Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue191/550/telugu-serials/atulitabandham/atulitabhandham/

( గతసంచిక తరువాయి) . “ఏమైంది ఆ అమ్మాయికి? నా వైపు అదోలా చూస్తోంది...” ఇంటర్ కామ్  లో ఐశ్వర్యను అడిగాడు కార్తీక్.
    “ఎవరు?”

“అదే... ఆ అమ్మాయి... షామిలి...”

“ఏమో మరి? నాకేం తెలుసు?” మనసులోనే నవ్వుకుంటూ అన్నది ఐశ్వర్య.

“సరే...” ఫోన్ డిస్కనెక్ట్ చేసి తలెత్తి ఉలిక్కి పడ్డాడు కార్తీక్. ఎదురుగా షామిలి. ఈరోజు ఫార్మల్ డ్రెస్ కాకుండా లంగా, వోణీ వేసుకుని వచ్చింది. స్వీట్ బాక్స్ ముందుకు చాపుతూ, “కార్తీక్, స్వీట్ తీసుకోండి... ఈరోజు నా పుట్టినరోజు...” అని చెప్పింది సిగ్గుగా నవ్వుతూ...

“ఓ, విష్ యు మెనీ మెనీ హాపీ రిటర్న్స్ షామిలి...” అంటూ ఒక స్వీట్ పీస్ తీసుకున్నాడు...

“నేను మీతో కొంచెం మాట్లాడాలి... పర్సనల్...”

“పర్సనలా? ఏమిటి?” అయోమయంగా అడిగాడు కార్తీక్.

“అదీ... అదీ... ఐ లవ్ యూ...” గబుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది షామిలి.  తలతిరిగినట్టయింది కార్తీక్ కి. మధ్యాహ్నం చిరుజల్లుగా మొదలైన వర్షం కాస్తా, సాయంత్రం అయ్యేసరికి జడివానగా మారిపోయింది. దాంతో అందరూ త్వరత్వరగా పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఐశ్వర్య మాత్రం చేస్తున్న పనిని మధ్యలో వదలటం ఇష్టం లేక ఆగిపోయింది. అది పూర్తి అయి, బాస్ చేత సంతకాలు పెట్టించి, ముంబై కి ఫాక్స్ చేయాల్సి వచ్చింది. అదంతా కార్తీక్ కంప్లీట్ చేసాడు. ఈ లోగా బాస్ కి ఫోన్ కాల్ రావటం, ఆయన తనింటికి కార్లో వెళ్ళిపోవటం కూడా జరిగిపోయాయి.

“అందరూ వెళ్ళిపోయారు... మనం మాత్రమే మిగిలాము...” డెస్క్ సర్ది తాళం వేస్తూ చెప్పాడు కార్తీక్.

“సరే, నేను వెళతాను...”

“ఎలా వెళతావు, ఇంత వర్షం పడుతూ ఉంటే? నా కారులో దింపుతాను ఐశూ...”

“ఉహు... ఎలాగో అలా వెళతాను... కాబ్ బుక్ చేస్తాను...”

“సరే, చెయ్యి, నీకు కాబ్ బుక్ అయ్యే వరకూ ఉంటాను...” ఆమె ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు కార్తీక్.  మొబైల్ చేతిలోకి తీసుకుని ప్రయత్నించసాగింది... దరిదాపుల్లో ఎక్కడా కాబ్స్ లేవు... అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించసాగింది...  విసురుగా ఆమె చేతిలోంచి మొబైల్ లాక్కున్నాడు కార్తీక్... “ఇక చాల్లే పద!” అన్నాడు కోపంగా.

మారు మాటాడకుండా హాండ్ బాగ్ తీసుకుని, అతని వెంట నడిచింది ఐశ్వర్య.

కారిడార్ లోంచి కార్ పార్కింగ్ వరకూ వెళ్ళే సరికే ముద్దగా తడిసిపోయారు. కుండలతో కుమ్మరించినట్టు ఒకటే వర్షం... గబుక్కున తలుపు తెరిచి కూర్చుని, అటువైపు తలుపు తెరిచాడు కార్తీక్. ఐశ్వర్య కూర్చోగానే, డాష్ బోర్డ్ లోంచి నాప్ కిన్ తీసి తుడుచుకోవడానికి ఇచ్చాడు... ఐశ్వర్య తన ముఖం, జుట్టూ తుడుచుకున్నా ఇంకా నీళ్ళు కారసాగాయి... ఆమె దగ్గరనుంచి తీసుకుని తాను కూడా ముఖం తుడుచుకొని కార్ స్టార్ట్ చేసాడు.

సాయంకాలం ఆరున్నరకే చిమ్మచీకటి కమ్మేసింది. పిచ్చిపట్టినట్టు చెట్లన్నీ గాలికి ఊగిపోతున్నాయి. గుండ్రటి రాళ్ళలాంటి  చినుకులు కారు టాప్ మీదా, అద్దాల మీదా  మృదంగం వాయిస్తున్నాయి. రోడ్ మీద నీళ్ళ ప్రవాహం... కారు టైర్స్ కూడా రెండు అడుగుల లోతులో మునిగిపోతున్నాయి... “మై గాడ్... ఇట్స్ హారిబుల్...” గొణుక్కున్నాడు కార్తీక్. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఐశ్వర్య ఉండే ‘సప్తగిరి నిలయం’ చేరే సరికి అర్థగంట పైగా పట్టింది. అలవాటుగా తమ పార్కింగ్ స్లాట్ వైపు పోనిచ్చి అక్కడే పార్క్ చేసాడు కార్తీక్. వారించబోయి ఆగిపోయింది ఐశ్వర్య.

ఐశ్వర్య రమ్మని అనకపోయినా ఆమెతో పాటుగా లిఫ్ట్ లో పైకి వచ్చాడు కార్తీక్. తలుపు తాళం తెరవగానే లోపలికీ వచ్చాడు. కూర్చోమని అనకుండానే కూర్చున్నాడు.

“త్వరగా కాఫీయో, టీ నో చెయ్యి... తాగుదాం...ఏదీ ముందు టవల్ ఒకటి తెచ్చివ్వు...” అన్నాడు తడిసిపోయిన షర్టు తీసి వాష్ రూమ్ దగ్గర స్టాండ్ కి వేసి వస్తూ...

ఏమీ మాట్లాడకుండానే టీ తయారు చేసి అతనికి బిస్కట్స్ తో పాటుగా సర్వ్ చేసింది ఐశ్వర్య.

“ఇవాళ ఓ తమాషా జరిగింది... షామిలి నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పింది...” అన్నాడు ఆమె ముఖం లోకి పరీక్ష గా చూస్తూ...

“అందులో ఆశ్చర్యం ఏముంది? నిన్ను ప్రేమిస్తున్నానని, ప్రపోజ్ చేస్తానని నాకు ముందే చెప్పింది...” అంది ఐశ్వర్య.

“అయితే నీకు ముందే తెలుసా? మరి నన్ను హెచ్చరించాలి కదా... సరే, నేను ఇందాకే చెప్పేసానులే!

“ఏమని?”

“అదే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని... నా భార్యవు నువ్వేనని...”

“వాట్ ఎ జోక్ కార్తీ!”

“జోకా? ఏమంటున్నావ్ ఐశూ? ఇది జోకా?” కోపంగా అడిగాడు కార్తీక్.

“మరి? పెళ్ళి మీద నీకూ, నాకూ ఇద్దరికీ నమ్మకం లేని సమయంలో ఒకటి అయ్యాము. కొన్నాళ్ళు కాపురం చేసాము, విడిపోయాము... ఇప్పుడు కొత్తగా నువ్వు పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు నిజంగా చిత్రంగా ఉంది...”

