Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
desdamu nakicchina sandesamu story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

కదళీ --అరటి చెట్టు . - హైమాశ్రీనివాస్.

banana tree

తాతయ్య సాయంకాలం నడకనుంచీ వచ్చేసరికి వరండాలో కూర్చుని చేతిలో పుస్తకం చూసి పెద్దగా ఏదో పాట పాడుతున్న ప్రదీప్ నుచూసి గేటు దగ్గరే ఆగి ఆలకించాడాయన.

ఆదివారము నాడు అరటి మొలిచింది    
సోమవారము నాడు సుడి వేసి పెరిగింది         
మంగళవారము నాడు మారాకు తొడిగింది  
బుధవారము నాడు పొట్టి గెల వేసింది                     
గురువారమునాడు గుబురులో దాగింది               
శుక్రవారము నాడు చక చకా గెల కోసి                             
అందరికి పంచితిమి అరటి అత్తములు


అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లివిగో!-- " ఓర్నీ! ఇదిట్రా నీవుపాడేపాట ! ఇది ఎప్పటిదో పాత పాట. నీ కెలాతెలుసురా!"  అంటున్న తాతగారితో " ఈరోజు మాతెలుగు టీచరుగారు చెప్పారుతాతా! ఈ పాట రేపు ఎవరు బాగా పాడితే వారికి ఒక బహుమతిట!" అంటూ తి రిగి పాట పాడటంలో లీనమయ్యాడు వాడు.

నిజమే అరటి అత్తాలు అందరికీ పంచేన్ని కాస్తాయి మన ఇంట్లో ఒక్క అరటిమొక్క ఉంటే!. మన ఇంట్లో వాడే సిన వృధా  నీళ్ళన్నీ పీల్చుకుని మనకు కమ్మని అరటి పండ్లనూ, కూర అరటినీ ఇచ్చే, అరటి గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే! అరటి సంపూర్ణంగా తన భాగాలన్నీ మనకోసం అందించే త్యాగమూర్తి.

అరటి ఒక కొమ్మలు లేని చెట్టు, ఐతే ఇది నిజానికి ఒక మొక్క అనవచ్చేమో కానీ మనం వాడుకలో అరటి చెట్టనే అంటాం. పూర్వం అంటే షుమారుగా 40,45 ఏళ్ళక్రితం వరకూ ఇంటికి బంధువులు వచ్చారంటే అమ్మ " పెరట్లో కెళ్ళి ఒక అరటాకు కోసుకురండి " అనేది, వారికి భోజనం వడ్డించను. అరటాకు భోజనం ఆరోగ్యప్రదమేకాక అతిధికి అలా భోజనం పెట్టి ఆదరించడంగా భావించేవారు పూర్వులు. 

అరటి ప్రపంచవ్యాప్తంగా అన్నికాలాల్లోనూ లభించే పండు. వ్రతాలకూ, నోములకూ, పూజలకూ అరటి పండులేందే కుదరదు. ఆలయాలకూ, ముత్తైదువుల తాంబూలాలకూ అరటి పండుది ప్రధమస్థానం.అరటిలో చాలా రకాలున్నాయి.అరటి పండ్లేకాక కూర అరటికూడా మన వంట గదిలో ప్రవేసించిమన నోటికి రకరకాల రుచులతో కడుపు నింపుతుంది.

మన దేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయంటే ఆశ్చర్యంగాఉంటుంది. పచ్చ అరటి పండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటి పండ్లు, అమృతపాణి ,కర్పూరఅరటి, మొదలై నవి.  అరటి శుభ సూచకం. అందుచే అరటిని శుభకార్యాలలో తప్పకుండా మనం అరటి పండును, అరటి మొలకలను, అరటి చెట్లను ఉపయోగిస్తాం. అరటి పుట్టుక గురించిన  ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది.

దుర్వాసమహాముని మనకు తెల్సునుకదా! ఆయన కు అతి త్వరగా కోపంవస్తుంది. ఒకరోజున ఆమహర్షి సాయంసంధ్యసమయంలో ఎందుచేతోకానీ ఆదమరచి మంచి నిద్రపోతున్నాడుట.ఆయన భార్య కదలీ ఆయన సంధ్యావందన సమయం మించిపోతున్నదని ,ఆతర్వాత ఆయన తనను నిద్రలేపలేదని కోప్పడతాడనీ భావించి  సంధ్యావందనం మించిపోకుండా  నిద్రస్తున్న ఆయనను లేపిందిట.. దుర్వాస మహర్షి  నిద్రాభంగమైనందుకు అమిత ఆగ్రహంతో,లేచికళ్ళుతెరచి చూడగానే  ఆయన నేత్రాల నుంచి వచ్చి న కోపాగ్నికి ఆవిడ మాడి మసైపోయి భస్మరాశి గా మారిపోయిందిట. కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి మామ గారు తన కుమార్తెను చూసి, యోహక్షేమాలు విచారించను వచ్చి,తనకుమార్తె గురించి  అల్లుని అడగ్గా ఆయన ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి, తనమామ గారి ఆగ్రహానికి తాను గురి కాకుండా ఉండేందుకై ,ఆభస్మరాసిని ఒక చెట్టుగా మార్చడుట.మహర్షులకేం ఏదైనా చేయ గలరు కదా! దుర్వాసముని భార్య శుభపద్రమైన కార్యక్రమాలన్నింటిలో ఉపయోగించే కదలీ వృక్షం అంటే అరటి గా మారిపోయింది.సంస్కృతంలో దీన్ని కదలీఫలం అంటారు. తెలుగు పదం అరటి.దుర్వాసముని తన భార్య భస్మంతో సృష్టించిన ఆచెట్టుకు "లోకంలో అంతా నిన్ను అన్ని శుభకార్యల్లో ఉప యోగింతురుగాక ' అనే వరాన్నిస్తాడు. అలా ఈ అరటి ఆకులను ,పండ్లను మిగతా అన్ని భాగాలనూ రక రకాల పనులకు ఉపయోగిస్తాం, ముఖ్యముగా భోజనానికి పెండ్లిళ్ళలో ఉపయోగిస్తాం.

కూర అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ , అరటి ఛిప్స్, ఇంకా అరటి తో ఎన్నో విధాల అల్పాహారాలు కూడా చేస్తాం.అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా బనానా బట్తర్ మిల్క్ పెద్దలకూ, పిన్నలకూ మంచి ఆహారద్రవం. కూర అరటి లోనూ చాలా రకాలు లభ్యమవుతున్నాయి.కూర అరటి రకాలలోకొన్ని - పచ్చబొంత, బూడిద బొంత, బత్తీసా ,బూడిద బొంత బత్తీసా, పచ్చగుబ్బబొంత ,పలకల బొంత,నూకల బొంత, సపోటా బొంత, సిరుమల అరటి, వామన కేళి మొదలైనవి.  అలంకరణ వస్తువుల తయా రీకీ , ఔషధాలతయారికీ కూడా  వాడతారు. అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత , అది మరో గెల వేయదు కనుక దాన్ని కొట్టేస్తారు.దాన్ని అరటి బోదె అంటా రు. దాని తోనూ కూరచేస్తారు. చాలారుచిగానే కాక బలవర్ధకం కూడా. విడదీస్తే అది అర్ద చంద్రాకరం గల పొడవాటి దళ సరిగా వున్న పట్టలు వస్తాయి. వాటినుండి సన్నని పట్టు దారం లాంటి దారాన్ని తీసి దాంటో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. అవి చాల మన్నిక కలిగి చాల అందంగా వుంటాయి.

పూల వ్యాపారులు పూలుకట్టే దారంగా కూడా వాడతారు. అరటి బోదె పైన ఉండే కాలువ వంటి కాండ భాగా న్ని లోపల తమల పాకులు భద్రపరచి మార్కె ట్కు తీసుకెళ్లను వాడుతారు. అరటిపిలకలను పూజలు, వ్రతా ల సమయాల్లో దేవుని మంటపానికి అలం కారంగా కట్టడం మన ఆచారం. అరటి చెట్లను పెళ్ళి మంట పాలకు శుభసూచకంగా కడతాం. అరటి పువ్వు తో కూర అతిరుచిగా చేస్తారు.

అరటి  పచ్చిదీ, పండ్లూ కూడా చాలా బలవర్ధకమైన ఆహారం.అరటిలో పిండిపదార్థాలు అంటే –కార్బో హైడ్రే ట్సు ఎక్కువ గా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటి లో 20 గ్రాముల కార్బోహైడ్రేట్సు ,1గ్రాము మాంస కృత్తులు అంటే ప్రోటీన్లు, 0.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉంటుంది. పీచుపదార్ధమూ ఎక్కువే!అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.     
పచ్చి అరటిలో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉండి పండే కొద్దీ చక్కరగా మారుతాయి. అందువల్లే  అరటిపండు తియ్యగా ఉంటుంది. అరటిపండు మంచి శక్తినిస్తుంది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది.  అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అరటి, యాలిల్ పడ్లలో రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంఅందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. అరటి పండు చౌక, ఆపిలు పండుఅరటికంటే ఖరీదు. 

అరటి ఆకులు చాలా సున్నితంగాఉండి, అతిధులకు భోజనం పెట్టేప్పుడు పదార్ధాలన్నీ వడ్డించను సౌలభ్యం గా ఉంటాయి. పచ్చనిఅరటాకులో భోజనం చేయడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది, కఫవాతాలు పోతాయి, శరీరానికి బలం కలుగుతుంది,బాగా ఆకలివేస్తుంది,ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి శక్తి వస్తుంది. అరటి పండు అల్సర్లను పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది.   కర్ణాటక రాష్ట్రంలో అరటి ఆకును కోనుగా చుట్టిన ఇడ్లీ లకు ప్రసిధ్ధి, రుచితోపాటుగా అరటి ఘుమ ఘుమ లతో చూడనూ తిననూ కూడా అందంగా ఉంటాయి. రుచుకీ ,సుచికీ అవి పెట్టింది పేరు.

అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు.దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి.

కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్కను రాస్తే నొప్పిత్వరగా తగ్గిపోతుంది. పూర్వం కట్టేల పొయ్యి మీద వంటచేయడం వల్ల వళ్ళుకాలేప్రమాదాలు ఎక్కువగానే ఉండేవి. అలాంటిసమయంలో అరటి ఆకుల మీద వారిని పడుకోబెట్టి, వాటినికప్పి ఉంచి వైద్యసహాయంకోసం వెళ్ళేవారు.

అర‌టి పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటాన వాటిని చర్మమిదరాస్తే  ర‌క్షణకలిగిస్తాయి. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి మెత్తని భాగాన్ని ముఖానికిరచి  అర్ధగంట తర్వాత  గోరు వెచ్చ‌ని నీళ్ళతో ముఖం క‌డిగితే చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం ఆరోగ్యాన్ని ఉంటుంది. చ‌ర్మంపై వచ్చే దుర‌ద‌లకు, మంట‌ల‌కు అర‌టి పండు తొక్క బాగా సహకరిస్తుంది. అర‌టి పండు తొక్క‌ను చర్మమ్మీద రాచి 10 నిమిషాల తర్వాత క‌డిగితే దుర‌ద‌లు, మంటలు త‌గ్గిపోతాయి.

వందగ్రాముల అరటిలో వుండే పోషకాలు ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు.మొత్తంగా నీరు - 70.1 గ్రా., ప్రోటీన్ - 1.2 గ్రా.,కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.,పిండిపదార్థాలు - 27.2 గ్రా.,కాల్షియం - 17 మి.గ్రా.,ఇనుము - 0.4మి.గ్రా.,సోడియం - 37 మి.గ్రా.,పొటాషియం - 88 మి.గ్రా.,రాగి - 0.16 మి.గ్రా.,మాంగనీసు - 0.2 మి.గ్రా., జింక్ - 0.15 మి.గ్రా.,క్రోమియం - 0.004 మి.గ్రా.,కెరోటిన్ - 78 మైక్రో గ్రా.,రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.,సి విటమిన్ - 7 మి.గ్రా.,థయామిన్ - 0.05 మి.గ్రా.,నియాసిన్ - 0.5 మి.గ్రా.,శక్తి - 116 కాలరీలు. అంటే షుమారుగా ఒక పెద్ద అరటిపండు తింటే మనకు ఇలా పోషకాలు అందుతాయన్నమాట.   రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని వైద్య నిపుణూలు చెప్తారు. అరటిపండులోని పొటా షియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ,అందువల్లడైటింగ్ చేసేవారు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి  అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతా యిట. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.అరటిపండు జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర పాడై కాకుండా కాపాడు తుంది. పొట్టలో ఆమ్లాలు ఎక్కువై, మంటగా ఉంటే అరటిపండు తినమని నిపుణులు చెప్తున్నారు.  పొటాషియం అధి కంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతంపు ముప్పు నుంచీ తప్పించు కోవచ్చనీనేక  అధ్య యనాల్లో గమనించారు నిపుణులు.అరటి తొక్క లోపల భాగాన్ని దోమ కరచినచోట రుద్దితే దురద ,వాపు తగ్గిపోతాయి. అరటిపండు అందరికీ అందుబాటులో ఉన్న పండు. యాడాదంతా , ప్రపంచవ్యాప్తంగా , మిగతా పండ్లకంటే చౌకగా ,దొరికే ఒకేఒక్క ఫలం అరటిపండు.అరటిపండు మనకు త్యాగ గుణాన్ని నేప్రుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో అన్ని వేళలా అందుబాటులో ఉంటున్న ఫలం.విటమిన్ ఎ,బి, సి లు అత్యధికంగా ఉండటాన అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా సహకరిస్తుంది. ఉపయోగపడుతుంది.  దీన్లో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు.తిన్నవెంటనే శక్తి నిచ్చేది అరటిపండు ఒక్కటే!   మజిల్ క్రాంప్స్ రాకుండా చేస్తుంది. వ్యాయామం చేసేవారి కండరాలు పట్టి వేతను నివారిస్తుంది.  

" అమ్మాయ్ ! అలివేలూ! ఒక అరిటాకు కోసిస్తావా ! అనుకోకుండా మా అన్నయ్య, వదినా వచ్చారు నన్నుచూడను . వాళ్లకు నగరాల్లో అరిటాకు దొరకదు , అరటాకు భోజనం వారికి చాలా ఇష్టం అమ్మాయ్!" అంటూ వచ్చింది పక్కింటి పద్దమ్మ పిన్ని.
"ఓ దాందేముంది పిన్నిగారూ! అలాగే " అంటూ ఒక పెద్ద అరిటాకు మొదలంటా కోసుకొచ్చి ఇచ్చింది అలివేలు. "ఆహా! ఈ అరిటాకుతో ఐదుమంది భోజనం చేయవచ్చు, మాఇంటిల్లి పాది కీ ఈరోజు అరిటాకు భోజనం, చాలా సంతోషం అలివేలూ! "అంటూ సంబరంగా వెళ్ళిందావిడ.

ఇంట్లో అరటి చెట్టు ఉంటే అంతా ఉన్నట్లే, ఇతరులకే కాక మనకూ ఎప్పుడు కావాలన్నా అరిటాకు భోజనం, అరటి బజ్జీలు, అరటి పీచుతో పూలుకట్టుకోడం , అరటి పండ్లూ, కూరలు అన్ని కోరుకోగానే అందుబాటులో ఉంటాయి. మన స్నానాల గదిలో నీరంతా అరటిమొక్కలు పీల్సుకుని మన ఇంటి వాతావరణాన్నికూడా మురికి నీటి నుంచీ రక్షణ కలిగిస్తుందికదా! ఇంట్లో అరటి నాటుకుని ఆనందంగా ఉందామా!         

మరిన్ని శీర్షికలు
big currency