Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రా నాగలక్ష్మి

( పత్ని టాప్ )


NH - 1A మీద ఉధమ్ పూర్ నుంచి శ్రీనగర్ వైపు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి పత్ని టాప్ చేరుకుంటాం .

పత్నిటాప్ జమ్ముకశ్మీరు రాష్ట్రం లో ప్రసిధ్ది పొందిన వేసవి విడిది . శివాలిక్ పర్వత శ్రేణులలో సుమారు 6,600 అడుగు యెత్తున వున్న వేసవి విడిది యిది . ఉధమ్ పూర్ నుంచి పత్ని టాప్ వరకు దారంతా అహ్లాదంగా వుంటుంది , దూరంగా తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయాలు కిందన లోయలో ప్రవహిస్సున్న నది , కొండల మీద నుంచి  జారుతున్న జలపాతాలు మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది 1990 ల వరకు సంవత్సరం పొడవునా హిమపాతం జరిగే ప్రదేశంగా వుండేది యీ ప్రదేశం . ఏడాది పొడవునా వింటర్ యెడవంచర్ స్పోర్ట్స్ జరిగే ప్రదేశం కావడంతో పర్యాటకుల తాకిడి సంవత్సరం పొడవునా వుండేది . ఇక్కడ చిన్న పెద్ద హోటళ్లు అన్ని ప్రాంతాలవారికి యిష్టమైన ఆహారపదార్థాలు వడ్డించే రెస్టొరెంట్స్ వున్నాయి . ప్రస్తుతం అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే మంచు వుండి ఆ నెలలలో మాత్రమే పర్యాటకులకోసం ఎడ్వంచర్ స్పోర్ట్స్ నిర్వహించ బడుతున్నాయి .

ఒకప్పుడు నాలుగు వైపులా మంచు తప్ప యేమీ లేని ప్రదేశంలో ఇప్పడు ఒక్కో సంవత్సరం హిమపాతం కూడా జరుగదు అంటే ఆశ్చర్యంగా వుంటుంది . మంచి వేసవిలో కూడా 1 లేక 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుండే ప్రాంతం లో యిప్పుడు ముప్పైలలో వుంటున్నాయి అంటే వాతావరణం మానవుల తప్పిదాల వల్ల యెంత పాడయిందో కదా అని అని పించక మానదు . ప్రస్తుతం పర్యాటకులు ట్రెక్కింగు చెయ్యడానికి వస్తున్నారు . చిన్న పెద్ద యెన్నో ట్రెక్క్ లు వున్నాయి . అన్ని వయసుల వారు చెయ్యగలిగే అతి సులువైనవి , అతి కష్టమైన ట్రెక్కులు  సుమారు ఓ డజను వరకు వున్నాయి . సమతల ప్రదేశాలలో టెంటులలో నివాస సదుపాయాలు ట్రెక్క్ లు నడిపే అనేక సంస్ధలు అందుబాటులో వున్నాయి .

శ్రీనగర్ , లడాక్ ప్రాంతాలలోని భారత రక్షక సైనికులకు కావలసిన ఆహార , ఆయుధాలను చేరవేసే ముఖ్య మార్గం కావడంతో యెప్పడూ రద్దీగా వుంటుంది యీ రాజమార్గం .

ఈ ప్రాంతంలో వర్షపాతంకూడా యెక్కువ కావడంతో కొండచరియలు విరిగి పడి శ్రీనగరుకి రాకపోకలకు తరచు అంతరాయం కలుగుతూ వుండడం తో  ' పత్నిటాప్ సొరంగ మార్గ నిర్మాణం ' తల పెట్టేరు . దీనివల్ల ముప్పై కిలోమీటర్ల దూరం 9.1 కిలోమీటర్ల ప్రయాణం తో చేరుకోవచ్చు . కొండ చరియలు విరిగి పడటం వల్ల కలిగే ధన ప్రాణ నష్టాలను అరికట్ట వచ్చు . ఈ మార్గం 2016 లో ప్రారంభం కావచ్చు .

పత్ని టాప్ చుట్టు పక్కల చాలా పురాతన కొత్త మందిరాలు చాలా వున్నాయి . అలాగే యెన్నో అహ్లాద కరమైన పర్యాట స్థలాలు , సరస్సులు వున్నాయి . అందులో మేము చూసిన కొన్ని ప్రదేశాలను మీకు తెలియజేస్తాను .సన సర్ ---

       పత్ని టాప్ కి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో 2100 మీటర్ల యెత్తులో స్థానికంగా ప్రసిద్ది చెందిన రెండు సరస్సులు వున్నాయి . సన మరియు సర్ అనే రెండు సరస్సులు వున్న ప్రదేశం కావడం తో యీ ప్రాంతాన్ని సన సర్ అని పిలువ బడుతోంది . ఈ సరస్సులు వున్న గ్రామాలను కూడా సరస్సుల పేరులతో పిలుస్తూ వుంటారు . పర్యాటకులు ప్రసిద్ది పొందిన ప్రదేశాలను చూడదలుచు కుంటారు కాబట్టి యిక్కడకి చాలా కొద్ది మంది మాత్రమే రావడంతో చాలా ప్రశాంతం గా వుంటుంది .

కను చూపు మేర వరకు పచ్చని తివాసీ పరచి నట్లుండే పచ్చిక , దూరంగా ఆకాశాన్ని అంటు కొంటున్నట్లుండే దేవదారు , పైను వృక్షాలు , మీకన్నా యింకా యెత్తులో వున్నాం అని గర్వంగా తలెత్తుకొని వున్న పర్వతాలు ముచ్చటగా వుంటాయి , యెదురుగా నిర్మల జలంతో  వున్న సరస్సులు ,  అలా పచ్చికలో నడుస్తూ వుంటే యెంతదూరం నడిచినా తనివి తీరదు . మనస్సు స్విట్జర్ లాండు తో యీ ప్రాంతాన్ని పోల్చకుండా వుండలేదు , యింతింత అందాలను మనదేశం లో వుంచుకొని అక్కడకి యెందుకు వెళ్లేం అని అని పించక మానదు .

టూరిజం వారు యిప్పుడిప్పుడే  పారా గ్లైడింగ్ మొదలయిన ఆటలు ప్రారంభించి పర్యాటకులను ఆకర్షిస్తున్నారు . హోటల్స్ , రిసార్ట్స్ ప్రారంభించేరు . సరస్సులకు దగ్గరగా టెంట్లు కూడా నడపబడుతున్నాయి . ఇలాంటి టెంట్స్ లో గడపడం కూడా చాలా బాగుంటుంది . వీలయితే ఆ అనుభవం కూడా సొంతం చేసుకోండి .

సనసర్ నుంచి కనిపించే పర్వతాలను  ' బ్రమ్మహ ' శ్రేణులు అని అంటారు . వీటిలో బ్రమ్మహ -1 , బ్రమ్మహ -2 , ప్లాటిటాప్ , అర్జున్ అనే పర్వతాలు ముఖ్యమైనవి . వీటిని కిస్తవార్ ప్రాంతం నుంచి కూడా చూడవచ్చు .

ఈ పర్వత శ్రేణులను గురించి మరో ముఖ్యమైన , ఆశ్చర్యకరమైన విషయం యేమిటంటే యీ పర్వతాలు వేరే గ్రహం నుంచి విడిపడి భూమి పైన పడిన ' ఉల్కాపాతం ' వల్ల  యేర్పడ్డ శిఖరాలు .

శంఖపాల్ దేవాలయం ---

సనసర్ నుంచి గంట గంటన్నర నడక దూరంలో శాంత పర్వత శ్రేణుల మధ్య సుమారు మూడు వేల మీటర్ల యెత్తులో వున్న శంఖ పర్వతం పై వున్న రాతి మందిరం , సుమారు నాలుగు వందల సంవత్సరాలకు ముందు నిర్మించిన నాగుల రాజైన శంఖపాలునికై నిర్మించిన రాతి మందిరం . రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన కట్టడం , రాతికి రాతికి మధ్య పట్టి వుంచేందుకు సిమెంటు లాంటి వేవీ వాడకుండా కట్టిన మందిరం . ఇన్నేళ్లు గడచినా చెక్కు చెదరలేదు . తప్పక చూడవలసిన మందిరం యిది .

నాథటాప్ --

పత్ని టాప్ కి సుమారు 12 కిలో మీటర్లు నడక తో చేరగలిగిన మరో వేసవి విడిది యిది . రోడ్డు దారి న కూడా చేరుకోవచ్చు . ఇక్కడ కూడా హిమపాతం యెక్కువగా వున్న సమయాలలో ( ఈ మధ్యన యీ ప్రాంతాలలో ఒక్కసారికూడా హిమపాతం జరగడం లేదు ) స్కీయింగ్ , పారా గ్లైడింగు మొదలయిన స్పోర్ట్స్ జరుగుతూ వుంటాయి . కొండవాలులలో టైరు మీద కూర్చొని జారడం , స్లెడ్జల మీద జారడం లాంటివి కూడా పర్యాటకులకు అందు బాటులో వుంటాయి .

ఇక్కడనుంచి పశ్చిమ హిమాలయాలను చూడొచ్చు . మంచు కురిసే సమయం లో పైను వృక్షాలపైన కురిసిన తెల్లని మంచు పువ్వులలా అనిపిస్తాయి .

కొండలపైనుంచి కిందికి జారుతున్న జలపాతాలు కనువిందు చేస్తాయి . ఇక్కడ మూడు స్వఛ్చమైన జలపాతాలు వున్నాయి . వీటిలో స్థానికులు స్నానాలు చేస్తూ కనిపిస్తారు . ఈ నీటికి యెన్నో ఔషధగుణాలు వున్నట్లుగా చెప్తారు . అంతచలిలో స్నానం అనగానే మా శరీరాలు గజగజ వణికాయి . మరి వారికి చలి అనిపించలేదేమో .

కాళికా మందిరం ( రియాసి )----

రియాసి బస్టాండుకి దగ్గరగా వున్న అందమైన కొత్త కట్టడం యిది . ఈ మందిరాన్ని చూస్తే మనకి ఇస్కాన్ మందిరం , జైను మందిరం గుర్తొస్తాయి , యెందుకంటే మందిర నిర్మాణం లో ఉపయోగించిన శిల్పకళ ఆ మందిరాలను పోలి వుంటుంది .

చాలా కొద్ది కాలంలో స్థానికులలో పేరు పొందింది . మందిర స్థలపురాణం గురించి అడిగితే జగత్ రామ్ అనే కశ్మీరీ పండిట్ కి ఓ రాత్రి కలలో అమ్మవారు కనిపించి తాను లింగాకారంలో ఓ గుట్ట కింద పడి వున్నట్లు తనను అక్కడ నుంచి తీసి మందిర నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా అతను ఆగుట్టను చాలా లోతువరకు త్రవ్వి అమ్మవారి లింగాకారాన్ని పైకి తీసి అదే గుట్టపైన మందిర నిర్మాణం చేసి లింగాన్ని ప్రతిష్టించి పూజాదులు నిర్వహించసాగేడు . ఈ అమ్మవారిని దర్శించుకున్న స్థానికుల మనో వాంఛలను అమ్మవారు వెంటనే తీరుస్తుందనే నమ్మకం బలపడడంతో చాలా కొద్ది కాలంలోనే అమ్మవారి కి యెందరో భక్తులు అయేరు . నవరాత్రులలో మందిర నిర్మాణం కావించిన జగత్ రామ్ ఆద్వైర్యం లో విశేష పూజలు జరుగుతాయి .

మళ్లా వారం శ్రీనగర్ వెడదాం వస్తారుగా నాతో , అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
story reviews