“ఐశూ... ప్లీజ్... పెళ్ళి అనే బంధం లోని తీయదనాన్ని తెలుసుకోకుండా ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారం లో ఉన్నాను... ఇప్పుడిప్పుడే కళ్ళకు ఆవరించిన పొరలు కరిగిపోతున్నాయి... మనసా, వాచా, కర్మణా నన్ను వలచి, వలపించుకున్న నా ప్రేయసివి... నువ్వే నా సహధర్మచారిణివి... నీవు అంగీకరిస్తే, మనం  అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకుందాము... నన్ను కాదనకు ఐశూ...” ఆమె చేయిని మృదువుగా పట్టుకున్నాడు కార్తీక్. సున్నితంగా ఆ చేతిని విడిపించుకుంది ఐశ్వర్య.

“కార్తీక్, వివాహ బంధమే అన్నిటికన్నా ఉన్నతమైన విలువలు కలదని, అది ఒక అతులిత బంధమని నేను కూడా చాలా ఆలస్యంగానే తెలుసుకున్నాను... ఇవాళ నువ్వు పెళ్ళి చేసుకుందామని అంటున్నావు... నీకు తెలుసా, పెళ్ళి చేసుకుంటే, ఈ చేతిని ఎన్నడూ విడిచిపెట్టి వెళ్ళకూడదు... నీ స్వేచ్చకు అది భంగమే అవుతుంది...”

“నాకు తెలుసు ఐశూ... అసలు నిన్ను విడచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు... నాకు విలువలు లేని స్వేచ్చ వద్దు, అది విశృంఖలత అవుతుందని తెలుసుకున్నాను...”

“కానీ, కానీ... నాకు నిన్ను అంగీకరించాలంటే చాలా భయంగా ఉంది... నన్ను ప్రేమించిన కార్తీక్ ఎంతగా మారిపోయాడు? నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణాన ఎంత సంతోషపడ్డానో, ఆ అరుదైన ఫలం నా చేతికి రాకుండానే దూరమైపోయిన క్షణాన, ప్రాణాపాయ స్థితిలో ఇదిగో ఇక్కడే ఒక మూటలా రక్తపు మడుగులో పడి క్షణాలు లెక్కపెట్టుకుంటూ కూడా నీ కోసమే కలవరించాను... కానీ... కానీ... నాకు అందరానంత దూరంలో నువ్వు ఎవరితోనో... అబ్బా, ఆ అసహాయ స్థితి పగ వారికి కూడా వద్దు... అప్పుడు, ఆ క్షణంలో మధూ  రాకపోయి ఉంటే నేను ఏమైపోయి ఉండేదాన్ని? 

నాకు నీ ప్రేమ కావాలి... నా ప్రేమికుడైన కార్తీక్ భర్తగా కావాలి... నన్ను ఎన్నడూ వీడని నీ చేయి కావాలి... చెప్పు... నాకు ఎప్పటికీ తోడుగా ఉంటావా? మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అలా నాతో జీవితాంతమూ కలిసి ఉండేట్టు అయితేనే ఈ చేయిని పట్టుకో... లేకపోతే... ఇక్కడినుండి వెళ్ళిపో... పెళ్ళి అంటే సుఖమే కాదు, సంఘంలో ఒక స్థానాన్ని కల్పించే సాధనమే కాదు, జీవితానికి పరిపూర్ణత మాత్రమే  కాదు... పెళ్ళి అంటే ఒక బాధ్యత, పెళ్లి అంటే ఒక తోడు, పెళ్ళి అంటే ఒక ఆలంబన... అది శారీరకంగా కలవటానికి ఓ జంట పొందే లైసెన్స్ మాత్రం కాదు... ఒకరికి ఒకరై జీవితమంతా కలిసి బ్రతకటానికి కట్టుకున్న జీవన సౌధం...

అలాంటి సౌధంలోనికి నాతో అడుగుపెడతానని అంటావా? బాగా ఆలోచించుకున్నావా? ఇది అగ్రిమెంట్ కాదు, మధ్యలో చింపేసుకుని విడిపోవటానికి... ఆలోచించి నిర్ణయం తీసుకో కార్తీ...”  ఆవేదనతో కూడిన ఆమె మాటలు కార్తీక్ ని నిలువెల్లా దహించివేసాయి...ఏం మాట్లాడాలో అర్థం కాలేదు...

 

ముగింపు వచ్చేసంచికలో..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam