Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
inkaa timundigaa

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు  అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు.

మాయావృతుఁడగు నాత్ముని 
సోయగమునఁ దెగడ తీగసోగలు ముచ్చు
ట్టై యునికి సంగరహితం
బై యుం గాకున్న జఘనమభిరామముగన్        (కం)

ఆత్మ మాయచేత ఆవరింపబడి ఉంటుంది. ఆత్ముడు అంటే జీవాత్మ. కనుక ఆ జీవాత్మ  తన ప్రక్కనే ఉన్న పరమాత్ముడిని అంతర్యామిని గుర్తింపలేదు. ఆ మాయావృతుడైన  అత్మలాగా శ్రీకృష్ణుని పిరుదులు, కటిస్థలి అంటే నడుమును మూడు చుట్లు చుట్టుకుని  అందమైన వస్త్రము అలరారుతున్నది!

ఇట నభ మిట భూవలయం 
బిట బలిసద్మంబునుండు నిరవులివియనన్ 
బటువులగు వళులచెలువునఁ 
బుటపుడనై యున్న చిన్నిబొజ్జ గదలఁగన్        (కం)  

ఇక్కడ ఆకాశము ఉన్నది, ఇక్కడ భూవలయము ఉన్నది, ఇక్కట బలినిలయము అంటే పాతాళము ఉన్నది అన్నట్లుగా, మూడు స్థలములకు గుర్తులుగా, సమస్త విశ్వమునకు  నిలయమైన ఆ ఉదరము మీద మూడు ముచ్చటైన ముడుతలు ఉన్నాయి. ఆ అందమైన 
ముడతల ముద్దుల బొజ్జ కదలాడేట్లు తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు  పరమాత్ముడు.

తులసికిఁ బచ్చరాకుదురు, తోయదవాహన రత్నవేది య
క్కలిమి మెఱుంగుఁబోఁడికిని, గౌస్తుభఘర్మగభస్తికిన్ నభ
స్థలము ననంగఁ బొల్చి నిరతంబు కృపావిభవంబునింటి బో
ర్తలుపుఁ దలంపుసేయుచు నురంబు గరంబు పరిస్ఫురింపగన్        (చం)

పచ్చలు తాపిన హారములున్నచోట, తులసీ మాలలు పెనవేసుకున్నచోట ఇంద్రనీలమణులు  తాపడంచేసిన హారములున్నచోట, కౌస్తుభమణి ఉన్నచోట, ఆ మణి వేడికాంతుల సూర్యుడిలా  ఆయన హృదయాకాశము అనే ఆకాశము మీద, వక్షస్థలము మీద అంటుకుంటూ, కృపకు,  దయకు నిలయమునకు తలుపులవంటి ఆ వక్షస్థలము స్ఫురించేట్లు, ఆ దయామయుడు తన  భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు.

కలుష ఖగవధవిధానా 
కలిత ఘుటికలనఁగ గ్రచ్చకాయలు వలచే 
నెలకొను నల జిలిబిలివ
న్నెలవన్నెల సంచి నిండి నింపులువారన్     (కం)

గోళీలతో, గుండ్రని రాళ్ళతో పిట్టలను కొట్టడం తెలిసిందే. పాపములు అనే పిట్టలను కొట్టడానికి  పెట్టుకున్న గుండ్లు అన్నట్టు ఎడమచేతిలోని జిలిబిలి వన్నెల సంచిలో నింపుకున్న గచ్చకాయలు సోయగాలు వెదజల్లుతుండగా తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు పరమాత్ముడు.

లలిత నిజవామకరతల 
కలిత కనత్కంబుకాంతి గలకల నవ్వన్ 
గలువలచెలి గిలిగింతల 
నలువగు రాలన్ బిసాళి నలువగుఱాలన్       (కం)

తన లలితమైన ఎడమచేతిలోని శంఖము యొక్క కాంతులు కళకళ నవ్వుతుండగా, కళకళలాడుతుండగా, కలువల నేస్తం ఐన చంద్రుడు గిలిగింతలతో నవ్వినట్లుగా, ఆ చంద్రుని  రాళ్ళు ఐన చంద్రకాంత శిలలవంటి కాంతులను చిమ్ముతున్న తెల్లని శంఖం ఎడమ  చేతిలో మెరిసిపోతుండగా తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు పరమాత్ముడు.

నిజ ధైర్యౌదార్యములను 
గజములకుం బొడము నిడుదకరములుఁబోలెన్
భుజములు పోషితభక్త 
వ్రజములు కరవిజిత పుష్కరజములు పొదలన్     (కం) 

ఏనుగులకు ధైర్యాన్ని, ఔదార్యాన్ని ఇచ్చే పొడవైన తొండములవంటి పొడవైన బాహువులతో,భక్తులను పోషించే, రక్షించే కొండలవంటి భుజములతో, తామరపూవులను ధిక్కరించే ఎర్రని  అరచేతులతో ప్రకాశిస్తూ ఆ పరమాత్ముడు తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu