసుకు వచ్చాడు.  కొడుక్కు యాక్సిడెంట్ అయిందనీ, తమ ఇంట్లో కాకుండా అల్లుడి ఇంట్లో ఉన్నారనీ తెలిసి ఆ తల్లి మనసు విలవిలలాడి పోయింది. వేణును ఇంట్లో పెట్టుకుని అతని మంచీ చెడ్డా చూస్తున్న అల్లుడినీ, అతని కుటుంబ సభ్యులను, కోడలిని కన్నీళ్ళతో చూసి పదేపదే కృతజ్ఞతలు చెప్పింది. మరో రెండు రోజుల తర్వాత తమ ఇంటికి వెళ్ళిపోవాలని ఏర్పాట్లు చేయించింది.

వినతలో వచ్చిన మార్పు ఆ తల్లి మనసులోని కలతను తీసేసినట్టు అయింది. కూతురూ, అల్లుడూ ఏ అరమరికలూ లేకుండా హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే అంతకన్నా కావలసింది ఏముంటుంది ఏ తల్లికైనా?

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam